15, అక్టోబర్ 2013, మంగళవారం

తెలుగువారు రాహుకాలం పాటించాలా?


గత కొంత కాలంగా మన తెలుగుపంచాంగాల్లో రాహుకాలం అనే క్రొత్త విషయం వచ్చి చేరింది.  దానితో ఈ రాహుకాలం అనేది చెడ్డకాలం కాబట్టి దీని విధిగా విసర్జించాలీ అనుకుని గడబిడ పడుతున్నారు చాలా మంది తెలుగువాళ్ళు.  ఈ రాహు కాలం కూడా మనకు అలవాటైన వర్జ్యం, దుర్ముహూర్తం అనే వాటి సరసన చేర్చి దీనికి భయపడటం పెరుగుతోంది.  ఈ‌ రాహుకాలం ప్రతిరోజూ వస్తుంది.  రాహుకాలం సమయాలు ఇలా కనిపిస్తున్నాయి కాలెండర్లలో.

వారం సమయము మొదలు-వరకు
ఆదివారం సాయంత్రం 4.30 - 6.00
సోమవారం ఉదయం 7.30 - 9.00
మంగళవారం మధ్యాహ్నం 3.00 - 4.30
బుధవారం మధ్యాహ్నం 12.00 - 1.30
గురువారం మధ్యాహ్నం 1.30 - 3.00
శుక్రవారం ఉదయం 10.30 - 12.00
శనివారం ఉదయం 9.00 - 10.30


చాలా పంచాంగాలు, గోడ కేలండర్లలో పైన చూపిన పట్టిక ప్రకారం రాహుకాలం చూపించటం బహుళంగా కనిపిస్తుంది.  కాని ఇది చాలా తప్పు.

సూర్యోదయం ఉదయం గం.6:00 మరియు సూర్యాస్తమయం సాయంత్రం గం.6:00 ఐతే మాత్రమేపై పట్టికలో చూపించిన సమయాలు వర్తిస్తాయి.

కాని సాధారణంగా సూర్యోదయసూర్యాస్తమయ సమయాలు అలా ఉండవు.  సర్వ సాధారణంగా దినప్రమాణం ఖచ్చితంగా 12గంటలు ఉండదు.  అలా పగలు రాత్రీ కూడా సమానంగా 12గంటలుగా ఉండేది సంవత్సరంలో‌కేవలం రెండు రోజులే సుమా!  అందుచేత  సూర్యోదయం నుండి సూర్యోదయం వరకూ పగటి సమయం ఎంత కాలమో దాన్ని ఎనిమిది భాగాలు చేసి, సూర్యోదయం నుండి ఆ భాగాలు లెక్కిస్తూ ఈ క్రింది పట్టికలో చూపినట్లుగా సరియైన విధంగా రాహుకాలం గ్రహించాలి.


వారం రాహుకాల భాగం
ఆదివారం 8వ భాగం
సోమవారం 2వ భాగం
మంగళవారం 7వ భాగం
బుధవారం 5వ భాగం
గురువారం 6వ భాగం
శుక్రవారం 4వ భాగం
శనివారం 3వ భాగం


సూర్యోదయం ఉదయం 5గం. ప్రాంతంలో కూడా రావచ్చు వేసవిలో మే నెలలో.  అటువంటప్పుడు సూర్యాస్తమయం సా॥7గం. కు అవుతుంది.  అంటే పగటి సమయం ఇంచుమించు 14గం. పాటు ఉంటుంది. రాహుకాలం ప్రమాణం 14/8 = గం.1:45ని॥అవుతుంది.  అలాగే శీతకాలంలో రాహుకాలం గం.1:15ని॥ కావచ్చును కూడా.  రాహుకాలం‌ ప్రారంభ కాలాలు కూడా చాలా తేడాగా వస్తాయి.  ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే గోడకాలెండర్లలో ఉన్న రాహుకాలాలు ఎంత శుధ్ధతప్పో తెలుస్తోంది కదా!

ఉదాహరణకు ఒక వేసవికాలం ఆదివారం నాడు సూర్యోదయం గం.5:00 సూర్యాస్తమయం సాయంత్రం గం.7:00 ఐతే నాటి రాహుకాలం  సాయంత్రం 5:15 నుండి 7:00 అవుతుంది కాని కేలండర్లలో ఇస్తున్నట్లుగా సాయంత్రం 4.30 - 6.00 కాదు. చూడండి ఎంత తేడా వస్తోందో!

అలా గని, అందరూ సరైన రాహుకాలాలు గణనం చేసుకుని వాడాలంటే కాలెండర్లలో సూర్యుడి ఉదయాస్తమయాల వివరాల సదుపాయం తక్కువే మరి.  గోడకాలెండర్లలో కొన్ని కొన్ని మాత్రమే సూర్యోదయం చూపుతున్నాయి.  సూర్యాస్తమయం చూపేవి తక్కువే.  బండగా మొదటి పట్టిలో ఉన్నట్లుగా రాహుకాలాన్ని చూపించేవి మాత్రం కొల్లలు.  మరి రాహుకాలం జనసామాన్యం సరిగా తెలుసుకునేది ఎలా అన్నది ప్రశ్న.

అసలు తెలుగువారు ఈ‌ రాహుకాలం పాటించవలసిన అవసరం లేదు అన్నది జవాబు.   అప్పుడు గణితమూ సరైన విలువా అంటూ గొడవే లేదు కదా!

