6, నవంబర్ 2023, సోమవారం

మావలన తప్పులుండిన


కం. మావలన తప్పులుండిన
నీవే మన్నించవలయు నిర్మలచరితా
రావణసంహర త్రిజగ
త్పావన శ్రీరామచంద్ర  పాపవిదారా


ఓ శ్రీరామచంద్రప్రభూ.

మేము మానవులం. ఒప్పులూ చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. ఆమాటకు వస్తే మా చేతల్లో ముప్పాతికమువ్వీసం తప్పులేను.

మాలో కొందరం నీవు చూపిన బాటలో నడవటానికి ఇష్టపడని వాళ్ళమూ ఉన్నాం. 

కొందరం నిన్ను తప్పుపట్టే వాళ్ళమూ ఉన్నాం. 

ఇంకా దారుణంగా రావణుడే నీకన్నా గొప్పవాడని వాదించే మూర్ఖులమూ ఉన్నాం.

కొద్దిమందిమి నీ మాహాత్మ్యాన్ని నమ్మినా, నీవలె సత్యనిష్ఠనూ ధర్మనిరతినీ అలవరచుకోలేక ఇబ్బంది పడుతున్నాం.

కొందరం నిన్ను పూజిస్తున్నా అది అంత త్రికరణశుధ్ధిగా మాత్రం కాదు.

ఇలా మాతప్పులు ఎన్నో ఎన్నెన్నో!

మాకు తెలుసు, ఏదో ఒకరోజు వస్తుందని.
ఆరోజున యముడు మమ్మల్ని నిలదీస్తాడని.

అయన నిర్మొగమాటి. చండశాసనుడు. దయాదాక్షిణ్యాలు లేని వాడు.

అయన మమ్మల్ని మన్నించే ప్రసక్తి లేనే లేదు.

ఈ ప్రపంచంలో ఉన్న మాలాంటి వచ్చేపోయే మానవులు మమ్మల్ని మన్నించితే ఎంత మన్నించకపోతే ఎంత?

మాగతి ఏమిటి?

ఆయముడి బారినుండి మమ్మల్ని రక్షించగల మహానుభావుడవు నువ్వే,

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని నిన్నే వేడుకుంటున్నాం.

రావణాది ధర్మద్రోహులను శిక్షించిన ధర్మావతారుడివి నువ్వు.
నీభక్తులం.

మమ్మల్ని రక్షించటం నీధర్మం అని భావించు దయచేసి.
అఖిలపాపాలనుండీ మమ్మల్ని విముక్తులను చేసి రక్షించగలవాడవు నువ్వొకడవే.

మూడులోకాలనూ  నీకంటే పావనమూర్తి లేడు. ముమ్మాటికీ లేడు.

శ్రీరామచంద్రా, తప్పదు. 

నువ్వే మమ్మల్ని తప్పక మన్నించాలి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.