ముందుమాట
దురదృష్టవశాత్తు పర్వదినాల విషయంలో పంచాంగాలు ఏకాభిప్రాయంతో ఇవ్వటం జరగటం లేదు. ఇది తరచు వివాదాలకు దారి తీస్తోంది. చాలా విచారించ వలసిన సంగతి.
దానికి తోడు, వివాదాల మీద బ్రతకటానికి అలవాటు పడిన మీడియా వారు, ఇలాంటి అవకాశాల్ని చక్కగా అంది పుచ్చుకుంటున్నారు. భిన్నమైన తారీఖులు ఇచ్చిన ఇద్దరు పంచాంగ కర్తల్నీ, అసలు పంచాంగం అంటే ఏమిటో, అదెలా తయారు చేస్తారో అన్న కనీస అవగాహన లేని ఒక ఖగోళశాస్త్ర అధ్యాపకుడినో, ఖగోళశాస్త్ర విద్యార్థినో ఒకరినీ, ఎడ్డెం అంటే తెడ్డెం అనటమే పనిగా మాట్లాడే ఒక హేతువాదినని చెప్పుకునే వాడినీ పోగు చేసి స్టూడియోలో కూర్చో బెట్టి ఒక యాంకరమ్మ చర్చాకార్యక్రమం చేస్తుంది. అలాంటి మోడరేటరు యాంకరమ్మల్లో నూటికి తొంభై తొమ్మిది మందికి పంచాంగం అంటే బొత్తిగా తెలియక పోవచ్చు కూడా. ఇక చూడండి, పరమ అసందర్భంగా నడిచే ఆ చర్చ ఎంత వేడిగా వాడిగా కావాలంటే ఛానెలు వారు అలా నడిపించుకుంటారు. చివరకి టీవీ ముందు కూర్చుని చూసిన వారికి మరింత గందరగోళమూ, తలనొప్పీ తప్పవు.
ఒక్కొక్క సారి మనలో కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకూ కొన్ని కొన్ని తప్పుడు అభిప్రాయాల కారణంగా గందరగోళ పరిస్థితులు వస్తాయి. ఈ రోజున అక్షరసత్యాలు బ్లాగులోని పండగలకు ఏకాభిప్రాయం అత్యవసరం అన్న టపాలో ఈ వాక్యం చూసాను "శాస్త్రం ప్రకారం పండగల సందర్భంలో సూర్యోదయానికి ఆ పండగ తిథి ఉన్న దినాన్నే గ్రహించటం జరుగుతుంది". ఇది అన్ని సందర్భాలలోనూ వర్తించే సూత్రం కాదు. ప్రతి పండుగనూ నిర్ణంచటానికి ధర్మశాస్త్రగ్రంథాలు తరచు వేరే వేరే నియమాలు ఇస్తాయి. అన్నింటికీ ఒకే నియమం కాదు.
ఈ విషయంలో కొంత స్పష్టత ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాను.
ఇక్కడ గమనించ వలసిన కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి.
పంచాగగణనంలో విభిన్నపధ్ధతులు
చాలా మంది పంచాంగ కర్తలు సరిగా దృక్సిధ్ధాంతం ప్రకారం పంచాంగం తయారు చేస్తున్నారు. కాని కొందరు ఇంకా సూర్యసిధ్ధాంతం ప్రకారం పంచాంగం చేస్తున్నారు.
దృక్సిధ్ధాంతం ప్రకారం సూర్యచంద్రుల, గ్రహాల స్థితిగతులు ఆధునిక ఖగోళశాస్త్రగణితం ప్రకారం సిధ్ధించే ఫలితాలతో సరిపోలుతాయి. నిజానికి ఈ రోజున చాలా మంది పంచాంగ కర్తలు ఆధునిక ఖగోళశాస్త్రగణితం ఇచ్చే వివరాల ప్రకారం పంచాంగం చేస్తున్నారు. కాబట్టి ఆ పంచాంగాలలో ఇచ్చే వివరాలు నిర్ధుష్టమైనవి. అవశ్యం ఆమోదించ దగినవి.
ప్రాచీన మైన సూర్యసిధ్ధాంతం చాలా అందమైనది. చాలా వరకు ఆధునిక ఫలితాలకు దగ్గర ఫలితాలను ఇవ్వగలిగింది. కాని ఈసిధ్ధాంతం ప్రకారం పంచాంగం చేయాలంటే కలియుగాదిగా రోజుల సంఖ్యను తీసుకొని, కొన్ని కొన్ని స్థిరాంకాల, కొన్ని కొన్ని గణిత ప్రక్రియల సహాయంతో కావలసిన దినానికి సూర్యచంద్రుల, గ్రహాల స్థితిగతుల్ని లెక్క వేస్తారు.
