23, అక్టోబర్ 2013, బుధవారం

పవన్ రాజకీయాలలోకి వస్తాడా?

పవన్ రాజకీయాలలోకి వస్తే అన్న విషయం మీద చర్చలు జరుగుతున్నాయి.

అందరికీ పవన్ కాస్తా అన్నగారిలా (అంటే సీనియర్ నందమూరి తారకరామారావుగారిలా) హిట్టవుతాడా? స్వంత అన్నయ్యలా ఫట్టవుతాడా?  అని ఆలోచనలూ అందోళనలూ అనుమానాలూ.  వెరసి బోలెడన్ని చర్చాగోష్ఠులూ!

ఇవన్నీ మంచి కాలక్షేపం చర్చలే అనటంలో సందేహం లేదు.

ఇప్పుడు తెలుగునాట ఉన్న పార్టీలు తెలుగువారి భవిష్యం కోసం ఏదో ఉడబొడిచేశాయా లేదా ప్రస్తుతం ఊడబొడుస్తున్నాయా?  ముందు ముందు కాలంలో ఏమైన ఉధ్ధరించ బోతున్నాయా?

అలాంటి దేమీ‌ లేనే లేదు కద?

ఉన్న సవాలక్ష పార్టీలూ తమ తమ మనికి కోసం, ఆ మాట కొస్తే  అసలు ఉనికి కోసం పాకులాడే పరిస్థితిలో ఉన్నాయనటంలో సందేహం ఎవరికైనా ఉందా?

ఇప్పుడు మరో పెద్దమనిషి మరో కొత్త పార్టీ‌ పెట్టి నన్నూ జనం మీద పడి బతకనివ్వండి అనబోతాడా అనడా అని మనం చర్చించ వలసిన అవసరం ఏమన్నా ఉందా?

ఈ స్వతంత్రభారతదేశంలో అన్ని రాజకీయపార్టీలూ జనం మీద పడి బతుకుతున్నాయే కాని ఏ ఒక్క పార్టీ‌ కూడా జనంకోసం బతకటం లేదు.

సామాజికస్ఫహ లాంటి మాటలు బాగుంటాయి వినటానికి.  క్రియలోకి వచ్చేసరికి ఈ‌ మాటా,  ప్రజాసేవ గట్రా మాటలూ మాట్లాడే వాళ్ళు చేస్తున్న రోతపనులకి చివరికి ఆ మాటల అర్థం మీదే జనానికి అనుమానం వచ్చే టంత గొప్పగా ఉంది పరిస్థితి.

మనదేశంలో  రాజకీయనాయకులు అధికారం కోసం ఏమైనా చేస్తారు.

మనదేశంలో బడాదొంగలు రాజకీయాల్లోకి వచ్చి పవిత్రులై పోతారు.  వాళ్ళని పవిత్రీకరించటానికి రాజకీయాల్లో బోలెడు అవసరాలూ, మార్గాలూ ఉంటాయి కూడా.

మనదేశంలో, మేధావులు నిత్యం రకరకాల గొప్ప చర్చలు చేస్తూ వినోదిస్తుంటారు.

మనదేశంలో, ప్రజల్లో చదువుకున్న వాళ్ళమని గర్వపడేవాళ్ళు మేధావుల చర్చలను ఫాలో ఐపోతూ ఆవేశపడిపోతుంటారు.

మనదేశంలో, ప్రజల్లో అత్యధిక శాతం మంది ఓట్లపండగ రోజున తమ వర్గం వాడికో, తమ కులం వాడికో, తమ అభిమాన నాయకుడికో, వాడి పాదదాసుడికో, తమకు తాయిలాలు అందిచ్చిన వాడికో ఓటు వేసి తరించిపోతుంటారు.

మనదేశంలో, జనం తిండికి మాడి చస్తూనే,  దొరతనాలు ప్రకటించే అంకెలగారడీలతో అవలీలగా పేదరికం రేఖని దాటేస్తూ‌ ఉంటారు.

మనదేశంలో, క్రికెట్టూ, రాజకీయాలూ, సినిమాలూ వంటివి, జనాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయి రోజూ.  కాని ఏరోజూ దేశపుభవిష్యం గురించి ఆలోచించే‌ టంత తీరికా ఓపికా ఎవరికీ‌ ఉండవు. అవును మరి. అదేమన్నా ఏమన్నా వినోదాత్మకమైన కాలక్షేపమా, సమయం దానిమీద చెచ్చించేందుకు?

ఇష్టమైతే, అంతగా దురద పుడితే, పవన్ ఒక రాజకీయ పార్టీ‌ పెడితే పెట్ట నివ్వండి.
ప్రజకి ఒరిగేది ఏమీ‌ ఉండదు.

ఈ‌ మాట పవన్‌కే‌ కాదు మరెవరికైనా సరే వర్తిస్తుంది.

అన్నట్లు కిరణ్ కుమార్ కూడా ఒక కొత్త పార్టీ‌ పెడతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  ఐతే ఏమిటట?

ఒకవేళ కిరణ్‌గారికి కొంత మంచి పబ్లిసిటీ వచ్చింది కాబట్టి, పార్టీ ఒకటి పెట్టినా ఆనక ఎలక్షన్ ముచ్చట్లు కాస్తా పూర్తయ్యాక, శుభముహూర్తం చూసుకుని స్వగృహప్రవేశం చేయరని గ్యారంటీ‌ ఏమీ లేదు కదా?

