31, అక్టోబర్ 2021, ఆదివారం

నీనామ మొక్కటే నేర్చినది నాజిహ్వ

నీనామ మొక్కటే నేర్చినది నాజిహ్వ
జానకీనాథ నా జన్మలక్షణ మిది

చదువు లెన్నో చదివి సాధించినది లేక 
వదలిన తనువులే బహుళంబు కాగ
తుదకు నీనామమే తోచగా దిక్కనుచు
నుదయించితిని జిహ్వనుంచి దానిని యిపుడు

బహుసుఖంబుల గోరి బహుజన్మముల నేను
బహుదైవముల గొలిచి పాతకుడ నైతి
నిహమునే నిరసించి యికనీవె దిక్కనుచు
మహనీయమూర్తి నీ మఱువు జొచ్చితి నిపుడు

ఏనామమును శివుం డెప్పడును జపియించు
నానామమును తెలియ లేనైతినే యనుచు
లోనెంచి తారకనామమే దిక్కనుచు
జ్ఞానినై నిన్ను నే శరణుజొచ్చిచి నిపుడు


తెలియరాదు నీమహిమ దేవదేవ

తెలియరాదు నీమహిమ దేవదేవ అది
నలువకే తెలియరాదు నాకేమి తెలియును

శ్రీరామా నీవేమో శ్రీహరివే కదటయ్య
క్షీరాంభోనిధికన్యక సీతామహాలక్ష్మి
ఈరీతిగ సొదను జొచ్చుటేమి తల్లి యనుచు
ఊరకే తికమకబడె నారోజున బ్రహ్మ

గోవుల గోవత్సంబుల గోపాలకు లందరను
దేవఖాతమున దాచ నీవిధం బెఱుగగ
గోవులు గోవత్సంబులు గోపబాలురుగ నొప్పి
నీవు మెలగుచుండ గాంచి నివ్వెరపడె నజుడు

ఒకటి కాదు నాల్గు ముఖము లుండినట్టి బ్రహ్మయే
సకలేశ్వర నిన్నెఱుంగ జాలడనగ దేవా
యిక నేనా నీదు మహిమ నించుకేని గ్రహించుట
చకితుడ నరమాత్రుడ నిను శరణుజొచ్చు చుంటి










28, అక్టోబర్ 2021, గురువారం

ఆకసపు వన్నె వా డఱుదైన విలుకాడు

ఆకసపు వన్నె వా డఱుదైన విలుకాడు
రాకాసుల నణచువాడు రామచంద్రుడు

శోకములు బాపువాడు సుఖములు చేకూర్చువాడు
ప్రాకటముగ సత్యధర్మపరాయణుడు
లోకముల నేలువాడు లోకేశులు పొగడువాడు
శ్రీకరుడు సకలలోక క్షేమంకరుడు 

శక్తి నొసగుచుండు వాడు సుజనులకు నిత్యమును
ముక్తి నొసగుచుండు వాడు ముముక్షువులకు
భక్తులకు నిత్యరక్ష ప్రసాదించుచుండు వాడు
యుక్తమైన వరములెల్ల నొసగు వాడు
 
యోగివరులు పొగడువాడు సాగి సురలు మ్రొక్కువాడు
భోగిరాజశయానుడు పురుషోత్తముడు
నాగురుడును దైవమగుచు నన్నేలుచు నుండువాడు
దాగియుండు వాడు నా హృదంతరంబున


శీతకన్ను వేయ కయ్య సీతాపతీ

శీతకన్ను వేయ కయ్య సీతాపతీ  ప్ర
ఖ్యాతికల దయాశాలి సీతాపతీ
 
కోతిబుధ్ధి నాదనుచు సీతాపతీ‌ నన్ను
కాతరించి తిట్టవద్దు సీతాపతీ
కోతులతో పొందు నీకు సీతాపతీ చాల
ప్రీతికదా మన్నించుము సీతాపతీ
 
పాతకుడని నిందించకు సీతాపతీ నేను
కాతరుడను నీవాడను సీతాపతీ 
చేతులెత్తి మ్రొక్కుదునో‌ సీతాపతీ నీకు
రీతి కాదు కాఠిన్యము సీతాపతీ
 
నాతండ్రివి నీవుకదా సీతాపతీ సర్వ
భూతకోటి నాథుడవే సీతాపతీ
ప్రీతితోడ సేవింతును సీతాపతీ సం
ప్రీతుడవై నన్నేలుము సీతాపతీ


రామనామ మనే దివ్యరత్నదీప మున్నది

రామనామ మనే దివ్యరత్నదీప మున్నది ఈ
నామదీపప్రభలు నన్ను నడిపించుచున్నవి

దారితోచనీయకుండ దట్టమైన చీకటివలె
పేరుకున్న యజ్ఞానము భీతిగొలుపగా
ఓరీ నీకేల భయము దారిచూపుదు ననుచు
యూరడించి నాకు కలిగి యున్నది యీ దీపము