ఒకవేళ ఎవరైనా రాహుకాలం పాటించి తీరాలీ అన్న స్థిరాభిప్రాయంలో ఉంటే వారికి వార్తాపత్రికలు కొన్ని ఉపకారం చేస్తున్నాయి.  ఉదాహరణకు ఈ‌నాడు పత్రికలో ప్రతిరోజూ ఆ నాటి పంచాంగం వివరాలను సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలతో సహా ఇస్తారు. వాటి ఆధారంతో ఓపిక ఉన్నవారు గణితం‌ చేసుకోవచ్చును.  ఐతే, ఆ సూర్యోదయ సూర్యాస్తమయాలు పత్రిక స్థానిక ఎడిషన్ ప్రాంతానికే వర్తిస్తాయి.  హైదరాబాదు ఎడిషన్ తీసుకుని కాకినాడవారు గణితం చేసుకోరాదు - ఆ అవకాశం తక్కువే అనుకోండి.

నిజానికి రాహుకాలాన్ని తెలుగువారు పాటించటం అన్న ఆచారం లేనే లేదు.  పైన చెప్పినట్లుగా ఈ‌ రాహుకాలం అనేది మన తెలుగుపంచాగాల్లో ఇటీవల చేరిన విశేషం మాత్రమే.  బహుశః గత పాతికేళ్ళలో ఇది మన దగ్గరకు వచ్చింది.

రాహుకాలాన్ని తమిళులు ఎక్కువగా పాటిస్తారు.

శ్రీకప్పగంతు సుబ్బరామశర్మగారు ఆంధ్రభూమి పత్రికలో తమ రాహుకాలం - దుర్ముహూర్తం  అన్న వ్యాసంలో తెలుగువారి పాత పంచాంగాలు తిరగేస్తే మనకు రాహుకాలంలో పంచాగకర్తలు సుముహూర్తాలు ఇచ్చిన దాఖలాలు కనిపిస్తాయని చెప్పారు.   వారు నెల్లూరు నుండి తమిళనాడు, కర్ణాటకలలో రాహుకాలం, నెల్లూరు ఇవతల ఆంధ్రలో దుర్ముహూర్తం వాడకం ప్రధానమైంది అన్న విషయం తెలియ జేసారు.  తమిళనాడు, కర్ణాటకలలో మరి ఇతర రాష్ట్రాల పంచాంగంలో ఇప్పటికీ దుర్ముహూర్తం గోచరించదు, మన పంచాంగవిధానంలో రాహుకాలం కనబడదు. మన పెద్దలు ఆచరించని రాహుకాలం మనం ఎందుకు ఆచరించాలి, అవసరం లేదు అని వారి అభిప్రాయం.  ఇదే నా అబిప్రాయం కూడా.

రాహుకాలం పూజకు మంచి సమయం అన్నది తమిళదేశంలో ఆచారం. తెలుగుదేశంలో‌కాదు.  వ్యాప్తిలోకి వస్తున్న మరొక అభిప్రాయం ఏమిటంటే దుర్గాపూజకు రాహుకాలం మంచిది అని.  ఇది నిరాధారమైన అభిప్రాయం. దుర్గామాతపూజకూ రాహుకాలానికీ ఏ సంబంధమూ‌ లేదు.

ఈ రాహుకాలం పాటించటం అనే దాని మీద వ్యగ్రత ఎంత దూరం వెళ్ళిందంటే రాహు కాలంలో పిల్లలు పుడితే దోషమేనా?  అన్న ప్రశ్నకు జవాబుగా తప్పక కొన్ని శాంతులు చేయించవలసి వస్తుంది అన్న జవాబు ఇచ్చారు తెలుగుబంధు వెబ్ సైట్‌వారు!

21 కామెంట్‌లు:

