7, ఏప్రిల్ 2023, శుక్రవారం

హనుమాన్ చాలీసాలో తప్పులున్నాయట!

హనుమాన్ చాలీసాలో తప్పులున్నాయట

ఈయనెవరో తులసీ పీఠాధిపతి, జగద్గురువులు రామభద్రాచార్య అట అలా అంటున్నారు. ఆసక్తి ఉన్నవాళ్ళు పై లింక్ తెరిచి చదువుకోండి.

నాకు ఆసక్తి లేదు!

ఈయనెవరు? గోస్వామి తులసీదాసు గారి కన్నా పాండిత్యంలో అధికుడా? భక్తితత్పరతలో అధికుడా? కవిత్వశక్తిలో అధికుడా? జ్ఞానసంపదలో అధికుడా? వినయశీలంలో అధికుడా?

ఎందుకు ఈయన మాటలు వినటానికి ఆసక్తి చూపాలి మనం?

కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా అన్నట్లు అల్పప్రజ్ఞ కలవారు ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అది లోకరీతి. అందుకు చిరాకుపడటం తప్ప ఏమీ చేయలేం.

ఇటువంటి వారు ఏమన్నారూ ఎందుకన్నారూ అంటూ నాకున్న విలువైన సమయాన్ని వృథాచేసుకోలేను. నాకు సమయం దొరకేదే చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే చివరకు రాములవారి మీద ఒక కీర్తనను గ్రంథస్థం చేసుకోవాలన్నా సమయం దొరకటం దుర్లభంగా ఉంది. అందుచేత నవ్వుకొని ప్రక్కకు నెట్టివేయటం మించి వీళ్ళను గురించి పట్టించుకోను. మీరూ పట్టించుకోవద్దు, వీలుంటే మీరూ అసమయాన్ని భగవన్నామానికి వెచ్చించండి. అది మంచిపని.

ఒక్క విషయం చెబుతాను. తులసీదాసు రామాయణం రచిస్తూ ఉంటే వినటానికి ఎందరో వచ్చేవారట. ఒకనాడు అయన అశోకవనంలో హనుమంతుడు కొలనులో ఉన్న తెల్ల తామరలను చూసాడు అని చెప్తే ఒకాయన లేచి తెల్లతామరలు కావయ్యా అవి ఎఱ్ఱతామరలు అని లడాయి వేసుకున్నాడు. తెల్లవే - రాముడు నాచేత అసత్యం వ్రాయించడు అంటారు దాసుగారు. ఈపెద్దమనిషి నేను హనుమంతుడినయ్యా - చూసిన నాకు తెలియదా అని గర్జించాడు. చివరకు ఇద్దరూ స్మరిస్తే వాల్మీకి ప్రత్యక్షమై అవి తెల్లతామరలే హనుమా, నీవు క్రోథావేశంలో ఎఱ్ఱని కండ్లతో అంతా ఎరుపుమయంగా చూసావు అని చెప్పాడట. అదీ దాసుగారంటే.

ఇప్పుడు ఎవరెవరో వచ్చి వాల్మీకి తప్పులూ తులసీదాసు తప్పులూ వ్యాసులవారి తప్పులూ అంటూ నోటికి వచ్చింది మాట్లాడటం మొదలు పెడితే శుష్కతర్కవితర్కాలతో సమయం వారి కోసం వృథా చేసుకోవలసిన అగత్యం లేదు.

ఈరోజుల్లో జగద్గురువులమని వీధికిద్దరు కనిపిస్తున్నారు! గురువులకు లెక్కేలేదు. చివరకు బ్లాగుప్రపంచంలో కూడా జ్ఞానాహంకారులు కనిపిస్తున్నారు అదృష్టవంతులైన శిష్యులను ఆహ్వానిస్తూ.

దయచేసి భక్తమహాశయులు ఎవ్వరూ ఇల్లాంటి చిలిపి గొడవలను పట్టించుకోవద్దని మనవి.

5 కామెంట్‌లు:

  1. నమస్కారం.
    రామభద్రా చార్యుల వారు అన్నది హనుమాన్ చాలీసా లో తప్పులు ఉన్నాయనో, లేక తులసీదాసు తప్పులు వ్రాసారనో కాదు. నేను ఆ వీడియో చూశాను .కేవలం ఇప్పుడు దొరుకుతున్న హనుమాన్ చాలీసా పుస్తకాలలో ఆ 4 తప్పులు ఉన్నాయని , పాత హనుమాన్ చాలీసా పుస్తకాలలో వారు చెప్పినట్లు. వుండేవని. ఆయన అన్నారు.
    ఆ మాట నిజం! నేనే ప్రత్యక్ష సాక్షిని!
    నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక హనుమాన్ చాలీసా పుస్తకం వుండేది. అది మా అమ్మగారి బాల్యంలో, వారికి వారి నాన్నగారు అనగా మా తాత గారు ఇచ్చినది. నేను ఆ పుస్తకం నుండే మొదటిసారిగా హనుమాన్ చాలీసా చదివి కంఠస్థం చేశాను. అందులో రామభద్రాచార్యుల వారు చెప్పిన ఆ నాలుగు చోట్ల, ఆయన చెప్పినట్లు గానే వుండేది. నాకూ అలానే కంఠస్థం వచ్చు.

    రిప్లయితొలగించండి
  2. సమయం ఆసక్తి లేదు అని చెప్పి ఒక తొందరపాటు పోస్టు వ్రాశారు.

    వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునవునూ అంటూ తలూపండి ఈ తలను మొదటే ఉపయోగించుంటే ఈ శుష్క టపా తప్పేను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.