25, అక్టోబర్ 2013, శుక్రవారం

నాన్నగారి దయవల్ల గడచిన హిందీగండం!

ఈ మధ్య నేను వ్రాసిన ఒక టపా తెలుగువారు రాహుకాలం పాటించాలా? అనే టపాకువచ్చిన ఒక వ్యాఖ్యలో శ్రీధర్‌గారు ఒక హిందీ పుస్తకాన్ని ప్రస్తవించారు. సమాధానంగా నేను అ జ్యోతిష్ ఔర్ కాల్ నిర్ణయ్ పుస్తకం తెలుగు అనువాదం దొరికితే పరిశీలిస్తాను కాని మూలం చదివేటంత హిందీ పాండిత్యం నాకు లేదని చెప్పాను.అందుచేత హిందీభాషకీ నాకూ ఎంత సయోధ్య ఉన్నదీ కూడా ఒక సారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని అనిపించింది.

చదువుకునే రోజుల్లో నాకు హిందీ అంటే చచ్చేంత భయంగా ఉండేది. ఆ భాష నాకు ఒక ఏమీ కొరుకుడు పడేది కాదు.

1958-63 సంవత్సరాల కాలంలో నాన్నగారు తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడికి చాలా దగ్గరలోనే ఉన్న గెద్దనాపల్లి లోని మిడిల్ స్కూలుకు  ప్రధానోపాధ్యాయులుగా ఉండేవారు. ఆ పాఠశాలలో నేను ఆరు, ఏడు తరగతులు చదివాను. ఆ రోజుల్లో ఆ తరగతుల్లో ఇంగ్లీషు హిందీ  భాషల సిలబసులు  కాస్తా అక్షరాలూ, చిన్న చిన్న వాక్యాల వరకే ఉండేది.

శేషగిరిరావుగారని ఒక మాష్టారు ఆరవతరగతిలో మాకు ఇంగ్లీషు నేర్పేవారు. మొదట్లో నాకు ఆ భాష అంతగా నచ్చలేదు.  ఒక రోజున "ఈ ఇంగ్లీషు పిచ్చిభాషలా ఉందండీ" అన్నాను నాన్నగారితో. "అర్థం కావట్లేదా " అని నాన్నగారు అనుమాన పడ్డారు. "ఈ భాషలో చాలా అక్షరాలు లేవండీ, గా ఏదీ చా ఏదీ" అన్నాను నేను.  నాన్నగారు చాలా సేపు నవ్వుకున్నారు.

అలాగే ఒక రోజున, దిస్ అంటే ఎడమవైపున అనీ, అలాగే దట్ అంటే కుడివైపున అనీ, నేను సులువుగా కనిపెట్టేసానని చెప్తే కూడా చాలా నవ్వుకున్నారు.  మా ఆరవతరగతి ఇంగ్లీషు వాచకంలో మొదటి పాఠమే,  దిస్ ఈజ్ రామ అనీ దట్ ఈజ్ సీత అనే బొమ్మల్తో కూడా వేసిన వాక్యాలతో ప్రారంభం అవుతుంది.  దిస్ ఈజ్ రామ అని వ్రాసి దానికి ఎడమవైపున రాముడి బొమ్మ వేసారు.  అలాగే, దట్ ఈజ్ సీత అని వ్రాసి ఆ వాక్యానికి కుడివైపున సీత బొమ్మ వేసారు మరి!  అలాగే ఈజ్‌లాండ్ సిమ్యుల్‌టేన్యువస్లీ అంటూ అక్షరాలన్నీ జాగ్రత్తగా కలేసి అమాయకంగా పలుకుతూ ఆయనకు బోలెడు వినోదం కలిగించాను కూడా.   అలా మొదలైన నా ఇంగ్లీషు భాషాభ్యాసం నాన్నగారి శిక్షణలో త్వరత్వరగానే బాగా మెరుగయ్యింది.  ఎనిమిదిలోకి వచ్చేసరికే నేను స్వంతంగా తప్పుల్లేకుండా వ్రాయగలిగే స్థితికి వచ్చాను. ఇంగ్లీషు ఇలా చకచగా నేర్చుకో గలిగాను కాని హిందీని మాత్రం అస్సలు పట్టుకోలేక పోయాను!