  1. శ్రీ శ్యామలీయం గారికి, రాహు కాలం పైన నాకు తెలిసిన విషయం వ్రాస్తున్నాను. ఇది పాత తెలుగు పంచాంగాలలో కనపడక పోవడానికి కారణం ఏమిటంటే దీనిని రావణ బ్రహ్మ కనిపెట్టినందువల్ల ! ద్రావిడ ప్రోక్తం అని అంగీకరించి ఉండరు. మన ఆర్య పంచాంగం అమలులో రవడానికి పూర్వమే, రావణ బ్రహ్మ ద్రావిడ పంచాంగాన్ని ( నిజానికి ఇది పంచాంగం కాదు, దీనిలో మూడు అంగాలే ప్రధానం )కనిపెట్టి వాడుకలో పెట్టారు. అతని కాలమానినిలో (పంచాంగం అనడం బాగుండదు) మూడే పధాన అంశాలు ! మాసం: వారం, సమయం. మాసాలు మూడు భాగాలుగా విభజింప బడ్డాయి. ౧ఫల మాసాలు. ౨మల మాసాలు, ౩మధ్య మాసాలు .౧ ఫలమాసాలు -- చైత్రం.శ్రావణం , వైశాఖం, భాధ్రపదం, మాఘం, ఫాల్గుణం. ౨మల మాసాలు-- జ్యేష్టం, ఆషాడం. ౩ మఢ్యమ మాసాలు-- ఆశ్వియిజం, కార్తీకం, మార్గశీర్షం, పౌష్యం. ఇక వారాలు ఎప్పట్లాగే ఏడు. సమయం ప్రధానంగా నాలుగు కాలాలుగా విభజింపబడింది. ౧మహేంద్ర కాలం, ౨ అమృత కాలం, ౩ వక్ర కాలం, ౪ శూన్యకాలం. ఇవి కాకా మన వాడుకలో ఉన్న రాహుకాలం ! ఈ రాహు కాలం పైన ఉదహరించిన మిగతా కాలాలలో కలిసి పోతుంది కాబట్టి దానిని ప్రత్యేకంగా చూపించ లేదు. ఫలానా మాసంలో , ఫలానా వారం నాడు ఫలానా సమయానికి ఈ కాలాలు వస్తాయి. అది టైం టేబిల్ లాగ ముందే నిర్ణయింప బడింది రావణ బ్రహ్మ ద్వారా ! వీటిలో మహేంద్ర కాలం , అమృత కాలం మంచి ఫలితాలు ఇస్తాయి వాటి ప్రకారం మన విధులను నిర్వహిస్తే ! వక్ర కాలం, శూన్యకాలాలు విపరీత ఫలితాలను ఇస్తాయి. ఇక రాహు కాలం పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అయితే ఇది మహేంద్ర కాలంతో కలిసి వస్తే దాని ఫలితాలు మారిపోతాయి ! అమృత కాలంతో కలిసి వస్తే దాని ప్రభావం నశిస్తుంది ! ఇక మిగతా కాలాలతో కలిసి వస్తే విపరీత ఫలితాలి ఇబ్బడి ముబ్బడి అవుతాయి.
    రాహికాలం ద్రావిడులది కాబట్టి పాత పంచాంగాలలో కనిపించదు. అయితే దాని ప్రాముఖ్యతని వదులుకోలేక తరువాత పంచాంగ కర్తలు రాహు కాలాన్ని పన పంచాంగాలలో ప్రవేశ పెట్టారు. ఇంతకన్న వివరంగా వ్రాయాలనే ఉంది కాని వ్యాఖ్య ఉద్దేశం అతిక్రమించినట్లు అవుతుంది. ! దీనిని బట్టి నిష్కర్ష ఏమిటంటే ఈ కాలాలకి చాల విలువ ఉంది. దానిని పాటించక పోతే చేడేదొ మనమే గాని అది కాదు !
    ఎ .శ్రీధర్

    రిప్లయితొలగించండి
  2. శ్రీధర్‌గారు మన్నించాలి. ఆర్యులు-ద్రావిడులు అన్న సిధ్ధాంతం పాశ్చాత్యులు మన వారి మీద రుద్దినదే కాని సరైనది కాదు. ఆ తప్పుడు సిధ్ధాంతం ఎప్పుడో పరాస్తం ఐపోయింది. చరిత్రకారులు ఈ‌ నాడు దానిని తిరస్కరిస్తున్నారు. భారతదేశం ఎప్పుడూ‌ ఎవరో వచ్చి ఆక్రమించి పాలించే ప్లాట్‌ఫారం వంతి భూమి అని భారతీయుల్ని నమ్మించే ఆ సిధ్ధాంతాన్ని ఇంకా మన విద్యావిధానంలోంచి సమూలంగా పెరికి వేయకపోవటం వల్ల మనం నష్టపోతున్నాం.

    రావణుడు పులస్త్యబ్రహ్మ మనుమడు. ఋషిసంప్రదాయం వాడే, కాని తన తల్లియైన కైకసి రాక్షసస్త్రీ కావటం వల్ల ఆ వైపు మనస్తత్వం అలవరచుకొన్న వాడు. వేదంలొ ఘన, జట, క్రమ వంటి విధానాలను ప్రవేశపెట్టినది రావణబ్రహ్మయే. అతడి వేద విధానాలను అంగీకరించిన వైదికసంప్రదాయం అతడి జ్యోతిషవిధానాలను తిరస్కరించిం దనటం సరికా దనుకుంటాను. నిజానికి రాహుకాలం ఒకటే కాదు, ఇంకా గుళికాకాలం, యమగండం, ఇంద్రచాపం, పరివేషం వంటి అనేక విషయాలున్నాయి. వీటికి జ్యోతిషంలో ప్రశ్నభాగంలో కొంత పాత్ర ఉంది. కాని జాతకపధ్ధతి, ముహూర్తాదులల్లో ఏమీ ప్రాధాన్యత లేదు నాకు తెలిసినంత వరకు.

    నా వ్యాసంలో స్పష్టీకరించినట్లుగా దాదాపు అన్ని చోట్లా రాహుకాలం తప్పుగానే ఇస్తున్నారు. రాహుకాలం అత్యంత ముఖ్యమైన దైతే ఇలా చేయటం వలన అనేక విధాలుగా చెరుపు జరుగుతూ ఉండాలి. కనీసం ఆ భయంతో ఐనా పంచాంగ కర్తలు కాలెండర్లలో రాహుకాలం స్ఫుటం చేసి ఇవ్వాలి. కాని వాస్తవం అలా లేనే లేదు కదా.

