4, ఏప్రిల్ 2013, గురువారం

పూతన - 1. రత్నావళీవృత్తాంతము.

. శ్రీమన్మహావిష్ణుదేవుండు వామనావతారంబు ధరియించి దైత్యేశ్వరుండును నమరేంద్రవిరోధియును నశ్వమేధాధ్వరదీక్షితుండును నగు బలిచక్రవర్తి సభాభవనంబు ప్రవేశించిన సమయంబున

కం. బలిదైత్యపుత్రి రత్నా
వళి వామను గాంచి పుత్ర భావంబున
న్నులు చేప పరవశించిన
కలికికి నళినాక్షు దివ్య కరుణ లభించెన్

కం. వడు గతి వినయంబుగ త
న్నడిగన వర మంత బలియు నాతని కీయం
బుడుతడు త్రైవిక్రముడై
యడుగులు రెండింట గొల్చె నఖిలభువనముల్ 

ం. మూడవ యడుగును బలితల
వేడుక నిడి వాని నొంచె విశ్వేశ్వరుడా
పోడిమి గని రత్నావళి
వేడెను తా నభయ మనుచు విహ్వలమతియై

తే.గీ. అంబుజోదర జాతివైరంబు మాకు
సహజమై యుండు దేవతాసమితి తోడ
మరియు మీ యందు భక్తితత్పరుల మగుచు
నేను మాయయ్యయును నుంట నీ వెఱుగవె

కం. దేవా వేడెద నభయము
త్రైవిక్రమ విశ్వనాథ తామసహరణా
భావాతీతప్రభావా
కావుము నను దనుజసుతను కడు నల్పజ్ఞన్

సీ. ఈ విశ్వసంఘంబు లెవ్వాడు పుట్టించు
        నెవ్వాడు నడపించు నెవ్వ డణచు
    నెవ్వాని మాయచే నెల్ల భూతంబులు
         నేను నేనను భ్రాంతి నిక్కు చుండు
    నెవ్వాని పుట్టువు నెఱుగ సాధ్యము కాదు
         నాలుగు మోముల నలువ కైన
    నెవ్వాని దయచేత నేవేళ విబుధుల
         కెట్టి కష్టంబులు బట్ట కుండు

తే.గీ. ట్టి ఘనుడవు నీకు నే నమిత భక్తి
మ్రొక్కు చుంటిని భవబంధమోక్షణంబు
దక్క నన్యంబు గోర ప్రధానపురుష
దీనదుఃఖాటవీదాహ దేవ దేవ
 
వ. అని విన్నవించిన వెన్నుండునుం జిరునగవున దాని కిట్లనియె

తే.గీ. వనితరో నాకు చన్నీయ వలచి నావు
ముందు రాగల వతార మందు నీదు
స్తన్య మంగీకరించుట లుపు దేను
తోడనే మోక్షమును నీకు దొరుక గలదు

తే.గీ. భక్తు లగు వారి కోర్కు లింపార దీర్చి
సంతసింతును నేనును సారసాక్షి
భూమి నీ పేరు చిరకాల ముండగలదు
బాలగోపాలలీలల వన్నెకెక్కి

వ. ట్లానతిచ్చిన రత్నావళియు మహాప్రసాదంబని సంతసించె నంత పెద్దకాలంబున కది పురాకృతానేకపాపచర్యాపర్యవసానంబుగా పూతన యన నొక్క రక్కసియై జనించి దురాచారియై యుండి కాలపరీపాకంబున దేవాసురసంగ్రామంబున విష్ణునిహతుండగు కాలనేమి యను దైత్యుండు కంసుండనం జన్మించిన వాని నాశ్రయించి యుండె నా కంసుండునుం తనకు భాగినేయుండుగా జన్మించనుండు విష్ణుని వలన చావు గలదని యెరింగి భాగినేయుల నెల్ల జంపుచునుండు నవసరంబున వాని సోదరి దేవకీదేవి యొక్క ష్టమ గర్భంబు నా దోచు నాడుశిశువు ంసుని ధిక్కరించి మింటికిం బోవుచు నీకు మిత్తి యగు వాడు వేరొండు చోట వర్థిల్లుచున్నవాడని పల్కిన నా పలుకుల ములుకుల వలన బాధితుండును పాపవ్యవసాయుండును నగు కంసుండు పూతనను రావించి  యిట్లనియె

2 కామెంట్‌లు:

  1. రత్నావళీ వృత్తాంతము ధారాపాకముగా బాగున్నది , దేవా వేడెద నభయము పద్యములో రెండవపాదము యతి సరి చూడండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యతిభంగదోషం సూచించిన అజ్ఞాతగారికి కృతజ్ఞతలు. సరిజేసిన పాఠాన్ని గమనించగలరని ఆశిస్తున్నాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.