8, అక్టోబర్ 2013, మంగళవారం

శ్రీలలితాసహస్రనామస్తోత్రంలో భక్తి సంబంధ నామాలు


శ్రీలలితాసహస్రనామస్తోత్రంలో పది నామాలలో భక్తి లేదా భక్త అనే శబ్దాల ప్రయోగం కనబడుతున్నది.  వేయింటిలో ఇది స్వల్పసంఖ్యయే ఐనా, ఈ‌ నామాలను కొంచెం వివరంగా తెలుసుకోవటం వలన శ్రీదేవి భక్తులకు ఉపయోగంగా ఉంటుందని భావించి విడిగా వీటిని చర్చిస్తున్నాను.

టెంబేస్వామిగా ప్రసిధ్ధులైన శ్రీవాసుదేవానందసరస్వతీస్వామివారు ఒకానొక సందర్భంలో సుందరశాస్త్రి అనే పండితుడిని, "నీకు శాస్త్రంపైన అభిమానం ఉంది.  కాని   భగవంతునిపైన భక్తి కుదరలేదు.  భక్తి లేనిదే దేవుడి దయరాదు.  ముక్తి దొరకదు" అని హెచ్చరించినట్లు తెలుస్తున్నది.  కాబట్టి భగవద్భక్తి అనేది అత్యంత ముఖ్యమైన విషయం అని గ్రహించాలి మనం.

117 భక్తసౌభాగ్యదాయినీ
అమ్మ భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం.  భగ శబ్దానికి శ్రీ, కామం, మాహాత్మ్యం, వీర్యం, ప్రయత్నం, సూర్యుడు, కీర్తీనే  అర్థాలున్నాయని ఆగ్నిపురాణం చెబుతున్నది. అలాగే ఐశ్వర్యం, కీర్తి, బలం, సంపద, జ్ఞానం,  వైరాగ్యం అనే ఆరింటీకీ భగమనే వ్యవహారం కూడా ఉంది. వీటిలో ఏదైనా కాని కొన్ని కాని కలిగి ఉండటమే భాగ్యం. ఇవన్నీ‌ కలిగినది తల్లి శ్రీదేవి. అందు చేత సుభగా అని శ్రీదేవి చెప్పబడుతుంది. ఆ తల్లి అనుగ్రహమే సౌభాగ్యం అన్నమాట. శ్రీగౌడపాదాచార్యులవారు శ్రీఆదిశంకరులకు గురుదేవులు. వారు సుభగోదయం అని తల్లిని గురించి ఒక స్తోత్రం చేసారు. దానిలో మరింత విశేషంగా తెలుస్తుంది.  సుభగ ఐన తల్లి  లోకమందలి దుఃఖముల వలన ఆర్తులు, తల్లి  మహిమను తెలుసుకోవాలనునే జిజ్ఞాసువులు, కోరికలతో పూజించేవారు, కేవలం జ్ఞానులు  అనే నాలుగు రకాల భక్తులకూ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నది.  జ్ఞానులైన భక్తులకు లభిస్తున్నది సాయుజ్యముక్తి అని తాత్పర్యం.

118 భక్తప్రియా
అమ్మ భక్తుల పట్ల విశేషమైన ప్రేమ కలది అని అర్థం. ఈశ్వరుడి పట్ల అనురక్తికే భక్తి అని పేరు. ఇటువంటి అనురక్తి కలవారిని ముఖ్యభక్తులు అంటారు. భజ సేవాయాం అని గరుడపురాణం. అంటే భగవంతుడికి సేవ చేయటమే భక్తి.భక్తులు వివిధ విధాలుగా భగవంతుని పట్ల తమ సేవను, అనురక్తిని చాటుతారు. ప్రహ్లాదుడు చెప్పినట్లు  శ్రవణం కీర్తనం విష్ణోః  స్మరణం పాదసేవనం। అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్॥అని నవవిధాలు. ఇది గౌణ భక్తి. ఇలా భక్తి లక్షణం రెండు విధాలు.  అలా ఏ విధమైన ధోరణిలో ఉన్న భక్తుల పట్ల నైనా ప్రీతికలది అమ్మ అని అర్థం చేసుకోవాలి. భక్తి తత్త్వం గురించీ‌భక్తుల లక్షణాలను గురించీ ఆర్షసాహిత్యంలో పురాణేతిహాసాల్లోనూ, నారదభక్తిసూత్రాదుల్లోనూ విపులంగా చర్చను గమనించవచ్చును.

సామవేదం లోని మంత్రాలకు భక్తులని పేరు. అమ్మ సామగాన ప్రియ. అందుచేత అమ్మకు భక్తిప్రియా అని విశేషంగా అన్వయం.

