4, అక్టోబర్ 2013, శుక్రవారం

తెలంగాణా వస్తే దోపిడీ అంతమవుతుందా?


ఈ రోజు  ప్రజ బ్లాగులో వచ్చిన  తెలంగాణా వస్తే దోపిడీ అంతమవుతుందా  అన్న ఈ ప్రశ్నకు నా జవాబు ఒక వ్యాఖ్య నిడివికి మించి ఉండటం వలన ఇక్కడ ఒక టపాగా వ్రాస్తున్నాను.

శ్రీ జీ.వి.కృష్ణారావుగారు అనువదించిన పుస్తకం ఆదర్శరాజ్యం (ప్లేటో) పుస్తకాన్ని చాలా చిన్నప్పుడే చదివాను.  అప్పటికి నేను టీనేజ్ పిల్లవాణ్ణి కూడా కాదు. అందుచేత ఆ పుస్తకంలోని చాలా విషయాలు గుర్తులేవు.  పైగా అది ఒక ఉద్గ్రంథం. ఒక్క విషయం మాత్రం బాగా మస్తిష్కంలో నాటుకుపోయింది.  ఆ పుస్తకంలో,  బలవంతుడి ప్రయోజనమే న్యాయం  అనే సిథ్థాంతాన్ని సోక్రటీస్ పూర్వపక్షం చేస్తాడు చాలా చక్కగా.  నిజంగా ఆదర్శరాజ్యం అంటూ ఉంటే దోపిడీ ప్రసక్తే ఉండదు.  పాలకులూ, పాలితులూ అందరూ పరమసజ్జనులే. అంతే‌కాదు, చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళూ పరమసజ్జనులే.  ఐతే, ఇలాంటి పరిస్థితి కేవలం ఊహల్లో మాత్రమే సాధ్యపడుతుంది.  అందుకే ఆదర్శరాజ్యం కూడా ఒక అందమైన ఊహ మాత్రమే.  కాబట్టి దోపిడి లేని రాజ్యం ఉండదు.   కాబట్టి, ఊహాజనితమైన ఆదర్శరాజ్యంలో తప్ప, అన్ని రకాల రాజ్యవ్యవస్థల్లోనూ  బలవంతుడి ప్రయోజనమే న్యాయం అన్నది అనుభవంలోనికి వస్తుంది ఎప్పుడూ.

ప్రస్తుత పరిస్థితికి అన్వయిస్తే,  కొత్తగా వచ్చే తెలంగాణా రాష్ట్రంలోనూ దోపిడీ నిరాటంకంగా కొనసాగుతుందని చెప్పవచ్చు.  ఆంధ్రప్రదేశంగా సమైక్యంగా ఉన్నప్పుడు దోచుకునేందుకు అందరికీ సమానంగా అవకాశా లుండేవి సైధ్ధాంతికంగా.  నిజం ఎలాగున్నా, తెలంగాణావారి ఆలోచనలో సీమాంధ్రులు అవకాశాన్ని తెలంగాణావారి కన్నా ఎక్కువ తెలివిగా వాడుకున్నారు.   ఇప్పుడు తెలంగాణారాష్ట్రం వచ్చాక తెలంగాణావారికి కూడా ఆ అవకాశం ఇబ్బడిముబ్బడిగా లభిస్తుంది.  దోపిడీ అవకాశం లేని వాడికి, అవకాశం‌ రాని వాడికీ, అటువంటి ఆలోచనలు లేని వాడికీ ప్రవర్తనలో, సమైక్యరాష్ట్రంలోనూ ప్రత్యేకరాష్ట్రంలోనూ కొత్తగా వచ్చే‌మార్పు ఉండదు.  కొత్త తెలంగాణారాష్ట్రంలో అవకాశం అందిపుచ్చుకో గల వాళ్ళుగా మరికొంతమంది బయలుదేరుతారు.  సమైక్యరాష్ట్రంగా ఉన్నప్పుడు అవకాశం ఉపయోగించుకున్న కొంతమందికి మాత్రం వేరే దార్లు వెతుక్కోవలసి వస్తుంది - దోపిడీదారుల్లో మరికొంత మంది దోపిడీ కొనసాగించుకునే కొత్త ఉపాయాలు కనుగొంటారు.

