30, ఏప్రిల్ 2013, మంగళవారం

కామినులందు కొందరును

ఉ. కామినులందు కొందరును కాంచనరత్నములందు కొందరున్
భూములయందు కొందరును భోగవినోదములందు కొందరున్
కామన గల్గు వార లధికంబుగ నిధ్ధర నుండ కొద్దిమంది శ్రీ
రామునియందు చిత్తమును లగ్నమొనర్చెద రెంత ధన్యులో

(వ్రాసిన తేదీ: 2013-4-27)


29, ఏప్రిల్ 2013, సోమవారం

మరల దూరం చేసి నన్ను ఏడ్పించకు

నేను
నీ ప్రపంచం లోనికి అడుగు పెట్టానో లేదో
నువ్వు
నా ప్రపంచాన్ని మొత్తం ఆక్రమించుకున్నావు

నాకు
నీ‌ ప్రపంచం గురించి తెలిసింది స్వల్పం
నీకు
నా ప్రపంచం గురించి తెలుసు సమస్తం

నేను
నీ పాదాలను తప్ప దర్శించింది స్వల్పం
నీవు
నా అణువణువులోను నిండినది సత్యం

ఇప్పుడు
నే నంటూ ఒకడిని లేకుండా పోయాను
ఎప్పుడూ
లాగే నీతోనే ఉండాలను కుంటున్నాను

నాకూ
అదే చాలా ఇష్టంగా కనబడుతోంది
నీకూ
అదే ఉద్దేశం ఉన్నట్లు కనబడుతోంది

నాకు 
తిరిగి అనవసరమైన ఉనికి కల్పింకు
నీకు 
మరల దూరం చేసి నన్నుడ్పించకు


పాహి రామప్రభో -092

మ. కనుమా చేసిన ఘోరపాపము లసంఖ్యాకంబులై దోచి చే
సిన పుణ్యంబుల సంఖ్య చెప్పుమనగా సిగ్గిల్లగా నాయెనో
జననాధోత్తమ యెట్టివాని యినన్ సంరక్ష సేయంగ నీ
నగా గల్గు టెరింగి చేరితిని ని న్నాపన్నుడన్ రాఘవా
 
(వ్రాసిన తేదీ: 2013-4-26)
   

28, ఏప్రిల్ 2013, ఆదివారం

జ్ఞానము రామ

ఉ. జ్ఞానము రామ నేటికన చక్కగ నాకు లభించె నీ దయన్
మానము రామ నీదె వమానప్రశంశలు జూడ నీ‌ దయల్ 
ప్రాణము రామ నీ‌ కృపయె రమ్మని పిల్చిన నాడు వచ్చెదన్
పూనిక రామ నాది యని పొల్పుగ దేనిని గూర్చి పల్కెదన్

(వ్రాసిన తేదీ: 2013-4-24)

27, ఏప్రిల్ 2013, శనివారం

రాములవారి పాదుకలు

ఉ. రాములవారి పాదుకలు రాజ్యము చేసెను రామసత్కథన్
రాములవారి బాణమున రాజ్యము కల్గెను రామసత్కథన్
రాములవారి వాక్యమున రాజ్యము కల్గెను రామసత్కథన్
రాములవారి బాణమున రావణు డీల్గెను రామసత్కథన్

(వ్రాసిన తేదీ: 2013-4-24)

26, ఏప్రిల్ 2013, శుక్రవారం

స్వామీ యెన్నడు నాకు

శా. స్వామీ యెన్నడు నాకు పామరులతో సల్లాపముల్ వాదముల్
ప్రేమాలింగనముల్ విరోధములు నేవేళం ప్రమాదంబుచే
నా మూలంబున వారిదోషముచే నైనం తటస్థించకీ
భూమిన్ శాంతుడ నై చరించు వరమిమ్మో జానకీ వల్లభా

(వ్రాసిన తేదీ:  2013-4-23)

25, ఏప్రిల్ 2013, గురువారం

రామచంద్ర పరాత్పరా

మ.కో. రామచంద్ర పరాత్పరా అమరాధినాధ ప్రకీర్తితా
కామితార్థప్రదాయకా శుభకారణా జగదీశ్వరా
బాములోర్చుచు డస్సియుండిన వాడ నన్నిక బ్రోవరా
నా మనంబున నమ్మియుంటి ననాథనాథ జనార్దనా

(వ్రాసిన తేదీ: 2013-4-19)
 

24, ఏప్రిల్ 2013, బుధవారం

భామినీమణుల కిది గడ్డుకాలం!

