30, ఏప్రిల్ 2015, గురువారం

సత్యనారాయణ సత్యనారాయణ






సత్యనారాయణ సత్యనారాయణ
నిత్యనిర్మలకీర్తీ సత్యనారాయణ


శ్రీరత్నగిరిసంస్థితనారాయణ
కారణకారణ కరుణాభరణ
శ్రీరమణీమణీహృదయవిహరణ
నారదసన్నుత నాగశయాన
సత్య

నీరజాక్ష  కలినిర్మూలనచణ
వీరవేంకట సత్యనారాయణ భవ
తారణకారణ నారాయణ భక్త
పారిజాత సత్యనారాయణ
సత్య

వరద  అనంతలక్ష్మీ  భావిత చరణ
నిరుపమ అన్నవరపురవర విహరణ
సురవైరిశోషణ సురగణతోషణ
హరిహరబ్రహ్మరూప ఆదినారాయణ
సత్య



[ ఈ రోజున కొద్ది సేపటి క్రితం మా తమ్ముడు చిరంజీవి తాడిగడప సత్యశ్రీరామచంద్రమూర్తి శ్రీసత్యనారాయణస్వామివారిమీద కొన్ని కీర్తవలు రచించవలసిందిగా కోరటం జరిగింది. అది నాకూ ఎంతో ఆనందదాయకమైన విషయం కాబట్టి స్వామివారిపైన యథాశక్తిగా కొంత సాహిత్యం అయన అనుగ్రహం మేరకు వెలువరించాలని ఆశిస్తూ ఈ కీర్తనతో ప్రారంభిస్తున్నాను. స్వామివారు ఏమేమి ఈ అల్పప్రతిభుడిచేత వ్రాయిస్తారో అని నేనూ అసక్తిగా ఎదురుచూస్తున్నాను.]

29, ఏప్రిల్ 2015, బుధవారం

కాలం చేసే గారడి నేను చాలా చూసాను



కాలం చేసే గారడి నేను చాలా చూసాను
కాలాతీతుని రాముని నాలో మేలుగ తలచాను 

కన్నులు తెరచిన తొలినాడే నే కలినే చూసాను
కలిమాయలలో చిక్కిన జనులు కలగుట చూసాను
కలగిన మనసులు సత్యపథమ్మును తొలగుట చూసాను
తొలగిన బేలలు చీకటులందు తిరుగుట చూసాను
॥కాలం చేసే॥
మాయామయమగు జగమును నమ్మే మనుజుల చూసాను
కాయమె తానని తలచే వారల కష్టము చూసాను
ప్రేయోమార్గము వెంట మనుషుల పరుగులు చూసాను
శ్రేయోమార్గము గలదని తెలియని జనులను చూసాను
॥కాలం చేసే॥
అక్కడక్కడ భ్రమలు తొలగిన అనఘుల చూసాను
చక్కగ రాముని నమ్మిన మనసుల సౌఖ్యము చూసాను
అక్కజముగ శ్రీరాముడు వారికి దక్కుట చూసాను
మిక్కిలి ప్రేముడి కొలిచి రాముని దయనే చూసాను 
॥కాలం చేసే॥



28, ఏప్రిల్ 2015, మంగళవారం

ఆపదలన్నీ గడచేదెట్లా



ఆపదలన్నీ గడచేదెట్లా
శాపాలన్నీ సమసేదెట్లా
పాపాలన్నీ పోయేదెట్లా
తాపత్రయములు తీరేదెట్లా

దుర్మదమంతా అణగకపోతే
ధర్మాధర్మము లెఱుగకపోతే
కర్మాసక్తిని విడువకపోతే
నిర్మోహత్వము కలుగకపోతే
॥ఆపద॥
హరిభక్తులతో చేరకపోతే
హరికీర్తనలు పాడకపోతే
హరినామములు నుడువకపోతే
హరినామము రుచి తెలియకపోతే
॥ఆపద॥
భామినిపై భ్రమ వదలకపోతే
భూములపై భ్రమ వదలకపోతే
కామాదికములు కాలకపోతే
రామునిపై గురి కుదదకపోతే
॥ఆపద॥



25, ఏప్రిల్ 2015, శనివారం

చెనటి మాయకు జిక్కి చెడిపోవ కుందుమా?






