4, నవంబర్ 2016, శుక్రవారం

ఇతడే భగవంతుడని యెఱుగుడు మీరు


ఇతడే భగవంతుడని యెఱుగుడు మీరు
చతురులై కొలిచి ముక్తి సాధించుడు

జ్ఞానస్వరూపుడు జ్ఞానప్రదాయకుడు
దేనిపైన రాగమును పూననివాడు
తానె జగదీశ్వరుడై తనరెడువాడు
మానిత సత్కీర్తిపరుడు మారాముడు
ఇతడే

దానవారి ధర్మసంస్థాపనాచార్యుడు
పూని యార్తుల నెల్ల ప్రోచువాడు
మానవోత్తముడు సర్వమంగళవిక్రముడు
జానకీవిభుడు భువనసంరక్షకుడు
ఇతడే

సిరులకు నెలవితడు శ్రీనివాసుడు
సిరులుపంచు శ్రీనిథి చిన్మయమూర్తి
సిరులకు సిరియైన మోక్షశ్రీ నిచ్చువాడు
పరమాత్ముడు రాముడు భగవంతుడు
ఇతడే