చిరుప్రమిదలవంటి వాయె చిన్నపెద్ద విద్యలు
కరముల నవిబూని నేను కాననైతి దారి
పరమదివ్యప్రభలనీను ప్రభునామరత్నము
సరియైన దారిచూపె చక్కగ నీ దీపము

రామనామరత్నప్రభల ప్రకాశమున కోర్వక
కామక్రోధాది దుష్టమృగములు దారి తొలగ
నా మనోరథమునెఱిగి నడుపుచు తిన్నగా
స్వామి యింటి దారిచూపె సరసమైన దీపము







24, అక్టోబర్ 2021, ఆదివారం

నేరములే చేసితిమి నారాయణా

నేరములే చేసితిమి నారాయణా మేము
శ్రీరామా యనమైతిమి నారాయణా

క్రూరకర్మములు చేసి నారాయణా మేము
దారుణమగు నరకములే నారాయణా
ఆరూఢిగ పొందుదుమో నారాయణా అచట
ఘోరశిక్ష లుండునంట నారాయణా

ఘోరసంసార జలధి నారాయణా దీని
నేరీతిగ నీదుదుమో నారాయణా
దారి తెన్ను కానరాదు నారాయణా నీవు
తీరమునకు చేర్చుదువట నారాయణా

తీరము చేర్చునట్టి నారాయణా యింక
నేరముల నెంచవద్దు నారాయణా
తారకరాముడవు నీవు నారాయణా విడువ
నేరమింక నీనామము నారాయణా

16, అక్టోబర్ 2021, శనివారం

మీ రేమి యిత్తురో మిక్కిలి విలువైన

మీ రేమి యిత్తురో మిక్కిలి విలువైన
వే రామచంద్రుల కీయవలె
 
మిక్కిలి విలువైన మేదినీకన్యక
చక్కని సీతను జనకు డిచ్చె 
నెక్కటి వీరుడీ ఇనకులతిలకుడె
చక్కటి వరడనుచు నిక్కుచును

మిక్కిలి విలువైన మిత్రత నిచ్చెను 
సొక్కుచు కపిరాజు సుగ్రీవుడు
చిక్కని స్నేహము చేతనిర్వురకు
చక్కని లాభమే సమకూరె

మిక్కిలి విలువైన చక్కని భక్తిని
నిక్కువముగ హనుమ నెఱపెను
రక్కసులను గెలువ రామున కండగ
చక్కగ నిల్చు యశంబు గొనె