అది 1964వ సంవత్సరం.  నేను 8వ తరగతిలో ఉన్నాను. ఇప్పుడు మేము కొత్తపేట వచ్చేసాము.  ఇక్కడ నాన్నగారు సీనియర్ బి.ఇడి టీచర్.  ఉడతల రమణయ్య పంతులుగారని మా ప్రధానోపాధ్యాయులు. ఆయన నల్లగా ,పొడుగ్గా ఉండేవారు. ఫుట్‌బాల్ కూడా ఆడేవారు.  నాకు ఇంకా కొంత మంది ఆ పాఠశాల గురువుల పేర్లు గుర్తున్నాయి. హిందీ మాష్టారి పేరు  పుప్పాల వేంకట్రావుగారు. ఈయనా నల్లగా ,పొడుగ్గా, కొంచెం సన్నగా ఉండే వారు. వేంకట్రావుగారు హిందీ ఉర్దూలు రెండూ బాగా వచ్చిన వారట.  ఈ ఎనిమిదో తరగతిలో హిందీ పాఠాలు నిజంగా మొదలయ్యాయి. ఈ హిందీ భాష  నాకు చుక్కలు చూపించింది. నాగరిలిపిని చదవటమే నాకు మహాకష్టంగా ఉండటం వలన ఆ భాషలో అభ్యాసం నాకు వీలు కాని వ్యవహారం ఐపోయింది.  ఆ సంవత్సరం క్వార్టర్లీ పరీక్ష నా బండారం బయట పెట్టింది.

కొత్తపేటలోని పాఠశాల హైయర్ సెకండరీ అండ్ మల్టీపర్పస్ స్కూల్. అంటే ఎనిమిది నుండి పన్నెండు వరకు తరగతులు. నూటికి 75మార్కులకి పరీక్ష పేపర్లు. మిగతా  25 మార్కులూ, పాఠశాల వారి చేతిలోఉంటాయి. సరే, ఇంతకీ నాకు ఆ క్వార్టర్లీ పరీక్ష లో అన్ని సబ్జెక్టుల్లోను చక్కగా వచ్చాయి మార్కులు  - ఒక్క హిందీ‌లో తప్ప.  హిందీలో వచ్చింది అక్షరాలా మూడు మార్కులు. దాంతో కంగారుపడి, వేంకట్రావుగారు మాయింటికి వచ్చి నా సంగతి ఆందోళనకరంగా ఉందని నాన్నగారితో చెప్పి చక్కాపోయారు.

ఆ రాత్రి భోజనాలయ్యాక, నాన్నగారు  నన్ను కూర్చో బెట్టుకుని ప్రశాంతంగా "హిందీ టెక్స్ట్" తియ్యరా అన్నారు. తీసాను. తీరా చదవమంటే అక్షరాలు చదవటమే గగనమాయె నాకు. నిజంగా నాన్నగారు కూడా అందోళన పడ్డారు.

అప్పటి నుండి, నాకు నాన్నగారి దగ్గర రోజూ హిందీలో ప్రత్యేక శిక్షణ ప్రారంభం. అక్షరాలను గుర్తుపట్టటం నుండి మొదలైన ఆ శిక్షణ మార్కులు తెచ్చుకోవాలంటే తెలుసుకోవలసిన కిటుకుల దాకా నడిచింది కొన్ని నెలల పాటు.

అర్థసంవత్సరం పరీక్షలు వచ్చి వెళ్ళాయి. ఇప్పుడు హిందీ అంటే మరీ అంత బెరుకు లేదు. అంటే కొంచెమే నన్నమాట!

నాకు ఆ అర్థసంవత్సరం పరీక్షలో హిందీలో వచ్చిన మార్కులు క్లాసులో చెబుతూ వేంకట్రావుగారు చాలా ఆశ్చర్యపోయారు.  75కి ,72 మార్కులు! నాకైతే నమ్మశక్యం కాలేదు.

ఇంక హిందీ అంటే భయం పోయింది అంటా ననుకోకండి.  ఆ భయం నేటికీ అలానే ఉంది.

పుప్పాల వెంకట్రావుగారిని మరొకసారి ఆశ్చర్యంలో ముంచెత్తే అవకాశమూ నాకు మరో రెండు మూడేళ్ళకి వచ్చింది.

