2, ఏప్రిల్ 2013, మంగళవారం

మాత్రాగణ వృత్తాలలో పులిహోర ఛందస్సు

మాలిక అవధానం పుటలో నిన్న అష్టావధాని శ్రీమాడుగుల అనిల్ కుమార్ మహాశయులను సంప్రతించటం‌ జరిగింది. నిజానికి జ్యోతిగారు అభిప్రాయ పడినట్లుగా మాడుగులవారే స్వయంగా ఈ క్రొత్త వృత్తం గురించి జరిగిన చర్చకు స్పందిస్తారని యెదురు చూసిన మాట వాస్తవం. చివరకు సాయంకాలం నేనే వారి అభిప్రాయం కోరుతూ వ్యాఖ్య ఉంచాను. దానికి వారు రాత్రి కొంత ప్రొద్దుపోయిన తరువాత స్పందించి తమ అభిప్రాయాలను అందించారు.  వారికి నా కృతజ్ఞతలు.
మా సంభాషణను క్రింద పొందుపరుస్తున్నాను.

శ్యామలరావు: అవధాని మాడుగులవారికి నమస్కారం. మీరు ఈ పుటలో వ్యాఖ్యానించటం చూసాక, అడుగుతున్నాను. నిన్న అవధానం జరుగుతున్న సమయంలో వ్యాఖ్యాతల మధ్య నదచిన యిష్టాగోష్ఠిని కూడా మీరు చదివే ఉంటారని ఆశిస్తున్నాను. అందులో‌ భాగంగా నేను చెప్పిన క్రొంగ్రొత్త వృత్తఛందస్సు పులిగోరవృత్తం మీద మీ అభిప్రాయం తెలుసుకో గోరుతున్నాను.తత్సంబధిత చర్చతో బాటుగా మరికొన్ని వివరాలు జోడించి నా శ్యామలీయం‌ బ్లాగులో ఉఈ రోజున ఒక టపా కూడా ప్రచురించాను. శ్యామలీయం‌ బ్లాగు చిరునామా: http://syamaliyam.blogspot.in/
మీ అమూల్యాభిప్రాయం కొరకు యెదురు చూస్తున్నాను. ఈ క్రొత్త వృత్తానికి మీ వైపు నుండి మరొక ఉదాహరణను జోడించటానికి మీకు అభ్యంతరం ఉండదని కూడా భావిస్తున్నాను.


అవధాని: శ్రీ శ్యామల రావు గారికి నమస్కారములు. మీరు అడిగినారు కావున చెప్తున్నాను కాని పులిహోర పదానికి తగిన అందమైన సంస్కృతం నామ ధేయము పెడితే తప్పక ఒప్పుగా ఉంటుంది. కవి సమాజం ఒప్పుకుంటుంది. లేకపోతే అంతగా బాగుండదు. ” అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః , యథాస్మిన్ రోచతే విశ్వం తథైవం పరివర్తతే ll ” ఇది మన పెద్దలు మనకు ఇచ్చిన స్వేచ్ఛ . ఆ స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా చూస్తే అంతా మనమే.వృత్తం లయబద్దంగా బాగానే ఉన్నది. దీనితో మీరు పూర్తిగా ఒక కావ్యం ఏదైనా వ్రాస్తే మీ పేరు మీద పరగుతుంది. ఇక మీ ఉదాహరణానుసారం పద్యం వ్రాసి చూపుతున్నాను.
సిరి శ్యామలుడు నేడు జిగియొప్పునట్లుగా
ధరణీజనులు మెచ్చదగినట్లు నిచ్చిరే
సరసీరుహనిభాంఘ్రి చతురాస్యుపత్నికిన్
పులిహోర యను వృత్తమునునంకి తమ్ముగా ll


శ్యామలరావు: అవధాని మాడుగులవారికి నమస్కారం. మీ సూచనలు గమనించాను.  వృత్తం కాబట్టి సంస్కృతనామధేయం ఒప్పుగా నుండునన్నది మీ‌ అబిప్రాయం. మంచి అభిప్రాయమే.  మీరు ఇచ్చిన ఉదాహరణానికి ధన్యవాదాలు. ఈ వృత్తానికి నేనే పూనుకుని కావ్యప్రశస్తి కలిగించటం అంటారా, చూద్దాం, దైవానుగ్రహం ప్రకారం అలాగే‌ జరుగుతుందని ఆశిద్దాం.

ఇప్పుడు మన ముందు ఉన్న ప్రశ్న ఈ వృత్తానికి యేమని సంస్కృతనామధేయం‌ చేస్తే ఉచితంగా ఉంటుందా అన్నది.  చదువరులు తమతమ అభిప్రాయాలను పంపగోరుతున్నాను.

మరికొన్ని విశేషాలు, యీ వృత్తం గురించి ముచ్చటించుకోవలసి ఉందని క్రిందటి టపాలో చెప్పాను గదా.  ఆ వివరాలు చూద్దాం.
  
ఈ‌ పులిహోర వృత్తంలో (కొత్తపేరు పెట్టేదాక అదే వాడదాం) ప్రతి పాదానికి నాలుగేసి పంచమాత్రా కాలఖండాలుంటాయని చెప్పబడింది కదా. కాలఖండాల ప్రకారం గణవిభజన చేస్తే లక్షణం సల - సల -సల - ర అని కూడా ఇప్పటికే చెప్పుకున్నాం.

