28, అక్టోబర్ 2013, సోమవారం

పాఠశాలకోటా మార్కులమీద నాన్నగారి పర్యవేక్షణ.

నాకు  నాన్నగారి దయవల్ల గడచిన హిందీగండం గురించి ముందే వ్రాసాను కదా.  ఆ టపాలోనే మాకు పబ్లిక్ పరీక్షల్లో 75మార్కులకి పేపర్లూ, స్కూలువారి చేతిలో మిగతా 25మార్కుల వాటా ఉండేదనీ కూడా వ్రాసాను. ఆ 25 మార్కులనీ పాఠశాలవారు లెక్కవేయటానికి ఒక పధ్ధతి ఉంది. మాకు  11 మరియు 12వ తరగతులు రెండేళ్ల కోర్సుమీదా నిర్ధాక్షిణ్యంగా  పబ్లిక్ పరీక్షలు ఉండేవి. ఆ రెండు సంవత్సరాలలోనూ విద్యార్ధి  పాఠశాలవారి పరీక్షల్లో సంపాదించుకొన్న మార్కుల ఆధారంగా కొలిచి 25కి ఎన్ని ఇవ్వాలో నిర్థారించేవారు.

నిర్దాక్షిణ్యం అని ఎందుకన్నానో చెప్పాలి కదా.  లెక్కల పేపరూ, సైన్సు పేపర్లు రెండింటిలోనూ సరిగ్గా పది అంటే పది ప్రశ్నలు ఇచ్చే వారు. ప్రతిప్రశ్నకూ‌ మార్కులు సమానము. 10 x 10 = 100 అని నిర్మొగమాటంగా ప్రశ్నపత్రం మీదే వ్రాసేవారు. ఒక్క ప్రశ్న తప్పిపోయినా పది మార్కులు గోవిందా. పేపర్లు వంద మార్కులకు ఇచ్చి 75మార్కులకు త్రైరాశికం చేసేవారన్న మాట. కొన్ని కొన్ని ప్రశ్నలు రెండు పార్టులుగా ఉండేవి. అచ్చుపుస్తకాల్లోని  అధ్యాయాల్లోని ప్రశ్నల్లోంచి ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా ఇవ్వని సందర్భాలూ సాధారణం. పైగా రెండేళ్ళ కోర్సు మీద పరీక్ష కాబట్టి తట్టెడు సిలబస్ తిరగేసుకోవాలి విద్యార్ధులు. పిల్లల్ని ఎలా ఫెయిల్ చేయాలా అన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ఇచ్చినట్లుండేవి ప్రశ్నాపత్రాలు!

మా బేచ్ వాళ్ళకి ఐతే పగవాడికీ రాకూడని ఒక కష్టం కూడా వచ్చి పడింది.  ఇంగ్లీషు మీడియం కోసం అని  విద్యార్థుల్లోంచి మెరికల్లాంటి వాళ్ళని ఏరి ఒక సెక్షన్ చేసారు.  ఐతే జిల్లాపరిషత్ విద్యాశాఖ వారి నుండి అనుమతి రాలేదు. సరేలే అని మాకు తెలుగులోనే బోధన చేసారు.   ఇంక పబ్లిక్ పరీక్షలు మూడు నెలలు ఉన్నాయనగా, ఆ మహా గొప్ప పర్మిషన్ కాస్తా మా పాఠశాల మీదికి విసిరేసారు.  ఇదేం అన్యాయం అని పోయి మొత్తుకున్నా స్కూలు వారి మాట చెల్లలేదు.  అప్పటి కప్పుడు మాకు స్పెషల్ కోచింగ్ మొదలు. అప్పటికప్పుడు ఇంగ్లీషు మీడియం పుస్తకాలు కొనుక్కున్నాం.  మొదట్లో జుట్లు పీక్కున్నా వాటిలో పాఠాలు సరిగా అర్థం కాక చాలా అవస్థపడి పోయాం.  ఎలాగోలా అంతా బండి లాగించేసాం కాని, మొదటినుండి ఇంగ్లీషు మీడియంలో చదివించి ఉంటే మాకు మరిన్ని మంచి మార్కులు వచ్చేవి కదా!

మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉడతల రమణయ్య పంతులుగారు చాలా మంచివారు.  అలాగే ఆయన చాలా నిక్కచ్చి మనిషి కూడా. ఆయన పుత్రరత్నాల్లో చిన్నవాడు వేణుగోపాలరావు మా సహవిద్యార్ధి కూడా.  అతని తమాషా ఒకటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం.

