24, అక్టోబర్ 2013, గురువారం

హీరో నాగేశ్వరరావునే గురుపట్టలేదు మా నాన్నగారు.

అది 1972వ సంవత్సరం.  ఆ యేడాదిలో మానాన్నగారు స్వర్గీయ వేంకట సత్యనారాయణగారికి రంపచోడవరం హైస్కూలుకు హెడ్మాష్టరుగా బదిలీ అయింది. అప్పటి దాకా మేము కొత్తపేటలో ఉండేవాళ్ళం.

ముందుగా నాన్నగారు వెళ్ళి రంపచోడవరంలో ఛార్జీ తీసుకుని వచ్చారు.  ఒక తమాషా విషయం చెప్పారు.  ఊరిపెద్దలు నాన్నగారికి ఊరు తిప్పి చూపించారట.  ఒక చిన్న గుడిసెలాంటి ఇంటిముందుకు వచ్చాక ఆ యింటిలోని ఒకావిడ వచ్చి పరిచయం చేసుకున్నారట.  ఆవిడ పేరు రత్నాబాయి అని నాన్నగారు చెప్పినట్లు గుర్తు.  అవిడ అక్కడ ఎమ్మెల్యే.   ఆ సంవత్సరం ఆగష్టు 14న మా కుటుంబం అంతా రంపచోడవరం వచ్చాము.

మాకు క్వార్టర్స్ ఇచ్చారు.  అందులో రెందు పోర్షన్లు.  ఒకటి ప్రధానోపాధ్యాయులకు.  మరొకటి మరెవరైనా ఇతర  ఉపాధ్యాయులకు తాత్కాలిక వసతిగా ఇచ్చేందుకు ఉద్దేశించబడ్దాయి ఆ పోర్షన్లు.  అన్నట్లు వాటిలో కరెంటు సదుపాయం లేదు అప్పటికి. 1975లో వచ్చింది వాటికి కరెంటు.

శ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారు హీరోగా బాపుగారు తీసిన అందాలరాముడు సినిమా 1973సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చింది. ఈ  సినిమాకోసం  తూర్పుగోదావరిజిల్లా ఏజన్సీ ప్రాంతం లోని దేవిపట్నంలో  విస్తారంగా షూటింగ్ చేసారు.  దేవీ పట్నానికి రోడ్డు మార్గం అంటే వయా రంపచోడవరం.

ఆ రోజుల్లో జై ఆంధ్రా ఉద్యమం చాలా జోరుగా సాగుతూ ఉండేది.

వేసంగి సెలవుల్లో పాఠశాలలకు సెలవులు. ఉపాధ్యాయులంతా స్వస్థలాలకు వెళ్ళి మళ్ళీ బడి తెరచే రోజుకు చేరుకుంటారు. ప్రధానోపాధ్యాయులకు మాత్రం సెలవులు కావా ఏమిటి. వారికీ సెలవులే. ఐతే మా నివాసం స్కూలుకు అతిసమీపం లోనే.  స్కూలు ఎదురుగా ఆటస్థలం. అందులోనే ఒక మూల మా క్వార్టర్స్ అన్నమాట.  అటస్థలానికి మరొక పెడగా పిల్లలకు హాస్టల్ ఉంది. అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట నాన్నగారు అఫీసుకు వెళ్ళి  కాగితాలు చూసుకుంటూ ఉండేవారు.

అలా ఒక రోజున ఆయన ఆఫీసు పనిలో నిమగ్నమై ఉన్నారు.

ఒక వ్యక్తి అఫీసు గుమ్మం వద్దకు వచ్చి నిలబడ్డారు.

ఎవరో వచ్చిన అలికిడి గమనించి  నాన్నగారు 'కమిన్' అని ఆహ్వానించారు.

ఆ  లోనికి వచ్చిన పెద్దమనికి కుర్చీ చూపించి కూర్చుండబెట్టి 'చెప్పండి, ఏ పని మీద వచ్చారు' అన్నారు నాన్నగారు.

వచ్చిన పెద్దమనిషి  కుర్చీలో కొంచెం  ఇబ్బందిగా కదిలి, 'నా పేరు నాగేశ్వరరావంటారండీ. నేను సినిమాల్లో  వేషాలు వేసుకుంటూ ఉంటాను' అన్నారు.

వచ్చిన పెద్దమనిషి సినిమాహీరో‌ నాగేశ్వరరావుగారు అన్నది అర్థం కావటానికి మానాన్నగారికి ఒక నిమిషం పట్టింది.  చాలా ఆశ్చర్యపోయారు.  సినిమా హీరోగారికి ఒక పాఠశాలతో ఏం‌ పనబ్బా అనుకున్నారు.

