తామసుల మనసులకు రాముడు కడు దూరము
రామదాసజనులకు తామసమతి దూరము
అరకొర చదువులు చదివిన నరుల కెంత తామసము
సిరులు కొలది కొలది కలిగి నరుల కెంత తామసము
దొరతనములు దొరకినవని నరుల కెంత తామసము
అరరే యీ తామసముల నణచక హరి దూరము ॥తామసికుల॥
వరకులసంజాతులమని నరుల కెంత తామసము
పరమేశ్వరదత్త మైన ప్రజ్ఞ లేక తామసము
పురాకృతకర్మఫలము పట్టలేని తామసము
అరరే యీ తామసముల నణచక హరి దూరము ॥తామసికుల॥
గురుపీఠంబుల నెక్కు కొలది పెరుగు తామసము
పరాకుల నెత్తిచూపు వారిని గని తామసము
హరివిరసుల తోడ నడచి యంతులేని తామసము
అరరే యీ తామసముల నణచక హరి దూరము ॥తామసికుల॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.