మేము పన్నెండో తరగతిలో ఉన్నప్పుడు రమణయ్య పంతులుగారే లెక్కలు చెప్పేవారు. ఐతే, ఆయనకు పాఠశాల అడ్మినిష్ట్రేషన్ వ్యవహారాలలో మాకు పీరియడ్‌లు తీసుకోవటం తరచుగా కుదిరేది కాదు. అలాంటప్పుడు వేరే మాష్టారుగారు వచ్చి ఆయన క్లాసులు కవర్ చేసేవారు.  పంతులుగారు మాత్రం కుదిరినప్పుడు వచ్చి చాలా బాగా పాఠాలు చెప్పేవారు. ఒకసారి ఆయన మాకు నిర్వహించిన తరగతి పరీక్షల్లో అందరికీ పాతికకూ పాతికమార్కులూ వచ్చాయి. ఎక్కడో తమషా జరిగిందని ఆయనకు అర్థమయింది. ఐనా పిల్లల్ని ఏమీ అనలేదు.  మీరంతా హఠాత్తుగా జీనియస్‌లు ఐపోయారే అని మాత్రం అన్నారు. కాని ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ తిరిగి నిర్వహించారు. ఈ సందర్భంలో,  మా నాన్నగారు నన్ను వాకబు చేసారు. అసలేం జరిగిందీ‌ అని.  పంతులుగారి అబ్బాయి వేణూ  లెక్కలపేపర్ని లీక్ చేసాడనీ అందరికీ అందుకే పూర్తి మార్కులు వచ్చాయనీ నిజం చెప్పాను. అసలు సంగతి విని ఆయన బాధపడ్డారు. ఇలాంటివి జరగకూడదు. నీకు  తెలిసిన వెంటనే నాకెందు చెప్పలేదూ‌ అని కోప్పడ్డారు.  చిన్నతనం.  పేపరు దొరికిపోయిందన్న ఆనందంలో అది తప్పు అన్న స్పృహ రాలేదు.  పంతులుగారు కూడా వేణూని దండించలేదు.  అలా చేయకూడదు తప్పు అని మాత్రం అన్నారట.

రమణయ్య పంతులుగారికి, పిల్లలకి రావలసిన పాతికమార్కుల కోటాలో వాటాలు సరిగా ఉపాధ్యాయులు కొలిచి ఇస్తున్నారా అన్న అనుమానం ఉండేది.  అనుమానం ఉన్నా లేకున్నా, ఆ విషయంలో పాఠశాల పెద్దగా పర్యవేక్షణ చేసే బాధ్యత ఆయన మీద ఉంది కదా. డిఇవో ఇన్‌స్పెక్షన్‌లో ఇలాంటివీ పరిశీలిస్తారు మరి. అందుచేత ఈ స్కూలు తాలుకు మార్కులు పిల్లలకు సరిగా వేస్తున్నారా లేదా క్లాస్‌టీచర్లు అన్నది, పంతులుగారు జాగ్రత్తగా గమనించేవారు.

ఆ పాఠశాలలో మా నాన్నగారు ఒక సీనియర్  బిఇడి ఉపాధ్యాయులు.  అప్పటికే ఆయనకు పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా చేసిన మంచి అనుభవం కూడా బాగా ఉంది.  మంచి బోధకులుగానే కాక, మంచి నిర్వాహకులుగా కూడా నాన్నగారికి జిల్లాస్థాయిలో చాలా పేరుండేది కూడా.  అందు చేత  ఈ‌ పాతిక మార్కుల కోటాను పర్యవేక్షించే బాధ్యతను పంతులుగారు మా నాన్నగారి మీద పెట్టేవారు.  ఆయనొక్కరే కాదు మరొక రిద్దరూ ఈ పనిలో నాన్నగారితో కలిసి పనిచేసేవారు.

ఈ మార్కుల కొలతల్లో  చాలా తమాషాలు జరుగుతూ ఉండేవని నాన్నగారు ఆ రోజుల్లోనే నా దగ్గర  కొన్ని సార్లు అసంతృప్తి వెలిబుచ్చేవారు.  కొన్ని కొన్ని  ఔదార్యాలూ, తరచుగా కక్షసాధింపులూ కనిపిస్తూ ఉండేవట.  అలాంటి కక్షసాధింపుకు నేనూ, నా స్నేహితుడు కన్నబాబూ  దాదాపుగా బలి ఐన సంఘటన కూడా జరిగింది.  ఈ‌ తమాషానీ నాన్నగారే పట్టుకున్నారు. అది తరువాత చెబుతాను.