కంప్యూటర్లు జన సామాన్యానికి అందుబాటులోకి ఈ మధ్యనే వచ్చాయి. కాని పంచాంగ గణనం మనవాళ్ళు శతాబ్దాలుగా చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద అంకెలతో కూడిన గణితం చేయటం, అది కూడా కేవలం చేతి తోనే చేయటం అనేది ఒక కత్తిమీద సాము వంటిది. చిన్న పొరపాటుతో మొత్తం గణితం చెడుతుంది - పంచాంగం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది.
ఈ చిక్కును తొలగించటానికి మహానుభావులు అనేకమంది గణితాన్ని సులభం చేసేందుకు మార్గాలు చూపారు. సుక్ష్మంగా వివరిస్తాను.
పంచాంగణనంలో అతి ముఖ్యమైన సంఖ్య అహర్గణం. అంటే కలియుగం ప్రారంభమైన రోజు సంఖ్య ౦ అనుకుని,కావలసిన రోజు వరకు ఎన్ని దినాలు గడిచాయో ఆ సంఖ్యయే అహర్గణం. మాట వరసకు కలిప్రారంభదినం నుండి సరిగా 5000 సంవత్సరాల తరువాత అహర్గణం విలువ 365.25*5000 = 1826250 రోజులు అవుతుంది. ఇలా గణితం ప్రారంభసంఖ్య పెద్దదిగా ఉంటే గణనం కష్టం కదా. అందు చేత పెద్దలు కొన్ని కొన్ని కరణగ్రంథాలు చేసారు. కరణగ్రంథం అంటే సులభ పంచాంగ గణిత గ్రంథం అన్నమాట. కరణగ్రంథాల్లో అహర్గణాన్ని కలియుగం ప్రారంభం నుండి లెక్కించటం కాక గ్రంధకర్త అప్పటికి దగ్గలో ఉన్న ఒక గత దినం నుండి ప్రారంభం చేస్తారు. దీని వలన గణితం చిన్న సంఖ్యతో మొదలు పెట్టవచ్చునన్నమాట. అంతే కాదు, గణిత విధానంలో కూడా కొన్ని కొన్ని సులభమైన అడ్డదారులు చూపిస్తారు. దీనితో గణితం సులభం అవటం వలన పంచాంగ కర్తలు తక్కువ శ్రమతో సంవత్సరం మొత్తానికి పంచాంగం చేయటం వీలవుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. గణితం చేయటంలో సులభవిధానాలు అత్యంత నిర్దుష్టమైన ఫలితాలు ఇవ్వలేవు. ఎంతో కొంత తప్పు ఉంటుంది అన్ని ఫలితాల్లోనూ. కాని ఈ తప్పులు అన్నీ నిముషంలోపు కాలమానం తప్పటం తప్ప గంటల్లో తేడా తీసుకు రావు. అందుకే కరణగ్రంథాల ప్రాశస్త్యం.
ఇక్కడే ఒక ముఖ్య మైన సంగతీ తెలుసుకోవాలి. ఏదైనా కరణగ్రంథం ఆథారంగా పంచాంగం వ్రాస్తే ఫలితాల్లో వచ్చే తప్పుల విలువలు స్థిరం కాదు ఎప్పూడు విసర్జించటానికి! గ్రంథకర్త ఇచ్చిన మొదటిరోజునుండి అహర్గణం విలువ పెద్దది అవుతున్న కొద్దీ, ఈ తప్పు పరిమాణమూ పెరుగుతూ వస్తుంది. అలాగైతే ఏ నూరేళ్ళో రెండువందలఏళ్ళో అయ్యే సరికి తప్పుల పరిమాణం భరించలేనంతగా పెరిగి మొత్తం కరణగ్రంధం చెప్పిన గణితం దండగ అవుతుంది. దీనికి విరుగుడూ చెబుతాయి కరణగ్రంథాలు.
కరణగ్రంథాలు అహర్గణం ప్రారంభదినం నాటి గ్రహాల స్థితిగతుల్ని ఇస్తాయి. వీటిని బీజాలు అంటారు. ఇష్టదినానికి ఒక గ్రహం స్థితిని ఇంచుమించుగా తెలుసుకోవాలంటే, అహర్గణాన్ని ఒక భిన్నంతో హెచ్చవేసి దానికి ఆ గ్రహం తాలూకు బీజం (గ్రంథం ఇచ్చిన ఆరంభం నాటి గ్రహస్థితి) కలుపుతారు. కాలం గడిచినకొద్దీ ఈ స్థూలస్థితి తప్పుడు విలువ అవుతుంది కాబట్టి, ఇన్నేళ్ల కొకసారి ఈ విలువకు ఫలానా నిర్దిష్టమైన విలువను కలపాలీ అని కరణగ్రంథాలు చెబుతాయి. ఇలా అదనంగా విలువను కలిపి / తీసివేసి సరిచేయటాన్ని సంస్కరించటం అంటారు. తరచుగా ఇన్నేళ్ళ కొకసారి బీజవిలువలను ఇలా సంస్కరించి సరిచేసుకుని అక్కడనుండి అహర్గణం లెక్కవేసుకుని గణితం చేయమనీ కరణగ్రంథాలు చెబుతాయి. దీని వలన తప్పులు ఆన్నేసి యేళ్ళ చక్రం యొక్క కాలానికి పరిమితం కావటం వలన పంచాంగం ఖచ్చితంగా వస్తుంది.
