23, ఏప్రిల్ 2015, గురువారం

నీ విచ్చిన యూపిరితో నిలచితి నేను


నీ విచ్చిన యూపిరితో నిలచితి నేను
నావాడ వని నిన్ను నమ్మితి నేను
నా వెన్ను గాచి రామనారాయణా నీవు
నావాడవై యుండ నాకేమి కొఱత
భావింప మనమధ్య బంధ మింతటిదై
యేవేళ తెగకుండ నెసగనీ ధృఢమై
నీ విచ్చిన


జగములం దేమూలల జన్మించితి గాక
యుగయుగంబుల నుండి తగిలియుంటి నిన్ను
అగచాట్లపాలైన యన్ని వేళల యందు
తగినరీతిని నాదు తలగాచి నావు
నీ విచ్చిన


పరమయోగులు కూడ పట్టలేని నిన్ను
పరమమూఢుడ నెట్లు భావింతు నయ్య
అరయ నిర్వ్యాజకరుణాంతరంగుడ నిన్ను
తరచు కూరిమి మీఱ తలచుచుండెద గాక
నీ విచ్చిన