నాగేశ్వరరావుగారు సందర్భం వివరించారు. జై ఆంధ్రా ఉద్యమకారులు రంపచోడవరంలో నాగేశ్వరరావుగారి కారుని ఆపి ఉద్యమాన్ని సమర్థిస్తూ‌  పత్రికా ప్రకటన విడుదల చేయాలని డిమాండు చేసారట. అలాగే నని చెప్పి ఆయన వారిని సముదాయించి బయట పడ్డారు. ఆ తరువాత ఆయన తిన్నగా స్కూలు దగ్గరకు వచ్చారు.

"రామారావుగారితో మాట్లాడాలండీ.  మద్రాసు నుండి ఆయన మా ఇద్దరి తరపునా పత్రికలకు  ప్రకటన ఇస్తారు ఈ‌ విషయమై" అన్నారు నాగేశ్వర రావుగారు మానాన్నగారితో.

"ఇక్కడ మీ‌ స్కూలులో‌ టెలిఫోన్ ఉంటుందని పిల్లలు చెబితే వచ్చాను.  మీరు ఈ‌ విషయంలో దయచేసి సహాయం చేయాలి" అని నాగేశ్వరరావు గారు తాను స్కూలుకు ఎందుకు వచ్చిందీ వివరించారు.

మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. "స్కూల్లో ఫోన్ లేదండీ. మీరు మద్రాసుకి ఫోన్ చేయాలంటే పోష్టాఫీసుకు వెళ్ళాలి" అని సలహా ఇచ్చారు.

"అలాగా " అన్నారు నాగేశ్వరరావు గారు.

నాన్నగారు "బుచ్చన్నా" అని  పిలుస్తే  గుమ్మందగ్గరే తచ్చాడుతున్న బంట్రోతు లోపలికి వచ్చాడు.  వాడు జరుగుతున్న తమాషా అంతా గుమ్మంలోంచి చూస్తూనే ఉన్నాడు. "నువ్వు పోష్టుమాష్టరు సాంబమూర్తిగారికి ఈ చీటీ అందించు" అని అప్పటి కప్పుడు చీటీ వ్రాసి పంపారు నాన్నగారు.

కొద్ది సేపటికి బుచ్చన్న తిరిగి వచ్చాడు, అంతా సిధ్ధం అన్న వర్తమానంతో.  నాన్నగారు బుచ్చన్ననీ, నాగెశ్వరరావుగారినీ వెంట బెట్టుకొని పోష్టాఫీసుకు వెళ్ళారు.

సాంబమూర్తిగారు ఒక రూములో ఫోన్ పెట్టించి ఉంచారు అప్పటికే.  ఆ తరువాత నాగేశ్వరరావుగారు రామారావుగారిని ప్రకటన విషయమై సంప్రదించి ఉంటారు.

ఈ  సంఘటన నా కళ్ళముందు జరగ లేదు. జరిగిన విషయం అంతా బుచ్చన్న వచ్చి మా అమ్మగారికి పూస గుచ్చినట్లు వివరించాడు.

రంపచోడవరంలో బ్యాంక్  ఉద్యోగి రామ్మోహనరావుగారనీ ఒకాయన నా స్నేహితులు. బహుశః అప్పుడు నేను ఆయన దగ్గరకు వెళ్ళి ఉంటాను.  మేము రంపచోడవరం నుండి రాజోలు బదిలీ జరిగి వెళ్ళాక కూడా రామ్మోహనరావుగారు మా కుటుంబానికి చాలా సహాయం చేసారు.  ఆ విషయం వేరే చెప్పుకోవాలి.

నేను సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక,  ఆ రోజు జరిగిన సంఘటన  విషయం మా అమ్మగారు నాకు చెప్పారు.

ఎదురుగా నాగేశ్వరరావుగారు వచ్చి కూర్చుంటే,  మా నాన్నగారు ఆయన్ని సుతరామూ గుర్తు  పట్టలేకపోవటం నాకైతే  చాలా తమాషాగా అనిపించింది.

( నేను నిన్న లక్ష్మీఫణి గారి బాతాఖానీ బ్లాగులో గుర్తుంచుకోవటం టపాకు సందర్భం వచ్చి వ్రాసిన ఒక వ్యాఖ్య తరువాత, ఆ విషయం వివరంగా అక్షరబధ్ధం చేసుకోవాలని అనిపించి ఈ బ్లాగులో వ్రాసుకున్నాను. )