దురదృష్టవశాత్తు ఇక్కడ ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు సాంప్రదాయిక గణితంతో పంచాగాలు చేసేవాళ్ళు. చాలా మంది వారి తండ్రి తాతలు చేసిన బీజాల విలువలతోనే పంచాంగగణనం చేస్తున్నారు కాని బీజాలని సంస్కరించుకోవటం లేదు. అనేక మంది అడ్డగోలు వాదన ఏమిటంటే మా పూర్వీకులనుండీ సంప్రదాయంగా వచ్చిన గణితం మార్చటం తప్పూ - ఆ గణితమే ప్రమాణం అని. ఇలా ప్రాచీనమైన సూర్యసిథ్థాంతం ఆధారంగా చేసే గ్రహగణితంలో కొన్ని కొన్ని గ్రహాలు డిగ్రీల స్థాయిలో తప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. తిథుల గణనం మరింతం ఘోరంగా తయారయింది. ఒక్కోసారి ఆరేడు గంటలదాకా ఆకాశంలో కనబడే తిథికీ, వాళ్ళ పంచాంగాల్లో తిథికీ పొంతన తప్పిపోతోంది.
అన్నింటి కంటే పెద్ద చిక్కు వచ్చేది గ్రహణాల విషయంలో. పాత పంచాగం పథ్థతిలో గ్రహణాలు బొత్తిగా ఆకాశస్థితులతో పోలటం లేదు. అందు చేత అనేక మంది పాతపథ్థతి పంచాగ కర్తలు కూడా గ్రహణాలు మాత్రం ఆధునిక ఖగోళగణితం ఆధారంగానే లెక్కవేస్తున్నారు.
ఆధునిక ఖగోఖశాస్త్రం ఆధారంగా చేసిన పంచాగాలకీ, పాతపధ్దతి వాళ్ళ పంచాంగాలకీ తిథులలో చాలా వ్యత్యాసం రావటమే కాదు. మరొక ముఖ్య విషయం ఉంది. అనేక కరణ గ్రంథాలు ఉన్నాయి పంచాంగగణనం కోసం. వాటిని వాడుతూ పంచాంగం చేసేవాళ్ళు బీజసంస్కారాలు చేయకపోవటం వలన, అవన్నీ ఒకదానితో మరొకటి పొంతన లేని విధంగా పంచాగాలని ఇస్తున్నాయి. ఇన్ని రకాల పంచాంగాలు మార్కెట్లో కనబడే సరికి సామాన్యులకు ఏది సరైన పంచాంగం అన్న సంగతి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
మన పండుగలని నిర్ణయించటంలో తిథుల , నక్షత్రాల పాత్ర కీలకం. అవి తప్పుగా ఇస్తే, పండుగలూ చాలాసార్లు పంచాంగానికీ పంచాంగానికీ తేడాగా వస్తాయి. అందుకే ఒకే పండుగకి ఒక్కొక్క పంచాంగం ఒక్కక్క విధంగా తారీఖుని ఇవ్వటం కనబడుతోంది.
