కూరిమిగలవారి సంఖ్య కొంచెమే నోయి నీ
దారి నెఱుగువారైతే కొందరే నోయి
దురుసుమాటలాడువారి తోడ వాదంబులు సేసి
మరలమరల మాటపడుట మానియుండక
నరుని నాలుకపలుచనై యుండు పోనిమ్మని
హరిని డాసి సుఖముండే వంతే చాలోయి ॥కూరిమి॥
రామనామ మెఱుగనివారు రాముడన్న గిట్టనివారు
రామాయణమును చదువ రాదని బోధించు వారు
భూమిని చెలరేగిచాల పుల్లవిరుపులాడుచుండ
నీమముగ రామునెన్ను నీమాట లాలకించు ॥కురిమి॥
కూరిమితో నిన్ను బ్రోవ కోదండరాము డుండ
ఊరకనే నోరు విదిపే వారు తిట్ట పొగడ నేమి
ఊరి వారి దారులెంత వేరు వేరైన నేమి
దారి చూపి సంరక్షించే దాశరథి నీవాడాయె ॥కూరిమి॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.