పవన్‌గారు కొత్తపార్టీ పెట్టినా ఎన్నికల తర్వాత అది కాస్తా ఉంటుందో ఆయన పార్టీకి కూడా ఆయన అన్నగారు చిరుకు లాగే జ్ఞానోదయం కాదని గ్యారంటీ‌ ఏమీ లేదు కదా?

ఐనా రాజకీయనాయకులు ఎవరూ కూడా, తమ మాటల్ని తామే గౌరవించుకోరే, అలాంటిది వారి గురించి జనం నమ్మకాలూ అంచనాలూ ఏమిటీ అసయ్యంగా?

మన పవిత్రభారతదేశంలో, రాజకీయాలు జూదంకన్నా, మరొకదానికన్నా కూడా పరమనీచంగా నడుస్తున్నాయి!

ఐతే తప్పంతా రాజకీయనాయకులదీ రాజకీయాలదీ అనుకోకండి!!

ఇలాంటి రాజకీయవాతావరణాన్ని పోషిస్తున్న మనపవిత్రభారతదేశప్రజదే ఈ‌ తప్పంతా!

ఐతే ఆ మాట ఒప్పుకుందుకు మటుకు, మనకు ఆభిజాత్యం అనండి, అహం అనండి, అది అడ్డం వస్తుంది.  అందుచేత ఎప్పుడూ రాజకీయాలు బాగుపడాలీ రాజకీయనాయకులు మంచివాళ్ళైపోవాలీ లేదా మంచివాళ్ళే రాజకీయాల్లోకి రావాలీ అని తెగ గింజుకుంటాం.  కాని అంతకంటే ఒక్క పిసరు కూడా ఏమీ చేయం.

అవును మరి. మనది ప్రజాస్వామ్య దేశం కదా?  రూలు ప్రకారం మనకు కాలక్షేపంగా చర్చలు చేసుకునే హక్కు తప్పకుండా  ఉంది.  అలాగే ఈ‌ ప్రజాస్వామ్యం పుణ్యమా అని నిష్క్రియాపరవాక్శూరులుగా కూడా ఉండే హక్కు కూడా తప్పకుండా ఉంది.

అందుచేత నా బోటి వాడి నస పట్టించుకోకండి.

హాయిగా చర్చించుకోండి.   పవన్ రాజకీయాల్లోకి వస్తాడా? అని

6 కామెంట్‌లు:

 1. శ్యామలీయం గారూ , చాలా చక్కగా రాశారు.
  ప్రజలకి నిజంగా నీతి గల రాయకీయాలు కావాలంటే లోక్ సత్తా ఉంది. కానీ ప్రజలకి అలాంటి పార్టీల అవసరం ఇంకా గుర్తించినట్టు లేదు. ఇంకా కాంగ్రెస్, టిడిపి , పిల్ల కాంగ్రెస్ అంటూ వేలాడుతున్నాం.

  రిప్లయితొలగించండి

 2. శ్యామలీయం గారు రాజకీయాల మీద టపా రాయటం ఎంత మహద్భాగ్యం ! అదిన్నూ గాలి కన్నా వేగం పవనుని పావన వేగం ! వారిమీదే టపా రాయడం మరెంత మహాభాగ్యం !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. మన దేశ రాజకీయాలు వ్యక్తులచుట్టూ తిరుగుతున్నాయి తప్పించి పాలసీ చుట్టూ కాదు. నదీనాం సాగరోగతి అని అన్ని కొత్త పార్టీలు కొంత సమయం తేడాతో ౧౯౪౭ తరవాత కుళ్ళు కాల్వలా మారినదానిలో కలిసిపోతున్నాయి.

  రిప్లయితొలగించండి
 4. చిరంజీవి గారు తమ ప్రజారాజ్యం పార్టీని పూర్తిగా కాంగ్రెస్ లో కలపకుండా బయటనుంచి సపోర్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారి పవనిజం,కాపు నాయకుల కాపిజం తో ఒక బలమైన నేతగా ఎదిగి తాను ముఖ్యమంత్రి అయ్యేవాడు!దక్షన భారతదేశం లోనే ఒక పెద్ద బలహీనవర్గాలనేతగా స్వతంత్రంగా ఎదిగేవాడు!అవసరమైతే నరేంద్రమోడి గారు ప్రధానిగా కావడానికి దోహదం చేసి రాజకీయంగా పెను లబ్ది పొంది కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకునేవాడు!ఇప్పటికైనా ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరించగలిగితే దానికి పవన్ కళ్యాణ్ గారు ఊతం అందించేవాడు!

  రిప్లయితొలగించండి
 5. ఒకటో రెండో సినిమాలు కాస్త హిట్ అవగానే తనకన్నా గొప్పవాడు లేడని విర్రవీగే లక్షణం తారలకు నేర్పింది కూడా అభిమానులు అనబడే "సామాన్య" జనం. మనకు సరి అయిన నాయకులను ఎన్నుకోవడం ఎలాగూ రాదు. కనీసం మంచి నటులను (తారలను కాదు) ప్రోత్సాహిద్దాం అని అనుకుంటే సినిమాలు కొంతయినా బాగు పడేవి.

  రిప్లయితొలగించండి
 6. లోక్సత్తా కమ్మోళ్ళ పార్టీ కదా

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.