భామినీషట్పదలు

ఏమి చెప్పే దెంత ఘోరం
కాముకులతో నిండెలోకం
భూమిపై యిక స్త్రీలబ్రతుకులు నీటి బుడగలటే
రాము డేలిన భూమి మీదే
కాముకుల విజృంభణాలా
పాములై మగవాళ్ళు స్త్రీలను కాటు వేస్తారా

నెలలు నిండిన నెలత మీదా
నెలల బాలికమీద కూడా
విలువలన్నీ వదలి యెగబడి రోతపనులేనా
దులపరించే వారు లేరని
తలలు తీసే వారు లేరని
అలుసుగా మగవాళ్ళు స్త్రీలను కాటు వేస్తారా

ఎందుకొచ్చిన నీతి వాక్యా
లెందుకొచ్చిన పిచ్చి చట్టా
లెందుకొచ్చిన గొప్ప రక్షక భటులు చెప్పండీ
ఎందరయ్యా న్యాయదేవత
ముందు నిలబడి యీ పశువులను
బందిఖానా కైన నెట్టే పోరు సలిపేదీ

ఎప్పటికి యీ దుష్టులకు ఉరి
తప్పదని గర్జించి చట్టం
గొప్ప సాహసపూర్ణ తీర్మానమ్ము చేసేదీ
నిప్పురా ఒక ఆడదంటే
ప్పురా తన జోలి కెళితే
ముప్పురా ఉరిశిక్ష అని కాముకులు బెదిరేదీ    

  

ఔత్సాహికులకోసం భామినీ‌షట్పదగురించి వివరాలు:

కొంచెం క్లుప్తంగానే చెప్పటం ఇక్కడ బాగుంటుంది.
ట్పదలన్నీ మాత్రాగణాలతో లయాన్వితంగా ఉంటాయి. షట్పదలలోని అనేక రకాలలో భామినీ‌షట్పద ఒకటి. ఇది మిశ్రగతిలో నడిచే గేయఛందం.  దీని లక్షణం

3 + 4   +   3 + 4
3 + 4   +   3 + 4
3 + 4   +   3 + 4   +   3 + 4 + 2  
3 + 4   +   3 + 4
3 + 4   +   3 + 4
3 + 4   +   3 + 4   +   3 + 4 + 2  

యతినియమం లేదు! తెలుగులో యతినియమం లేనివి షట్పదలు మాత్రమే.  ప్రాస నియమం ఉంది కాని రెండవ ఐదవ పాదాల్లో ప్రాస పాటించటం ఐఛ్ఛికం.

భామినీషట్పదలు కన్నడభాషలో మంచి ప్రచారంలో ఉన్నాయట. వాటికి అక్కడ కన్నడకస్తూరి అని ప్రసిథ్థి.
  
 

ఎవరో రాసిన పద్యం

ఎవరో రాసిన పద్యం
ఎవరూ ఒక కంట చూసి ఎరగని పద్యం
చివికిన ఒక పదగుఛ్ఛం
భవితవ్యం లేని దాని బ్రతుకే దీనం

అందం చందం భావం
పొందికగా అమరి ఉన్న పుత్తడి పద్యం
మందికి నచ్చని సరుకై
ఎందుకిలా దిక్కులేక యేడుస్తోందో

ఒక పక్క అక్షరాలకు
రకరకాల చిత్రహింసలైతే నిత్యం
ఒక పక్క పలుకుబడులకు
ముకుతాళ్ళు పరాయిభాష ముచ్చట లాయే

కొత్త కవిత్వపు వెల్లువ
మొత్తంగా తెలుగుజాతి మూల కవిత్వం
చెత్తే అని అంటున్నది
కొత్తలు కడు వింతలగుట కొత్త విషయమా
 
ఈ కొత్త కవీంద్రుల్లో
యే కొత్తాలేదు గాని యెంత గడబిడా
మా కన్నా ఘనులెవరని
మాకన్నా ముందు కవులు మతిహీనులనీ