119 భక్తిగమ్యా
అమ్మయే అంటే అమ్మ పాదాలే భక్తులకు గమ్యం అని అర్థం. అమ్మ భక్తి చేతనే ప్రత్యక్షం అయ్యేది.  అమ్మయే బ్రహ్మము - అవ్యక్తమైన బ్రహ్మము. బ్రహ్మ సూత్రాల్లో అపి సంరాధనే అనే సూత్రం చేత అవ్యక్తమైన బ్రహ్మం కేవలం భక్తిచేతనే ప్రత్యక్షం అవుతున్నదని చెప్పబడింది. భగవద్గీతల్లో శ్రీకృష్ణపరమాత్మ భక్త్యా త్వనన్యయా అని అనన్యమైన భక్తిచేత మాత్రమే నన్ను పొందవచ్చును కాని ఇతర విధాలుగా తనని పొందటం అసాధ్యం అని చెప్పారు.  దీనిని బట్టి భక్తిచేతనే బ్రహ్మైక్యం సాధ్యం అని తెలియ వస్తోంది. అందుచేత అమ్మ తనను నమ్ముకున్న భక్తులకు మోక్షం ప్రసాదిస్తున్నదని అర్థం చేసుకోవాలి.

120 భక్తివశ్యా
అమ్మ తన భక్తులకు మాత్రము స్వాధీనురాలు అని అర్థం.  భగవధ్బక్తి కారణంగా ఆత్మ-అనాత్మ అనే విషయాల మీద వివేకం లభిస్తుంది. అంతుచేత స్వస్వరూపజ్ఞానం కలుగుతుంది.  మహావాక్యం ఐన్ తత్త్వమసి అనేది చెబుతున్నట్లుగా తాను భగవంతుని కన్నా అభిన్నం అన్న స్పృహ కలుగుతుంది. అదే అద్వైత సిధ్ధి.  అంటే భక్తి వలన  అమ్మ అనుగ్రహమూ దాని కారణంగా అద్వైతసిధ్ది వశం అవుతున్నాయని ఈ‌ నామం‌యొక్క అర్థం.

353 భక్తిమత్కల్పలతికా
అమ్మ తన యందు భక్తి కలవారికి ఒక కల్పలత లాగా అన్ని కోరికలనూ ఇస్తుందని అర్థం.  స్వర్గంలో నందనం అనే ఉద్యానవనంలో కల్పవృక్షం అనేది ఉంది - అది కోరుకున్న దేనినైనా ప్రసాదించే మహిమకలది.  పురుషపరంగా వృక్షాన్నీ స్త్రీపరంగా లతనీ చెప్పటం సంప్రదాయం కాబట్టి కల్పవృక్షం బదులు  అమ్మవారి పరంగా ఇక్కడ కల్పవృక్షం బదులుగా కల్పలత అని చమత్కారంగా చెప్పబడింది. విషయబేధం లేదు.

మరొక పక్షంలో భక్తిమత్కల్పులు అంటే భక్తులవంటివారు - అనగా అంతగా పరిపూర్ణం కాని భక్తి కలవారు అని అర్థం చెప్పుకోవచ్చును. లతలు క్రమక్రమంగా ఎలా విస్తరిస్తాయో అదే విధంగా అటువంటి అర్థభక్తులకు తన అనుగ్రహాన్ని క్రమంగా విస్తరిస్తూ అమ్మ అందిస్తూ వారిని వారికి గమ్యం ఐన మోక్షం వైపు నడిపిస్తుంది అమ్మ అని అర్థం చెప్పుకోవచ్చును.

372 భక్తమానసహంసికా
పక్షులలో అత్యంత సుందరమూ శ్రేష్ఠమూ ఐనవి జాతి హంసజాతి పక్షులు.  అవి జలాశయాల్లోకెల్లా పావనమైన మానససరోవరంలో విహరిస్తూ ఉంటాయి.  అమ్మ భక్తుల మనస్సులనే మానససరోవరాల్లో విహరించే ఆడుహంస అని చమత్కరించటం ఈ‌ నామం యొక్క అర్థం. ఏ వ్యక్తులు తమ మనస్సులలో పరమేశ్వరి ఐన అమ్మను నిరంతర ధ్యానం చేత  నిలిపి ఉంచుకుంటారో వారు ధన్యులు.  అటువంటి వారి మనస్సులే‌ పరమ ప్రశాంతమైనవి.  పరమ పవిత్రమైనవి. అవి కేవలం మానససరోవరాల్లాగా అతి విశిష్టమైనవి.  వారి మనస్సులలో అమ్మ  సంతోషంగా మానససరోవరంలోని హంసలాగా విహరిస్తూ ఉంటుంది.  అంటే, వారికి అభ్యున్నతి కల్పిస్తుంది అమ్మ అని అర్థం.

