4, ఏప్రిల్ 2015, శనివారం

కొంచెపు వాడ నైతే కానీరా నీ మంచితనము నాపై రానీరా






కొంచెపు వాడ నైతే కానీరా నీ
మంచితనము నాపై రానీరా




లోకుల మాటల నెన్ని నీకు మ్రొక్కుట లేదు
లోకులం దెందరు నేడు నీకు మ్రొక్కేరో
నీ కనులు కరుణ  తోడ నిండి యుండుట జూచి
నాకు నచ్చెను గాన నీకు మ్రొక్కుచు నుంటి
కొంచెపు


సొమ్ములిచ్చెదవని నమ్మి మ్రొక్కుట లేదు
సొమ్ములున్న వారికెల్ల సుఖముండేనా
నెమ్మనమున శాంతినింపు నీ చిరునవ్వే నాకు
సొమ్మైయుండుట జూచి  సొరిది మ్రొక్కుచు నుంటి
కొంచెపు


అట్టే విద్యలు లేవే యభ్యాసములు లేవే
మెట్టవేదాంతము బుధ్ధి మెదలును గాక
గట్టిగ నీ చెలిమి నున్న కాచుచుందు వది జూచి
పట్టి నీ పాదములు రామా పాహి యనుచుంటి 
కొంచెపు





1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.