9, అక్టోబర్ 2013, బుధవారం

శ్రీలలితాసహస్రనామస్తోత్రంలో జ్ఞాన ప్రస్తావన కల నామాలు

శ్రీలలితాసహస్రనామస్తోత్రంలోని నేరుగా జ్ఞాన మనే శబ్దాన్ని ప్రస్తావించిన నామాలు కొన్ని ఉన్నాయి.  వీటిని పరిశీలిద్దాం ఈ‌టపాలో

253. విజ్ఞానఘనరూపిణీ
ఇక్కడ ఘన మనగా  దట్టమైనది అని ఒక అర్థం. గొప్పది అని మరొక అర్థం. ఈ అర్థఛ్ఛాయల వలన  ఈ నామానికి  పెద్దగా అర్థభేదం కాదు. సంపూర్ణత్వం కారణంగానే ఈ నామంలో చెప్పబడిన విజ్ఞానానికి గొప్పదనమూ, చిక్కదనమూ అనుకోవచ్చును. విజ్ఞానఘన పదం చిదేకరసమని శ్రుతి. కాబట్టి ఈ‌ నామానికి  అమ్మ  చైతన్యరసస్వరూపిణి అని అర్థం.

574. ప్రజ్ఞానఘనరూపిణీ
నిత్యజ్ఞానం చేత నిరంతరం ఘనమై అవిద్య లేశమాత్రం కూడా లేనిది అమ్మ అని భావం. ఆత్మస్వరూపజ్ఞానం కన్నా మరేవిధమైన వృత్తీ లేని బుధ్ధికి ప్రజ్ఞానఘనం అని పేరు. దానికే తురీయావస్థ అనీ పేరు.  "స యధా సైంధవఘనోఽన్తరోఽబాహ్యః రసఘన ఏవైవం వాఅరేఽయ మాత్మాఽనన్తరోఽబాహ్యః కృత్స్నో ప్రజ్ఞానఘన" అని శ్రుతి.  అంటే  ఉప్పుస్ఫటికం లోపల బయట కూడా ఏ విధమైన రుచి భేదం లేకుండా ఒక్క లాగే ఉంటుందో అలా ఆత్మకు లోపల వెలుపల అన్న భేదం లేకుండా అంతటా ఒక్కలాగే ఉంటుంది. కాబట్టి ఈ నామం అర్థం అమ్మ దేశకాలాలకు అతీతంగా నిత్యమైన జ్ఞానస్వరూపం కలది అని అర్థం.

643. జ్ఞానదా
అమ్మ తన భక్తులకు బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తుందని అర్థం.  జ్ఞానం అనగా స్వస్వరూపజ్ఞానం. అంటే  తాను బ్రహ్మము కన్న వేరుకాదు, దాని యొక్క స్వరూపాన్నే అన్న గ్రహింపు అన్నమాట. ఉపాధిసహజమైన ఇంద్రియ జ్ఞానములూ, నేర్చిన విద్యల వలన వచ్చే జ్ఞానములూ అన్నీ బంధములే.  స్వస్వరూపావబోధ పొందటమే అసలైన జ్ఞానం. అది అమ్మ అనుగ్రహం వలనలే సాధ్యం అని ఈ నామం యొక్క అర్థం.  ఈ  జ్ఞానం పొందటం వలన కలిగే ప్రయోజనం కైవల్యమే.

644. జ్ఞానవిగ్రహా
అమ్మ జ్ఞానమే  ఆకారంగా (శరీరంగా) కలది అని అర్థం. సకలజ్ఞానానికి నిధి ఐన వేదమే అమ్మ యొక్క స్వరూపం అని అర్థం.  సకలజగత్తుకూ అమ్మయే మూలం. అలాగే సకలజగత్తుకూ జ్ఞానమే మూలం అని కూడా చెప్పటం  ఉన్నది.  కాబట్టి అమ్మయే జ్ఞానము అని తెలుసుకోవాలి.  అమ్మను జ్ఞానం యొక్క స్వరూపం అని చెప్పటంలో భావం అమ్మను భజించే వారికి తల్లి అనుగ్రహం చేత జ్ఞానం లభిస్తున్నదని చెప్పటం.

727. శివజ్ఞానప్రదాయినీ
శివ మనగా బ్రహ్మమే. శివజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమే.  అదే స్వస్వరూపజ్ఞానం - తానే బ్రహ్మ మనే తెలివిడి. అమ్మ అటువంటి పరమమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నదని అర్థం. ఉమా హైమవతీ బహుశోభమానా ఐన దేవి ఇంద్రుడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినట్లుగా కేనోపనిషత్తు. లేదా శాంతుడు, అమలుడు చిన్మాత్రుడు ఐన శివుని గురించిన జ్ఞానం అమ్మ అనుగ్రహం వలన మాత్రమే కలుగుతున్నది అని అర్థం.