14, అక్టోబర్ 2021, గురువారం

రామయోగులము మేము శ్రీరామదాసులము మేము

రామయోగులము మేము శ్రీ
రామదాసులము మేము
 
హరేరామ యని యందుము
హరేకృష్ణ యని యందుము
హరియె రాముడు కృష్ణుడు
హరియే నరసింహుడు
 
హరికి దక్క నన్యులకు 
పొరబడియు మ్రొక్కము
పరమపద సంప్రాప్తికి
హరికి మ్రొక్కుచుందుము

రామస్మరణే మాయోగము
రామనామమె మామంత్రము
రామునకె మేమంకితము
రాముడే మాదైవతము


12, అక్టోబర్ 2021, మంగళవారం

రామనామ సహస్రపారాయణం

రామా రామా రామా రామా  రామా సీతారామా శరణం
రామా రామా రామా రామా  రామా హరి నారాయణ శరణం
రామా రామా రామా రామా  రామా పురాణపురుషా శరణం  
రామా రామా రామా రామా  రామా బ్రహ్మాద్యర్చిత శరణం
రామా రామా రామా రామా  రామా ధరణీపూజిత శరణం
రామా రామా రామా రామా  రామా సురగణవందిత శరణం
రామా రామా రామా రామా  రామా దశరథనందన శరణం
రామా రామా రామా రామా  రామా కౌసల్యాసుత శరణం
రామా రామా రామా రామా  రామా మేఘశ్యామా శరణం  
రామా రామా రామా రామా  రామా  సుగుణవిభూషిత శరణం
రామా రామా రామా రామా  రామా  సుమధురభాషణ శరణం
రామా రామా రామా రామా  రామా మంగళవిగ్రహ శరణం  
రామా రామా రామా రామా  రామా గాధేయప్రియ శరణం  
రామా రామా రామా రామా  రామా కోదండధరా శరణం  
రామా రామా రామా రామా  రామా  గౌతమపూజిత శరణం
రామా రామా రామా రామా  రామా మునిమఖరక్షక శరణం
రామా రామా రామా రామా  రామా తాటకసంహర శరణం
రామా రామా రామా రామా  రామా హరగుణివిదళన శరణం
రామా రామా రామా రామా  రామా భూమిసుతావర శరణం
రామా రామా రామా రామా  రామా జగదోధ్ధారక శరణం
రామా రామా రామా రామా  రామా అయోధ్యరామా శరణం
రామా రామా రామా రామా  రామా వనమాలాధర‌ శరణం
రామా రామా రామా రామా  రామా భరతసుపూజిత శరణం
రామా రామా రామా రామా  రామా ఖరదూషణహర శరణం
రామా రామా రామా రామా  రామా మారీచాంతక శరణం
రామా రామా రామా రామా  రామా జటాయుమోక్షద శరణం
రామా రామా రామా రామా  రామా శబరీసేవిత శరణం
రామా రామా రామా రామా  రామా కబంధనాశక శరణం
రామా రామా రామా రామా  రామా హనుమత్సేవిత శరణం
రామా రామా రామా రామా  రామా సుగ్రీవార్చిత శరణం
రామా రామా రామా రామా  రామా వాలిప్రమథన శరణం
రామా రామా రామా రామా  రామా వారిధిబంధన శరణం
రామా రామా రామా రామా  రామా విభీషణార్చిత శరణం
రామా రామా రామా రామా  రామా దివ్యపరాక్రమ శరణం
రామా రామా రామా రామా  రామా సత్యపరాక్రమ శరణం
రామా రామా రామా రామా  రామా రావణసంహర శరణం
రామా రామా రామా రామా  రామా బ్రహ్మాదివినుత శరణం
రామా రామా రామా రామా  రామా సురగణతోషణ శరణం  
రామా రామా రామా రామా  రామా త్రిజగన్మంగళ శరణం  
రామా రామా రామా రామా  రామా పట్టాభిరామ శరణం
రామా రామా రామా రామా  రామా జగదానందక శరణం
రామా రామా రామా రామా  రామా జగదాధారా శరణం
రామా రామా రామా రామా  రామా దీనజనావన శరణం
రామా రామా రామా రామా  రామా భక్తజనప్రియ శరణం
రామా రామా రామా రామా  రామా కారుణ్యాలయ శరణం
రామా రామా రామా రామా  రామా పాపవినాశన శరణం
రామా రామా రామా రామా  రామా బ్రహ్మాండాధిప శరణం  
రామా రామా రామా రామా  రామా త్రిజగద్వందిత శరణం  
రామా రామా రామా రామా  రామా భవవిఛ్ఛేదక శరణం
రామా రామా రామా రామా  రామా మోక్షప్రదాయక శరణం


ఇది ఒక రగడ. దీనిని హరిగతి రగడ అంటారు. ఈ స్తోత్రంలో ప్రతి పాదంలోనూ ఐదు మార్లు రామనామం వస్తున్నది. యాభై పాదాలకు 250 మార్లు రామనామం చేసినట్లు అవుతున్నది. పల్లవిగా ఉన్న "రామా రామా రామా రామా  రామా సీతారామా శరణం " అన్నది ప్రతి శరణం పాదంతోనూ కలిపి చదవాలి.  ఇలా చేస్తే  ద్విగుణితమై 500  మార్లు రామనామం చేసినట్లు అవుతున్నది. ఈవిధంగా స్తోత్రాన్ని రెండు సార్లు పారాయణం చేసినట్లైతే 1000 సార్లు రామనామం చేసినట్లు అవుతుంది.

లఘుపారాయణం చేసేందుకు ఒక విధానం ఉంది. పాదాలలో మొదట వచ్చే "రామా రామా రామా రామా"  అన్న నాలుగు మాటలు వదలి చదవటం. ఇలా చేస్తే ఇది మధురగతి రగడ అవుతుంది, యతి నియమం లేకుండా. సమయాభావం ఉన్నపుడు ఇలా చేయవచ్చును. అంతా సంస్కృతమే కాబట్టి యతినియమం అవసరం కాదు.

10, అక్టోబర్ 2021, ఆదివారం

రామనామం భవ్యనామం

రామనామం భవ్యనామం రామనామం దివ్యనామం

రామనామం విష్ణునామం రామనామం జ్ఞానదీపం
రామనామం విమలనామం రామనామం విభునినామం
రామనామం సులభనామం రామనామం సుఖదనామం
రామనామం జయదనామం రామనామం యశదనామం
రామనామం అఘవినాశం రామనామం భవవినాశం
రామనామం శక్రవినుతం రామనామం భర్గవినుతం
రామనామం భక్తవినుతం రామనామం లోకవినుతం
రామనామం సర్వఫలదం రామనామం మోక్షఫలదం