చెనటి మాయకు జిక్కి చెడిపోవ కుందుమా
తనవలె నెవరు మాయ దాటి యుందురు




తాను జగముల జేసి తనమాయలో ముంచి
వేనూఱు వింతవింత లైన జీవుల జేసి
లేనిపోని చిక్కులు బెట్టి మానక నవి దాటించు
ఆనక విన్నాణమిచ్చు నందాక నేది తెలివి
చెనటి



జీవులందరి లోన చెలగి తానె క్రీడించు
భావింప రాళ్ళురప్పల భాసించు వెన్నుండు
చేవ తాను గాని దైన చిన్న పరమాణువు లేదు
ఏ విధి మనబోంట్ల కిది విదితంబుగా నుండు   
చెనటి



మాయతోడ బుట్టి కూడ మాయగడువ వచ్చు ననుచు
ప్రేయోమార్గమున నున్న వెంగళులమైన మనకు
శ్రేయోమార్గమును జూప శ్రీరామచంద్రు డాయె
ధ్యేయమైన రామపథము తెలిసినడువ లేకున్న        
చెనటి






వెన్నుగాచి రామభద్రు డున్నాడుగా






వెన్నుగాచి రామభద్రు డున్నాడుగా నా
కెన్నటికి భయమనేదే లేదుగా




వాసవాదినుతుని మాట వమ్ముగాదుగా రామ
దాసకోటి సేమమును వీసమంతగ
మోసపుచ్చు నాపదయు మొలకెత్తదుగా వారి
జాసనుని సృష్టిలోన జనులార వినుడు
వెన్ను గాచి


ప్రారబ్ధము నన్ను బట్టి  బాధించునే రామ
నారాయణపాదసేవనాపరుడ గాన
కోరి నేను చేరగనే కోదండరాముని
పారిపోయె పాపములు ప్రజలార వినుడు
వెన్ను గాచి


రాముని వాడ నైతి రాముడు నావాడై
నా మనసున నిండి నా కండగ నుండి
ప్రేమతో తలగాచి పవలు రేలు తోడై
యేమఱక సేమమఱయు నెల్లరిది వినుడు
వెన్ను గాచ






24, ఏప్రిల్ 2015, శుక్రవారం

ముక్కోటి దేవతలే మ్రొక్కుచున్నారయా






ముక్కోటి దేవతలే మ్రొక్కుచున్నారయా
అక్కటా నీవు నమ్మనందువలన లోపమా




నమ్మవయ్య రాముడు నారాయణుడు నీవు
నమ్మకున్న కూడ నతడు నారాయణుడే
నమ్మినందు వలన రామునకు లాభమా నీవు
నమ్మకున్న రామునకు నష్టమున్నదా  
ముక్కోటి



కాముడు నీవాడుగా కనిపించునా నీకు
రాముడు పెఱవాడుగా ననిపించునా
ఏమి దుష్కర్మమో ఏమార్చగా నీకు
స్వామిపై నమ్మకము సంభవమేనా      
ముక్కోటి



రామునికృప నీపైన రాకూడదా నీకు
రామునిపై భక్తి కలుగరాదా నేడే
ప్రేమమయునకు నీవు బిడ్డవు కావా నీకు
నామాటలు చేదైతే నేమి చేసెద   
ముక్కోటి