791. సత్యజ్ఞానానందరూపా
సత్యజ్ఞానానందములు అమ్మ యొక్క స్వరూపమే అని అర్థం. సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ అనీ విజ్ఞాన మానందం‌బ్రహ్మ అనీ శ్రుతి. సతీ+ఆజ్ఞ+అనానంద+రూప అని విభజన చెప్పినపుడు సద్విద్యా (సతీ), అనభిజ్ఞులు(ఆజ్ఞ లేని వారు), అనానంద(దుఃఖ) శబ్దముల చేత జ్ఞానశూన్యులకి దుఃఖాన్ని ఇచ్చేది అని అర్థం వస్తున్నది. "అంధతమసః ప్రవిశంతి యే అవిద్యా ముపాసతే" అని బృహదారణ్యక, ఈశావాస్య ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాబట్టి దేవిని గూర్చి జ్ఞానం లేనివారికి అమె దయ అలభ్యంగా ఉండిపోవటం వలన దుఃఖం కలుగుతున్నది అని అర్థం చేసుకోవాలి.

902. విజ్ఞానకలనా
విజ్ఞానం అంటే బ్రహ్మసాక్షాత్కారం. అందుచేత విజ్ఞానం యొక్క కలనా అంటే స్వాత్మసాక్షాత్కారం (స్వస్వరూపజ్ఞానం). అమ్మ స్వస్వరూపజ్ఞానకళా స్వరూపం అని అర్థం.

979. జ్ఞానముద్రా
తర్జని (చూపుడు వేలు)యొక్క కొనను అంగుష్ఠం (బొటన వేలు) యొక్క కొనతో కలిపి కుడి అరచేతిని ప్రదర్శించటం అనే ముద్రకే జ్ఞానముద్ర అని పేరు. ఈ రెండూ జీవ బ్రహ్మలకు సంకేతాలు. వీటి కలయికను ప్రదర్శించటం ద్వారా జీవుడూ బ్రహ్మమూ ఒక్కటే అనే సందేశం చూపటమే ఈ ముద్ర ప్రయోజనం. ఈ ముద్ర అమ్మయొక్క స్వరూపమే అని అర్థం. అమ్మ జ్ఞానం చేత సంతోషం‌ కలిగించేది అనీ అమ్మ చిదానంద స్వరూపిణీ అనీ అర్థాలు కూడా ఈ నామం ద్వారా చెప్పబడుతున్నవి. ఏకమేవాఽద్వితీయం బ్రహ్మా, తత్త్వమసి మొదలైన శ్రుతి వాక్యాలు చిన్ముద్రను సూచిస్తున్నాయి. ఈ ముద్రద్వారా జీవుడు ఏ బ్రహ్మముతో ఏకము అని చెప్పబడుతున్నదో ఆ బ్రహ్మము అమ్మయే అని ఈ‌ నామం చెబుతున్నది.

980. జ్ఞానగమ్యా
అమ్మ సాన్నిధ్యాన్ని కేవలం జ్ఞానం చేతనే పొందవచ్చును అని అర్థం. స్కాందపురాణంలో అమ్మ జ్ఞానదృష్టి కలవారు మాత్రమే నా సాన్నిద్యం పొందగలరు అని చెప్పినట్లు ఉన్నది.

981. జ్ఞానజ్ఞేయస్వరూపిణీ
 జ్ఞేయం అంటే తెలుసుకో దగినది అని అర్థం. జ్ఞానజ్ఞేయం అంటే జ్ఞానం చేత మాత్రమే తెలుసుకో వలసింది అని అర్థం. కాబట్టి అమ్మ స్వరూపం జ్ఞానజ్ఞేయం అంటే అమ్మను గురించి కేవలం జ్ఞానం చేతనే తెలుసుకో వచ్చును అని అర్థం. ఈ జ్ఞానమూ జ్ఞేయమూ‌రెండూ మాయా కల్పితాలే. స్వస్వరూపావబోధ కలిగిన తరువాత తెలుసుకో వలసినదీ లేదు, తెలుసుకోవటం అనే‌ క్రియా లేదు. ఎంతకాలం అట్టి బోధ లేదో అంతకాలమే  జ్ఞేయమైనది ఒకటి ఉంటుంది. దానిని తెలుసుకోవటమే జ్ఞానం. అమ్మయే జ్ఞేయమూ దాని వలన లభించే జ్ఞానమూ కూడా. అమ్మకు అన్యమైనది సృష్టిలో లేదు కదా.  అందుచేత తెలుసుకోవటం అనే వ్యాపారం అమ్మయే.  అలా తెలుసుకోబడుతున్న తత్త్వమూ‌ అమ్మయే అని అర్థం.

993. అజ్ఞానధ్వాంతదీపికా
అమ్మయే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపం అని అర్థం.

2 కామెంట్‌లు:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.