9, అక్టోబర్ 2021, శనివారం

మదిలో శ్రీరఘురాముని నామము మానక తలచండీ

మదిలో శ్రీరఘురాముని నామము మానక తలచండీ
అదియే భవతరణైకోపాయం బన్నది తెలియండీ 

పాపాటవులను రామనామము భస్మము చేయును నమ్మండీ
కోపాంధులకు రామనామము కూర్చును శాంతము నమ్మండీ

ఆపదలందున రామనామమే ఆదుకొనును మిము నమ్మండీ
తాపసులీ శ్రీరామనామమును తలదాల్చెదరని నమ్మండీ
 
హరబ్రహ్మాదులు కొలిచే రాముని యన్ని విధములుగ నమ్మండీ
మరి వేరేదైవములను కొలుచుట మంచిది కాదని తెలియండి

పరమమంత్రము రామనామ మను భావన విడువక యుండండీ
నిరంతరంబుగ రామనామమును నిర్భయముగ జపియించండీ
 
రాముని నమ్మిన వారికి కష్టము రానే రాదని యెఱుగండీ
మీమీ యోగక్షేమము లన్నీ రాముడు చూచును నమ్మండీ
 
శ్రీమన్నారాయణుడే రాముడు చిత్తము నందిది తెలియండీ
రాముడు కరుణాధాముడు త్రిజగద్రక్షకు డన్నది తెలియండీ

శ్రీరాముని మనసార కొలువరే

శ్రీరాముని మనసార కొలువరే చిత్తశాంతిని పొందరే
నీరసమైన శాస్త్రగ్రంథముల నిత్యము రుబ్బుట మానరే

ఆరూఢిగ శ్రీరామచంద్రుడే ఆశ్రీహరి గ్రహియింపరే
నారాయణుడే శ్రీరాముడని నమ్మి భజించిన మోక్షమే

నోరారా శ్రీరాముని నామము నుడువుచు సంతోషించరే
శ్రీరఘునాథుని నామభజనచే చింతలుడిగి ముదమందరే

భవతారకము రామనామమని బాగుగ నమ్మి తరించరే
రవికులపతి శుభనామ మొక్కటే ప్రాణప్రదమని యెంచరే

కువలయమున శ్రీరాముని నిత్యము కొలిచెడి వారతిధన్యులు
వివిధదేవతల గొలిచెడువారు వీరివలెను తరియించరు

శాస్త్రాధ్యయనము చిత్తశుధ్ధికి సాధనమై తగియుండును
శాస్త్రజడులు శాస్త్రంబుల కావలి సర్వేశ్వరుని కానరు

శాస్త్రజ్ఞుల పరిశోధనలకు హరి సర్వేశ్వరుడు చిక్కడు
శాస్త్రగ్రంథము లెంత రుబ్బినా జ్ఞానము లేశము కల్గదు

హరివిజ్ఞానము శాస్త్రజ్ఞానము లన్నిటి కంటెను గొప్పది
హరేరామ యని హరేకృష్ణ యని యానందముగా ననరే

హరి మీభవబంధము లూడ్చగ శ్రీహరిపదమే మీకబ్బును
హరేరామ యని హరేకృష్ణ యని యానందముగా ననరే


దేవదేవ రఘురామా

 

దేవదేవ రఘురామా నిన్నే త్రికరణశుధ్ధిగ నమ్మితిని

నీవే శరణము సీతారామా నీవే శరణము శ్రీరామా


అనిశము దేవగణములకు ప్రీతిగ నభయం బొసగెడు శ్రీరామా

వినయాన్వితులకు విభవము గూర్చెడు వీరవరణ్యా శ్రీరామా

జననాథోత్తమ ఘనతాపహరా  యినకులతిలకా శ్రీరామా

మునిగణసన్నుత సురగణసన్నుత మోక్షప్రదాయక శ్రీరామా


నిరుపమసుగుణసుశోభనశీలా నీరజనయనా శ్రీరామా

పరమదయాకర పరమశుభంకర పరమాత్మా హరి శ్రీరామా

సురవిరోధిగణశోషణభీషణ పరమపరాక్రమ శ్రీరామా

పరమేశ్వరచతురాస్యపురందరప్రస్తుతవిక్రమ శ్రీరామా


ఆదిదేవ సకలాగమసన్నుత అంబుజనాభా శ్రీరామా

నీదగు దివ్వప్రభావము నెన్నగ నేనసమర్ధుడ శ్రీరామా

పాదదాసుడను భక్తుడ నను పరిపాలించవయా శ్రీరామా

కాదనకుండగ మోక్షమునిచ్చి కరుణజూపుమా శ్రీరామా


7, అక్టోబర్ 2021, గురువారం

వీడు వ్యర్ధుండనుచు వెక్కిరించెడు వారు

వీడు వ్యర్ధుండనుచు వెక్కిరించెడు వార
లాడు మాటల బట్టి యాగ్రహింపకు రామ

పదిమంది మధ్యలో పలుకాడినది లేదు
పదిమంది బాగుకై పాటుపడినది లేదు
పదిమందితో కలిసి పనిచేసినది లేదు
పదిమందితో నడచి బాగుపడినది లేదు