సీమాంద్రులు దోపిడీ చేస్తున్నారని చాలాకాలంగా నానాయాగీ చేస్తున్నారు తెలంగాణా వాదులు.  తెలంగాణాలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశరాష్ట్రంలో ఇన్నాళ్ళుగా జరిగిన అభివృధ్ధి అంతా హైదరాబాదులోనే‌ కేంద్రీకృతమై ఉంది - దీనిలో సీమాంధ్ర భాగస్వామ్యం హెచ్చూ, ఇప్పుడు హైదరాబాదుపై తెలంగాణాకే పూర్తి హక్కు అనటం అన్యాయమూ అని సీమాంధ్రవాళ్ళు ప్రస్తుతం తీవ్రంగా అందోళన చేస్తున్నారు.  రెందు వర్గాల ఆందోళనలోనూ ఎంతోకొంత నిజం లేదనలేం.  ఎక్కడ నిజం ఎన్నిపాళ్ళు అన్న రాజకీయ చర్చకు ఇది స్థలమూ కాదు, సమయమూ కాదు.  ఐతే, తెలంగాణారాష్ట్రం వస్తే ఇంక సీమాంధ్రులు దోచుకునే అవకాశం ఉండదూ అని ఇన్నాళ్ళూ చెప్పిన తెలంగాణా నేతలే మళ్ళా చాలా కాలం పాటు ప్రతి తెలంగాణారాష్ట్ర సమస్యకూ సీమాంధ్రవారి గతకాలపు లేదా వర్తమానకాలపు దోపిడియే కారణమని పాట పాడుతూ ఉంటారు. ఇది సహజం.  ప్రతి సమస్యనూ ఎదుర్కునే క్రమంలో నెపం వేరే చోట వేయటం అనే తతంగం జరుగుతూనే ఉంటుంది.   తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినా అనేకానేక యేళ్ళ పాటు ప్రతిసమస్య మీదా కాంగ్రెసు వారు ఇదే రకంగా రాగాలాపన చేయటం అందరికీ విదితమే.  చెప్పవచ్చే‌ ముక్క ఏమిటంటే, సీమాంధ్రవాళ్ళను ఇంకా చాలా కాలం తెలంగాణా వాళ్ళు ఈ‌ నెపంగా దూషిస్తూనే ఉంటారు.  కాబట్టి దోపిడి తెలంగాణాలోనే‌ జరుగుతున్నా సీమాంధ్రులు మాటలు పడటం‌ తప్పదు.