23, ఏప్రిల్ 2015, గురువారం

నీ విచ్చిన యూపిరితో నిలచితి నేను






నీ విచ్చిన యూపిరితో నిలచితి నేను
నావాడ వని నిన్ను నమ్మితి నేను




నా వెన్ను గాచి రామనారాయణా నీవు
నావాడవై యుండ నాకేమి కొఱత
భావింప మనమధ్య బంధ మింతటిదై
యేవేళ తెగకుండ నెసగనీ ధృఢమై
నీ విచ్చిన


జగములం దేమూలల జన్మించితి గాక
యుగయుగంబుల నుండి తగిలియుంటి నిన్ను
అగచాట్లపాలైన యన్ని వేళల యందు
తగినరీతిని నాదు తలగాచి నావు
నీ విచ్చిన


పరమయోగులు కూడ పట్టలేని నిన్ను
పరమమూఢుడ నెట్లు భావింతు నయ్య
అరయ నిర్వ్యాజకరుణాంతరంగుడ నిన్ను
తరచు కూరిమి మీఱ తలచుచుండెద గాక
నీ విచ్చిన






21, ఏప్రిల్ 2015, మంగళవారం

రామా యని పలికితిని..



వేమారులు కలిగితిని
వేమారులు తొలగితిని
ఈ మాయను తెలిసితిని
రామా యని పలికితిని

తనువులపై మోహంబుల
తనయులపై మోహంబుల
ధనములపై మోహంబుల
ననయము గొని తిరుగుచు నే
॥వేమారులు॥
దుర్మదముల ఫలితంబుల
కర్మనిష్ఠ ఫలితంబుల
ధర్మదృష్టి ఫలితంబుల
మర్మంబుల తెలియుచు నే
॥వేమారులు॥
విడచితి పాపము పుణ్యము
విడచితి సుఖమును దుఃఖము
విడచితి నీకై సర్వము
తడవేలా దయచూడుము
॥వేమారులు॥



20, ఏప్రిల్ 2015, సోమవారం

రాముడున్నాడు రక్షించు చున్నాడు






రాముడున్నాడు రక్షించు చున్నాడు
ప్రేమతో పాలించే విభుడై యున్నాడు




నమ్మి కొలచిన వారి యుమ్మలికములెల్ల
గమ్మున తొలగించు ఘనుడై యున్నాడు
సమ్మతి రాముని సర్వాత్మకుని చే
కొమ్మని మీరు మ్రొక్క కున్నా రిదే మయ్య
॥రాముడు॥



బలవంతులకు వాడె బలమిచ్చు చుండ
బలవంతులని వేఱు వారల గూడేరొ
తెలియ లేరో రామదేవుని మహిమను
కలిమాయలో చిక్కి కలతపడ్డారో
॥రాముడు॥



రామరామ యన్న రాలును కలిమాయ
రామభక్తులపైకి రాదు కాలుని చాయ
రామరక్షను మించు రక్ష లేనే లేదు
రామపాదములు చేర రండు సుజనులార
॥రాముడు॥






17, ఏప్రిల్ 2015, శుక్రవారం

తానేమో నేనేమో



తానేమో నేనేమో
మానేమో యీ ఆటలు
నేను తనను వెదకుదునా
తాను దాగి నవ్వేనా

ఎందున్నా వని యందును
ఎందు లేనని నవ్వును
ఎందుకు దాగెద వందును
సందియము వలదనును
॥తానేమో॥
నేను తన తోటలో
తాను నాతో‌ ఆటలో
నే నెఱిగినది లేదు
తా నెఱుగనిది లేదు
॥తానేమో॥
వెదకి వెదకి కనుగొంటిని
తుదకు తాను నాలోనే
మెదటి నుండి యున్నాడని
వెదుకులాట వెఱ్ఱియని
॥తానేమో॥



16, ఏప్రిల్ 2015, గురువారం

కనుల జూద మనుకొందును



కనుల జూద మనుకొందును
కనులు చాల వనుకొందును
మనసు పట్టలేని నిన్ను
కనులు పట్ట లేవందును