కొంత మంది ఉపాధ్యాయులు పిల్లలమీద దయకొద్దీ హెచ్చు మార్కులు వేసేవారు ఈ కోటాలో. ఒక ఉదాహరణ చెబుతాను.

మేము 12వ తరగతిలో ఉండగా జరిగిన సంగతి.  హిందీ‌ పాఠం చెబుతున్నారు పుప్పాల వేంకట్రావు గారు.  మా వయసువాడే ఒక పిల్లాడు వచ్చి గుమ్మంలో నుంచున్నాడు.  మాష్టారు వాణ్ణి లోపలికి రారా అన్నారు.  వాడు వచ్చి ఒక చీటీ‌ ఇచ్చి మాష్టారి ముఖంలోకి ఆదుర్దాగా చూస్తూ ఉన్నాడు.  వేంకట్రావుగారు ఆ చీటీ చదువుకొని, "సరే, నువ్వెళ్ళు.  నేను హెడ్మాష్టరుగారితో మాట్లాడతానులే" అని చెప్పి, వాడిని పంపేసారు.  ఆ కుర్రాడు వెళ్ళిపోయాక మేష్టారు మాతో అన్న మాటలు ఇంకా చక్కగా గుర్తున్నాయి.

"ఒరే, ఈ‌ దిక్కుమాలిన హిందీ అందరికీ  బాగా రావాలని లేదు. అందుకే, అన్ని సబ్జెక్టుల్లోనూ  ముఫై ఐదు పాస్ మార్కులు అనీ, హిందీకి పదిహేను  చాలనీ అన్నారు.  వీడికి ఆ పదిహేనూ తెచ్చుకోవటం కష్టం కాబట్టి నా చేతిలో ఉన్న పాతికకూ, పోనీలే అని పద్నాలుగు వేసాను. ఆ మిగిలిన ఒక్క మార్కూ తెచ్చుకోలేక ఫెయిల్ ఐతే ఎలాగర్రా?  మళ్ళీ స్కూల్లో చేర్చుకోండీ అని వచ్చాడు.  నువ్వు రికమెండ్ చేస్తావా అంటారు పంతులుగారు.  ఏం చెయ్యాలో మీరే చెప్పండ్రా?"

నిజానికి హిందీలో పాస్ మార్కులు చాలా సులువుగా వచ్చేవి. 'నే' ఎ క్కడ వాడాలీ, 'కి ' ఎక్కడ వాడాలీ లాంటి కొన్ని గ్రామరు సూత్రాలు వస్తే సులువుగా పదిహేను మార్కుల సెక్షన్ లో పదికి పైనే వచ్చేవి. ఉత్తరం రాయటం‌ ప్రహసనంలో చూస్తే, ఉత్తరంలో విషయం ఏమీ అవసరం లేదు - సరైన ఫార్మాట్‌లో రాసి పారేయటమే. లెటర్ బాడీగా ఆ ప్రశ్నపత్రం లోంచి ఒక లైను ఎక్కించినా చాలు.  పదిహేనుకూ పది మార్కులు గ్యారంటీ.  ఇలాంటి సుళువులు బోలెడు ఉండేవి.  స్కూలు వారు ఎంత చెడ్డా పదో పరకో వేసే పంపేవారు.  చివరికి చచ్చుపక్షం పాతిక -ముఫై  మార్కులు వచ్చి పడేవి ఒళ్ళో.  కావలసిన పాస్ మార్కులు పదిహేనూ రాక ఎవరూ తప్పవలసిన అగత్యం ఉండేదే కాదు.   ఐనా, ఈ‌ పిల్లవాడు  75మార్కులకు ఒకటీ తెచ్చుకోలేక పోవటం వింతే మరి!  అలాంటి వాడికి పద్నాలుగు ఎలా వేసి పంపావని ఇప్పుడు పంతులుగారు వేంకట్రావుగారిని నిలదీసే పరిస్థితి!

పుప్పాల వేంకట్రావుగారిలా అందరూ  అంత దయగల ఉపాధ్యాయులు కారు.  ఆ రోజుల్లో పంతుళ్ళు ఇళ్ళవద్ద స్టూడెంట్లకి ప్రైవేట్లు చెప్పటం మహా జోరుగా ఉండేది.  చాలా మంది తమతమ ఇళ్ళకు ప్రైవేటుకు వచ్చే వారికి ఒకలాగా మిగతా వారికి మరొకలాగా మార్కులు వేసేవారు!  ఆ మరొకలా అనేది అప్పుడప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా ఉండేది.