అసలు పంచమాత్రాగణాలు యెన్నో చూదాం.  మూడుకన్నా తక్కువ అక్షరాలతోనూ, ఐదు కన్న హెచ్చు అక్షరాలతోనూ‌ పంచమాత్రా గణాలు తయారు కావు అనేది సులభ గ్రాహ్యం. అందుచేత పంచమాత్రా గణాలన్నీ‌ మూడు నాలుగు అక్షరాల నిడివి కలిగి ఉంటాయి అని తేలుతోంది కదా.

మొదట మూడక్షరాల పంచమాత్రా గణాలు గుర్తించుదాం
I I I     న    మూడు మాత్రలు
I I U    స    నాలుగు మాత్రలు
I U I    జ    నాలుగు మాత్రలు
I U U  య   ఐదు మాత్రలు
U I I    భ    నాలుగు మాత్రలు
U I U   ర    ఐదు మాత్రలు
U U I   త    ఐదు మాత్రలు
U U U  మ   ఆరు మాత్రలు
వీటిలో య, ర, త గణాలు మాత్రమే మూడక్షరాల పంచ మాత్రా గణాలు.

ఇక నాలుగక్షరాల పంచమాత్రా గణాలను గుర్తిద్దాం
I I I I      నల    నాలుగు మాత్రలు
I I I U     నగ    ఐదు మాత్రలు
I I U I     సల    ఐదు మాత్రలు
I I U U    సగ    ఆరు మాత్రలు
I U I I     జల    ఐదు మాత్రలు
I U I U    జగ    ఆరు మాత్రలు
I U U I    యల  ఆరు మాత్రలు
I U U U   యర  ఏడు మాత్రలు
U I I I      భల   ఐదు మాత్రలు
U I I U     భగ   ఆరు మాత్రలు
U I U I     రల   ఆరు మాత్రలు
U I U U    రగ   ఏడు మాత్రలు
U U I I     తల   ఆరు మాత్రలు
U U I U    తగ   ఏడు మాత్రలు
U U U I    మల  ఏడు మాత్రలు
U U U U   మగ  ఎనిమిది మాత్రలు 
వీటిలో నగ, సల, జల, భల అనేవి మాత్రం పంచమాత్రాగణాలు.

అంటే మొత్తం‌ పంచమాత్రా గణాలు య, ర, త, నగ, సల, జల, భల అని ఏడు.
అందు చేత ఏవైనా నాలుగు పంచ మాత్రా గణాలతో నిర్మించ బడే వృత్తాల సంఖ్య లెక్క వేస్తే 7 x 7 x 7 x 7 =  2401 అని తేలుతుంది. కాని ఇలా లెక్క వెయ్యటం సరి కాదు. ఎందుకంటే వృత్తం అన్నాక చివరి అక్షరం గురువు కావలసిందే కదా.  అందు చేత పాదంలో‌ని చివరి గణం తప్పక  , ర, నగ గణాలలో ఒకటి కావలసి ఉంది. అంటే మనం పంచ మాత్రా గణాలతో యేర్పరచ గలిగే వృత్తాల సంఖ్య 7 x 7 x 7 x 3 = 1029.
 
పిండితార్థం యేమిటంటే పంచమాత్రాగణాలు నాలుగింటిని వాడి తయారు చేయగలిగిన వృత్తాలు 1029 ఉండగా వాటిలో‌మన పులిహోరవృత్తం‌ ఒకటి.
ఈ‌1029 వృత్తాల సముదాయంలో అన్నీ పులిహోర వృత్తం లాగా చక్కటి లయను కలిగి ఉండక పోవచ్చును.

అలాగే పాదంలో నాలుగు పంచమాత్రా కాలఖండాలుగా కాకుండా 5 + 5 + 5 + 3  లేదా 5 + 5 + 5 + 4 మాత్రల విభజనతోనూ‌ వృత్తాలు సృష్టించ వచ్చును.  ఈ‌ సముదాయాల్లో‌ని వృత్తాల సంఖ్యనూ‌ మనం విడివిడిగా గుర్తించ వచ్చును. అల్లాగే మిగతా కాలఖండాల కన్నా భిన్నంగా ఉండే కాలఖండంపాదం చివరనే కాక మొదటనూ‌ ఉంవచ్చు నన్నది గమనిస్తే కాలఖండ విభాగంతో తాళప్రస్తారానికి అనుకూల మైన వృత్తాలను యెంత విస్తారంగా సృష్టించుకో వచ్చునో అన్నది చక్కగా బోధపడుతుంది.

నాలుగు కాక ఐదు లేదా అంతకన్న హెచ్చు కాలఖండాలతో ప్రయత్నిస్తే లేదా కాలఖంప్రమానం ఆరు లేదా ఏడు అనుకుంటే మరింతగా యిటువంటి వృత్తాలు సాగరోపమంగా ఉత్పన్నం అవుతాయి!

ఈ వ్యాసానికి చదువరులు తమ తమ అమూల్యాభిప్రాయాలను తెలియజేయ గోరుతున్నాను.

1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.