భావనలో పట్టరాని
పావన మగు భవ్యమూర్తి
ఆ విధమని ఈ విధమని
నీ వైభవ మెన్ని నేను
॥కనుల॥
ఓహోహో‌ నీవే నా
ఊహల నడపించు శక్తి
ఊహింపగరాని నిన్ను
ఊహించును భక్తి  కాన
॥కనుల॥
ఏమో పరమేశుడవో
రాముడవో కృష్ణుడవో
నా మనసున నిలచితివే
నీ మూర్తిని మనసారా
॥కనుల॥



15, ఏప్రిల్ 2015, బుధవారం

నే నుంటి నందునా నీవుంటి వందునా

నే నుంటి  నందునా నీవుంటి వందునా
నేనె నీ వందునా నిజమేమి టందునా

శ్రీరామ నిజమెన్న జీవరాసుల కెపుడు
తారుండు విధమైన తెలియరాకుండు
ఏ రీతి పరతత్త్వ పారమ్యమును గూర్చి
గోరంతయును పోల్చుకొనవచ్చు గాన ॥ నే నుంటి॥

జానకీరమణ నీ చరణాంబురుహములను
పూని గొల్చెదగాన బుధ్ధిలో కొంత
నేను  నీ వాడనను ఙ్ఞానలేశంబు
మానక కలుగెనే మరియందు చేత ॥నే నుంటి॥

తొడిగిన తొడగులు తొడగక కొన్ని
తొడిగిన వంటివే తొడుగుచు కొన్ని
ఉడిగితి తుదకు నా యున్కిపై భ్రాంతి
కడకు నీ యందె నే కలసితి గాన ॥నే నుంటి॥

పట్టినచో రామపాదమే పట్టవలెరా






పట్టినచో రామపాదమే పట్టవలెరా
పట్టినచో ముక్తిమార్గమే పట్టవలెరా




చెడ్డవిద్యలు నేర్చిన చెడిపోయేవు
అడ్డమైన మంత్రాలు ఆశతీర్చవు
గుడ్డ రంగుమార్చినా గురువువు కావు
గడ్డమొకటి పెంచగనే  ఙ్ఞానివి కావు    
పట్టినచో


నరులవలన దొరికేది సున్నకు సున్న
తరచు పుస్తకాలలో తత్త్వము సున్న
సరియైన గురువులేక ఙ్ఞానము సున్న
పరమార్థము తెలియకున్న బ్రతుకే సున్న         
పట్టినచో


వల్లమాలిన తాపత్రయమును ద్రుంచి
చిల్లరకోరికల కింక సెకవిచ్చి పంపి
అల్లరి పనులింక మాని హరిని యెడదనించి
కల్ల గాని సత్పథమే ఘనమని నిజమెంచి         
పట్టినచో





13, ఏప్రిల్ 2015, సోమవారం

ఆర్చేరా తీర్చేరా హరి యితరులు నాకు

ఆర్చేరా తీర్చేరా హరి యితరులు నాకు నీ
పేర్చిన కృప చాలులే వేయి మాట లెందులకు

తనను కట్టుటకు తాళ్ళు తాను తెచ్చుకొన్నటుల
వెనుక జన్మముల నుండి వికృతకర్మ బంధముల
మునుకొని నే తెచ్చుకొంటి కనుక నా కితరుల
పనుల మంచిచెడుల నెన్న బని లేదయ్యా  ॥ఆర్చేరా॥

నిరుపయోగమోహముల కొరబోయిన జన్మముల
తరచు బంధువులను నమ్మి తగులబడిన జన్మముల
గురువాచ్యులను నమ్ముకొనగ చెడిన జన్మముల
మరలమరల తలచెదనా మతిలేకుండ   ॥ఆర్చేరా॥

ఏమో యీ నాటికి యించుకంత భక్తి నిలచి
రామచంద్ర నీ పాదరాజీవముల వలచి
శ్యామసుందర బుధ్ధి నుండి తామసము విడచి
ఓ మహాత్మ వెలిచూడ్కుల నుడిగితి నిను తలచి  ॥ఆర్చేరా॥

