6, నవంబర్ 2016, ఆదివారం

ఇత్తువని పునరావృత్తిరహితపదమును


ఇత్తువని పునరావృత్తిరహితపదమును
చిత్తమున నమ్మితి శ్రీరామచంద్ర

కొత్తకొత్త జన్మములు కొత్తకొత్త బంధములు
కొత్తకొత్త దుఃఖములు కోరుదునా
యెత్తినవే చాలునింక యేలుకోవయ్య నా
బత్తినెఱిగి రక్షించ ప్రార్థింతు నిన్ను
ఇత్తువని

అందని గౌరవముల కలమటింపులు చాలు
పొందినభోగముల పొలుపులు చాలు
చెందితి నిదె నీదు శ్రీపాదములకు చే
యందించి నను బ్రోవ మనుచు ప్రార్థింతు
ఇత్తువని

కోరెడు వారలకు నీవు కొంగుబంగారమవు
ఈరేడులోకముల నేలుడు దొరవు
నారాముడవని నిన్ను నమ్ముకొన్నాడ నా
ప్రేమనెఱిగి బ్రోవుమని వేమరు ప్రార్థింతు
ఇత్తువని