పాఠశాల వార్షికోత్సవాలకి పిల్లలకి పెట్టిన పోటీల్లో హిందీ పోయెట్రీ రెసిటేషన్ అనేది ఒకటి.  నేనూ పేరిచ్చాను.  ఆకాశవాణి వివిధభారతిలో హిందీ కవితలు ఎలా గానం చేస్తారో వినీ వినీ బాగా పట్టుకున్నాను.  తరగతి వాచకంలో ఉన్న 'చాహ్ నహీ మైఁ సుర్ బాలాకే గహనోం మే గుంథా జాఁవూఁ' అనే కవితను అచ్చం రేడియో వాడి ఫక్కీలో చదివి ఫస్ట్ ప్రైజ్ సంపాదించేసాను. ఆ సందర్భంలో న్యాయనిర్ణేతగా ఉన్న వేంకట్రావుగారైతే చాలా ఆనందించారు.  ఆ విషయం ఆయన నాతో చాలా సార్లే చెప్పారు తరవాత కాలంలో.  ఆ పోటీలో బహుమతిగా  'కుచ్ కవితాయేం' అనే  కవితాసంకలనం ఇచ్చారు.  అదింకా నా దగ్గర ఉంది.

పన్నెండో తరగతి పబ్లిక్ పరీక్షలు ఇచ్చినప్పుడు నేను హిందీ పాఠ్యపుస్తకం ఒకసారి తిరగా బోర్లా చదువుకుని వెళ్ళానంతే.  నాకు  ఏ సబ్జెక్టుకూ నోట్సు వ్రాయటం అస్సలు అలవాటు లేదు. తరగతి గదిలో వినటమే. లెక్కలకు హోంవర్క్ పుస్తకం ఒకటి తప్ప మిగతా  సరంజామా అంతా నాదగ్గర కేవలం పాఠ్యపుస్తకాలే.

మా నాన్నగారు నాకు శ్రధ్ధగా హిందీ‌ నేర్పకపోతే అది నా కొంపముంచి ఉండేది నిస్సందేహంగా.

1975లో నాన్నగారు స్వర్గస్థులయ్యే దాకా ఆయన హిందీలో పరీక్ష (రాష్ట్రభాష కాబోలు) ఇచ్చారన్న విషయం తెలియదు నాకు!  అన్నట్లు మా నాన్నగారి దగ్గర దుర్గాదాస్ అని ఒకటీ మరికొన్ని (పేర్లు గుర్తులేవు) హిందీ పుస్తకాలు ఉండేవి.   నేనెప్పుడూ వాటి జోలికి పోలేదనుకోండి.

10 కామెంట్‌లు:

  1. రాజాజీ గారి పుణ్యమా అంటూ ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో హిందీ భాషకు మంచి స్తానమె లభించింది. భాషాప్రయుక్త రాష్ట్రాలు & హిందీ వ్యతిరేక ఉద్యమం పెట్రేగిన తరువాత దక్షిణాదిన హిందీ చాలా పడిపోయింది. ఈనాడు ఆంధ్రా ముస్లిం సోదరుల భాష వింటే బాధ పడాలా జాలి పడాలా తెలియడం లేదు.

    What a tragedy!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొరబడుతున్నారు!
      ముస్లింల భాష హీందీ అని ఎందుకు అనుకుంటున్నారూ?
      వారు ప్రాంతీయభాషల్లో మాట్లాడటం అనేది బాధపడవలసిన విషయం కాదే?
      హైదారాబాదులోనూ ఈ‌ మధ్యకాలంలో చాలా మంది ముస్లింలు తెలుగుభాస్జని ఆదరించి మాట్లాడుతున్నారే!
      మీ అంతర్యం‌ నాకు అర్థం కాలేదు.

      తొలగించండి
  2. ఆంధ్రా ముస్లిములు తెలంగాణ ముస్లిములు అంటే ఎవరో నాకు తెలియదు, తెలుగు ముస్లిములు తప్ప. రహ్మతుల్లా గారు తెలుగులోనే బహు చక్కగా బ్లాగులు రాస్తున్నారు, కాబట్టి మనం జాలిపడిపోనక్కరలేదు.
    శ్యామలీయం గారూ, మీ నాన్నగారికి హిందీ బాగా వచ్చు. ఎందుకంటే మార్కులు సరిగా రాకపోతే చాలామంది తల్లిదండ్రులు తెలుగులో శిక్షించారు. కాని మీ నాన్నగారు మాత్రం మీకు హిందీలో "శిక్ష" నిచ్చారు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాన్నగారికి హిందీ బాగా వచ్చు ననే నా ఉద్దేశమూ నండి.
      కాని తమాషా ఏమిటంటే ఆయన హిందీలో ఎవరితోనూ‌ మాట్లాడటం నేను చూడలేదు.
      చెప్పాను కదా, హిందీ పుస్తకాలు ఏ ఇబ్బందీ లేకుండా, హాయిగా చదివే వారు.
      హిందీ గురించి నేను వ్రాయవలసింది ఇంకా కొంచెం ఉందడీ. తరవాత వ్రాస్తాను.