తపము తపమంటా రదేమయ్యా






తపము తపమంటా రదేమయ్యా మరి యా
తపము వలన ఫలిత మేమయ్యా




తపము తపమన ధర్మపరుడై దాశరథినే నమ్మియుండుట
తపసి వెన్నుగాచి యుండుట దాని ఫలితము తెలిసికొనుము   
తపము



తపము తపమన యెల్లవేళల దాశరథినే తాను కొలుచుట
అపజయమ్ము లేక కోరిక లన్ని తీరుట దాని ఫలము         
తపము



తపము తపమన రామధ్యానము దాని ఫలితము బ్రహ్మఙ్ఞానము
తపము చేసి ఙ్ఞానియై పరతత్త్వమందే తాను కలియును          
తపము






12, ఏప్రిల్ 2015, ఆదివారం

కర్మసాక్షులు నీదు కన్నులు






కర్మసాక్షులు నీదు కన్నులు రామ
ధర్ముడు నీ బంటు దశరథరామ




జగమెల్ల నీయాన జరుగుచుండగను
తగని యాపద నన్ను దాకునా రామ
అగణితమహిమ నీ యండనుండంగ
పగలైన రేయైన తెగకుండు రక్ష
కర్మ



జగమెల్ల నీ భక్తజనుల నిండగను
తగని భయములు నన్ను దాకునా రామ
నిగమాంతసంవేద్య నీ నామమహిమ
పొగడెడు నాకు నీ పోడిమి రక్ష  
కర్మ



జగమెల్ల నీ బంట్ల జయగాథ లెగయ
తగని వగపులు నాకు తగులునా రామ
యుగయుగంబుల మన కున్నట్టి బంధమే
యగు చుండు తులలేని దైనట్టి రక్ష
కర్మ






10, ఏప్రిల్ 2015, శుక్రవారం

తెలిసిన వారికి దేవుడవు లేవని పలికే వారికి గుడిలో శిలవు






తెలిసిన వారికి దేవుడవు లేవని
పలికే వారికి గుడిలో శిలవు




ఇమ్మహి కాదర్శమ్మని నీ కథ
ఇమ్ముగ తన చిత్తమ్మున చక్కగ
నమ్మినచో మరి నారాయణుడవు
నమ్మకున్నచో నవ్వుకొందువు
తెలిసిన



తడబడకను  సధ్ధర్మపథంబున
నుడువులు నీయవి నడిపిన రీతిని
నడచినచో మరి నారాయణుడవు
నడువకున్నచో నవ్వుకొందువు
తెలిసిన



ఘోరభవాబ్ధినిమగ్నుండొక్కడు
తారణనౌకవుగా తలచినచో
శ్రీరాముడవు నారాయణుడవు
వేరని తలచిన నవ్వుకొందువు
తెలిసిన






9, ఏప్రిల్ 2015, గురువారం

రామ రామ రామ యనుచు నామభజన చేయుటలో






రామ రామ రామ యనుచు నామభజన చేయుటలో
ఏమి రుచి ఏమి సుఖము ఏమి శాంతి ఓ మనసా




ఆ మాటను కైకసిసుతు డైన విభీషణు డెఱిగి
శ్రీమంతుడు గుణవంతుడు శ్రీరామచంద్రహితుడు
నీమ మొప్ప రఘువరు శుభనామంబు నుపాసించి
భూమి మీద చిరాయువై పొలిచె కీర్తిమంతుడై
రామ



సామీరియు నిరతంబును రామచంద్రవిభుని మ్రోల
నామజపానందనిమగ్నాంతరంగు డగుచు నుండి
భూమిసుతావరుని మెప్పు పొంది యుప్పొంగు చుండి
యా మహాత్ము డాగామిని యధివసించు బ్రహ్మపదము
రామ