పదుగురిని తప్పులు పట్టి మిడిసితి గాని
పదుగురిని మించగా పరువులెత్తితి గాని
పదుగురిని  కికురించి భంగపడితిని గాని
పదుగురిని గమనించి బ్రతికినది లేదు

ఊరకే గొప్పగా నూరెల్ల గమనింప
శ్రీరామభక్తి యను చిన్న ముసుగును దాల్చి
ధారుణిని తిరుగునీ దాంభికుం డెప్పుడును
గౌరవింపగ మంచి కనరాదు వీనిలో









6, అక్టోబర్ 2021, బుధవారం

హరి నీవే గతి హరి నీవే గతి హరి నీవే గతి యందరకు

హరి నీవే గతి హరి నీవే గతి హరి నీవే గతి యందరకు 
పరమాత్మా హరి నరసింహా రఘువరరామా నీవే శరణు

పాపాత్ములకును పుణ్యచరితులకు పరమపావనులు పతితులకు
శాపోపహతులు సుఖయుక్తులకును సంపన్నులకును బీదలకు
ఆపన్నులకును జిజ్ఞాసువులకు నర్ధార్ధులకును జ్ఞానులకు
కోపాలసులకు శాంతమూర్తులకు శ్రీపతి నీవే శరణమయా

సురలకు సిధ్ధులు గరుడోరగ కిన్నరులకు విద్యాధరులకును
నరచారణకింపురుషులు పితరులు సురవైరులు గంధర్వులకు
తరుణులు పురుషులు వృధ్ధులు బాలురు దండ్యులు గౌరవనీయులకు
అరయగ పదునాలుగు లోకములను హరి నీవొకడవె శరణమయా 

స్థావరములకును జంగమములకును స్వామీ పోషకు డవు నీవే
నీవే స్థితిలయ కారకుడవు హరి నిన్నెఱుగుట మా వశమగునా
భావించగ నేరరుగా దేవా బ్రహ్మాదులును నీ‌మహిమ
కావున శరణము వేడెద భవచక్రంబును శ్రీహరి త్రుంచవయా


శోకమోహంబు లవి నాకెక్కడివి రామ

శోకమోహంబు లవి నాకెక్కడివి రామ
నీకు బంటుగ నేను నెగడుచుండగను

సకల లోకాధార సకల ధర్మాధార
సకల జీవాధార సర్వేశ్వర
సకల క్రియలును నీదు సంకల్పములె కాన
నొక వికారము లేక యుందును నేను 

సురనాథసంస్తుత్య హరదేవసంస్తుత్య
నరనాథసంస్తుత్య నారాయణ
ధర మీద నా యునికి అరయ నీ యాన యని
హరి యెంచుకొను వాడ నంతియే కాని

మానక నీనామ మంత్రమే పలుకుచు
పూని నిన్నెప్పుడును పొగడుచుందు
నేను నీ చాయనై నిలచియుందును కాని
లేనిపోనివి తలపు లెందుకు నాకు









రామ రామ రామ రామ రామ రఘురామ

రామ రామ రామ రామ రామ రఘురామ
రామ రామ రామ రామ రామ సీతారామ

రామ రామ కౌసల్యా రమణీసుత జయజయ
రామ రామ దశరథ రాజనందన జయజయ
రామ రామ మునియాగ రక్షక హరి జయజయ
రామ రామ శివధనుర్భంగకారక జయజయ

రామ రామ స్థిర సత్యవ్రతదీక్షిత జయజయ
రామ రామ వనవాసవ్రతదీక్షిత.జయజయ
రామ రామ దండకారణ్యపావన జయజయ
రామ రామ దుష్టపౌలస్త్యనాశక జయజయ

రామ రామ సురలోకరక్షక హరి జయజయ
రామ రామ మునిలోకరక్షక హరి జయజయ
రామ రామ భక్తలోకరక్షక హరి జయజయ
రామ రామ సర్వలోక రక్షక హరి జయజయ

నేనెంత చక్కగా నినుపొగడ నేర్తునో

నేనెంత చక్కగా నినుపొగడ నేర్తునో
జానకీనాథ నా శక్తి స్వల్ప

ఆవిరించి యున్నాడే యత డెంతటి వాడు
వేవిధముల నిన్నెప్పుడు పెద్దగ పొగడు
దేవా నాకొక తలయును తెలియ వానివి నాల్గు
భావింప నాత డేమో భాషాపతియు