ఈ‌ స్వపక్షం విద్యార్థులకి మంచి మార్కుల కోసం కొందరు టీచర్లు పేపర్లు దిద్దే విధానం చాలా తమాషాగా కూడా ఉండేది అనటంలో వీసమంత అతిశయోక్తి కూడా లేదు.  అందుచేత స్కూలు నుండి పిల్లలకు మార్కుల విషయంలో అన్యాయం జరగకుండా చూడటం అంటే ఆవరేజ్ చేయటంలో పొరపాట్లు పట్టుకోవటమే కాదు, ఆ రెండేళ్ళ పేపర్లూ అన్నీ సరిగా దిద్దారా లేదా అన్నదీ క్షుణ్ణంగా చూసేవారు.  ఉదాహరణకు, ట్యూషన్ పిల్లలు తమ మాష్టారు బట్టీ పట్టించిన సాదాసీదా సమాధానం వ్రాసి పదికి పదీ‌ తెచ్చుకుంటే, మిగతా విద్యార్థులకు పదికి మూడూ నాలుగూ‌ పడేవి అంతకంటే మంచిగా సమాధానం వ్రాసినా సరే.  నాకే ఇలాంటి అనుభవాలు కొల్లలుగా అయ్యాయి! మేష్టర్లు తమ ట్యూషన్ పిల్లలకు ప్రశ్నపత్రాలు లీక్ చేయటమూ తరచుగా జరిగేదంటే పరిస్థితి అర్థం చేసుకోండి.

నాకు తెలిసి ఇంగ్లీషులో ట్యూషన్ చెప్పించుకునే పిల్లలే కాని తెలుగులోనో, హిందీలోనో ఆ  అవసరం పడే పిల్లలెవరూ ఉండేవారే కాదు. లెక్కలూ సైన్సూ సబ్జెక్టులకు ట్యూషన్ అన్నది సర్వసాధారణం. మా నాన్నగారే నాకు అన్నీ చెప్పేవారు అవసరమైతే.  కాబట్టి నేను ట్యూషన్లకు వెళ్ళే పని ఉండేది కాదు.

హిందీలో అలా వేంకట్రావుగారు దానకర్ణుళ్ళా పదులూ పద్నాలుగులూ వేసేస్తుంటే డిఇవోలు పట్టుకుని అభ్యంతరం చెప్పరా అని అనుమానం వస్తుంది కదా?  నాకు అదే అనుమానం వచ్చి నాన్నగారిని అడిగితే పై చదువులకు హిందీ అంత అవసరం కాదుగదా, ఆ హిందీలో పిల్లలు అనవసరంగా ఫెయిల్ కావటమెందుకూ అని ఈ సబ్జెక్టు విషయంలో మాత్రం అంతా -అంటే అన్ని స్కూళ్ళ లోనూ- కొంచెం ఉదారంగా ఉంటారని చెప్పారని గుర్తు. "పది వరకూ ఫరవాలేదు. మరీ ఎక్కువగా వేసేయకండీ" అన్నా  వేంకట్రావుగారు వినేవారేకాదట.

అన్ని రకాల కారణాలూ‌ కలిసి ప్రతి సంవత్సరమూ చాలా మంది విద్యార్థులకి స్కూలు కోటా మార్కుల్లో సమస్యలు వస్తూ ఉండటమూ,  వాటిని నాన్నగారూ మరొకరిద్దరూ‌ మాష్టర్లు కూర్చుని పట్టుకుని సరిచేయవలసి వస్తూ ఉండటమూ అటు పంతులుగారికీ, ఇటు నాన్నగారికీ ఆందోళన కలిగించేది.  ఈ విషయం నాన్నగారే నాతో కొన్ని సార్లు ప్రస్తావించి బాధపడ్డారు.  ఉపాధ్యాయవృత్తి పవిత్రతకు భంగం వాటిల్లుతోందని విచారించే వారు.

2 కామెంట్‌లు:

  1. ఇష్టపడి చదువుకుంటే సమస్యలుండవండి.అనుభవం బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. మా స్కూలు రోజుల్ని గుర్తుకు తెప్పిస్తున్నారు. మా నాన్నగారు కూడా స్కూలు టీచరే అవడంతో మీరు ఉదహరించిన వాతావరణమే మా ఇంట్లోనూ ఉండేది.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.