పండుగల నిర్ణయంలో భిన్న సంప్రదాయాలు
పండుగలను నిర్ణయించటంలో మరొక ముఖ్య పాత్ర మతసాంప్రదాయాలది. హిందూ మతం అంటూ నిజానికి ఏమీలేదు. మనది ఆర్షజీవనవిధానం. అంటే ఋషులు చెప్పిన మంచి దారుల్లో నడవటమే మన విధానం అన్న మాట. మన సంప్రదాయంలో నేడు ముఖ్యంగా మూడు భిన్న మైన శాఖలు ఉన్నాయి. అవి స్మార్తం, వైష్ణవం, శైవం అనేవి. కొన్ని కొన్ని పండగలను విభిన్న మతశాఖలు విభిన్నమైన విధంగా నిర్ణయిస్తాయి. ఉదాహరణకు చైత్రశుధ్ధనవమీ తిథినాడు శ్రీరామనవమి. స్మార్తసంప్రదాయంలో నవమి తిథి ముఖ్యం. శ్రీవైష్ణవ సంప్రదాయంలో వారికి పునర్వసు నక్షత్రం ముఖ్యం. ఈ చిన్న తేడా వలన ఒక్కొక్కసారి స్మార్తులకూ వైష్ణవులకూ పండుగ ఒక రోజు తేడా వస్తుంది. అంతే కాదు, పండుగల నిర్ణయం గురించి ధర్మశాస్త్రగ్రంథాల్లో నియమాలు చెప్పబడి ఉంటాయి. ఒక్కో పండుగకూ దానికి సంబంధించిన ప్రత్యేక నియమాలు ఉంటాయి తరచుగా. వాటిని పంచాంగానికి సరిగా అన్వయించటంలో, పంచాంగకర్తల మధ్యన అప్పుడప్పుడూ అభిప్రాయ బేధాలు వస్తూ ఉంటాయి. ఇవి కూడా గందరగోళం సృష్టిస్తూ ఉంటాయి.
పంచాంగాన్ని గ్రహించటంలో పొరపాట్లు
అనేక మంది పంచాంగకర్తలు పంచాంగాలు ప్రకటిస్తున్నారు. రాజమండ్రి, విజయనగరం, కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాదు వగైరా అనేక నగరాలనుండి పంచాగాలు వెలువడుతున్నాయి. బజారులో లభించే పంచాంగం ఏదో ఒకటి కొనుక్కునే వారు, ఫలానివారి పంచాంగం అంటూ అడిగి తీసుకునే వారుగా మనవాళ్ళు పంచాగాలు కొని వాడుకచేస్తూ ఉంటారు. జాగ్రత్రగా గమనించండి, ప్రతి పంచాంగంలోనూ అది ఏ ప్రాంతానికి గణితం చేయబడిందో స్పష్టంగా చెబుతారు. అంతే కాదు ఏదైనా ఇతరప్రాంతం వాళ్ళు ఆ పంచాంగాన్ని వాడుక చేయాలంటే పంచాంగంలో ఇచ్చిన విలువలను ఎలా సరిచేసుకుని గ్రహించాలో కూడా ఒక పట్టిక ఉంటుంది. విచారించ వలసిన విషయం ఏమిటంటే, చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళకూ ఈ విషయం మీద అవగాహన లేదు. పంచాంగంలో ఉన్న వివరాలు ఎలా ఉన్నవి అలా వాడేస్తారు. కాకినాడకో విజయనగరానికో గణితం చేసిన పంచాగాన్ని ఉన్నదున్నట్లుగా హైదరాబాదులో వాడుతున్నవాళ్ళు బోలెడు మంది.
లగ్నాలూ సూర్యోదయ చంద్రోదయాదులూ ప్రదేశాన్ని బట్టి మారతాయి. అందుకే పంచాంగ విలువలని సరిగా మార్పు చేసుకుని వాడాలి.
పండగల విషయంలో ఈ మార్పులు ప్రభావం చూపిస్తాయి. ఐతే పండగలు సార్వజనీనంగా జరుపుకోవటం ఆచారం. ఊరికో రోజున చేయటం సంప్రదాయం కాదు. అందు కని పండుగలని మాత్రం మరింత జాగ్రత్తగా నిర్ణయించాలి. ఉగాది తెలుగువా రందరి ఉమ్మడి పండుగ కాబట్టి దానిని రాజధాని నగరానికి వర్తించే నాడే అందరూ చేసుకోవటం ఉత్తమం.
ఇలాంటి ముఖ్యవిషయాలలో పంచాగకర్తలకు అవగాహనా, వాళ్ళ మధ్య సమన్వయం ముఖ్యం. దురదృష్టవశాత్తు అవి లోపించి చాలా గొడవలు.
లగ్నాలూ సూర్యోదయ చంద్రోదయాదులూ ప్రదేశాన్ని బట్టి మారతాయి. అందుకే పంచాంగ విలువలని సరిగా మార్పు చేసుకుని వాడాలి.
పండగల విషయంలో ఈ మార్పులు ప్రభావం చూపిస్తాయి. ఐతే పండగలు సార్వజనీనంగా జరుపుకోవటం ఆచారం. ఊరికో రోజున చేయటం సంప్రదాయం కాదు. అందు కని పండుగలని మాత్రం మరింత జాగ్రత్తగా నిర్ణయించాలి. ఉగాది తెలుగువా రందరి ఉమ్మడి పండుగ కాబట్టి దానిని రాజధాని నగరానికి వర్తించే నాడే అందరూ చేసుకోవటం ఉత్తమం.