ఆదిశేషు డున్నాడే యత డెంతటి వాడు
మోదముతో నిచ్చలునిను పొగడుచున్నాడు
నాదొక్కటి నాల్కయైన నాగేంద్రునకు వేయి
కాదు కాదు రెండువేలు కదా నాల్కలు

హరుని మహాదేవుని గను మత డెంతటి వాడు
హరి నిన్ను లోనెప్పుడు ధ్యానించునే
హరుడు నీవు వేరే కాదని యందురు పెద్దలు
హరుని వలె నిన్ను పొగడ నన్యుల వశమె


4, అక్టోబర్ 2021, సోమవారం

నమ్మీనమ్మక నడచుకొన్నచో

నమ్మీనమ్మక నడచుకొన్నచో 
నమ్మిన ఫలితము లేదు గట్టిగ నమ్మని దోసము పోదు

చేసీచేయక చేసినపూజల 
చేసిన ఫలితము లేదు శ్రధ్ధగ చేయని దోసము పోదు
రోసీరోయక లోభమోహముల
రోసిన ఫలితము లేదు నిజముగ రోయని దోసము పోదు

పలికీపలుకక భగవన్నామము
పలికిన ఫలితము లేదు మనసా పలుకని దోసము పోదు
కొలిచీకొలువక కులదైవంబును
కొలిచిన ఫలితము లేదు నిరతము కొలువని దోసము పోదు

తగిలీతగులక తగిలిన గానియు
తగునని యగ్ని దహించు నటులే తారకనామము నిన్ను
తగులీతగులక తగులుకొన్న నది
తగునని ముక్తి నొసంగు నదియే తారకరాముని గుణము




దేవదేవ రామచంద్ర తెలిసికొంటిని

దేవదేవ రామచంద్ర తెలిసికొంటిని
భావనలో నీదైన పరమసత్యము

తీయతీయని దైన నీ దివ్యనామమే ఈ
మాయతెరల పాలిటి మంచిఖడ్గము
మాయతెరలు తొలగగా మహితసత్యమే
హాయిగా నిలిచెలే యంతరంగాన

పరమమంగళకరము నీ భవ్యచరితమే దు
ర్భరభవరుజకు మంచి రాజవైద్యము
విరిగి భవరుజ దేవా వేడుకతోడ
పరమాత్మ యెఱిగితినా స్వస్వరూపము

నీవు చేసిన మాయచే నిఖిలసృష్టిలో నీ
నీవు నేనను భావన నెగడుచున్నది
నీవు రాముడవు నేను జీవుడ గాని
దేవ నారూపు నీదు తేజోంశమే
 

3, అక్టోబర్ 2021, ఆదివారం

హరిని నమ్మితిని నేను

హరిని నమ్మితిని నేను హరిని నమ్మితిని కదా
పరులముందు సాగిలపడు పనియే లేదు
 
ఎవరెవెరిని నమ్మువార లేమేమి పొందుదురో
ఎవరెవ రేమేమి పొంది యెంత సుఖపడుదురో
వివరములవి నాకేలను విశ్రుతుడగు శ్రీహరిని
భవబంధవినాశకుని బాగుగ నమ్మితిని నేను

అవియివి యాశించి నేను హరి నాశ్రయించ లేదు
ఎవరో బోధించుటచే నితని నమ్ముకొన లేదు
ప్రవిమలాత్ములగువారికి లక్షణమీ హరిభక్తి
భువి నందరు తెలియుడయ్య పుట్టు హరిభక్తుడను
 
హరిసేవయె సుఖకరం బన్యుల సేవింపను
హరి యిచ్చును కామితంబు లర్ధింప నన్యులను
హరి యిచ్చును బ్రహ్మానంద మదే నాకు చాలును
హరియిచ్చును మోక్షధనం బదే నేను కోరెదను

అనరే శ్రీరామ యని

అనరే శ్రీరామ యని యనరే రఘురామ యని
వినా సీతారామం ననాథో ననాథ యని

పాహిమాం రామభద్ర పరమదయాసాంద్ర యనరె
పాహిమాం పౌలస్త్యప్రాణాపహరణ యనరె
పాహిమాం భక్తలోకపరిపాలనచణ యనరే
పాహిమాం రామచంద్ర త్వమేవ శరణ మనరె
 
పాహిమాం పరమయోగిపరిపూజిత రామ యనరె
పాహిమాం దానవారి పాకారివినుత యనరె
పాహిమాం దేవదేవ  బ్రహ్మాద్యభినుత యనరె
పాహిమాం రామచంద్ర త్వమేవ శరణ మనరె
 
పాహిమాం సర్వలోకపరిపాలక హరి యనరె
పాహిమాం దీనజనావన వేదవేద్య యనరె
పాహిమాం భవతా‌రక పావనశుభనామ యనరె 
పాహిమాం రామచంద్ర త్వమేవ శరణ మనరె