404 భక్తహార్థతమోభేద భానుమద్భానుసంతతిః
అమ్మ భక్తుల హృదయాలకు సూర్యతేజస్సు వంటిది . భక్తుల హృదయాల్లో ఉండే  జీవసహజమైన అజ్ఞానపు చీకట్లను చెదరగొట్టే సూర్యకిరణాల పరంపర అమ్మ కటాక్షప్రసారం అని అర్థం.  స్వస్వరూపం విస్మృతికి గురికావటమే భ్రమ.  అదే అజ్ఞానం.  దాని కారణంగానే మనోమాలిన్యం.  దానినే చీకటి అంటున్నారు.  చీకటి యొక్క లక్షణం సత్యవస్తువులను దర్శించనీయక అడ్డుపడటమే కదా!  అమ్మ యందు భక్తి కుదరగానే ఆ తల్లికృపాకటాక్షవీక్షణాలు మధ్యాహ్నకాలం సూర్యకిరణాల సందడిలాగా దూసుకొని వచ్చి, అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి రక్షిస్తున్నది.  ఈ విధంగా అమ్మ రక్ష   లభించగానే, అజ్ఞానం తొలగి సత్యవస్తు దర్శనం అవుతున్నది.  ఆ సత్యమే స్వస్వరూపజ్ఞానం.  జీవుడనని అని అనుకొంటున్న తాను  భగవదంశనే అని గ్రహింపు కలగటానికే స్వస్వరూపజ్ఞానం అంటారు. దాని ప్రయోజనం మోక్షసిధ్ధి.

502 సమస్తభక్తసుఖదా
అమ్మ తన భక్తులందరికీ సుఖం ఇచ్చేది అని అర్థం.  గీతలో చెప్పబడినట్లు ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థకాములు, జ్ఞానులు అనే నాలుగురకాల భక్తులకూ వారివారి అర్హతలకూ అవసరాలకూ అనుగుణంగా వారికి అభ్యుదయపరంపరను చేకూర్చే విధంగా అమ్మ సమస్తమైన సుఖాల్నీ అనుగ్రహిస్తుంది.  వారి వారి అవస్థాభేదాన్ని బట్టి ఐహికమూ ఆముష్మికమూ తల్లి అనుగ్రహించి వారికి తగిన సంతోషం కలిగిస్తున్నది అని అర్థం.  జ్ఞాని అయిన భక్తుడికి అత్యంత సుఖప్రదమైనది మోక్షమే.

567 భక్తనిధిః
నిధి అంటే విస్తారమైన సంపద. ఎంత అవసరమైతే అంతగా తరచుగా గ్రహించినా ఏమాత్రమూ తరుగుదల లేని సంపద యొక్క రాశికే  నిధి అని వ్యవహారం.  భక్తులకు అమ్మ  అన్ని కొరికలనూ తీర్చే గొప్పనిధి అని ఈ‌ నామం యొక్క అర్థం. నిధి లభించినప్పుడు అందులో లభించిన వాటిలో అత్యంత విలువైన వాటిపైనే జీవులకు దృష్టి  కలుగుతూ ఉంటుంది కదా. అది వివేకవంతులకు లక్షణం కదా.  అమ్మ సర్వేశ్వరి, అనంత నిధి.  వివేకవంతుడైన జీవుడు అమ్మ అనే విశేషమైన నిధిని తన భక్తిచేత పొందినప్పుడు, ఆత్మలాభం అనే అత్యంత విలువైన ప్రయోజననాన్నే ఆశిస్తాడని అర్థం చేసుకోవాలి.  అమ్మయే నిధుల్లో కల్లా అతి గొప్ప నిధి.  మరే ఇతర నిధి కూడా మోక్షమనే సంపదను ఇవ్వలేదు.  అందు చేత అమ్మయే భక్తులు కోరుకునే అతి గొప్ప నిధి.  కాబట్టి, మోక్షం అనే గొప్ప సంపదను అనుగ్రహించే గొప్ప నిధి అమ్మ అని ఈ నామం‌ యొక్క అర్థం.  మరొక విశేషం ఏమిటంటే నిధి అనేది స్వపరభేదం లేనిది కదా.  అలాగే అమ్మకూడా బిడ్డలందరికీ సమంగా ఏ పక్షపాతమూ లేక, సమానమైన ప్రేమను పంచి అందరికీ యోగ్యతానుసారంగా అభ్యుదయ పరంపరను అనుగ్రహిస్తున్నది అని అర్థం.

747 భక్తచిత్తకేకిఘనాఘనా
ఈ‌ నామంలో‌  ఉన్న, కేకి అంటే నెమలి, అఘనం అంటే మేఘం.  నెమలికి ఒక జాతి సహజమైన లక్షణం ఉంది. దానికి మేఘం అంటే అత్యంత ప్రీతి.  ఆకాశంలో మేఘం కనిపించగానే నెమలి ఆనందంతో పురివిప్పి నాట్యం చేస్తుంది.  అమ్మవారు ఒక పెద్ద చల్లని దయామేఘం.  ఆ తల్లి దర్శనం చేత భక్తుల హృదయాలు అనే నెమళ్ళు సంతోషిస్తున్నాయని ఈ నామం యొక్క అర్థం.  అమ్మ అనుగ్రహ దర్శనం చేత ఇక్కడ భక్తులు పొందుతున్న ఆనందం యొక్క స్వరూపం సమ్యక్‌జ్ఞానం.  దాని ప్రయోజనం‌ మోక్షమే.