2, నవంబర్ 2023, గురువారం

బ్రతుకవలె మంచిబ్రతుకు

బ్రతుకవలె మంచిబ్రతుకు బంగరుబ్రతుకు శ్రీ
పతి నిన్నే భజియించే బంగరు బ్రతుకు 

పదవులపై భ్రమలులేని 
బ్రతుకే బ్రతుకు సం
పదలు కోరి చెడకుండిన బ్రతుకే బ్రతుకు
మదిని నిన్ను నింపుకొన్న బ్రతుకే బ్రతుకు
పదుగురును మెచ్చుకొన్న బ్రతుకే బ్రతుకు

కాముని వెడలించినట్టి ఘనునిదె బ్రతుకు నీ
నామమునే నమ్ముకొన్న నరునిదె బ్రతుకు
రామచంద్ర నిన్ను పొగడు బ్రతుకే బ్రతుకు నీ
ప్రేమామృత మాని నదే స్వామీ బ్రతుకు

హరేరామ హరేకృష్ణ యనునదె బ్రతుకు శ్రీ
హరి నిన్నే తలచుచుండు నతనిదె బ్రతుకు
పరాత్పర నినుగొలిచిన బ్రతుకే బ్రతుకు నీ
కరుణామృత మానినదే ఘనమగు బ్రతుకు