    తరతరాలుగా రాహుకాలం అనేది పట్టించుకోని తెలుగువారు ఇప్పుడు రాహుకాలం పట్ల వ్యగ్రత చూపటం అనవసరమని నా అభిప్రాయం. ప్రాంతీయాచారాలను అనుసరించి వేర్వేరు ప్రాంతాల్లో భారత దేశంలో అనేక మైన మంచి చెడు కాలాలను వారివారి పంచాంగ కర్తలు ఇస్తూ ఉండవచ్చును. మనం తెలుగువారం ఆత్రుతగా అన్ని రకాల చెడుకాలాలను అన్ని పంచాంగపధ్ధతుల్లోంచి గ్రహించి పాటించటం మొదలు పెడితే తరచుగా వారంలో ప్రతి సమయమూ, ఏదో ఒక పంచాగాచారం ప్రకారం, ఏ పనికీ పనికిరానిదే ఐపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొత్తకొత్త వాటిని జొప్పించుకుని ఆందోళనలకు తెలుగువారు గురికా నవసరం లేదని విన్నవించటం నా వ్యాసం ఉద్దేశం.

    రిప్లయితొలగించండి
  3. Everything has become a business in AP. The people who write calendars put this by borrowing from Taminadu or other states. And the people who fear hire these so called "pundits" for doing some shanti and feel good. So the pundits make money and the vicious loop goes on.

    Those who borrow rahu kaalam and such from TN forget even our own roots and even our potana Bhagavatam but will be more than happy to recite some tamil slokam whose meaning they do not even understand (than to recite a simple poem our own potana wrote). Even in Tirupathi we continue to use tamil terms like 'padi' etc for kitchen and other places. If you say anything there is a huge outcry.

    This daridram is only with AP. If you ask a tamil guy to repeat a potana poem, he will laugh sarcastically and get away from you a million miles. So long as we don't change the world will continue to play their games at us. This is the exact reason why all the priests ALL OVER AP are like money spindlers and want to make as much money as possible even in Tirupathi and Annavaram. All the sancticity of the towns is gone a long time ago. All you can see in the faces of these priests is their look for money and GREED.

    Do you see the samething in Guruvayur or any other Kerala or TN temples? It is because the public in those states does NOT allow their sancticity to die. We allow it wholeheartedly because we want to go first and finish first (me first syndrome than to stand in line like everyone and go with flow) first.

    So long as WE DO NOT CHANGE, there will be no imporement in AP. This is our dauBhagyam.

    రిప్లయితొలగించండి
  4. రాహుకాలం, వ్యర్జం వగైరాలు అన్నీ హిందూ మతానికి చెందినవి కావాండీ? చెల్లితే హిందువులు అందరికీ చెల్లాలి లేకపోతె ఎవరికీ చెల్లకూడదు అనే వాదన సరి కాదా?

    I believe these concepts originate in religion, not language or region. Am I wrong here?

    రిప్లయితొలగించండి
  5. చెల్లితే హిందువులు అందరికీ చెల్లాలి - i don't think Hindu tradition is like that. There is no one rule for all to follow. To each his own, interpretations of cosmic configuration differs from region to region. In Astrology, place of birth has its own importance in determining the ascendant and subsequent chakra - Krishna

    రిప్లయితొలగించండి
  6. శ్యామల్ గారూ ! మీరు వ్రాసిన టపా మీ స్వంత అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేస్తోంది. సమగ్రంగా శోధించి చేసినది కాదు. కారణం ఏమిటంటే రాహు కాలం గురించి సరియైన పరిశోధన లేక పోవడమే !
    రావణాసుర వధ జరిగిన వెంటనే శ్రీరాముడు ,లక్ష్మణున్ని పిలిచి రావణాసురుని దగ్గర కాలఙ్జానం నేర్చుకోమని చెప్పి పంపిస్తాడు. తనకి కాలఙ్జ్జానం నేర్పమని అభ్యర్ఢన చేసిన పిమ్మట రావణుడు తన చేతితో ఒక ధర్భ పుల్లని తెంపి తనతో పాటు ధరాశాయి అయిన ఒక ‘సోన్ వృక్షాపు ఒక శాఖలోని కొన్ని ఆకులని ఆ దర్భపుల్లతో ఛేధిస్తాడు అలా చేధింప బడిన ఆకులలో చిట్టచివరి ఆకు బంగారు రంగులో మారి పోతుంది ! ఇప్పటికీ దసరాలలో రావణ దహనం జరిగిన వెనుక ‘సోన్ ఆకులని పంచిపెట్టే ఆచారం ఉంది.
    చూసావా లక్ష్మణా ! ఇదే కాల ప్రభావం ! ఈ దర్భ పుల్ల మహేంద్ర కాలంలో చివరి ఆకుని స్పృశించింది. కాబట్టి బంగారు రంగులో మారిపోయింది అని చెప్పి, లక్ష్మణునికి కాలనిర్ణయ రహస్యాలని చెప్తాడు.
    రావణుడు కాలాన్ని పగలు రాత్రి అని రెండు భాగాలుగా వర్ణిస్తాడు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పగలు అనీ, సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు వరకు రాత్రి అని చెప్పాడు. అందు వల్ల దానికి సూర్యోదయ సూర్యాస్తమయాల ప్రసక్తి లేదు. కాలాంతర, దేశాంతర సంస్కారాలు సమయ శోధనలు ఈ కాల నిర్ణయానికి వర్తించవు ! అందు చేత గోడ మీద కాలెందర్లాలో వ్రాసిన రాహుకాలం పట్టికకి ఎలాంటి సంశోధన అవసరం లేదు ! ముఖ్యంగా రాహు కాలం అనేది ఒక ఛాయ (షేడో) అది అతను చెప్పిన నాలుగు కాలాలతో ( మహేంద్ర, అమృత, వక్ర, శూన్య కాలాలు) కలిసి వస్తుంది. కాబట్టి అది ఎల్లప్పుడూ వ్యతిరేక ఫలితాలని ఇవ్వదు కేవలం శూన్య వక్ర కాలాలతో కలిసి వచ్చినప్పుడే అది విపరీత ఫలితాలని ఇస్తుంది.
    ఈ కాల నిర్ణయం గురించి తెలుసుకొంటే ఎన్నో ఆశక్తి కరమైన విషయాలు తెలుస్తాయి ! నా చిరకాల అనుభవంతో ఈ కాలాలు ఇఛ్ఛే ఫలితాలని నేను ప్రయోగించి తెలుసుకొన్నాను
    శ్రీ నారాయణ్ దత్త్ శ్రీమాలి హిందీలో వ్రాసిన రావణ ప్రోక్తమయిన ‘ జ్యోతిష్ ఔర్ కాల్ నిర్ణయ్’ అనే పుస్తకాన్ని చదవండి. మీకు ఎంతో అద్భుతమయిన విషయాలు తెలుస్తాయి !