రామనామ జపముచే లభియించని దేది

రామనామ జపముచే లభియించని దేది
రామ రామ యనకుంటే రక్షణ యేది
 
రామునిపై మనసు నిలిపి రామనామజపమును
ప్రేమతో చేయవలయు రామనామజపమును
పామరునకు పండితునకు రామనామజపమున
రామచంద్రుని దయ దొఱకు రక్షణ లభించును
 
రాముని దయచాలును  లక్షబాధలు తొలగ
రాముని దయచాలును ప్రాణములు నిలుపగ
రాముని దయచాలును రాజ్యలాభము లీయ
రామనామము చాలుగద రాముని దయకలుగ

రామనామ మణగించును కామక్రోధాదులను
రామనామ మణగించును పామరత్వంబును
రామనామ మిచ్చు శుభపరంపరల ననిశము
రామనామ మందించును ప్రేమతో మోక్షమును
 

రామనామము జగదారాధ్యనామము

రామనామము జగదారాధ్యనామము
రామనామము సర్వరక్షక నామము
 
హరినామము లందిదియే యత్యుత్తమ నామమని
హరుడు వక్కాణించినట్టి యందమైన నామము
పరమపావన నామమని భవతారక నామమని
ధరను పేరుకెక్కినట్టి దాశరథి నామము

ఓపరాని దుఃఖంబుల నూడ్చునట్టి నామము 
కోపమోహాదికదుష్ట గుణములణచు నామము
తాపత్రయంబుల పట్టి తరుము నట్టి నామము 
పాపలతాలవిత్రమై పరగునట్టినామము
 
సకలమునీశ్వరులు జపము సలుపుచుండు నామము
సకలభక్తవరులు పాడు చక్కనైన నామము
సకలలోకములకు సుఖసంవర్ధక నామము
సకలార్ధసిధ్ధికరము జానకీశు నామము

2, అక్టోబర్ 2021, శనివారం

దిగిరారా దిగిరారా జగదీశ్వరా

దిగిరారా దిగిరారా జగదీశ్వరా
జగమున పౌలస్త్యమతము  చాలహెచ్చాయె

అవనీతలేశ్వరుండ నన్నమాట మరువకు
ప్రవిమలసత్కీర్తితో భాసించుట మరువకు
ఉవిదల రక్షించుట నీకొప్పు నది మరువకు
రవికులేశ వేగిరమే రారా రామా

భక్తులను పాలించగ వలయునని మరువకు
శక్తికొలది రాకాసుల జంపవలె మరువకు
ముక్తికోరి కొలుచెడు మాబోంట్లమాట మరువకు
యుక్తమే ధర్మరక్షణ మో రఘురామా

ఖలులుచేయు సాధుహింస ఖండించవలెనురా
కలి రావణుల చెలిమిని ఖండించవలెనురా
అలసత్వము జూప బిరుదు లన్నియును చెడునురా
తలపరా కర్తవ్యమును దశరథరామా



 




అల్పుడనా యేమో యది యటు లుండనీ అల్పమా నానోట నమరిన నీనామము

అల్పుడనా యేమో యది యటు లుండనీ
అల్పమా నానోట నమరిన నీనామము

పదివేల జన్మలెత్తి బడసితినో యేమో 
యిది నా రసనపైన  నెంత నర్తించునో
పదిలముగ దీనినే పట్టుకొని యున్నానే
యిది యనల్పమే యని యెఱుగుదు గాన

మాయ నన్నెంతగా మభ్యపెట్టుచున్నను
చేయుదును రామ రామా యని నామమును
తీయని నీనామమె దేవదేవ భవమును
బాయుటకు దారియని భావింతు గాన

అల్పమైన చిప్ప యం దాణిముత్య మున్నటుల
అల్పత్వ మటుండ నా కబ్బెను నీనామమే
నిల్పుకొని నాలుకపై నే నుపాసింతునే
అల్పుడనా నేను మోక్షార్హుడను కాని




రామదేవుడా ఓ రామదేవుడా

రామదేవుడా ఓ రామదేవుడా నిన్ను
ప్రేమతో కొలిచెదమో రామదేవుడా

భూమిమీద సాటిలేదు రామదేవుడా నీదు
నామమున కనివింటిమి రామదేవుడా
ఏమఱక నీనామము రామదేవుడా అదే
మేము చేయుచున్నాము రామదేవుడా

నీమహిత చరితమునే రామదేవుడా కనుము
మేము చదువుచున్నాము రామదేవుడా
నీమీద పాటలనే రామదేవుడా సదా
మేము పాడుచున్నాము రామదేవుడా

కామితము మాకొకటే రామదేవుడా యింక
యేమిజన్మమును వద్దు రామదేవుడా
మా మొఱాలకించ వయ్య రామదేవుడా నీవు
మామీద దయజూపుము రామదేవుడా



