6, ఏప్రిల్ 2013, శనివారం

పూతన - 3. పూతన నందవ్రజమునకు ప్రయాణమగుట

కం. రా జాడు మాట విన్నది
పోజాలదు చన్నుగుడుచు బుడతని జంపన్
దా జంప నోడెద నన
గా జాలదు దస్యవనిత కంసభయమునన్

కం. మనమున నటునిటు దలచును
తన యొడయని యాన మీర దగదని భావిం
చును తగనిది యగు పనికిం
జన నేటికి యనుచు మరల సందేహించున్

మ. నను బాలింతను బిల్చి రాజిటుల నాజ్ఞాపించుచో నిక నే
మను దానం గడు గర్కశుం డితడు దుర్వ్యాపారియై తీవ్రకో
పనుడై బాలుని బోయి చంపమనె నా వాక్యంబు లాలించడా
తనితో‌ వాదము ప్రాణహాని సరియే వాడాడి నట్లయ్యెడిన్

ఆ.వె. మున్ను తానె జంపె జిన్నారి శిశువుల
నెన్ని నేడు బంపు నన్ను నంద
గోపబాలు జంప గోపాలసుండైన
కంసు డెవరి నైన గసిమసంగు

చం. సరిసరి నందబాలకుని జంపగ బోవగ దప్పనట్టిదౌ
రయగ శౌరిగాని యెడ నాతడు చచ్చును నా కరమ్ములన్ 
రియగు నేని వాడు నను నక్కట చంపక మానుటుండునే
పురమును జొచ్చి రేపకడ భూవరునిం కడతేర్చకుండునే
   
శా. మున్నాకాశము పల్కినట్టి పలుకుల్ మోసంబులో సత్యమో
వెన్నుండీతని బట్టి చంపునొ మహావీరుండు కసుండు తా
మున్నే వెన్నుని మాయలం దెలిసి నిర్మూలించునో వానినే
యెన్నన్ వెన్నుడు లేడు చంపుటయు లేదేమో భవిష్యంబునన్

. ఇట్లు వితర్కించుకొనుచు నిజాగారంబునకుం జని  కన్నబిడ్డకు జన్నిచ్చుచు

మ. బుడుతా నీవలె నుండు నొక్క శిశువున్ భూపాలు పుణ్యంబునన్
గడతేర్చం జను భాగ్యమబ్బె మరియా కంసాజ్ఞ మీఱంగనుం
దడయం గాదిక నేమి జేయుదు నిసీ దైత్యాంగనాదేహమున్
గడుతుఛ్చం బిది బుగ్గిజేసి నపుడే కర్మంబు నిర్మూలమౌ.

కం . నిసుగా రోజుల పాపని
గసిమసగుట యెట్లు నాకు గార్యంబగు బో
మసలిన కంసుడు మరి నా
యుసు రడచును కాన వెడల కుండగ నెటులౌ

ఆ.వె. చిన్ని పాపడైన శ్రీమహావిష్ణువో
మానవార్భకుండొ మరి యెరుగక
స్తన్యమిచ్చి వాని జంప యత్నించెడు
తల్లి పట్ల జాలి తలచవయ్య  

కం. అసురాంతకుడగు వెన్నుడు
సివాడై వచ్చె ననెడు పలుకే నిజమై
యసలునకు మోసమగుచో
విసపరి మీ‌ యమ్మ జచ్చు వింటే కొడుకా

వ. అని పరిపరివిధంబుల వాపోవుచు నా రక్కసి నందవ్రజంబుండు దిక్కునకు నెట్టకేలకుం జనె నంత నచ్చట

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.