    రిప్లయితొలగించండి
  7. శ్రీ గురుభ్యోనమః
    నమస్తే
    ఈ టపా అసలు విషయం మీద నాకు పూర్తి వివరం తెలీదు. కానీ శ్రీధర్ గారు ఉటంకించిన ఒకటీ రెండు విషయాల గూర్చి మాత్రమే
    ౧) దసరాలలో రావణ దహనం చేయమని ప్రమాణం లేదు, దసరా నాడు చేయవలసింది, అపరాజిత పూజ, శమీ పూజ, విజయ ముహూర్తంలో సీమోల్లంఘనం, శోభాయాత్ర.
    ౨) సోన్ పత్ర్ గురించి వ్రాసారు దాన్ని అశ్వంక వృక్షమని పిలుస్తారు, శమీ వృక్షానికి పూజ చేయడం కుదరకపోతే అశ్వంక వృక్షానికి పూజ చేయమని దాన్నే దేవకాంచనం అని గణపతి 21 పత్రాలలో ఒకటిగా వాడతారు. అది రావణుడు పుట్టకముందునుంచీ ప్రకృతిలో ఉన్నది కొత్తగా రావణుడు సృష్టించినది కాదు,
    ౩) రావణుడు ఎంత విద్వత్తుఉన్నవాడైనా, వశిష్ఠ- విశ్వామిత్రాదులచేత సుశిక్షితుడై విష్ణ్వంశ సంభూతుడైన లక్ష్మణుడికి విద్య నేర్పేంత పండితుడు కాదు (ఆయనే ఉంటే.. అని ఒక ముతక సామెత, పక్కవాడికి చెప్పేవాడే ఐతే తానుబాగుపడేవాడు ముందు), రాముడు లక్ష్మణుడికలా చెప్పలేదు లక్ష్మణుడలా చేయనూలేదు, కల్పిత గాథా ప్రచారం తప్ప. {చాలా మంది ద్రావిడ బ్రాహ్మణులు మేం రావణుడి వారసులం అని చెప్పుకోవటం విన్నాను, అదేదో గొప్పకేమో తెలీదు, రావణుడి వంశంలో ఒక్కడు మిగలకుండా రామలక్ష్మణ హనుమదాదులు చంపేశాక కొత్తగా వీళ్ళెక్కడనుంచొచ్చారు, కనీసం విభీషణుడి వారసులం అని చెప్పుకున్నా, కుబేరుడి వారసులం అను చెప్పుకున్నా, ధర్మాత్ముడి వారసులం అన్న ఆనందం అన్నా ఉంటుంది}
    ౪) రావణుడొక్కడే కాదు వేదానికి ఘన, జఠ, క్రమ పాఠాలను బోధాయనాదులెన్నడో ఆ ప్రక్రియ చూపారు. రావణుని ఆడంబరాల వల్ల ప్రచారం కలిగింది.
    ౫) రావణకృతమైన లేదా రావణుడనుష్ఠించిన విషయాలను పెద్దలు లెక్కలోకి తీసుకోని కారణం అతని తామస రాజస గుణాలు, అవి అతని ప్రతి పనిలోనూ, అనుష్ఠానంలోనూ కనిపించేలా ఉంటాయి విద్యాభ్యాసం, తపస్సు, కళాపోషణ, స్తోత్రనిర్మాణం ఇత్యాదులతో సహా.. అందుకే పెద్దలు, ఋషులు అటువంటి విషయాలను వర్జిస్తారు, సాత్వికమైన విషయాలనే స్వీకరిస్తారు. ఎంత శివభక్తుడైనా మహన్యాసంలో రావణ పద్ధతి పాటించేవారు బహు స్వల్పం, బోధాయనాది ఇతర పద్ధతులే వ్యవహారంలో ఉన్నవి. సమయం లేకపోతే లఘు న్యాసాదులు చేస్తారు కానీ రావణాన్ని స్వీకరించరు.
    ౬) ఎంత విద్వత్తున్నా ఎంత గొప్ప వాజ్ఞ్మయాన్ని నిర్మించగలిగినా, అహంకార పూరితుడైన నీచుడి మాటలను ఏనాటికీ విజ్ఞులైనవారు స్వీకరించరని పునః పునః చాటి చెప్పేది రావణ చరితం.