భాషమీద గౌరవాదరా లేమిటి
భాష వదలి కవిత పరుగుపెట్టు
పాతకవుల భావవాహిను లెందుకు
కొత్త భావములను హత్తగలరు

గందరగోళం కాలం
సుందరతర పద్యకుసుమ శోభకు చేటై
అందరికీ యిక పద్యం
అందని పండైన రోజులై పోయాయే

ఎవరో రాసిన పద్యం
ఎవరిప్పుడు దివి తెలిసి యిది వెదజల్లే
కవితాసౌందర్యానికి
అవునని తల ఊపుతారు అత్యాశ కదా  

ఎవడు సమస్త విశ్వముల

చం. ఎవడు సమస్త విశ్వముల నేర్పడ జేసి భరించి మాపు నో
యెవడు సమస్త భూతతతి నీ‌ ఘనసృష్టిని నించి పెంచు నో
యెవని విభూతిఁ జీవగణ మెల్ల విలీనత నొందు నట్టి రా
ఘవుని నమేయు నవ్యయుని కారణకారణు నాత్మ గొల్చెదన్ 

(వ్రాసిన తేదీ: 2013-4-19)

23, ఏప్రిల్ 2013, మంగళవారం

చిన్మయమూర్తి వీవు

ఉ. చిన్మయమూర్తి వీవు నిను చేరగ నోడు నవిద్య నే ననన్
మృణ్మయమూర్తి నీ బ్రతుకు మీదికి క్రిందికిగా నవిద్యతో
తన్మయమై భ్రమించు వరదా దయచూపితి వయ్య రాఘవా
మన్మన మింక నీ దగుట మాడె నవిద్యయు చాల ధన్యుడన్

(వ్రాసిన తేదీ: 2013-4-19)

22, ఏప్రిల్ 2013, సోమవారం

కవిరాక్షసులు అక్షరాల్ని కాల్చుకు తింటున్నారు

కవిరాక్షసులు క్షరాల్ని కాల్చుకు తింటున్నారు
కవనప్రపంచ పాడుబెట్టి గంతులు వేస్తున్నారు

వికృతముఖనాసావిలాసాలతో వీళ్ళ మాటల సైన్యం దాడికి
అన్నిరకాలపాత మాటలూ పలుకుబడులూ‌ హరీ అంటున్నాయి
ఓడిపోతున్న మాటల అక్షరాలు వీళ్ళ హింసాగ్నుల్లో మాడుతున్నాయి

కొత్తకొత్త కలాల పోట్లకు కొన్నికొన్ని మాటలు చచ్చాయి
మొత్తిమొత్తి వాళ్ళు కొన్నిటిని మూర్ఛపోగొట్టారు
ఇంకా పోరాడుతున్న మాటలు ఈసురో మంటున్నాయి

కొత్తకొత్త కవిత్వాలు పుట్టుకు రావాలంటే పాతవి చావాలన్న యావ
పాతదైపోయిన పుణ్యానికి ఉన్న భాషను చంపి పాతరేస్తున్నది 
భాషాసేవ బహు చక్కగా జరుగుతోంది కొత్త కవిత్వతత్వం పుడుతోంది

ఈ‌ కొత్త కవిత్వాలకు  నియమాలు మీ లేవు గాక లేవు
పాతబడ్ద భాష తాలూకు అక్షరాల్ని బాగా కాల్చుకు తిన్నా
కొత్తగా పుట్టించే కవిత్వాలలో భావాలు చాలట భాష వద్దట

మాయవలన బుట్టి

ఆ.వె. మాయవలన బుట్టి మాయలోన పెరిగి
మాయచేత చచ్చు మాకు రామ
నీ దయాకుఠారనిర్ద వలననే
మాయ బెదరి చెదరి మాయ మగును

(వ్రాసిన తేదీ: 2013-4-19)

21, ఏప్రిల్ 2013, ఆదివారం

మాయమైన ఊరి కొలను

ఊరి మధ్యన కొలనొక టుంది
కొలని గట్టున కోవెల ఉంది
కోవెల వెనుక తోటొక టుంది
తోట నిండుగా సందడి ఉంది

దగ్గరలోనే బడి ఒక టుంది
బడి పిల్లల సందడి ఉంది
సందడి చేసే పిల్లలందరికి
కోవెలతోట విడిదే నండి