ఇలాంటి ముఖ్యవిషయాలలో పంచాగకర్తలకు అవగాహనా, వాళ్ళ మధ్య సమన్వయం ముఖ్యం. దురదృష్టవశాత్తు అవి లోపించి చాలా గొడవలు.
సంప్రదాయం సరిగా తెలియని కొందరు పంచాంగకర్తలు
సంప్రదాయం సరిగా తెలియకపోవటం. ముఖ్యంగా పర్వదినాల నిర్ణయంలో ధర్మశాస్త్ర గ్రంథాల మీద మంచి పట్టు ఉండటం పంచాంగ కర్తకు చాలా అవసరం. ఈ రోజున పంచాంగ చేసే వాళ్ళలో చాలా మంది కుటుంబాచారాలుగా వస్తున్న సులభ సూత్రాల ఆధారంగా నిర్ణయాలు చేస్తున్నారు.
యువతరం పంచాంగకర్తలూ, కొందరు పెద్దలూ కూడా సంవత్సరం పొడవునా దినవారీ గ్రహస్థితుల్ని ఖగోళశాస్త్ర పరిశోధనాశాలలనుండి గ్రహించి హాయిగా పంచాంగం చేస్తున్నారు. ఇది మంచిదే. వాళ్ళు ఇష్టపడో, సులభమనో ఈదారికి వచ్చి ఆధునిక గణితం ద్వారా మంచి పంచాగాలు చేస్తున్నారు. కానీ, ఒక తిరకాసు ఉంది. ప్రతిరోజూ ఉ॥5-30ని॥కు అన్ని గ్రహాల స్థితులూ తీసుకుని, తిధి ప్రవేశాన్ని గణితం చేయటానికి అనేకులు తిన్నగా స్కూలు పిల్లల్లా త్రైరాశికం చేస్తున్నారు. ఇది సరికాదు. చెప్పుకోదగ్గ తప్పు ఉంటుంది అసలు విలువకూ ఇలా చెస్తే వచ్చే విలువకూ. కొందరు మాత్రం కంప్యూటరు పరిజ్ఞానం ఉన్నవారు మంచి సాఫ్ట్‌వేర్ ఆధారంతో గణితం చేయించుకుంటూ ఖచ్చితమైన విలువలు ఇస్తూ ఉండవచ్చును. ఈ రెండు రకాల ఆధునిక పంచాగాలూ ఇచ్చే విలువల్లో కొంచెం తేడాలు ఉంటాయి. పండుగల నిర్ణయాలూ ప్రభావితం కావచ్చును.
యువతరం పంచాంగకర్తలూ, కొందరు పెద్దలూ కూడా సంవత్సరం పొడవునా దినవారీ గ్రహస్థితుల్ని ఖగోళశాస్త్ర పరిశోధనాశాలలనుండి గ్రహించి హాయిగా పంచాంగం చేస్తున్నారు. ఇది మంచిదే. వాళ్ళు ఇష్టపడో, సులభమనో ఈదారికి వచ్చి ఆధునిక గణితం ద్వారా మంచి పంచాగాలు చేస్తున్నారు. కానీ, ఒక తిరకాసు ఉంది. ప్రతిరోజూ ఉ॥5-30ని॥కు అన్ని గ్రహాల స్థితులూ తీసుకుని, తిధి ప్రవేశాన్ని గణితం చేయటానికి అనేకులు తిన్నగా స్కూలు పిల్లల్లా త్రైరాశికం చేస్తున్నారు. ఇది సరికాదు. చెప్పుకోదగ్గ తప్పు ఉంటుంది అసలు విలువకూ ఇలా చెస్తే వచ్చే విలువకూ. కొందరు మాత్రం కంప్యూటరు పరిజ్ఞానం ఉన్నవారు మంచి సాఫ్ట్‌వేర్ ఆధారంతో గణితం చేయించుకుంటూ ఖచ్చితమైన విలువలు ఇస్తూ ఉండవచ్చును. ఈ రెండు రకాల ఆధునిక పంచాగాలూ ఇచ్చే విలువల్లో కొంచెం తేడాలు ఉంటాయి. పండుగల నిర్ణయాలూ ప్రభావితం కావచ్చును.