పరమయోగిగణంబులును పాకశాశనాదిసురలు
సరసిజభవపరమశివులు సతతము కీర్తించునట్టి
పరమపదావహము పతితపావనంబు నై యెసంగు
నిరుపమాన నామ మెఱిగి  నిర్మలశుభనిష్ఠ మెఱయ
రామ






7, ఏప్రిల్ 2015, మంగళవారం

పరమభాగవతులు రామభజనకు రండు






పరమభాగవతులు రామభజనకు రండు
పరమపురుషుడైన చక్రి భజనకు రండు




నోరారగ మనసు కరువుతీర పాడ రండు
శ్రీరాముని పొగడిపొగడి సేదతీర రండు
మీ రెరిగిన కృతులు విభుడు మెచ్చ పాడ రండు
చేరి మనము రామభజన చేయ వచ్చు రండు 
పరమ



పోచికోలు కబురులతో ప్రొద్దుపుచ్చనేల
రాచకార్యమేముండును రాత్రిపూట మీకు
వాచవియట రామభజన వాసవాదులకైన
లేచి రండు భజనచేయ లేచి రండు వేగ
పరమ



రామభజనతో గోపరాజు ముక్తి నొందె
రామభజనతో త్యాగరాజు ముక్తి నొందె
రామభజనతో హనుమ బ్రహ్మపదము నొందె
రామభజనతో పొందరాని దేమిగలదు
పరమ






తామసుల మనసులకు రాముడు కడు దూరము

తామసుల మనసులకు రాముడు కడు దూరము
రామదాసజనులకు తామసమతి దూరము

అరకొర చదువులు చదివిన నరుల కెంత తామసము
సిరులు కొలది కొలది కలిగి  నరుల కెంత తామసము
దొరతనములు  దొరకినవని నరుల కెంత తామసము
అరరే యీ తామసముల నణచక హరి దూరము  ॥తామసికుల॥

వరకులసంజాతులమని నరుల కెంత తామసము
పరమేశ్వరదత్త మైన ప్రజ్ఞ లేక తామసము
పురాకృతకర్మఫలము పట్టలేని తామసము
అరరే యీ తామసముల నణచక హరి దూరము  ॥తామసికుల॥

గురుపీఠంబుల నెక్కు కొలది పెరుగు తామసము
పరాకుల నెత్తిచూపు వారిని గని తామసము
హరివిరసుల తోడ నడచి యంతులేని తామసము
అరరే యీ తామసముల నణచక హరి దూరము  ॥తామసికుల॥

6, ఏప్రిల్ 2015, సోమవారం

తరచుగా ఏకాంతమన్నది దొరకు చున్నదా

తరచుగా ఏకాంతమన్నది దొరకు చున్నదా
తరచుగా శ్రీరామజపము జరుగుచున్నదా

తరచుగా తాపత్రయముల తహతహల రోజు గడచునా
తరచుగా కామాదిరిపుల తాడనంబులు విరచునా
తరచుగా మరి యీతిబాధల పరమవ్యగ్రత కరచునా
తరచుగా నటు లగుచు నున్న దాశరథినే వేడుమా  ॥తరచుగా॥

తరచుగా పదిమంది నడుమ తలచు భాగ్యము కలుగదా
తరచుగా సాస్థ్యంబుదప్పి తనువు బడలుట కలుగునా
తరచుగా మతిమరపుచేత ధ్యానలోపము కలుగునా
తరచుగా నటు లగుచునున్న దాశరథినే వేడుమా  ॥తరచుగా॥

తరచుగా దుర్విద్యలందలి తమిని దినములు గడచునా
తరచుగా డాంబికుల బోధల దారి తప్పుట గలుగునా
తరచుగా ఫలమేమి యనెడు తప్పు బుధ్ధియు గలుగునా
తరచుగా నటు లగుచుచున్న దాశరథినే వేడుమా  ॥తరచుగా॥