చెట్ల మీద పలు చిలకల కిలకిల
చెట్ల కింద మన పిల్లల కిలకిల
బాలల పరుగుల కటునిటు చెదరి
ఎండుటాకుల గలగల గలగల

మధురఫలాలూ పరీమళాలు
సీతాకోకచిలుకల తళుకులు
ఆటల పాటల ఆనందాలు
బాలలస్వర్గం ముచ్చటలు

ఆటలు ఆడి పాటలు పాడి
కోనేటను జలకాలాడి
గుడి దేవుడితో‌ ముచ్చటలాడి
పెరిగే పిల్లల పల్లె అది

నవనాగరికత నడచి వచ్చినది
వ్యవసాయం నామోషి ఐనది
పిల్లలు పెరిగి ఊరు విడచిరి
పల్లె పెరిగి తన ఉనికి మరచెను

కోవెల దేవుని కైంకర్యానికి
పూలిచ్చే ఆ తోట పోయినది
కోవెల దేవుని నైవేద్యానికి
పళ్ళిచ్చే ఆ తోట పోయినది

ఆ జాగాలో‌ అపార్టుమెంటు
కాంప్లెక్సొకటి వెలసినది
షాపింగ్ కాంప్లెక్స్ క్లబ్బుహౌసులకు
స్వాహా అయినది కోనేరు

ఒకనాడెవరో యెక్కడివారో
నలుగురు గుడికి వచ్చారు
ఊరుమారిన తీరును చూసి
ఆవేదనతో‌ తలచారు

ఊరి మధ్య నొక కొలనుండేది
గట్టున యీ కోవెల ఉండేది
కోవెల వెనుక తోటుండేది
నిత్యం సందడిగా ఉండేది 

కొలనూ‌లేదు నీరూ‌లేదు
బిలబిలాక్షుల పిలుపులు లేవు
పిల్లల సందడి లేనే లేదు
ఊరు ఊరులా లేనే లేదు

కొలని నీటిలో కాళ్ళు కడుగుకొని
దేవుని చూడగ పోలేము
కోవెలతోట చెట్ల నీడలో
కూర్చుని మురిసి పోలేము

ఊహల స్వర్గం చెదరింది
ఊరు పట్నమై పోయింది
ఊరు వదలి పోలేక దేవుడు
ఉసూరుమంటూ ఉన్నాడు


ఈ కవిత నీలహంస బ్లాగులో ప్రచురించబడింది.  చూడండి:  మాయమైన ఊరి కొలను

మనిక:
ఈ‌ కవిత నీలహంస బ్లాగు వారి స్థాయికి తగినట్టిది కానందుకు గాను వారిని దయతో దీనిని వారి బ్లాగు నుండి తొలగించ వలసినదిగా యీ రోజున (2013-4-21) ప్రార్థించటం‌ జరిగింది.

కొలను

కాలమేఘవృష్టికల్లోలితం నా మనస్సరోవరం
కోలుకోవటానికి తప్పక కావాలి నీ‌ సహాయ
బాలార్కకోటిసుందతరమైన నీ దరహాసం
నాలో ప్రతిఫలించటం లేదే అని నా విచారం
  
నాలుగుమూలలా నాలుగుపురుషార్థాల ఒడ్లు
కాలం చేసిన దెబ్బలకు చాలా గండ్లు పడ్డాయి
చాలా ఆశాశోకమోహాలచ్చు బురద వచ్చి
నాలో పేరుకుపోయిందనే నా కున్న విచారం

నీ‌ మనసైన నా మనసు కొలను పాడుబడిందే
ఏమని చెప్పేది దాని ఉనికి మొత్తంగా చెడిందే
నా మనవిని యిప్పటికైన నువ్వు వినిపించుకో
ఈ మురికి కొలనికి గట్లు కొట్టి పుణ్యం‌కట్టుకో

నీ దయతో నాల్గు దిక్కులూ కొత్త ఒడ్లు కానీ
ప్రోది చేసుకొని మనస్సరసి జ్ఞానామృతవర్షాన్ని
నీ దరహాసచంద్రికలను ప్రతిఫలించి మురవనీ
నీదైన నా మనసుకొలను నీకే అంకితం కానీ

ఈ కవిత నీలహంస బ్లాగులో ప్రచురించబడింది. చూడండి: నీలహంస బ్లాగులో నా కొలను కవిత

గమనిక:
ఈ కవిత నీలహంస బ్లాగువారి స్థాయికి తగిన రచన కాలేకపోయినందుకు గాను వారిని దయచేసి దీనిని తొలగించవలసినదిగా వారిని యీ రోజున (2013-4-21) ప్రార్థించటం  జరిగింది.

