12, అక్టోబర్ 2013, శనివారం

శ్రీలలితాసహస్రనామస్తోత్రంలో బ్రహ్మతత్త్వాన్ని చెప్పే నామాలు - 1


132. నిరాధారా
అమ్మకు ఏ విధమైన ఆధారమూ అవసరం లేదు అని అర్థం. అమ్మ సర్వజగత్తులోనూ‌ ఉన్నది.  సర్వజగత్తుకూ ఆమె తల్లి. అమెకు వేరొకరు ఎవరూ ఆధారం కాదు - తనంత తానుగా ఉండేది అమ్మ. అమ్మయే సర్వాధిష్ఠాన బ్రహ్మతత్త్వం కాట్టి ఆమె నిరాధార అని అర్థం.

133. నిరంజనా
అంజనం అంటే కాటుక -నల్లని మరక వంటిది - చీకటి వంటిది.  మాయ అనబడే అవిద్య కారణంగానే నల్లని మరకలు అంటే దోషాలు. అమ్మ జ్ఞానస్వరూపురాలు. కేవలం శుధ్దవిద్యాస్వరూపురాలు కాబట్టి ఆమెకు  అవిద్య అన్నది లేనేలేదు.  అమ్మ అత్యంతస్వఛ్ఛమైన కేవల జ్ఞానస్వరూపం.

134. నిర్లేపా
అమ్మ ఏవిధమైన కర్మ సంబంధమూ లేనిది అని అర్థం. లేపనం అంటే పై పూత. కర్మ సంబంధమైనది ఇక్కడ ప్రస్తావించిన పూత అనే పదం.  భగవద్గీతలో కూడా లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభసా అని తామరాకు నీళ్ళల్లో ఉన్నా నీరు దానికి అంటనట్లు జ్ఞానికి పాపపు పూత అంటదు చెబుతుంది.

135. నిర్మలా
అమ్మ అత్యంత పరిశుధ్ధురాలు. మురికి అంటే అవిద్యయే. సర్వత్ర సర్వకాలములందూ ఒక్కటే ఐన సత్యవస్తువు బ్రహ్మమును గుర్తించలేక జీవులు రాగద్వేషాలు వంటి ద్వంద్వాలను ఆ అవిద్య కారణంగానే అనుభవిస్తూ ఉంటారు.  కేవల జ్ఞానస్వరూపిణి, సాక్షాత్తూ పరబ్రహ్మమే ఐన అమ్మ వద్ద  అవిద్య ఉండటం అనే ప్రసక్తే ఉండదు.  సూర్యుడి వద్ద చీకటి ఉండదు కదా! అమ్మ అందుకే నిత్యశుధ్ధ.

136. నిత్యా
అమ్మయే నిత్యమైనది. ఆమె త్రికాలల్లోనూ కేవలజ్ఞానస్వరూపిణిగా ఉండి అన్ని లోకాల్లోని అందరు జీవులకూ తల్లియై అనుగ్రహిస్తున్నది. అందరు జీవుల్లోని ఆత్మస్వరూపమూ అమ్మయే.  అవినాశీ వారేయ మాత్మా అని శ్రుతి ఆత్మ వినాశనం లేనిది - నిత్యం అని చెబుతున్నది.

137. నిరాకారా
అకారం లేనిది అని అర్థం. భాగవతం కూడా పరబ్రహ్మ దేవదానవనరాదుల్లో ఎవరి స్వరూపమూ  కలవాడు కాదు. స్త్రీపురుష నపుంసక స్వరూపాల్లో ఏదీ‌ కాదు, త్రిగుణాల్లో ఏదీ కలవాడు కాదు, సత్-అసత్ అని చెప్పబడే ఏదీ కాదు, అయినా అన్నీ‌ తానే, అన్నిటికీ అతీతమైన తత్త్వమూ తానే అని చెబుతుంది.  మనకు తెలిసి స్వరూపం అనేది కరచరణాదులు కలిగి ఉండాలి.  ఐతే కరచరణాదులనే ఇంద్రియాలు త్రిగుణాల కారణంగా వచ్చాయి.  పరతత్త్వమైన శ్రీదేవి ఆ త్రిగుణాలకు పూర్వం నుండే ఉన్నది కదా.  అందుచేత ఆవిడ కేవలం తేజస్స్వరూపురాలు అని భావన.