ప్రతిలేని ఘనవిద్య రామవిద్య






ప్రతిలేని ఘనవిద్య రామవిద్య
చతురాస్యశివశక్రసన్నుతవిద్య




అతిమనోహరవిద్య అమృతవిద్య
అతిశయబుధ్ధుల కందని విద్య
మతిమంతులకు సేవ్యమైన విద్య
మితిలేని యానందమిచ్చెడు విద్య
ప్రతి



తలగాచి బ్రోచెడు ధర్మవిద్య
ఇల విద్యలన్నింటి కెక్కుడు విద్య
కలిమాయల నుండి కాచువిద్య
సులువైన సద్విద్య  నిస్తులవిద్య
ప్రతి



మందబుధ్ధిని బాపు మంచివిద్య
బందంబు లుడిగించు పావన విద్య
అందరకు నందుబా టైన విద్య
అందుకుంటె మోక్షమిచ్చు అద్బుత విద్య
ప్రతి






5, ఏప్రిల్ 2015, ఆదివారం

తానుండు నన్నాళ్ళె తనది తనువు






తానుండు నన్నాళ్ళె తన దీతనువు
తాను తొలగిన నాడు తన కేమి కాదు




తనివార మైపూతల నద్ది ముఱిసేను
తినుటకె పుట్టిన దనునట్లు పెంచేను
తనభోగముల కెంతొ తహతహ లాడేను
తనకాల మఱుదెంచ తానిట్టె వీడేను   
తానుండు



కొఱగాని కాసులు కొన్ని గడించేను
మరి మేను శాశ్వతమన్నట్లు బ్రతికేను
ధరనిండ బంధుసంతతి చాల నించేను
తరుణము కాగానె తానిట్టె తరలేను        
తానుండు



ధీమంతుడు నిజము తెలిసి చరించేను
కామాదుల విడచి రాముని కొలిచేను
రామదాసుడ తిరిగి రానని పలికేను
క్షేమదాయకు నింట  చేరగ తరలేను        
తానుండు






4, ఏప్రిల్ 2015, శనివారం

అఖిలాండిలోటి బ్రహ్మాండైక నాయక

అఖిలాండిలోటి బ్రహ్మాండైక నాయక
నిఖిలాగమస్తుత నిర్వాణదాయక

దేవదేవ నీదు దివ్యప్రభావంబు తెలియంగ నేనెంతవాడ
నీవంకకే కాని ఏవంకకును బోక నిలువంగ లేకున్న వాడ
ఏ విధానమున నిన్నెడబాయని భక్తి భావంబు నిండించు వాడ
నేవే కటాక్షించి నా జాలి పరికించి కావుమా కోనేటి రేడ  ॥అఖిలాండ॥

తలపులన్నీ నీకు ధారపోయుదు నని తహతహ లాడేను కాని
యిలలోని గొడవలు తలలోన కలబడి తలపులు కలుషితమ్మైన
జలజాక్ష నీదివ్య చరణసరోరుహముల మ్రోల నుంచగా లేని
తులువను జాలితో తిలకించి నీదయ నొలికించుమా చక్రపాణి ॥అఖిలాండ॥

శ్రీరామ శ్రీరామ శ్రీరామ అని మూడు మారులు పలికెడు లోన
మారుద్రోవలుద్రొక్కి మసలుచుండును నాదు మనసన్న జానకీజాని
ఈ రీతి గడిచిన వెన్ని జన్మంబులో యిల నిట్లు తిరుగుటే కాని
వేరు మార్గములేదు నీవె జాలిని చూపి ఆరాటమును తీర్చవేని  ॥అఖిలాండ॥


కొంచెపు వాడ నైతే కానీరా నీ మంచితనము నాపై రానీరా






కొంచెపు వాడ నైతే కానీరా నీ
మంచితనము నాపై రానీరా




లోకుల మాటల నెన్ని నీకు మ్రొక్కుట లేదు
లోకులం దెందరు నేడు నీకు మ్రొక్కేరో
నీ కనులు కరుణ  తోడ నిండి యుండుట జూచి
నాకు నచ్చెను గాన నీకు మ్రొక్కుచు నుంటి
కొంచెపు