ఇదిగో యీ యినవంశ మందు

మ. ఇదిగో యీ యినవంశ మందు మునుముం దిందీవరాక్షుండు తా
నుదితుండై ధర నేల వచ్చు నని లో నూహించి శ్రీరామ తా  
నొదిగెన్ మీకు పురోహింతుండగుచు నోహోహో వశిష్టుండు నిన్
చదివింపగను దివ్యభాగ్యమునకున్ సర్వాత్మనా వేచుచున్

(వ్రాసిన తేదీ: 2013-4-18)

20, ఏప్రిల్ 2013, శనివారం

విమలయశోవిలాస

చ. విమలయశోవిలాస రఘువీర పరాత్పర రామచంద్ర యు
త్తములు నిరంతరంబు నిను ధ్యానము చేయుచు నుండ మ
ధ్యములును భక్తియుక్తులయి దప్పక గొల్చుచు నుండ ని
త్యము పెడదారి నుండెదరు తక్కిన వారు జగత్రయంబునన్


(వ్రాసిన తేదీ: 2013-4-18)
  

19, ఏప్రిల్ 2013, శుక్రవారం

నిను సేవించెద నంచు

మ. నిను సేవించెద నంచు బల్కుటకు నా సేవావిశేషంబు లిం
తనగా నేమియు లేవులే వనుచు సంతాపింతు నట్లయ్యు నో
యనఘా యెంతయు చిన్నదౌ నుడుత నిన్నానాడు సేవింప మె
చ్చిన తండ్రీ రఘురామ దండములతో సేవించుకో నీయవే 


(వ్రాసిన తేదీ: 2013-4-18)

18, ఏప్రిల్ 2013, గురువారం

సుమధురభాషణాచతుర

. సుమధురభాషణాచతుర సూర్యకులాన్వయరత్నదీప దై
త్యమధనసత్కళానిపుణ ధర్మప్రవర్తక సత్యశీ
ర్వమునిజనాంతరంగపరిభావితసుందరదివ్యరూప జ్ఞా
నమయవిలాస చిన్మయ అనాధజనైకశరణ్య రాఘవా 

(వ్రాసిన తేదీ: 2013-4-17)

17, ఏప్రిల్ 2013, బుధవారం

రామ ధరాత్మజారమణ

ఉ. రామ ధరాత్మజారమణ రమ్యగుణాకర రాజలోకసు
త్రామ శరాగ్నివర్షహతదారుణరావణకుంభకర్ణము
ఖ్యామరవైరివీరగణ కంజదళేక్షణ వార్షుకాభ్రసు
శ్యామలకోమలాంగ వనజాసనవాసవశంకరస్తుతా

(వ్రాసినతేదీ: 2013-4-16

16, ఏప్రిల్ 2013, మంగళవారం

చేరి సోదరత్రయము

తే.గీ. చేరి సోదరత్రయము సామీరి గొలువ
హేమ సింహాసనంబున రామ నీవు
సీతతో గూడి కూర్చుండి చెన్ను మీర
భూమి నేలుము నా చిత్త భూమి తోడ

(వ్రాసిన తేదీ: 2013-4-16)

15, ఏప్రిల్ 2013, సోమవారం

మంచిది రామచంద్ర

ఉ. మంచిది రామచంద్ర అసమాన పరాక్రమశాలివైన నిన్
వంచనచేయు రావణు నవశ్యము ద్రుంచితి నీదు భక్తులన్
వంచనచేయు నట్టి కలి వంకకు చూడ విదేటి న్యాయమో
ముంచిన తేల్చినన్ పరమ పూరుష భారము నీది రాఘవా

(వ్రాసిన తేదీ:  2013-4-15)

14, ఏప్రిల్ 2013, ఆదివారం

జనపూజిత రఘునాయక

కం. జనపూజిత రఘునాయక
జనకసుతాహృదయనాధ సాక్షాన్నారా
యణ సురగణతోషణచణ
దనుజకులారణ్యదహన దశరథరామా


