13, ఏప్రిల్ 2015, సోమవారం

ఆర్చేరా తీర్చేరా హరి యితరులు నాకు

ఆర్చేరా తీర్చేరా హరి యితరులు నాకు నీ
పేర్చిన కృప చాలులే వేయి మాట లెందులకు

తనను కట్టుటకు తాళ్ళు తాను తెచ్చుకొన్నటుల
వెనుక జన్మముల నుండి వికృతకర్మ బంధముల
మునుకొని నే తెచ్చుకొంటి కనుక నా కితరుల
పనుల మంచిచెడుల నెన్న బని లేదయ్యా  ॥ఆర్చేరా॥

నిరుపయోగమోహముల కొరబోయిన జన్మముల
తరచు బంధువులను నమ్మి తగులబడిన జన్మముల
గురువాచ్యులను నమ్ముకొనగ చెడిన జన్మముల
మరలమరల తలచెదనా మతిలేకుండ   ॥ఆర్చేరా॥

ఏమో యీ నాటికి యించుకంత భక్తి నిలచి
రామచంద్ర నీ పాదరాజీవముల వలచి
శ్యామసుందర బుధ్ధి నుండి తామసము విడచి
ఓ మహాత్మ వెలిచూడ్కుల నుడిగితి నిను తలచి  ॥ఆర్చేరా॥

2 కామెంట్‌లు:

  1. మన తాళ్ళు మనమే తెచ్చుకున్నా, కనీసం మనం బంధింపబడి ఉన్నామనే ధ్యాస కూడా లేకుండా ఎదుటివాళ్ళ బంధనాల గురించే మాట్లాడుకుంటాం. అదే విచిత్రం కదండీ. సగం శరీరం పాము నోట్లో ఉన్న కప్ప కూడా తన ముందు ఎగిరే ఈగ కోసం నాలుక జాపుతుంది.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.