సొమ్ములిచ్చెదవని నమ్మి మ్రొక్కుట లేదు
సొమ్ములున్న వారికెల్ల సుఖముండేనా
నెమ్మనమున శాంతినింపు నీ చిరునవ్వే నాకు
సొమ్మైయుండుట జూచి  సొరిది మ్రొక్కుచు నుంటి
కొంచెపు


అట్టే విద్యలు లేవే యభ్యాసములు లేవే
మెట్టవేదాంతము బుధ్ధి మెదలును గాక
గట్టిగ నీ చెలిమి నున్న కాచుచుందు వది జూచి
పట్టి నీ పాదములు రామా పాహి యనుచుంటి 
కొంచెపు





3, ఏప్రిల్ 2015, శుక్రవారం

నీ దారి నెఱుగువారైతే కొందరేనోయి

కూరిమిగలవారి సంఖ్య కొంచెమే నోయి నీ
దారి నెఱుగువారైతే కొందరే నోయి

దురుసుమాటలాడువారి తోడ వాదంబులు సేసి
మరలమరల మాటపడుట మానియుండక
నరుని నాలుకపలుచనై యుండు పోనిమ్మని
హరిని డాసి సుఖముండే వంతే చాలోయి     ॥కూరిమి॥

రామనామ మెఱుగనివారు రాముడన్న గిట్టనివారు
రామాయణమును చదువ రాదని బోధించు వారు
భూమిని చెలరేగిచాల పుల్లవిరుపులాడుచుండ
నీమముగ రామునెన్ను నీమాట లాలకించు   ॥కురిమి॥

కూరిమితో నిన్ను బ్రోవ కోదండరాము డుండ
ఊరకనే నోరు విదిపే వారు తిట్ట పొగడ నేమి
ఊరి వారి దారులెంత వేరు వేరైన నేమి
దారి చూపి సంరక్షించే దాశరథి నీవాడాయె   ॥కూరిమి॥

2, ఏప్రిల్ 2015, గురువారం

శతకోటిదండప్రణామంబు లయ్య

శతకోటిదండప్రణామంబు లయ్య
అతివేగమునబ్రోవ నరుదెంచవయ్య

మతిమాలి యింద్రియవశుడనై యుంటి మాయచే మనుజాధముడనైతి నయ్య
అతిశయంబైన దేహాభిమానంబు నావలద్రోయంగ శక్తి లేదయ్య
గతియేమి నాబోంట్ల కనియైన తలచి గట్టివిరక్తియు చెందలేకుంటి నయ్య
ప్రతిలేని నీ మహిమాతిశయంబునను బాగొప్ప ననుబట్టి సరిచేయ రాద ॥శతకోటి॥

పంచమలంబులును తాపత్రయములును పట్టిపల్లార్చెడు పాడుజీవితము
యించుకైనను రామభక్తివిశేషమంచు నెఱుంగని వట్టి పాపజీవితము
సంచితాగామిప్రారబ్ధంబులెపుడు వంచించుచుండెడి వ్యర్థజీవితము
కొంచెము నీదయ రానిచ్చి దేవ మంచిగ నినుజేరు నటు చేయ రాద ॥శతకోటి॥

పూజలు వ్రతములు భక్తిమై చాల పొలుపుగా నే జేయ లేనైతి గాని
నా జన్మమున కీవె దిక్కువు నాదు నావను నడపవె జానకీ జాని
భూజనావళి పైన కనికరంబునను మోక్షమిచ్చెడు మంచి వాడవే గాన
వే జన్మములనుండి వేచెడు నన్ను విడువక రక్షించవయ్య రామయ్య  ॥శతకోటి॥