ఆయనాంశా గణనంలోతేడాలు
ఈ విషయంలో చాలా మంది చదువరులకు అవగాహన ఉండక పోవచ్చును. ఆధునికమైన ఖగోళ శాస్త్రం ప్రకారం వచ్చే గ్రహస్థితులు అన్నీ పంచాంగకర్తలకు, జాతక చక్రాలు వేయటానికీ మనకు యథాతథంగా పనికి రావు. అవన్నీ సాయన విలువలు అంటారు. మనదేశంలో నిరాయన గ్రహస్థితులు వాడుతాము. ఇది కొంచెం సాంకేతికమైన విషయం. ఆట్టే వివరాలు ఇక్కడ చెప్పటం కుదరరు. మన గణితం రాశిచక్రం స్థిరంగా ఉన్నట్లుగా భావించి చేసేది. నిజానికి రాశిచక్రం భూమి నుండి చూస్తే చాలా మెల్లగా కదలుతూ ఉంటుంది. శాస్త్రీయ గణితం ఇచ్చే విలువలు ప్రస్తుత రాశిచక్రస్థితికి వర్తిస్తాయి. మన స్థిరరాశిచక్రం నుండి ప్రస్తుతం కనిపించే రాశిచక్రం కదిలి పోయిన దూరం (డిగ్రీల్లో)కొలిచి దాన్ని ఆయనాంశ అంటారు. ఈ ఆయనాంశను గణించటంలోనే అనేక అభిప్రాయ భేదాలున్నాయి. ఎక్కువ మంది లాహిరీ ఆయనాంశను వాడుక చేస్తున్నా, కొంతమంది రామన్ ఆయనాంశ వాడేవాళ్ళున్నారు. సంప్రదాయిక పంచాంగ కర్తలు వారి వారి పథ్థతుల్లో ఆయనాంశాసంస్కారం చేస్తారు. వీళ్ళ ఆయనాంశ గణితాలు అన్నీ ఆధునిక విలువలతో సరిపోలక పోయే అవకాశాలే హెచ్చు.
తిథి గణితంలో ఆయనాంశ ప్రభావం ఉండదు. కాని నక్షత్రం నిర్ణయించటంలో చంద్రుడికి సరిగా ఆయనాంశ సంస్కారం చేయటం జరిగిందా అన్నదీ ముఖ్యమే. పంచాంగకర్తలు ఆయనాంశలు రకరకాలుగా లెక్కిస్తే పర్వదినాలు, ముఖ్యంగా వైష్ణవ పర్వదినాలు తప్పిపోయే అవకాశం మెండు.
తిథి గణితంలో ఆయనాంశ ప్రభావం ఉండదు. కాని నక్షత్రం నిర్ణయించటంలో చంద్రుడికి సరిగా ఆయనాంశ సంస్కారం చేయటం జరిగిందా అన్నదీ ముఖ్యమే. పంచాంగకర్తలు ఆయనాంశలు రకరకాలుగా లెక్కిస్తే పర్వదినాలు, ముఖ్యంగా వైష్ణవ పర్వదినాలు తప్పిపోయే అవకాశం మెండు.
అమాయక పురోహితవర్గం పాత్ర
అనేక మంది పండుగల విషయంలోనూ పితృతిథుల విషయంలోనూ పురోహితుల నిర్ణయం తీసుకుంటారు. శుభ ముహుర్తాల విషయంలో ఐతే పురోహితుల్ని సంప్రదించటం అత్యంత ఆవశ్యకం కూడా. తప్పు లేదు.
కాని అటువంటి పురోహితుల్లో ఎంతమందికి పంచాగం గురించి సరైన అవగాహన ఉన్నదీ అన్నది మనకు తరచు తెలియదు. పట్టించుకోము కూడా. రాజమండ్రీ పంచాంగం ప్రకారం హైదరాబాదులో యథాతధంగా ముహూర్తాలు నిర్ణయిస్తున్న పురోహితుణ్ణి చూసాను. ఆయనకు ఎవరి దగ్గరో పంచదశకర్మలు చేయించటంలో శిష్యరికం చేసి తెలుసుకున్న పరిజ్ఞానమే కాని స్వయంగా పధ్ధతిగా అభ్యసించిన జ్యోతిషసంబంధమైన పరిజ్ఞానం శూన్యం. అసలు దృక్సిధ్ధాంతం అనే పేరే వినని పురోహితులూ చాలా మంది. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను పితృతిథినిర్ణయం ఎలా చేయాలో దాదాపు పురోహితవర్గంలో తొంభైశాతం మందికి నేడు తెలియదంటే అసత్యం లేదు. ఈ విషయంలో చాలా ఫార్సులు ఉన్నాయి కాని వాటి గురించి తరువాత ఎప్పుడైనా వ్రాస్తాను.
అనేక మందికి సహజంగా పంచాగాల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయీ అన్న విషయం మీద ఏమీ తెలియటం లేదు. చాలా మంది చెప్పే సమాధానం తమ గురువు గారు వాడుతున్న ఫలాని పంచాంగ సరైనదే కావాలి కాబట్టి దాని ప్రకారం చేయటమే సరైన విధానం అని. ఇది అస్పష్టమైన సమాధానం కావటం వలన అనేకులకు అసంతృప్తి కలుగుతోంది.