    రిప్లయితొలగించండి
  8. అయ్యా!

    అసలామాటకొస్తే ఈ జ్యోతిష్య ఫలాల్నే పట్టించుకోనఖ్ఖర్లేదు. ఇవేమీ పట్టించుకోకుండా విదేశాలవాళ్ళు వాళ్ళపనుల్లో విజయులవటంలేదా? ఒక్కమనకే ఇన్ని బంధనాలెందుకండి? ఇవన్నీ పాటిస్తేకానీ success అవ్వలేకపోవడానికి మనమేమన్నా వాసితక్కువవాళ్ళమా? లేకపోతే వాళ్ళకేమాత్రమూ అడ్డుచెప్పని గ్రహాలు మనల్నిమాత్రం మనమేదో location-ally challengedలాగా ఇవన్నీపాటిస్తేకానీ అడుగువెయ్యడానికి లేదని శాశిస్తున్నాయ్? మా నమ్మకం అనికాక వేరేయితర సమాధానం చెప్పగలరా?

    మనకున్న astronomical knowledgeని misuseచేస్తూ పుట్టిందే astrology అంటాను.

    విధేయుడు
    నాగ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగ్‌గారూ,

      విదేశీయులూ జ్యోతిష్యాన్ని బాగానే నమ్ముతున్నారు.
      జ్యోతిష్యంలో అనేక విధానాలున్నాయి. మనదేశంలోనే పారాశర్యం ఒకటే కాన జైమినీయం కూడా ఉంది కదా. ఇతరదేశాల వాళ్ళకూ వారివారి విధానాలున్నాయి.

      ఐనా, నా వ్యాసం ఉద్దేశం జ్యోతిషం నిజమా -అబధ్ధమా అనో జ్యోతిషం శాస్త్రమా - మూఢనమ్మకమా అనో కాదు.

      మీకు జ్యోతిషం మీద నమ్మకం లేక పోవటాన్ని నేను తప్పు బట్టను. నమ్మటం‌ మానటం మీష్టం.

      తొలగించండి
  9. ఆంగ్లేయుల్లోనూ కొందరిలో ఈనమ్మకాలున్నప్పటికీ మనకున్నంత విస్తృతంగాలేవు. ప్రయాణాలకీ, కొత్తపనులకీకూడా జ్యోతిష్యాన్ని సంప్రదించరు. వాళ్ళ సాంప్రదాయం చాలావిషయాల్లో భారతీయజ్యోతిష్య సాంప్రదాయంతో ఏకీభవించదు.

    విసిగిస్తున్నాననుకోకుంటే వీవిషయంలో నావి కొన్ని సందేహాలూ, ప్రశ్నలు :

    అ) కేవలం పధ్ధతులా ఆధారంగా తెలుగువారికి రాహుకాలం పట్టించుకోనవసరంలేనిదైనప్పుడు, వారిక్కూడా అలాగే ఇంకేదో పట్టించుకోనవసరంలేనిదైనప్పుడు, ఈరెండూ ఆంగ్లేయుల జ్యోతిష్యంప్రకారమో, జిప్సీల జ్యోతిష్యంప్రకారమో పట్టించుకోరానివైనప్పుడు ఏదసలు పట్టించుకోవలసిన జ్యోతిష్యం? ఏది ప్రామాణీకం?
    ఆ) జ్యోతిష్య ఫలాలు నివశించే ప్రదేశాలప్రకారం మారుతాయని పైనెవరో అన్నారు. తెలుగుదేశాన పుట్టినవ్యక్తి తమిళదేశంవెళితే అప్పుడు రాహుకాలాన్నికూడా పాటించాలా? మరి విదేశాలకెళితే అప్పుడేమిటి?
    ఇ) గ్రహాల ప్రస్తావనేలేకుండా హస్తసాముద్రికం, టారట్ కార్డులు, చిలకజోస్యం లాంటి సాంప్రదాయాల్లో జ్యోతిష్యాలు చెబుతారుకదా. మరలాంటప్పుడు మనం చెప్పించుకున్న రెండు సాంప్రదాయాల్లో వ్యతిరేక ఫలితాలను వచ్చాయనుకోండి, అప్పుడు దేనిఫలితాన్ని పట్టించుకొని, దేనిని వదిలెయ్యాలి? మీరుదహరించిన పారాశర్యం, జైనమీయాల్లో పారాశర్యమ్మాత్రమే జైనమీయంకంటే ఎందుకు మెరుగైనది? లేదా జైనమీయమే పారాశర్యంకన్నా మెరుగైనది? ఇప్పుడెవరైనా ఇంకోక్రొత్త జ్యోతిష్యవిధానాన్ని మీకు పరిచయంచేశారనుకుందాం, అప్పుడేంచెయ్యాలి?
    ఈ) ఇవన్నీ ఆలోచించాక జ్యీతొష్యం ఆచారమా, శాశ్త్రమా అన్నప్రశ్నవస్తే దానికి జవాబేది?

    రిప్లయితొలగించండి
  10. ఆంగ్లేయుల్లోనూ కొందరిలో ఈనమ్మకాలున్నప్పటికీ మనకున్నంత విస్తృతంగాలేవు. ప్రయాణాలకీ, కొత్తపనులకీకూడా జ్యోతిష్యాన్ని సంప్రదించరు. వాళ్ళ సాంప్రదాయం చాలావిషయాల్లో భారతీయజ్యోతిష్య సాంప్రదాయంతో ఏకీభవించదు.