      తొలగించండి
    2. అన్నట్లు దక్షిణభారత్ హిందీ ప్రచార్ సభ వాళ్ళు పెట్టే పరీక్షలైతే నాకు తెలిసి ఇవి: ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్రభాష, ప్రవేశిక, విశారద 1 & 2, ప్రవీణ 1 & 2. ఇప్పటికీ అవే ఉన్నాయో లేక మార్చారో తెలియదు, కాని అప్పట్లో "ప్రవీణ" చేసి ఏదైనా డిగ్రీ వెలగబెడితే హిందీ టీచర్ అయ్యే చాన్సు వచ్చేది. నేను ప్రవీణ పూర్తి చేశా. మన రాష్ట్రం వారికి హైదరాబాదువారు మాట్లాడేదే హిందీ అని ఒక అపోహ ఉంది. కాని నిజానికి హైదరాబాదీలు మాట్లాడేది ఉర్దూ తో కలిపిన ఒక మిశ్రమ భాష. హిందీని ఈ పరీక్షలద్వారా నేర్చుకుని సాధన చేసిన వారు ఉత్తర భారతీయులకి ధీటుగా మాట్లాడగలరు.

      తొలగించండి
  3. చాలా బాగుందండి. మరి కొన్ని విశేషాలు వ్రాయండి. నాకు హిందీ అంటే అంత భయం లేదుగానీ, సోషల్ అంటే వణికిపోయేవాడిని పదోక్లాసు వరకు, అ తర్వాత మళ్ళీ ఇంజినీరింగ్ లో దాపురించింది ఆ దరిద్రం ఒక సారి. అత్తెసరు మార్కుల్తో గట్టెక్కేసాను. నాకు టెంత్ లో హిందీలో అత్యధిక మార్కులొచ్చేయి కానీ ఇప్పటికీ పూర్తి హిందీ మాట్లాడ్డం రాదు :-( నార్త్ ఇండియాలో చదువుకుంటూన్నప్పుడు ఆగయా కీ ఆయేగా కి తేడా తెల్సేది కాదు. హిందీ మంచి భాష. ప్రాసలు బాగా కలుస్తాయి హిందీలో (హం దో హమారే దో టైపులో) అదీకాక చాలామటుకు తెలుగు పదాలు హిందీలో ఉన్నవే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హిందీ నిస్సంశయంగా చక్కని భాషే నండీ. అది నాకు అబ్బకపోతే, పాపం దాని తప్పేముందీ!
      నిజానికి నాకు హిందీ సుబ్బరంగా అర్థం అవుతుంది. ఎటొచ్చీ మాట్లాడలేను.
      హిందీ సినీమా తెలుగు సినిమా అంత బాగానూ అర్థం అవుతుంది కూడా!

      తొలగించండి
  4. నిజానికి ఆ భాషని 'ఖడీబోలీ’ అంటారు, నాకూ పెద్దగా రాదు కాని మీలాటిదే నా పాండిత్యమూ, మాకు ఆరోజుల్లో హిందీ కంపల్సరీ కాదు, నాకు 29 మార్కులొచ్చాయి వందకి.

    రిప్లయితొలగించండి
  5. శ్యామలీయం గారు హిందీ గురించి వ్రాస్తూనే అప్పటి విశేషాలని చక్కగా తెలిపారు....తరవాత, హిందినే కాదు ఏ భాష అయినా చదవటం వేరు... మాట్లాడటం వేరు... మాట్లాడటం బాగా వచ్చిన వారికి కూడా మార్కులు బాగా రాకపోవచ్చును... సూర్య గారు తెలుగు శిక్ష, హిందీ శిక్ష గురించి బాగా చెప్పారు...

    ముస్లిమ్స్ మాట్లాడేది ఉర్దూ... ఇదోరకం మిక్సింగ్ భాష. దీనిలో సంస్కృతం, అరబిక్ మరియు లోకల్ భాష ఒకటి తప్పనిసరిగా కలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. హిందీ అంటే మీకులానే నాకు కూడా ఇప్పటికీ భయం పోలేదు..

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.