4, నవంబర్ 2016, శుక్రవారం

అన్నిటి కంటెను ముఖ్యమైనది


అన్నిటి కంటెను ముఖ్యమైనది హరిసాన్నిధ్యమురా
చిన్నాచితక సిరులకు భ్రమసిన చిక్కులు తప్పవురా

ఇంతకు ముందుగ నెన్నిమారులో యిలపై పుట్టితివే
అంతోయింతో యార్జించితివే యన్నిభవంబులలో
అంతగ శ్రమపడి కూడబెట్టినవి యాయాజన్మలతో
అంతరించెగా ననుసరించి రాదాయె నేదియైన
అన్నిటి

చింతాకంతయు మాధవచింతన చేయకుండు మదిలో
చింతలు కాపురముండును సుఖము చేరగ రాకుండు
పంతగించి సిరులందు భ్రమలను వదలగొట్టుకొనక
ఎంతవగచిన ఫలములేదురా ఎన్నే జన్మలకు
అన్నిటి

రామరామయని రామనామమును ప్రేమమీఱ పలికి
రామచంద్రపదరాజీవంబుల రక్తిమీఱ గొలిచి
రాము డిచ్చునది చాలు నన్యములు రాలురప్పలనుచు
నీ మదిలో ధృఢనిశ్చయముండిన నీవు తరింతువురా
అన్నిటి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.