    విసిగిస్తున్నాననుకోకుంటే వీవిషయంలో నావి కొన్ని సందేహాలూ, ప్రశ్నలు :

    అ) కేవలం పధ్ధతులా ఆధారంగా తెలుగువారికి రాహుకాలం పట్టించుకోనవసరంలేనిదైనప్పుడు, వారిక్కూడా అలాగే ఇంకేదో పట్టించుకోనవసరంలేనిదైనప్పుడు, ఈరెండూ ఆంగ్లేయుల జ్యోతిష్యంప్రకారమో, జిప్సీల జ్యోతిష్యంప్రకారమో పట్టించుకోరానివైనప్పుడు ఏదసలు పట్టించుకోవలసిన జ్యోతిష్యం? ఏది ప్రామాణీకం?
    ఆ) జ్యోతిష్య ఫలాలు నివశించే ప్రదేశాలప్రకారం మారుతాయని పైనెవరో అన్నారు. తెలుగుదేశాన పుట్టినవ్యక్తి తమిళదేశంవెళితే అప్పుడు రాహుకాలాన్నికూడా పాటించాలా? మరి విదేశాలకెళితే అప్పుడేమిటి?
    ఇ) గ్రహాల ప్రస్తావనేలేకుండా హస్తసాముద్రికం, టారట్ కార్డులు, చిలకజోస్యం లాంటి సాంప్రదాయాల్లో జ్యోతిష్యాలు చెబుతారుకదా. మరలాంటప్పుడు మనం చెప్పించుకున్న రెండు సాంప్రదాయాల్లో వ్యతిరేక ఫలితాలను వచ్చాయనుకోండి, అప్పుడు దేనిఫలితాన్ని పట్టించుకొని, దేనిని వదిలెయ్యాలి? మీరుదహరించిన పారాశర్యం, జైనమీయాల్లో పారాశర్యమ్మాత్రమే జైనమీయంకంటే ఎందుకు మెరుగైనది? లేదా జైనమీయమే పారాశర్యంకన్నా మెరుగైనది? ఇప్పుడెవరైనా ఇంకోక్రొత్త జ్యోతిష్యవిధానాన్ని మీకు పరిచయంచేశారనుకుందాం, అప్పుడేంచెయ్యాలి?
    ఈ) ఇవన్నీ ఆలోచించాక జ్యోతొష్యం ఆచారమా, శాశ్త్రమా అన్నప్రశ్నవస్తే దానికి జవాబేది?

    క్షమించాలి. టైపిచేసినదంతా ఎగిరిపోయింది. అందుకే మళ్ళీ ఇస్తున్నాను.

    -నాగ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగ్‌గారూ,

      బోలెడు ప్రశ్నలు సంధించారు.

      ఇక్కడ అంశం తెలుగువారు రాహుకాలం పాటించటం అవసరమా అన్నది. ఇండులో ప్రత్యేకించి చెప్పకపోయినా సరిగా విస్తరిస్తే తెలుగువారిలో జ్యోతిషాన్నీ ముఖ్యంగా శుభాశుభసమయాల విషయాన్ని నమ్మేవారు రాహుకాలం పాటించవలసిన అవసరం ఉందా అన్నది. జ్యోతిషాన్నే నమ్మని వారికి ఈ వ్యాసంతో‌ పనీ లేదు - వారితో జ్యోతిష సంబంధమైన డిఫెండింగ్ లాయర్‌లా నేనేమీ వాదనలు చేయవలసిన అవసరమూ‌ లేదు.

      కాబట్టి కేవలం ప్రశ్న (ఆ) తెలుగుదేశాన పుట్టినవ్యక్తి తమిళదేశంవెళితే అప్పుడు రాహుకాలాన్నికూడా పాటించాలా? మరి విదేశాలకెళితే అప్పుడేమిటి? అన్నది మాత్రం స్పర్శిస్తాను జవాబివ్వటానికి.

      అసలు తెలుగువారు రాహుకాలం అనేది పాటించటం అనవసరం అని నా వ్యాస సారాంశం అని తెలిసీ ఈ‌ ప్రశ్న వేస్తున్నారే! ఐనా ఒక్క విషయం చెబుతాను శుభాశుభ సమయాలూ ముహూర్తాలూ లోకాచారం లేదా కుటుంబ సంప్రదాయం ఆధారంగా నిర్ణయిస్తారు. ఎటు మొగ్గాలనేది సంబంధిత వ్యక్తుల ఇష్టాఇష్టాలకు సంబంధించినది. దయచేసి ఈ‌ విషయంలో మరింక చర్చ పెంచవద్దు.

      చర్చ అనేది చర్చకు ఉన్న అంశం గురించి మాత్రమే జరగాలి. శాఖాచంక్రమణం చేయటానికో, వాదన పెంచటానికో చర్చలు చేయరాదు. క్షమించాలి, ఇంతకన్నా చెప్పలేను.