138. నిరాకులా
ఆకులము అంటే కలత, బాధ. అమ్మ ఆకులము లేనిది. కలత అనేది కేవలం అవిద్య ఉన్న చోటే ఉంటుంది. అమ్మ విద్యాస్వరూపిణి.  శుధ్ధజ్ఞానమూర్తి. అందు వలన అమ్మకు ఎన్నడూ  ఏవిధమైన భావవికారాలూ వాటివలన వచ్చే కలతలూ ఉండవు.

139. నిర్గుణా
అమ్మ త్రిగుణరహితురాలు. అమ్మ యే పరబ్రహ్మము.  పరబ్రహ్మము సృష్టిలో మొదట కలిగినవి ఈ త్రిగుణాలు.  వీటి ఆధారంగా జరిగిన సృష్టిలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలూ, వాటి అధిదేవతాస్వరూపాలూ, జీవులు, వారికి శరీరాకృతులు అన్నీ అమరాయి. అమ్మ అన్నిటి కన్నా ముందు నుండీ ఉన్న నిత్యసత్యస్వరూపిణి. ఆమె గుణాలను సృజించింది కాని అవి ఆమెకు లేవు.  ఈ విషయాన్ని చమత్కారంగా నారదుడు హిమవంతుడితో  "అమ్మాయి జాతకం లోకోత్తరం. ఆమె లక్షణవర్జితురాలు" అని అంటాడు.

140. నిష్కళా
అమ్మ కళలు లేనిది. కళ అంటే అంశం. నిష్కళా అంటే కళలకు అతీతురాలు అని అర్థం.  భగవద్గీతలో కృష్ణుమమైవాంశో జీవలోకః అంటాడు.  లోకం అంతా భగవంతుని అంశ మాత్రమే. బగవత్స్వరూపం మాత్రం నిత్యపూర్ణం. సాధకానాం‌ హితార్థాయ బ్రాహ్మణో రూపకల్పనా అని చెబుతారు . అంటే సాధనా సౌలభ్యం కోసం పరబ్రహ్మమునకు రూపాన్ని కల్పించుకోవటమే కాని బ్రహ్మమునకు నిర్దిష్ఠమైన రూపం లేదు. ఐనా రూపం అనేది నామరూపాత్మకమైన ప్రకృతి లక్షణం - పరబ్రహ్మలక్షణం‌ కాదు.  అమ్మ సంపూర్ణబ్రహ్మతత్త్వం అని అర్థం.

142. నిష్కామా
అమ్మ ఏ కోరికా లేనిది. అమ్మ సర్వజగత్తుకూ అధినేత్రి. ఆమెకన్న పైవా రెవరూ లేరు. అమె తలంపుకు ఎన్నడూ అడ్డులేదు. అందుచేత సర్వకాలము లందూ సర్వదేశము లందూ అమ్మకు కోరవలసినది ఏదీ లేదు. అంతా తానే ఐన తల్లికి, సృష్టిలో అన్నీ తానే ఏర్పరచిన పరబ్రహ్మతత్త్వం ఐన తల్లికి, ఏది తనది కాదు కాబట్టి ఇది నాకు  కావాలీ అన్న కోరిక కలగటానికి?

143. నిరుపప్లవా
ఉపప్లవం అంటే ఆపద, నాశము. సృష్టిలో అన్నింటికీ జనన, వృధ్ధి, నాశములు ఉన్నాయి. అమ్మ సృష్టికే ఆద్యురాలు. అమ్మ అందుకే ఏ విధమైన ఉత్పాతాలు, ఉపద్రవాలూ, వృధ్ధిక్షయాలు లేనిది.  కేవలం మోక్షస్వరూపురాలు అని అర్థం.

144. నిత్యముక్తా
ముక్తము అంటే విడిచిపెట్ట బడింది అని అర్థం. ముక్తా అని స్త్రీలింగం. అర్థం అదే. అమ్మకు బంధాలు ఏమీ లేవు ఎన్నడూ.  బంధం అనేది ఉన్నప్పుడు కదా వాటినుండి విడుదల పొందినస్థితి కలగటం? బంధానికి కారణం అవిద్య. అంటే జ్ఞానరహితమైన స్థితి.  అమ్మ కేవల జ్ఞానస్వరూపిణి. సృష్టికే ఆద్యురాలు. ఆమెకు ఎన్నడూ బంధం లేదు. నిత్యం ఆమె మోక్షస్వరూపిణి.

