21, నవంబర్ 2023, మంగళవారం

రామనామము మరువబోకండీ


రామనామము మరువబోకండీ శ్రీరామరామ యని తరించండీ

రామనామము విష్ణుదేవుని నామములలో మిన్నయైనది
రామనామము మౌనివరలు విరామెఱుగక పలుకునట్టిది
రామనామము సర్వలోకారాధితంబగు దివ్యనామము
రామనామము కన్న మిక్కిలి రమ్యమనదగు నామమేది

స్వామినామము మరువనేటికి జపములేవో చేయనేటికి
స్వామినామము మరువనేటికి సకలబాధలు పొందనేటికి
స్వామినామము మరువనేటికి జముని చేతికి చిక్కనేటికి
స్వామినామము మరువనేటికి భూమి నింకను పుట్టనేటికి

కవులకు ప్రియమైన నామము ఘనతలకొలువైన నామము
శివుడు మెచ్చిన విష్ణునామము చింతలను తొలగించునామము
భవవినాశము చేయునామము పరమపావనమైన నామము
రవికులేశుని రమ్యనామము రామనామము సుజనులారా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.