దోపిడీ అనేది ఇద్దరిలో ఒకరు మరొకరిని దోచుకోవటం అనేదొకటే కాక మరో‌ కోణం కూడా ఉంది.  మూడో మనిషీ‌ చేయవచ్చు ఆ ఇద్దరినీ దోపిడీ!  స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ,  రాచకుటుంబంగా మనదేశంలో‌, కాంగ్రెసు పార్టీ పేరుతో స్థిరపడిపోయిన నెహ్రూ-గాంధీ కుటుంబం చేతిలోనే ఎక్కువకాలం అధికారపు పగ్గాలు ఉన్నాయి.  కాంగ్రెసు అయ్యేది కాకపోయేది ఢిల్లీ‌గద్దెకు ఎక్కిన ఏ దొరతనమూ తెలుగువారి ఆశలనూ అభివృధ్ధినీ ఏమాత్రమూ పట్టించుకోలేదు.  చిత్రం ఏమిటంటే, ఐనా ఎప్పుడూ తెలుగువారు నియోగాంధీల పార్టీకి వీరవిధేయులుగా కట్టలు కట్టలుగా ఓట్లూ సీట్లూ‌ కట్టబెడుతూనే ఉన్నారు.  నిరాదరణకూ, వివక్షకూ, దోపిడీకీ గురి అవుతూనే ఉన్నారు.  చివరకు ప్రధాని పదవిని నిర్వహించిన వ్యక్తినీ ఈ‌ కాంగ్రెసుపార్టీ మరణానంతరం కూడా దర్జాగా అవమానిస్తూనే‌ ఉంది. మొన్న ప్రధాని ప్రసంగంలో‌ పీవీ ప్రసక్తి ఉంది.  ఆ ప్రసంగానికి కాంగ్రేసు వారు ప్రకటించిన పాఠంలో పీవీ ప్రసక్తిని తొలగించారు.  తెలంగాణా అనే‌కాదు, తెలుగునాట అనేకానేక ప్రాంతాలు అభివృధ్ధికి ఆమడదూరంలో ఉన్నాయి.  కల్పాకం అణువిద్యుత్తు కేంద్రం‌ ప్రారంభించిన ఇందిరాగాంధీ దాన్ని జాతికి అంకితం ఇచ్చారు - నూరుశాతం విద్యుత్తునూ తమిళనాడుకే ఇచ్చారు!   ఆంధ్రాలో దొరికే సహజవాయునిక్షేపాలలో ఆంద్రప్రదేశానికి ముష్టిస్థాయిలో విదుపుతున్నారు!  ఈ రోజుకూ రైలుబండి ముఖం చూడని వారు కోనసీమలో బోలెడు మంది!   ఇదంతా ఎందుకు ప్రస్తావించాను?  దోపిడీ అనేది తెలుగునాట ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతాన్ని దోచుకోవటం అనే అర్థంలోనే కాదు.  మొత్తం తెలుగువారందర్నీ ఇన్నాళ్ళూ ఢిల్లీ‌ పెద్దలు దోపిడీ చేస్తూనే ఉన్నారని గుర్తు చేసేందుకు.  తెలంగాణారాష్ట్రం ఏర్పడితే ఈ దోపిడీ‌ ఆగుతుందా?  ఒకవేళ అది మరింత పెద్ద దోపిడీగా  పెరుగుతుందా?  ఇష్టం లేని వాళ్ళూ ఐకమత్యమే బలం అన్న కథను గుర్తు చేసుకోండి.  విడిపోయి రెండు రాష్ట్రాలలో పడ్డ తెలుగువారిని మరింతగా దోచుకుందుకు ఢిల్లీ పెద్దలకు మరింత సులువు ఇప్పుడు.  కాదంటారా?

కొత్తగా వచ్చే ప్రతి మార్పూ నవవసంతం అని ఆశపడటం‌ మానవసహజం.  తప్పులేదు.
కాలమే నిర్ణయించాలి ఆ వస్తున్నది వసంతమా, గ్రీష్మమా అన్నది.

14 కామెంట్‌లు:

 1. pv narasimha rao kendhram gauravinchaledu correcte kani ee simmandhra prabhuthavam itchinna gaurvam ettidhi ? .... dopidi podu kevalam seemandhra dopidi mathrame pothundhi

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆవుకథ జోక్ లాగా మీరు ప్రతి అవకాశమూ‌ సీమాంధ్రులని నిందించటానికే వినియోగించుకో దలచుకుంటే అది వేరే విషయం.

   కాని మీ‌రు నా వ్యాసాన్ని కాస్త శ్రధ్ధపెట్టి చదివి ఉంటే బాగుండేది. తెలివైన దోపిడీదారుకు ఈ రాష్ట్రవిభజన అనేది ఏమీ ఇనపతెర కాదని మీరు గ్రహించలేక పోతున్నారు. ఈ రాష్ట్రవిభజన వలన లాభం సంపాదించుకొనేది కేవలం కేంద్రప్రభుత్వమూ, ఆ కేంద్రప్రభుత్వం అనేది తన గుత్తాధిపత్యం అనుకుంటున్న కాంగ్రెసు పార్టీవాళ్ళూ మాత్రమే అని అందరూ గ్రహించ వలసి రావచ్చు ఒక నాటికి.

