14, నవంబర్ 2016, సోమవారం

రామునకు మ్రొక్క మీ కేమి కష్టము


రామునకు మ్రొక్క మీ కేమి కష్టము శ్రీ
రాముడు కాక వేఱు రక్షకు డున్నాడా

శివదేవు డొక్కనికే చేరి మ్రొక్కెదరొ మీరు
చివరకు కాశీపురి చేరదలతురో
శివసన్నిధి విడుతురో జీవరత్నములు మీరు
శివుడే మీ చెవిలోన చెప్పు రామమంత్రము
రామునకు

శివకేశవు లిద్దరును చిల్లరదేవుళ్ళని చెప్పి
అవలంబించేరో యన్యధర్మములు
చివరకు మీరెచ్చట చేరెదరో తెలియరాదు
భువి మతములు పుట్టునట్లు పుట్టరు దేవుళ్ళు
రామునకు

ముక్కోటి దేవతలకు మూలపురుషుడైన హరి
అక్కజముగ వచ్చినా డందరి కొఱకు
చక్కగ లోనెఱిగి మీరు సరగున సేవింతురా
నిక్కువముగ శ్రీరాముని నిజధామము చేరుదురు
రామునకుకామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.