వట్టిమాట లెందుకయ్య పరంధాముడా

వట్టిమాట లెందుకయ్య పరంధాముడా మరల 
పుట్టవు పొమ్మనుచు నా కొట్టుపెట్టరా

పదిపదులగు జన్మలుగను ప్రాకులాడు చుంటి గాని
పెదవివిప్పి యావరమును విదుపవుగా రామా
వదలలేక భవచక్రము భంగపడుచు నిన్ను
పదేపదే వేడుకొనెడు భక్తుని కరుణించవు

అడిగితినా ధనరాశుల నాశలతిశయించు చుండ
అడిగితినా పెత్తనంబు నందరిపైన నేను
గడువలేక భవబంధము కావమనుచు నిన్ను
విడిపించుమనుచు వేడ వినని యటులుందువు

మచ్చికతో పాటలువిని మామంచి దేవుడా
యిచ్చకంబు లాడి అవియివి యిత్తునందువు
ముచ్చటగా నింక నీవు పుట్టవనెడు మాటను
ఆచ్చుతుడా పలుకవయ్య ఆనందపడుదు

1, అక్టోబర్ 2021, శుక్రవారం

నేటికిని నీదయకై నిరీక్షించుచుంటిని

నేటికిని నీదయకై నిరీక్షించుచుంటిని
మాటయిచ్చి తప్పవుగా మధుసూదనా

ఇచట నావాడ వగుచు నెసగు నీవు రేపకడ
అచట కొంతకాల ముండ నరుగరాదో
యెచటనున్న నీవాడనె విచారించ నేల నని
విచలితు నన్నోదార్చి పృథివి నుంచి వెడలితివి

ఏళ్ళాయెను పూళ్ళాయెను ఎన్నో యుగములాయెను
కళ్ళజూడ నైతిని నిను కటాక్షించరా
వెళ్ళలేక వెళ్ళునన్ను వెళ్ళిరమ్మన్నది నీవు
మళ్ళీ కనిపించ కున్న మాటతప్పి నట్లేగా

నాడు నీవాడనే మరి నేడు కాకపోయితినా
వేడుకొందును దేవుడా విశ్వనాథుడా
నాడు నేడు నేనాడును నమ్మకముగ నావాడవె
గోడు వినర మాట్లాడర కోదండరాముడా






లోకేశ్వరునే లోనెంచేవో శోకమోహములు నీకేవీ

లోకేశ్వరునే లోనెంచేవో శోకమోహములు నీకేవీ
లోకవృత్తములు లోనెంచేవో నీకు మనంబున శాంతేదీ

హరి హరి హరి యని హరినే తలచిన
చొరబడగలదా శోకము నీలో
హరిమోహములో నన్నియు మరచిన
ధర నేమోహము తగులును నీకు
 
తారకమంత్రము దాల్చిన మనసున
కోరికలేమియు చేరవు కాదా
శ్రీరఘురాముని చేరుట యొకటే
కోరదగిన దనుకొందువు గాదా

నిరంతరంబును హరేరామ యని
హరేకృష్ణ యని ఆనందించే
నరోత్తమునకు మరే కష్టములు
ధరాతలంబున తగులవు కాదా

వింటిని వింటిని నీదయ గూర్చి విన్నది నిజమే ననుకొంటి

వింటిని వింటిని నీదయ గూర్చి విన్నది నిజమే ననుకొంటి
కంటికి కనబడు మంటే యెన్నడు కనరా కుండుట కనుగొంటి
 
అపదపాలై కరి శరణనగా అదుకొంటివని విన్నానే
ఆపదపాలై ద్రోవది మొఱలిడ ఆదుకొన్నకథ విన్నానే
ఆపదపాలగు నంబరీషు వెస నాదుకొన్నదియు విన్నానే
ఆపదలే నను చుట్టుముట్టినను నాహా పలుకవు రామయ్యా

పుట్టినదాదిగ పురుషోత్తమ నిను పొగడుచు నిట నిలుచున్నానే
పట్టుబట్టి నీ దరిసెనమునకై  ప్రార్ధనచేయుచు నున్నానే
ఒట్టులెన్ని నే పెట్టుకొన్న నీవోహో కనరాకున్నావే
యిట్టులైన నేనేమై పోవుదు నినకులతిలకా రామయ్యా

వింటిని భక్తవరదుడవు నీవని వెన్నుడ భక్తుడ నే గానా
వింటిని దీనజనాశ్రయుడ వని విన్నది నిక్కువమే కాదా
వింటి దయాబ్ధి వటంచును నదియడు గంటినదా నే డేమయ్యా
బంటుకు దయతో దరిసెన మీయవు భళిభళి ఓ రఘురామయ్యా