4, నవంబర్ 2016, శుక్రవారం

రామవిద్య యొక్కటే రమ్యవిద్య


రామవిద్య యొక్కటే రమ్యవిద్య
క్షేమము చేకూర్చు విద్య రామవిద్య

పామరత్వము విడక బహుశ్రద్ధతో
తామసికములైన తదితరములైన
ఏమోమో విద్యలు మీ రెంత నేర్చినా
రామవిద్యలేని యెఱుక రక్తికట్టదు
రామవిద్య

వేదవేదాంగ శాస్త్రవిద్య లెఱిగినా
వాదవివాదముల గెలిచి వన్నెకెక్కినా
వేదాంతుల శుశ్రూషలు విడక చేసినా
లేదు ముక్తి రామవిద్య లేని వానికి
రామవిద్య

రామవిద్య నేర్వ మరల రాడు పృధివికి
రామవిద్య నేర్వ పోవు రాముని దరికి
రామవిద్య నేర్చుటకు రక్తి కలిగెనా
రామకృపయె నేర్పునండి రామవిద్య
రామవిద్య