( వ్రాసిన తేదీ: 2013-3-16)

13, ఏప్రిల్ 2013, శనివారం

కాలబ్రహ్మసురాధినాధ

శా.  కాలబ్రహ్మసురాధినాధనిటలాక్షాద్యర్చితప్రాభవా
నీలాంబోధరకాయకాంతికలితా నిష్పుణ్య నిష్పాప దృ
ల్లీలాఖండితభక్తదుఃఖవనపాళీ దైత్యనిర్మూలి నీ
కేలూతం గొననిచ్చి దాసుని కటాక్షింపంగదే రాఘవా


(వ్రాసిన తేదీ: 2013-3-15)

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

రామా సీతమ్మను నిను

కం.రామా సీతమ్మను నిను
సౌమిత్రిని హనుమ నరయ చాల వలతునో
స్వామీ‌ మీ దాసుడ నా
కామిత మీడేర్చ వయ్య కరుణాజలధీ


(వ్రాసిన తేదీ: 2013-3-14)

11, ఏప్రిల్ 2013, గురువారం

రాముని నామము వినబడి నంత

వితాళచతుష్పధ
రాముని నామము వినబడి నంత
రాముడు మదిలో మెదలే నంట
రాముని స్మరణము చేసిన యంత
రాముని రక్షణ దొరకే నంట


(వ్రాసిన తేదీ: 2013-3-2)

10, ఏప్రిల్ 2013, బుధవారం

నినుగూర్చి పలికితే విను వారు లేరే

నినుగూర్చి పలికితే విను వారు లేరే
యను చింత వినవయ్య మనసంత నిండె

జనులకు చవులూర స్వల్పవిషయములపై
పనిగొని పలుకుట నా వలన కానే కాదు
యనునిత్యమును నిన్ను గొనియాడు వాడ నే
మునుకొని దుర్విషయముల నెట్లు తడవుదు

పదుగురి మధ్య నిలచి పరమాప్త నినుగూర్చి
ముదమున పలుక నేల ముందు చూపే లేక
మదిలో శ్రద్ధ లేని మనుజుల కాధ్యాత్మ
విదులకు హితమైన విషయము లెటు సొక్కు 

జగ మొల్లని విషయసంచయ మేమని నేను
తగునని వివరింపగ తహతహ లాడుదును
మొగము మొత్తెను జనుల మూఢతను గమనించి
జగమేలు రామయ్య తగు దారి చూపుమా


పూతన - 4. పూతన నందనందను గాంచుట

కం. ఇరుగమ్మలు బొరుగమ్మలు 
నరుదెంచిరి యమ్మ ద్ద నఖిలేశ్వరుడౌ
హరి చన్ను గుడుచు శిశువై
పరమాధ్బుతలీల నుండ వాని గనగన్ 

వ. వల్లవవనితాగణంబు బాలుని గని హర్షాతిరేకంబున నొండొరులతో

సీ. ఘననీలదేహంబు గాంచరే సతులార
      వెన్నుడే యనునట్టు లున్న వాడు
ఉరమున పెన్మచ్చ నువిదలు కంటిరే
      ఇది వెన్నునకు దప్ప నెవని కుండు
సరసిజాక్షుని యట్లు సరసిజాక్షుడు వీడు
      సరిసిజాక్షులు చక్క నరయ రమ్
యీ హరిభక్తుల యింటకి శ్రీహరి
      పుత్రుడై విచ్చేసె బొలతులార

తే.గీ. ఇంతకాలమ్మునకు వీరి యిల్లు నిడె
నెట్టి వ్రతములు చేసెనో యిందువద
యెన్ని నోములు నోచెనో యీ యశోద
నంద రాజెంత పుణ్యాత్ము డందు మమ్మ

కం. ని యువిదలు గడు మోద
బున సరసిజముఖి యశోద పుణ్యంబుల ప్రో
నగా గలిగిన బిడ్దను
వినుతించిరి వినెడు తల్లి వీను లలరగన్

వ. ఇట్లాభీరాంగలు సతీర్చి పలుకుచుండు నవసరంబున బాలగోపాలుండు కన్ను లరమోడ్చి యున్న గని యశోద వానిని పర్యంకంబున నుంచి తరుణీమ‌ణులతో‌ ముచ్చట లాడు చుండ