ముక్తిపొందినట్టి భక్తులచే ఆశ్రయించబడినది అన్న అర్థం కూడా ఈ‌నామానికి చెబుతారు. అమ్మను ఆశ్రయించటం వలన ముక్తి వస్తుందని ధ్వని. ముక్తిపొందినవారు కేవల పరబ్రహ్మంతో సాయుజ్యం కలిగిన వారు కాబట్టి అమ్మయే బ్రహ్మము కాబట్టి అలా ముక్తి పొందినవారితో కూడుకొని ఉంది అమ్మ అని అర్థం.

145. నిర్వికారా
అమ్మ ఏవిధమైన వికారములూ లేనిది. వికారం అంటే మార్పు - పరిణాం. సృష్టిలో సమస్తమూ జననమూ, స్థితీ, క్షయమూ అనే వికారాలు కలిగి ఉంటాయి. జీవులకు వృధ్ధి అనే మరొక వికారమూ, ఆ వృధ్ధిలో బాల్యం, యౌవనం, కౌమారం వార్థక్యం అనే అవస్థలూ ఉంటాయి. జాగదవస్థా, స్వప్నావస్థా, నిద్రవస్థా అనే వికారాలూ ఉంటాయి.  ఇలాంటి వికారాలేవీ లేనిదీ, మహదాతి తత్త్వాలకి అతీతామైనదీ ఐన పరబ్రహ్మము ఒక్కటే. ఆమ్మ శ్రీదేవియే ఆ పరబ్రహ్మము.

146. నిష్ప్రపంచా
ప్రపంచము లేనిది అమ్మ. ప్రపంచం అంటే విస్తరించి ఉండేది. పంచభూతాలు, త్రిగుణముల యొక్క విస్తారం వలన పుట్టినది బాహ్యప్రపంచం. దానిలో పదునాలుగులోకాలు, వాటిలోని చరాచరప్రకృతి అంతా ప్రపంచంలో భాగం. దానిని నడిపించేది కాలం. ఆ కాలం అమ్మ యొక్క స్వరూపమే. జీవులలో ఉండే కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ, పంచ వాయువులు, పంచ ఉపవాయువులూ, అంతఃకరణ చతుష్టయమూ, కామాది షడ్వర్గాలూ వగైరా సరంజామా అంతా కలిపి అంతఃప్రపంచం. అంతఃప్రపంచాలతో కూడిన జీవులంతా బాహ్యప్రపంచంలోని వారు.  అంతఃప్రపంచం జీవుని యందు ఉన్నట్లుగానే సమస్త బ్రహ్మాండాలతో కూడిన బాహ్యప్రపంచమూ అమ్మ యందు ఉన్నది. జీవుల్ని వారి వారి అంతఃప్రపంచ, బాహ్యప్రపంచాదులు నడిపించుతూ ఉంటాయి.  సమస్తమైన ప్రపంచములూ అమ్మయందే ఉన్నాయి కాని అమ్మను నడిపించే ప్రపంచం ఏమీ ఉండదు. ఆమె సర్వాధిష్టాత్రి. కాబట్టి అమ్మ ప్రపంచం లేనిది.

147. నిరాశ్రయా
అమ్మకు (వేరే) ఆశ్రయం ఏమీ లేదు.  విశ్వం ప్రతిష్టితం యస్యాం తస్యాః కుత్ర ప్రతిష్టా? సర్వ విమూ కేవల పరబ్రహ్మమైన అమ్మను ఆశ్రయించుకుని ఉంది కాబట్టి అమ్మకు వేరే ఆశ్రయం అంటూ ఉండటం అసందర్భం. ఆమె ప్రపంచాతీత తత్త్వం.  కాబట్టి తల్లి నిరాశ్రయ.

148. నిత్యశుధ్ధా
అమ్మ త్రికాలములలోనూ మాలిన్యం లేనిది. మాయోపాధి వినిర్ముక్తం శుధ్ధ మిత్యభిధీయతే. అమ్మ మాయకు అతీతురాలు. మాయ ప్రపంచంలోనిది. అమ్మ ప్రపంచానికే అతీతమైన తత్త్వం కదా. కాబట్టి అమ్మ నిత్యశుధ్ధ.

149. నిత్యబుధ్ధా
అమ్మ నిత్యం కేవలం జ్ఞానస్వరూపిణిగా ఉంది అని అర్థం. అమ్మకు త్రికాలములలోనూ అజ్ఞానం యొక్క స్పర్శయే లేదు. కాలం అనేది యే‌ పరబ్రహ్మము యొక్క సృష్టియో, ఆ పరబ్రహ్మమే శ్రీదేవి. ఆ తల్లియే‌ జ్ఞానమునకు మూల స్వరూపం. కాబట్టి అమ్మ నిత్యబుధ్దస్వరూపిణి