25, ఫిబ్రవరి 2013, సోమవారం

నీ వాడ నైతిని నేను నా వాడ వైతివి నీవు


నీ వాడ నైతిని నేను నా వాడ వైతివి నీవు
నీ వాడ చేర రమ్మని నీ వేల పిలువవు నన్ను

వేచి వేచి నాకు చాల విసువు పుట్టు దాక నీవు
కాచుకొని యున్నా వంత కాని వాడ నెట్టు లైతి
చూచి చూచి రామ నిన్ను సుంత నిలదీయుదు
పూచిక పుల్ల కన్న పోపో కడు పలుచ నైతి

పిలచిన తడవుగ తరచుగ కలల లోన  కనిపింతువు
అలక లన్ని నిన్ను జూచి నంత లోనె యణగారును
కలక దేరి తగవు తలపు గడచి మనసు చాల మురియు నయా
చిలిపివాడ నేడైనను చెప్పు మెపుడు పిలిచెదవో

విచ్చిపోవు తిత్తుల దూరు పిచ్చిపనికి విసువాయెను
గుచ్చి హింసపెట్టు ప్రకృతి గొడవలతో విసువాయెను
మెచ్చి స్వస్వరూపజ్ఞాన మిచ్చితి విది మేలాయెని
వచ్చి ముచ్చట దీర్చమంటె పలక విది వింతాయెను2 కామెంట్‌లు:

 1. విచ్చిపోయే తనువుల దూరే పిచ్చిపనితో విసువొచ్చేను
  చిలిపివాడ యీ నాడైనా చెప్పవయ్యా పిలిచే దెపుడో


  మీరింకా చిన్నవాళ్ళు అలా అంటే ఎలా? :)

  రిప్లయితొలగించండి
 2. శర్మగారూ,
  ఇలాగు వచ్చినందుకు మీరు ఆశ్చర్యపోవటం సహజమే. కాని కీర్తన వెలువడటంలో నా ప్రమేయం చాలా తక్కువ. అది యెలా బహిర్గతమయ్యేదీ కేవలం భగవదేఛ్ఛ మాత్రమే. కరచరణాద్యవయవసంపుటీకరణమైన ఈ శరీరం నాకు కేవలం ఉపాధి మాత్రమే నన్న స్పృహ నాకు నిత్యం. కాని యీ మాట బయటికి అంటే లోకం నన్ను డాంబికుడు అనుకుంటుంది. అలాగని లౌకిక జీవనం పట్ల అశ్రథ్థ యేమీ లేదీ‌ జగన్నాటకంలో.

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.