21, ఏప్రిల్ 2015, మంగళవారం

రామా యని పలికితిని..వేమారులు కలిగితిని
వేమారులు తొలగితిని
ఈ మాయను తెలిసితిని
రామా యని పలికితిని

తనువులపై మోహంబుల
తనయులపై మోహంబుల
ధనములపై మోహంబుల
ననయము గొని తిరుగుచు నే
॥వేమారులు॥
దుర్మదముల ఫలితంబుల
కర్మనిష్ఠ ఫలితంబుల
ధర్మదృష్టి ఫలితంబుల
మర్మంబుల తెలియుచు నే
॥వేమారులు॥
విడచితి పాపము పుణ్యము
విడచితి సుఖమును దుఃఖము
విడచితి నీకై సర్వము
తడవేలా దయచూడుము
॥వేమారులు॥1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.