24, ఏప్రిల్ 2013, బుధవారం

భామినీమణుల కిది గడ్డుకాలం!

భామినీషట్పదలు

ఏమి చెప్పే దెంత ఘోరం
కాముకులతో నిండెలోకం
భూమిపై యిక స్త్రీలబ్రతుకులు నీటి బుడగలటే
రాము డేలిన భూమి మీదే
కాముకుల విజృంభణాలా
పాములై మగవాళ్ళు స్త్రీలను కాటు వేస్తారా

నెలలు నిండిన నెలత మీదా
నెలల బాలికమీద కూడా
విలువలన్నీ వదలి యెగబడి రోతపనులేనా
దులపరించే వారు లేరని
తలలు తీసే వారు లేరని
అలుసుగా మగవాళ్ళు స్త్రీలను కాటు వేస్తారా

ఎందుకొచ్చిన నీతి వాక్యా
లెందుకొచ్చిన పిచ్చి చట్టా
లెందుకొచ్చిన గొప్ప రక్షక భటులు చెప్పండీ
ఎందరయ్యా న్యాయదేవత
ముందు నిలబడి యీ పశువులను
బందిఖానా కైన నెట్టే పోరు సలిపేదీ

ఎప్పటికి యీ దుష్టులకు ఉరి
తప్పదని గర్జించి చట్టం
గొప్ప సాహసపూర్ణ తీర్మానమ్ము చేసేదీ
నిప్పురా ఒక ఆడదంటే
ప్పురా తన జోలి కెళితే
ముప్పురా ఉరిశిక్ష అని కాముకులు బెదిరేదీ    

  

ఔత్సాహికులకోసం భామినీ‌షట్పదగురించి వివరాలు:

కొంచెం క్లుప్తంగానే చెప్పటం ఇక్కడ బాగుంటుంది.
ట్పదలన్నీ మాత్రాగణాలతో లయాన్వితంగా ఉంటాయి. షట్పదలలోని అనేక రకాలలో భామినీ‌షట్పద ఒకటి. ఇది మిశ్రగతిలో నడిచే గేయఛందం.  దీని లక్షణం

3 + 4   +   3 + 4
3 + 4   +   3 + 4
3 + 4   +   3 + 4   +   3 + 4 + 2  
3 + 4   +   3 + 4
3 + 4   +   3 + 4
3 + 4   +   3 + 4   +   3 + 4 + 2  

యతినియమం లేదు! తెలుగులో యతినియమం లేనివి షట్పదలు మాత్రమే.  ప్రాస నియమం ఉంది కాని రెండవ ఐదవ పాదాల్లో ప్రాస పాటించటం ఐఛ్ఛికం.

భామినీషట్పదలు కన్నడభాషలో మంచి ప్రచారంలో ఉన్నాయట. వాటికి అక్కడ కన్నడకస్తూరి అని ప్రసిథ్థి.
  
 

5 కామెంట్‌లు:

 1. చాలా చాలా బాగా వ్రాశారు నేటి దైనందిన దీనస్థితి ఆడజాతిపై .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు శర్మగారూ. ఈ పరిస్థితిమీద యెంత వ్రాసినా తక్కువే.

   తొలగించండి
 2. శ్యామలీయం గారు చాలా బాగా వ్రాశారండి. ఈ జనులకు కనువిప్పు ఎప్పుడు కలుగునో ఏమో ? రాముడు మళ్ళీ పుట్టి ఈ రాకసుల కూల్చక పోతే, ఈ రాకాసి మూక ఇంకా ఎన్ని పాపాలు చేస్తారో ఏమో?.

  రిప్లయితొలగించండి
 3. ఏమి చెప్పేదెంత ఘోరం[...]
  5 వ పాదం లో మాత్రలు సరి పోయినట్టుగా లేదు. నన్ను సరిద్దిద్దగలరు.
  "కా ము(3) కు ల వి జృం(4) భ ణా (3) లా(2)"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కాముకుల విజృంభణాలా అన్న పాదాన్ని గణవిభజ చేస్తే
   కాము| కుల వి|జృంభ। ణాలా ౩+4 3+4 గా విడుతోందా అంటే లేదు. నిజమే. నాదే పొరపాటు.
   ఇక్కడ జృ అనేది ఊన్చి పలికి దాని ముందున్న వి గురువు కావలసి వస్తున్నది.
   మార్చాలా అన్నది ఆలోచించాలి.
   పరిశీలించి ఎత్తి చూపినందుకు చాలా ధన్యవాదాలు.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.