   తొలగించండి
 2. ఆవుకథ జోక్ లాగా మీరు ప్రతి అవకాశమూ‌ సీమాంధ్రులని నిందించటానికే వినియోగించుకో దలచుకుంటే అది వేరే విషయం

  తప్పక...ఇప్పుడు ఒక్కో సీమాంధ్ర దోపిడీ దారుడూ...ఓ ఇరవై కోట్లు చొప్పున్న దోపిడీ చేస్తారనుకోండి..ఈ ఐదేళ్ళలో...ఐదు కోట్ల మంది..ఎంత దోచుకుంటారు?అదంతా ఇక తెలంగాణా ప్రజల జోబుల్లోనే మిగిలి పోతుంది..ఇక అందరూ...స్టీవ్స్ జాబ్..వార్న్ బఫెట్...ఒహో..చెయ్యిత్తి జైకొట్టు తెలుగోడా...వెర్రి పీనుగుల్లారా...వహ్...చిడంబరం...ఏమ్ దెబ్బ తీసావురా...:)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఓ అజ్ఞాతమహాశయా, తమరూ వ్యాసం సరిగా చదవకుండానే అధికప్రసంగం చేస్తున్నారు.
   ఇంక ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలని ప్రకటించేదీ లేదు - వాటికి జవాబులు ఇచ్చేది లేదు - తొలగించటమే జరరుగుతుంది.

   తొలగించండి
 3. ఆవుకథ జోక్ లాగా మీరు ప్రతి అవకాశమూ‌ సీమాంధ్రులని నిందించటానికే వినియోగించుకో దలచుకుంటే అది వేరే విషయం...


  ఇది మీకు ఇప్పటికి అర్ధం అయ్యిందా?కుక్కను చంపే ముందు...పిచ్చి కుక్క అన్న ముద్ర వేయాలి...చెన్న రెడ్డి టైమ్ లో ఉద్యమానికి కారణమ్ దేశ వ్యాప్తంగా అప్పట్లొ ఉన్న నిరుద్యోగ సమస్య..సీమాంధ్రుల మీద అది గురి చేయబడ్డది అప్పట్లొ...ఒక స్టూడెంట్ నిరాసతో ఆత్మహత్య చేసుకోవడమ్..అదే మిగతా వాళ్లకు..అక్కడి నుండి ఉద్యమానికి...దారి తీసింది..అసలు సమస్య అప్పట్లో దేశ మంతా ఉంది..కాకపోతె...ఇక్కడ..కాణం...సీమాంధ్రుల మీద.. గురి చేయబడ్డది ....అనేక కోణాల్లో విశ్లెషన చేయాల్సిన ది...తెలంగాణా!!అనేక కోణాలూ...:)

  రిప్లయితొలగించండి
 4. తెలివైన దోపిడీదారుకు ఈ రాష్ట్రవిభజన అనేది ఏమీ ఇనపతెర కాదని మీరు గ్రహించలేక పోతున్నారు....

  excellent shyaamaleeyam garu....

  రిప్లయితొలగించండి

 5. దోపిడిజరుగుతూనే ఉంది జరుగుతుంది కూడా! ప్రజలు దీనిని గుర్తించలేకపోతున్నారన్నదే బాధ

  రిప్లయితొలగించండి
 6. రాజ్యం ఉందీ అంటే దోపిడీ ఉంటుంది. రాజ్యం అనేది ఎందుకు ఏర్పడింది? దోపిడీ అంటే ఏమిటి? అనే విస్తృత అర్ధాలు వివిధ కోణాలలో తత్వవేత్తలు వారి వారి అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. రాజ్యం రద్దయినప్పుడు దోపిడీ సంపూర్ణంగా రద్దవుతుంది. ఆ విషయాలు వేరు. తెలంగాణా దోపిడీకి గురయినది ఎవరి చేతుల్లో అంటే కేవలం సీమాంధ్రవాళ్ల చేతుల్లో అనేది తప్పు.