      తొలగించండి
    2. నిర్ణయం స్వాభిప్రాయంపై ఆధారపడాలన్నప్పుడు పాటించాలావద్దా అన్నప్రశ్నే తలెత్తదనుకుంటాను :)

      సమాధానాలు నాకు చెప్పనన్నారుకాబట్టి కనీసం మీకోసమైనా నాప్రశ్నల దిశగా ఆలోచించవసిందిగా ఒక సలహా. నిష్ఫలమూ, అనవసరమూ, అనుచితమూ ఐనప్పటికీ. స్వస్థి.

      -నాగ్

      తొలగించండి
    3. నాగ్‌గారూ,

      నేను నా పై సమాదధానంలో 'ఇష్టాఇష్టాలకు సంబంధించినది' అన్నమాట ఒక contextకు సంబంధించి చెప్పాను. దయచేసి గమనించండి.

      మీరు వేసిన ప్రశ్నలు కొన్ని ప్రస్తుత చర్చకు సంబంధించినవి కావని అన్నానే కాని ఆ ప్రశ్నల గుణదోషాలు ఎన్నలేదు.

      అందరి సలహాలూ సూచనలూ ఆహ్వానిస్తాను. లేకుంటే మీతో ఇంత చర్చ జరిగేదా చెప్పండి? ఐతే, ఒక విషయం మీద చర్చలో కొన్ని కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం చర్చను పెంచటం మరియు శాఖాచంక్రమణం చేయటం అవుతుందని వారించానంతే.

      తొలగించండి
    4. బుల్లబ్బాయ్16 అక్టోబర్, 2013 10:16 PMకి


      ఈ రాహుకాలం అనేది సౌరమానం నుంచి వచ్చినట్టుంది... అందుకే తమిళుల పద్దతి లా ఉంది.

      ఇక ఇది పాటించాల వద్దా అన్న ప్రశ్న అప్రస్తుతం...ఎలా అంటే,

      తమిళుల మేష సంక్రాంతి మనం జరుపుకోవాలా వద్దా? అది హిందువుల పండగే కద?
      మలయాళీల ఓనం పూక్కాలం మనం జరుపుకోవాలా వద్దా? అది హిందువుల పండగే కద?

      చివరగా, పాశ్యాత్యుల జాతకాల పిచ్చి తక్కువేమీ కాదు. గ్రహాలు, లక్కీ నెంబర్లు ఇత్యాది.

      తొలగించండి
    5. బుల్లబ్బాయ్ గారు,

      వాళ్ళుకూడా నమ్మినంత మాత్రాన్నే ఇవన్నీ నిజమైపోవు. శాస్త్రానికి ఆధారాలూ, తర్కాలే గీటురాళ్ళుతప్ప నమ్మకాలుకావు.
      bhArgav

      తొలగించండి
    6. బుల్లబ్బాయ్17 అక్టోబర్, 2013 12:08 PMకి

      ఎవడండి వీడు? అది నిజమవుద్దో కాదో కాదు పాయింటు. పాశ్చ్యత్యులు నమ్ముతారా లేదా అన్నదానికి నా రెస్పాన్సు అది.

      తొలగించండి
  11. అందరికీ వందనాలు,
    తెలుగు వారు రాహుకాలం పాటించడం అవసరమా అన్నదే చర్చనీయాంశం.అసలు రాహుకాలం పైన శాస్త్రీయ దృక్ఫథం ఏర్పడితే ఈ ప్రశ్న తల ఎత్తదు. అందుకే నేను కాలనిర్ణయ పుస్తకం గురించి చెప్పాలని ప్రయత్నించాను, కాని చర్చ తప్పు దారి పట్టింది. అందువల్ల ఈ చర్చ నుండి విరమించుకొంటూన్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బుల్లబ్బాయ్17 అక్టోబర్, 2013 12:11 PMకి


      OK. టాటా బై బై

      ఒక పాయింటు కి సప్పోర్ట్ ఉందా లేదా అన్నది కాదు పాయింటు.

      అది మనం పాటించాలా వద్దా అన్నది మన ఇష్టం... మన పెద్దోల్లు చెప్పింది మనం చేస్తాం. అంతె!

      తొలగించండి
  12. రాహుకాలం గురించి సమగ్రంగా శోధించవలసి అవసరం ఉండవచ్చును. మీకు తెలిసిన వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు.

    రావణుడివద్ద లక్ష్మణస్వామి శష్యరికం వంటివి కేవలం తమాషాకథలు మాత్రమే కాని పురాణేఇహాసాల్లో ఉన్నవి కావు.

    సూర్యోదయాది సూర్యాస్తమయపర్యంతమూ పగటి కాలం. ప్రస్తుతం సూర్యోదయంతో దినప్రారంభం చేయటం సంప్రదాయం. పూర్వం సూర్యాస్తమయాది దినప్రారంభం చెప్పే సంప్రదాయమూ‌ ఉండేదని విన్నాను.

    ఆరుగంటలు అన్న మాటలో ఉన్న ఆరు సంఖ్య, గంట అన్న మాటా మరీ ప్రాచీనాలు అనుకోను. ముఖ్యంగా ఆరుగంటలు అనేది ప్రస్తుతం‌ గడియారానికి సంబంధించినది, ఆధునికమైనది. దీన్ని రామాయణం అంత పాతసంప్రదాయం చేయలేము.

    ఐనా, జ్యోతిష్ ఔర్ కాల్ నిర్ణయ్ పుస్తకం తెలుగు అనువాదం దొరికితే పరిశీలిస్తాను. మూలం చదివేటంత హిందీ పాండిత్యం లేదు నాకు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.