ముగింపు
భారతప్రభుత్వ సమ్మతమైన పంచాంగ విధానం దృక్సిధ్ధాంతమే. అంటే ఖగోళంలో
కనిపించే గ్రహస్థితులను ఆధునిక గణితం ద్వారా లెక్కించటమే సమ్మతం. అనేక
మంది ఈ విషయంలో పాతపధ్ధతులనీ, తప్పుడు గణితాలనీ అశ్రయించటం వంటి విధానంతో
జనబాహుళ్యానికి అసౌకర్యం కలిగిస్తున్నారు అది కాక మరొకొన్ని గందరగోళాలకి దారితోసే పరిస్థితులనీ పైన విశ్లేషించాను.
ఇంకా మరొకొన్ని ఇక్కడ ప్రస్తావించని ఇతర కారణాలు కూడా తరచు గందరగోళానికి కారణం అవుతున్నాయి. ఇలాంటి గందరగోళాల వలన ప్రజల్లో పంచాంగం పట్ల చులకన అభిప్రాయం కలిగే అవకాశాలు పెరుగుతున్నాయి.
కాని ప్రస్తుతానికి ఈవివరణతో చదువరులకు తగినంత అవగాహన ఏర్పడి ఉంటుందని భావించి ఈ వ్యాసం ముగిస్తున్నాను.
మీ మీఅభిప్రాయాలు తప్పక తెలియ జేయండి.
మీ మీఅభిప్రాయాలు తప్పక తెలియ జేయండి.
Etuvanti ahankaara vikaaraalaki lo u kaakundaa panchaanga karthalanthaa druksidhaantaanni paatisthe ilaati chikkulu raavu.
రిప్లయితొలగించండిbijumalla vaaruu , srinivasa gargeya gaaruu chaalaa krushi chesi vimarsalaki lonu ayyaru.monna oka channel lo dasara meda charcha chuusi veella pandithulu anipinchindi. Rama krishna sarma garu nijanga saastreeyanga grahagamanaalu thelusukuni panchangan thayaaru chesthharu.aayana oka nadiche observatory( nijangaane aayana daggara telescope undi)
Veellantha kalisi emaina cheyyaali
పై వ్యాఖ్య తెలుగులో:
తొలగించండిఎటువంటి అహంకార వికారాలకీ లోను కాకుండా పంచాంగకర్తలంతా దృక్సిధ్ధాంతాన్ని పాటిస్తే ఇలాటి చిక్కులు రావు.
బిజుమళ్ళవారు, శ్రీనివాసగార్గేయగారు చాలా కృషి చేసి విమర్శలకి లోనయ్యారు. మొన్న ఒక ఛానెల్లో దసరా మీద చర్చచూసి వీళ్ళా పండితులు అనిపించింది. రామకృష్ణశర్మగారు నిజంగా గ్రహగమనాలు తీసుకుని పంచాంగం తయారు చేస్తారు. ఆయన ఒక నడిచే అబ్జర్వేటరీ (నిజంగానే ఆయన దగ్గర టెలిస్కోపు ఉంది).
వీళ్ళంతా కలిసి ఏమైనా చేయాలి.
చాలా మంచి సంగతులు చెప్పేరు, తప్పులెన్నేవారే కాని తప్పులు దిద్దుకునేవారు కనపడటం లేదు. తెలిసి తెలియనివారు ఎక్కువ మాటాడేస్తున్నారు. ఇక ముహూర్త నిర్ణయం చేయవలసినవారు వేరు, అమలు చేసేవారు వేరుగా ఉండకపోడం కొంత గందరగోళానికి దారి తీస్తోంది.
రిప్లయితొలగించండిచాలా చక్కగా చెప్పారు! సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆతిథితో ఆరోజు కార్యక్రమాలలో ఆ తిథిగా లెక్కించినా నైమిత్తిక తిథులకు సంబంధించి ఒక్కోదానికి తత్సంబంధ నిర్ధారణ విషయాలు వేర్వేరుగా ఉంటాయి అన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. పూర్వం ఒక శాస్త్రంలో ప్రావీణ్యమున్నా ఇతర శాస్త్రాలతో పరిచయం ఉండేది కాబట్టి ifs, buts, and exceptions, eleminations తెలిసేవి. ఇప్పుడలాకాదుగా, ఎవరేది పట్టుకుంటే అదే ఒప్పనీ పక్క శాస్త్రంతో పనిలేదనీలా తయారవుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ధర్మ ప్రచార పరిషత్ వారు సాంగోపాంగ అధ్యనం చేసి 14 ధర్మస్థానాలు తెలిసిన పండితులను ఆశ్రయించి ఇటువంటి విషయాల మీద చర్చ చేసి శాస్త్రీయంగా ఇది ఈ నైమిత్తిక తిథి నిర్ణయం అని ప్రతి పండుగకీ, నైమిత్తిక తిథికీ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పంచాంగం ప్రకటించే ఏర్పాటు చేయగలగాలి. వీలైతే ధర్మ ప్రచార పరిషత్ వారికి వ్రాద్దాం, వారి చిరునామా, సభ్యుల వివరాలు సంపాదించి నెట్లో ఉంచే ఏర్పాటు చేస్తాను.