  తెలంగాణాను గతంలో దొరలు దోచుకున్నాను. సీమాంధ్ర పాలకులు లేదా పెట్టుబడిదారులు దోచుకున్నారు. అదే తెలంగాణా ప్రజలకు వీర తెలంగాణా పోరాటం లో ఆంధ్రా ప్రాంతపు నాయకులు ప్రాణాలకు తెగించి నాయకత్వం వహించి చైతన్యం నింపారు. తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండాలంటే ఒక్కటిగా ఉన్నా లేదా పెద్ద మనుషుల ఒప్పందాలు అమలు జరగలేదు కాబట్టి రెండుగా విడిపోయినా ఏమి చేయాలో ఆలోచించే పద్ధతి మాత్రం ఎవరూ చేయడం లేదు. ఎవడిగోల వాడిది ప్రతి వెధవా ఎదుటివాడిపై బురద జల్లుతూ గురివిందల్లా మాట్లాడుతున్నారు. చంద్రబాబు అభద్రతా భావపు పిచ్చి ఎత్తుగడల సాక్షిగా - విజయమ్మ-సోనియమ్మ లు తమ ముద్దుబిడ్డల భవితవ్యం కోసం కాంగ్రెస్ దోంగాటగా రాష్ట్ర విభజన చేస్తోంది. రాష్ట్రం లో పాలన లేక రావణకాష్టం లా రగులుతుంటే కిరణ్ ఓ వైపు - బొత్స మరో వైపు తమ స్వలాభాలకోసం మంట కాగుతున్నారు. ఎవడి ఎత్తుగడ చూసినా జుగుప్స కలుగుతుంది. సోనియాను ఒక్క మాట అనని జగన్ , నోటిదూలతో కారుకూతలు కూసే కే.సీ.ఆర్ లు తెలుగుదేశం పతనమే టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు.

  తెలంగాణా ఆగదని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు తెలంగాణా ను కొత్తగా దోచుకోవడానికి రెడీ అయిన గద్దల పట్ల తెలంగాణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇన్నాళ్లూ తెలంగాణాలో ఉద్యమం జరుగుతుంటే కేవలం లాబీయింగులతో డ్రామాలాడిన సీమాంధ్ర నేతలు ఇప్పటికీ కేవలం హైదరాబాద్ కోసమో , పెట్టుబడులకోసమో తమ రాజకీయ భవిష్యత్తుకోసమో ప్రాకులాడుతున్నారు తప్ప సీమాంధ్ర ప్రజలపై ప్రేమతో ఉన్న నేతలెవరున్నారు? ప్రజల ముందుకొచ్చి ధైర్యంగా నిలబడగలిగిన నేత ఎవడు? తెలంగాణా ప్రాంత నేతల్లా త్యాగాలకు నిలబడే దమ్మున్నవాళ్లెందరు?

  విభజనతో నిజంగా ప్రజలకు వచ్చే సమస్యలపట్ల ఇరుప్రాంతాల మేధావులతో , చిత్తశుద్ధి కలిగిన వారితో చర్చించి తెలుగుజాతి ఐక్యంగా ఉండేలా రెండు ప్రాంతాలలో దోపిడీ తగ్గేలా చూడాలి. శ్యామలీయంగారన్నట్లు ఢిల్లీ గద్దల ప్రాబల్యం తెలుగుజాతిపై తగ్గేలా చూడాలి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ విశ్లేషణ బాగుంది కానీ "..తెలంగాణా ప్రాంత నేతల్లా త్యాగాలకు నిలబడే ..." వారెవరో అర్ధం కాలేదు :)

   తొలగించండి
 7. మాస్టారు

  మీరు కూడా నెహ్రూ-గాంధీ కుటుంబం అంటారేంటండి. గాంధి గారి కుటుంబం ఆయనతోనే పోఇంది. ఆ తోక తగిలించుకున్న నెహురు కుటుంబమే కదా ప్రస్తుతం వుంది.

