6, అక్టోబర్ 2013, ఆదివారం

శ్రీలలితా సహస్రనామస్తోత్రంలో ఉన్న అమ్మవారి సౌందర్య వర్ణన - 1

శ్రీలలితా సహస్రనామస్తోత్రంలో ఉన్న అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించేనామాలు చాలా ఉన్నాయి.  ఈ‌ నామాల్లో అనేకం స్తోత్రంలోని రెండవ శ్లోకం నుండి ఇరవై ఒకటవ శ్లోకందాకా ఒక మాలికగా వర్ణించబడి ఉన్నాయి.

ఇలా అమ్మవారి సౌందర్యాన్ని నుతించే నామాలను ఒక పట్టికగా చూదాం. (ఇక్కడ  నామ సంఖ్యను జతపరచి ఆ నామాలను ఇస్తున్నాను). అలాగే ప్రతి నామం క్రిందనూ క్లుప్తంగా నామం యొక్క అర్థంకూడా  పొందు పరుస్తున్నాను.

6. ఉద్యద్భాను సహస్రాభా
వేయి కిరణములు కల, ఉదయసూర్యుని యొక్క కాంతి వంటి శరీర కాంతి గలది.

7. చరుర్భాహు సమన్వితా
నాలుగు బాహువులు(భుజములు) కలది. 

8. రాగస్వరూపపాశాఢ్యా  
రాగమనే స్వరూపం గల పాశముతో ఒప్పుచున్నది.

9. క్రోధాకారాంకుశోజ్జ్వలా
క్రోధం అంటే ద్వేషం అనే చిత్తవృత్తి విశేషం. ఆకారం అంటే లౌకిక విషయ జ్ఞానం. ద్వేషం అనే సవిషయక జ్ఞానం అనే అంకుశం ధరించి ప్రకాశిస్తున్నది అని అర్థం.

10. మనోరూపేక్షుకోదండా
అమ్మ యొక్క ఎడమ వైపున ఉన్న ఊర్ధ్వ కరమున చెఱుకు గడ విల్లు ఉంది. అది మనోరూపమైన చెఱకు విల్లు.

11. పంచతన్మాత్రసాయకా
అమ్మ  చేతిలో వింటికి బాణాలు పంచతన్మాత్రలు అని పిలువబడే శబ్ద, స్పర్శ, రస, రూప ,గంధములు.

12. నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా
అమ్మ యొక్క తనుకాంతిలో బ్రహ్మాండాలన్నీ మునిగిపోతున్నాయని అర్థం.

13. చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా
అమ్మ తలకట్టు సంపగిపూవుల పరీమళమూ, ఆశోకపుష్పాల పరీమళమూ, సురపొన్న పూవుల సుగంధమూ కలిగి శోభిస్తోంది.

14. కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా
అమ్మ ధరించిన కిరీటం పద్మరాగ మణుల వరుసలతో అలంకరించబడి ఉంది.

15. అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా
అమ్మ నుదురు అష్టమి నాటి అర్థచంద్రుడిలాగా అందంగా ఉందని అర్థం.

16. ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా
అమ్మ ముఖం ఒక చంద్రబింబంలా శోభిస్తూ ఉంటుంది.  ఆ దివ్యవదనం మీద ఉన్న కస్తూరీ తిలకం కూడా చంద్రబింబంలో మచ్చలాగా అందంగా ఉందని అర్థం.

17. వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా
మన్మథుడి ఇంటికి కట్టిన మంగళ తోరణాల్లాగా అమ్మ  యొక్క కనుబొమలు ఉన్నాయని అర్థం.

18. వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా
అమ్మ ముఖం యొక్క కాంతి ప్రవాహం ఒక  దివ్యజలప్రవాహం అనుకుంటే, అమ్మ యొక్క కదులుతున్న కళ్ళు ఆ మహా ప్రవాహంలో కదులుతున్న చేపలవలె ఉన్నాయి.

19. నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
అమ్మ ముక్కు ఉందే, అది అప్పుడే వికసించిన సంపంగి పూవులా ఉంది.

20. తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా
అమ్మ ముక్కుకు ఉన్న అడ్డబాస యొక్క ప్రకాశం, ఆకాశంలోని నక్షత్రాల కాంతుల్ని తిరస్కరించేంత గొప్పగా ఉంది.

21. కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా
కర్ణపూరం అంటే కర్ణావతంసం.  అంటే, చెవి మీద అలంకరించుకొనే ఆభరణం.  అమ్మ యొక్క కర్ణావతంసాలుగా మనోహరమైన కదంబపుష్పాలగుత్తులు ఉన్నాయి.

22. తాటంకయుగళీభూతతపనోడుపమండలా
సాక్షాత్తూ సూర్యచంద్రులే అమ్మ రెండు చెవులకూ చెవికమ్మలుగా ఉన్నారు.

23. పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః
పద్మరాగ శిలలు అతినిర్మలంగా ఉండి ప్రశస్తమైన అద్దాలుగా చెప్పబడుతాయి. అమ్మ చెక్కిళ్ళనే అద్దాలు ఆ పద్మరాగాల అద్దాల కంటే పరమ స్నిగ్ధములై గొప్పగా శోభిస్తున్నాయి.

24. నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా
లోకంలో‌ స్త్రీల పెదవులను పగడాలతోనూ, దొండపండ్లతోనూ‌పోల్చి అంత ఎఱ్ఱగా ఉన్నాయంటారు.  కాని అమ్మ పెదవుల అరుణిమ ముందు ఆ కొత్త పగడాలూ, దొండపండ్లూ దిగదుడుపే.

25. శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా
 అమ్మను గూర్చి తెలియజెసే శ్రీవిద్యకే శుధ్ధవిద్య అని అన్వయం. ఇది షోడశీ విద్య అని కూడా చెప్పబడుతుంది. ఈ షోడశీ విద్య యందుండే పదునారు అక్షరాలూ పదునారు పండ్లజత.  పైన పదునారు, క్రింద పదునారు మొత్తం ముప్పది రెండు పండ్లు కదా.  ప్రతి అక్షరమూ ఒక మొలక (అంకురం)లాగా భావిస్తే, మొలకకు రెండు దళాలు ఉంటాయి కదా, ఆ రెండూ పైన, క్రింద ఉండే ఒక్కొక పండ్ల జత అన్న మాట. అమ్మ నోటిలోని పండ్లు అన్నీ‌ శుధ్ధ విద్య అనే షోడశి యొక్క అంకురాలు అని తాత్పర్యం.

26. కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా
అమ్మ వేసుకున్న కర్పూర తాంబూలపు సువాసనలను అన్ని దిక్కులూ అకర్షించుకుంటున్నాయి. ఆ సువాసన అన్ని దిక్కులనూ కమ్ముకుంటున్నది. అంటే, అమ్మ కర్పూర తాంబూలపు కబళాలకోసం దిగ్దేవతలు చుట్టు కాచుకొని ఉండి గ్రహిస్తున్నారు అని అర్థం
.
27. నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ
సరస్వతీ దేవి యొక్క వీణకి కఛ్ఛపి అని పేరు. ఆ వీణ అతిలోక మధురమైన గానాన్ని వినిపిస్తుంది. సరస్వతి వాక్కుకి అధిదైవతం కదా!  ఐతే, అమ్మ  మాటల మాధుర్యం సరస్వతీ వీణనే‌ నివ్వెరపోయేలా చేసేటంత మధురాతిమధురంగా ఉంది.

28. మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా
కామేశ్వరుడి (శివుడి) మనస్సు అమ్మ యొక్క చిరునవ్వుల ప్రవాహంలో  మునకలు వేస్తున్నది.

29. అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా
వాగ్దేవి మొదలు నేటి మహాకవులదాకా అందరూ అమ్మవారి సౌందర్యాన్ని వివిధ మైన ఉపమానాలతో వర్ణించారు.  కాని ఎవ్వరికీ అమ్మ యొక్క గడ్డం యొక్క అసాధారణ సౌందర్యాన్ని వర్ణించాలంటే ఏ ఉపమానమూ‌దొరకలేదు.

30. కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా
మంగళసూత్రం‌ పరమపవిత్రమైనది. సర్వలోకపవిత్ర ఐన సాక్షాత్తు జగన్మాత శ్రీదేవి మెడలోని మంగళసూత్రాన్ని కట్టింది పరమశివుడు. పరమవిరాగి ఐన పరమేశ్వరుడే అమ్మని కోరి వరించి మంగళసూత్రం‌ కట్టాడు అంటే అమ్మ సౌభాగ్యాతిశయాన్ని ఊహించుకోవలసిందే!

31. కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా
అమ్మ అందమైన పై రెండు భుజాలకి బంగారు భుజకీర్తులున్నాయి. అలాగే ఆవిడ క్రింది రెండు భుజాలకీ బంగారు అంగదాలు ఉన్నాయి.

32. రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా
అమ్మ మెడలోరత్నాల చింతాకు పతకాలున్నాయి.  అలాగే బంగారు ఆభరణాలు, కదలుతున్న ముత్యాల హారాలూ ఉన్నాయి.  తెలుగునాట చింతాకు పతకం అన్నది ప్రసిథ్థమైన ఆభరణం.

33. కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ
మహానుభావుడైన కామేశ్వరుడి ప్రేమ అనే అనర్ఘ రత్నాన్ని కొనుక్కోవాలంటే అమ్మవారు తన రెండు స్తనాలనే మణులనే వెలగా ఇచ్చిందట. ఇక్కడ చమత్కారం ఏమిటంటే తల్లి యొక్క స్తనద్వయం కామేశ్వరునకే  అనుభవైకము అని చెప్పటం.

34. నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ
అమ్మ ఒక్క నాభినుండి ఉదయించి పైకి విస్తరించిన నూగారు అనే‌లతకు రెండు పళ్ళు కాసాయి. అవే అమ్మ యొక్క కుచద్వయం.

35. లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా
అమ్మకు  నడుము ఉందా లేదా అన్నది ఒక సందేహం. ఆమెకు నూగారు ఉంది ఒక లతలాగా, స్త్రీ సహజంగా. అది పైకి విస్తరించి స్తనములనే రెండు పళ్ళు కూడా కాసింది. ఈ ఆధారం లేకుండా  ఒక లత పైకి పాకలేదు కదా. అందు చేత ఆమెకు ఎంత లేనట్లుగా అనిపించినా, నడుము ఉన్నదని తెలుస్తున్నది అని అర్థం.

36. స్తనభారదలన్మధ్యపట్టబంధవళిత్రయా
ఆ తల్లి యొక్క నూగారు లతకు కాసిన స్తనఫలాల బరువుకు అసలే ఉండీ లేనట్లుగా ఉన్న ఆవిడ నడుముకు నిలబడటం‌ కష్టంగా ఉంది. ఆ నడుము నిలబడటానికి బంగారు పట్టీలు కట్టినట్లుగా అమ్మ  కడుపు మీద మూడు మడతలు ఉన్నాయి. చక్కని సన్నని నడుము, ఘనంగా ఉండే కుచములు ఉత్తమ స్త్రీ సాముద్రిక లక్షణాలు.  అమ్మకు ఉండే త్రివళిని  త్రిలోకాలకు, త్రిశక్తులకు, త్రికాలాలకు అలాగే ఇతర సాంప్రదాయిక వేదాంతంలోని త్రికాలలకు అన్వయం చేసి చెప్పవచ్చును.

37. అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ
అమ్మ నడుము క్రిందిభాగానికి మిక్కిలి ఎఱ్ఱనైన వస్త్రాలు ధరించి ఉన్నది.

38. రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా
అమ్మ ధరించిన ఆ వస్త్రాలకు ఒడ్డాణం పెట్టింది. ఆ ఒడ్డాణానికి బంగారపు తాళ్ళతో వేళ్ళాడుతున్న అనేక చిరుగంటలు ఉన్నాయి.  ఆ గంటలు  మంచి మంచి మాణిక్యాలతో నిర్మించబడినవి.

39. కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా
అమ్మ యొక్క ఊరువుల సౌభాగ్యం గురించి తెలిసిన వాడు ఒక్క కామేశ్వరుడే.

40. మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా
అమ్మ  మోకాళ్ళు మాణిక్యాల చేత చేయబడిన చిన్న చిన్న కిరీటాలలాగా ఉన్నాయి.

41. ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా
అమ్మ యొక్క పిక్కలు మన్మథుడి అమ్ములపొదుల్లాగా ఉన్నాయి. ఆరుద్రపురుగులు చాలా అందంగా మిక్కిలి ఎఱ్ఱగా ఉంటాయి. వానా కాలంలోనే మనకు కనిపిస్తాయి. మన్మథుడి అమ్ముల పొదులకు ఆరుద్రపురుగులు పట్టులాగా ఆవరించుకుంటే  ఎలా కనిపిస్తాయో ఆ పొదులు అలా ఉన్నాయట అమ్మ పిక్కలు.

42. గూఢగుల్ఫా
అమ్మ చీలమండలు మంచి పుష్టికలవి.

43. కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా
అమ్మ పాదాల ఉపరిభాగాలు, తాబేటి చిప్పల వలే ఎత్తుగా ఉన్నాయి. కాని ఆ సామ్యం అంతవరకే. ఆ మీగాళ్ళు మృదువుగా ఉన్నాయి. (ఇలా మృదువుగా ఎత్తుగా పాదోపరిభాగాలుండటం సాముద్రిక శుభలక్షణం)

44. నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా
అమ్మ కాలిగోళ్ళు చంద్రశకలాల్లాగా ప్రకాశిస్తున్నాయి. ఆ గోళ్ళ కాంతులు ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తున్న  వారి అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తున్నాయి.

45. పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా
సౌందర్యానికీ, సౌకుమర్యానికీ పద్మాలను ఉదాహరణగా చెబుతారు.  కానీ, అమ్మ పాదకాంతుల చేత, వాటి సౌకుమార్యం చేత, వాటి సౌందర్యం చేత పద్మముల శోభ చిన్న బోతున్నది.

46. శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా
అమ్మ పాదాబ్జాలకు మణులు పొదగబడిన గజ్జెల అందెలు ఉన్నాయి.

47. మరాళీమందగమనా
హంసల నడకలు వయ్యారానికి (మందగమనానికి)  పేరు. ఆడు హంసల నడకల గురించి ఇంకా చెప్పాలా?  అమ్మ  నడకల మందగమనాలు ఆడుహంసల  నడకల వంటివి.

48. మహాలావణ్యశేవధిః
అమ్మ అత్యుత్తమమైన సౌందర్యానికి నిధి.

49. సర్వారుణా
అమ్మ అంతా ఎఱుపే.  ఆమె ధరించిన వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలు అన్నీ‌ ఎఱుపే. అమ్మ శరీరఛాయ ఎఱుపే.

50. అనవద్యాంగీ
ఏ మాత్రం వంక పెట్టటానికి అవకాశం లేని పరమ శుభలక్షణాలు కల అవయవ సౌష్టవం కలది అమ్మ.

51. సర్వాభరణభూషితా
అమ్మ చూడామణి మొదలు, పాదాంగుళీయకాల వరకూ అన్ని రకాల ప్రశస్తమైన ఆభరణాలనూ ధరించి ఉంది.

ఇవి గాక, ఆ 21వశ్లోకం తరువాత వచ్చే శ్లోకాల్లోను ఆక్కడక్కడా మరొక  యాభై నామాల వరకూ తల్లి స్వరూప సౌందర్యాన్ని అభివర్ణించే నామాలు కనిపిస్తాయి.  వాటిని వచ్చే టపాలో చెప్పుకుందాం.