రిప్లయితొలగించండినా ప్రశ్నకు టపా విషయానికి సంబంధం ఉందొ లేదో తెలీదు అయినా అడుగుతాను.
రిప్లయితొలగించండిమనవైపు (Hyderabad) "కృష్ణా గోదావరీ మద్య క్షేత్రే" అంటూ చెబుతారు. గోదావరి నదికి ఉత్తరాన & కృష్ణా నదికి దక్షిణాన కాలం మారిపోతుందని దీని అర్ధమా?
నాకు తెలిసి కాలం నిర్ణయించడానికి లాటిట్యూడ్ ముఖ్యం కాదు. లాంగిట్యూడ్ వల్లే సమయం నిర్ధారణ అవుతుంది. మరి పంచాగాలు కూడా లాంగిట్యూడ్ బట్టి మారాలి కదా?
This is not my subject so please excuse the sloppiness of the comment.
పూజాదికాల్లో సంకల్పం చెప్పటం జరుగుతుంది. ఆ సందర్భంగా దేశకాలాలను ఉటంకించటమూ చేస్తాము. గురుడు ఏడాదికి ఒక రాశి మారతాడు రాశిచక్రంలో. గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరపుణ్యకాలం వస్తుంది. అలా మొత్తం పన్నెండు పుష్కరనదులు ఉన్నాయి మనదేశంలో. మనం సంకల్పం చెప్పే సమయానికి ఏ స్థలంలో ఉన్నామో అది ఏఏ పుష్కరనదుల మధ్య ఉన్నదో లేక ఏ పుష్కరనదీ తీరమో ఆ వివరం స్థల నిర్దేశానికిగాను చెప్పటం ఆచారం.
రిప్లయితొలగించండికాలనిర్ణయానికి రేఖాంశం(longitude) ఆధారం అన్నది నిజమే. కాని పంచాంగ గణితానికి అక్షాంశం(latitude) కూడా అత్యంతావశ్యకం. ఉదాహరణకు సూర్యచంద్రుల ఉదయాస్తమయాదులు తెలియాలంటే ఈ అక్షాంశ రేఖాంశాలు రెండూ గణితంలో వాడవలసి వస్తుంది.
పంచాంగాలు రేఖాంశం(longitude) ఆధారంగా తప్పక మారతాయి. ఈ విషయం నా వ్యాసంలో ప్రముఖంగా నే ప్రస్తావించాను. పంచాంగాన్ని గ్రహించటంలో పొరపాట్లు అన్న విభాగం ఇది ప్రస్తావించాను. ఐతే అక్షాంశరేఖాంశాలు అని సాంకేతిక విషయాలు కావాలనే ప్రస్తావించలేదు. పంచాంగం ఏ ప్రాంతం అక్షాంశరేఖాంశాలు ఆధారంగా గణితం చేసారో దానికి దగ్గర ప్రాంతాల్లో యథాతధంగా వాడవచ్చును. కాని దూరంగా ఉన్న ఇతర ప్రాంతాల వాళ్ళు పంచాంగంలో ఇచ్చిన సమయాల్ని సరిచేసుకుని వాడాలి. దీనికి సంబంధించిన వివరాలు ప్రతి పంచాంగమూ ఒక పట్టికలాగా ఇస్తుంది గమనించమని వ్రాసాను కూడా.
Thank you sir
తొలగించండిchaala manchi vishayaalu theliyajesaaru dhanyavaadamulu
రిప్లయితొలగించండిచాలా చక్కనివివరణ ,ఇప్పుడు అవసరమైన విషయం .ధన్యవాదములు
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీరు పర్ల్ లో రాసిన పంచాంగం ప్రోగ్రాం నాకు ఇంకా గుర్తుంది. దానికి కొద్దిగా మెరుగులు దిద్ది మీరే ఒక పంచాంగం ప్రచురిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దానికి తోడు ముఖ్యమైన నగరాలను (ఐచ్చిక అక్షాంశ, రేఖాంశాలను ఇవ్వగలిగితే మరీ మంచిది) బట్టి దేశీయ పంచాంగం వచ్చే విధంగా తయారు చేస్తే మరింత బాగుంటుంది.
రిప్లయితొలగించండి