సీ.  తరుణేందుమూర్తియే తరుణి ఫాలంబుగా
        నరుణుడే బొట్టుగా నమరి యుండ
తారకామాలికల్ దళుకుల హారా
    పంక్తులై గళసీమ వరలుచుండ
మదనుని శంఖమే మదవతి కంఠమై
    కులగిరుల్ గుచములై కులుకు లొలుక
కాలమేఘము దన ఘనమైన కొప్పుగా
    శంపాలతిక హాసంబు కాగ
తే.గీ. మన్మథుని తల్లి యనిపించు మంచి రూపు
దాల్చి పూతన సతుల చిత్తంబు లలర
బాలగోపాలు డున్నట్టి పాన్పు జేరి
యెత్తుకొని బల్కె నిట్లు గమ్మత్తుగాను  

కం. కనులేల మూసికొందువు
కనుదెరువుము చన్ను గుడిచి కనుమూయుగ వ
చ్చునులే నందకుమారా
పనిగొని నీ కొఱకు నేను వచ్చితి నయ్యా

. అని యయ్యసురజాతి జవ్వని బాలునిం గరంబులు సాచి యెత్తుకొని చన్నీయ నుంకించుట గని యశోదాదిగోపికా నివహబు దాని కిట్లనెయె

మ. వనితా యెవ్వరి దాన వెవ్వెతవు నీ వాక్యంబులం జూడ పా
పనికిం బల్మిని పాలు త్రాపుటకునై వాంఛింతు వో చెల్ల నీ
చనుబా లేటికి మా కుమారకున కాశ్చర్యంబు నీ బుధ్ధి మా
కును నీకుం గల దొడ్డ చుట్టరికముం గొంచెంబు వర్ణించవే

ఆ.వె. తల్లి పాలు త్రావి తనయుడు శయనించ
నీవు వచ్చి వాని నిదుర లేపి
పాలు త్రావు మనుచు బలవంతముగ జన్ను
గుడుప చూచె దేల కోమలాంగి 

వ. అనిన నా మాయాసుందరియును

కం. మందను గల నారీజను
లందరిలో నొకతె గానె యకటా యిటు న
న్నందరు వెలిజేయగ గడు
దొందరపడి పలుకనేల తొయ్యలు లారా

ం. నిరుడు మంద జేరి నేడు బాలింతను
రాచపట్టి జూడ రమణు లార
వేడ్క మీర వచ్చి విదిలింప బడితిని
కాల మెవరి కైన గడువ కాదు

వ. అని నయంబొప్ప బలికి వారు నమ్మక గుజగుజలు వోవుచున్న నీక్షించి రాకాసి

ఆ.వె. వీరి తోడ నేల వెచ్చింప సమయంబు
బాలు డొకడె నాకు వలయు గాన
ముగుద లెల్ల నిదుర మునుగ జేసెద గాక
యనుచు వారి నరసి యంబుజాక్షి

కం. మాయను బన్నిన నంతట
హాయిగ నిందురించ దొడగి రందరు తరుణుల్
మాయాభీరాంగనయును
మాయాధృతబాలవేషు మాధవు గదిసెన్

వ. చేరి

సీ. నీవే న టోయి యీ నేల నేలెడు వాని
      నేల గూల్చెడు నట్టి నిర్భయుడవు
నీవే‌ న టోయి యా నిర్జరారాతిని
      నిర్జించు వాడవు నీలదేహ
నీవే న టోయి వానికి భాగినేయు
      వగుచు న్మించిన యంతకుడవు
నీవే‌ న టోయి మన్నీటి కంటికి నిద్ర
      లేకుండ జేసిన లేత మొలక

తే. బాలుడా నీవు చూడ నెవ్వాడ వేని
నేడు నా పాల బడి కుఱ్ఱవాడ యింక
నెందు బోయెద వాయువు నీకు చెల్లె
కరుణ లేనిది పూతన కాచు కొనుము

వ. అని పలికి కలికి కులుకుచు నులుకక తన్నరమోడ్పు కన్నులు నరయుచున్న బాలగోపాలునకు జన్నీయ నుద్యమించు నవసరంబున