  రిప్లయితొలగించండి
 8. "ఐనా ఎప్పుడూ తెలుగువారు నియోగాంధీల పార్టీకి వీరవిధేయులుగా కట్టలు కట్టలుగా ఓట్లూ సీట్లూ‌ కట్టబెడుతూనే ఉన్నారు"
  మనవన్ని పీత బుర్రలని కాంగ్రెస్స్ వాళ్ళకు బాగా తెలుసు. అందుకే ఇంతగా బరితెగించారు.

  రిప్లయితొలగించండి
 9. Asalu intha charcha rachha avasaramaa syamaleeyamgaruu....telangana puttaboyedi, okavela pudithe I repeat...oka vela vaste giste adi ka cha ra gaari kutumba dopidee ke kaadaa......intha kanna maatlaadadam avasaram ledu.
  ippatikaina telangana mathu vaduluthundani aasiddamu.

  రిప్లయితొలగించండి
 10. "దోపిడి లేని రాజ్యం ఉండదు. కాబట్టి, ఊహాజనితమైన ఆదర్శరాజ్యంలో తప్ప"

  రాముడి రాజ్యంలోకూడా దోపిడీ ఉండేదా? ఉంటే అది ఎట్టిది? లేనట్లైతే రాముడూ, రామరాజ్యమూ కల్పనలేనా?

  మనం ఆంగ్లేయులనుంచి స్వాతంత్ర్యంకోసం పోరాడుతున్న రోజుల్లోనే స్వాతంత్ర్యం తరువాత మనల్ని తెల్లవారికి బదులుగా నల్లవారు దోచుకుంటారేతప్ప పెద్దగా ఒరిగేదిలేదని కొందరు ఆలోచించారు. అది నిజమైందికూడా. అసలుస్వాతంత్ర్యమంటే మనల్నెవరు దోచుకోవాలన్న విషయంలో మనమాట చెల్లుబాటవ్వడమేనేమో! తెలంగాణా విషయంలో మాత్రం అలా ఎందుక్కాకూడదు? మన స్నేహితులు, బంధువులు మనల్ని దోచుకోవడాన్ని మనం తప్పుగా భావించడంలేదుకదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాముడిరాజ్యంలో దోపిడీ లేదు. రామో విగ్రహవాన్ ధర్మః అని రాక్షసుడైన మారీచుడే చెప్పాడంటే రాముడి వ్యక్తిత్వం అర్థం చేసుకోండి. ఒక రాక్షసుడికే అర్థమైన రాముడి ధర్మస్వరూపం నేటికాలంలో ప్రశ్నకు గురి అవుతున్నదంటే మనవాళ్ళలో రాక్షసుడిపాటి ఇంగితమూ లేనివాళ్ళ సంఖ్యయే పెరుగుతున్న దన్న మాట.

   స్నేహితులు, బంధువులు మనల్ని దోచుకోవడాన్ని మనం తప్పుగా భావించడం లేదనటం మీ అజ్ఞాన పూర్వకవ్యాఖ్యానం మాత్రమే! ఆ తప్పుడు అవగాహనతో, తెలంగాణాను తెలంగాణావాళ్ళు దోచుకుంటే తప్పులేదన్న సిధ్ధాంతం తెలంగాణావాళ్ళకు నచ్చుతుందని సిధ్ధాంతీకరించటం అవివేకం!

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.