26, అక్టోబర్ 2013, శనివారం

ఇంట్లో చెప్పకుండా హిందీమాట్నీకి వెళ్ళటం - నాన్నగారికి దొరికి పోవటం.

కొత్తపేటలో మేము 1963నుండి 1972 ఆగష్టు వరకూ ఉన్నాం. నా ఉన్నత విద్యాభాసం అంతా కొత్తపేటలోనే చేసాను. అమలాపురంలో  SKBR కాలేజీలో చదివిన మూడేళ్ళూ  ప్రతి ఆదివారమూ ఇంటికి వచ్చి వెడుతూ‌ఉండే వాడిని.

కొత్తపేటలో మొదట్లో ఒకే సినీమా హాలు ఉండేది.  దాని పేరు మారుతీ టాకీస్.  అప్పట్లో నేలక్లాసు టికెట్టు 35పైసలూ, బెంచీక్లాసు 50పైసలూ, కుర్చీక్లాసు75పైసలూ, రిజర్వుడు అని ఒక వరస మంచి కుర్చీల క్లాసు 1రూపాయి ఖరీదు ఉండేవి. ఒక సారి పిల్లలం, నేల క్లాసుకు వెడితే అది దరిద్రంగా ఉంది.  అందుచేత అప్పటి నుండి నాన్నగారు పిల్లలకి బెంచీ క్లాసు టికెట్లు తీసుకునే వారు. అమ్మా నాన్నలు మాత్రం రిజర్వుడు క్లాసు అన్నమాట.

మారుతీ టాకీస్‌లో ఎప్పుడోకాని హిందీ సినిమాలు వచ్చేవి కావు.  ఒకవేళ ఎప్పుడైనా హిందీ సినిమా వచ్చినా అది మాట్నీ ఆటకే పరిమితంగా మూడు నాలుగు రోజులే ఉండేది.  అంతకంటే ఆ టౌనులో కలెక్షన్లు కష్టం.  సకృత్తుగా ఇంగ్లీషు సినిమాల మాట్నీలు  కూడా వేసేవారు.  అలా  కింగ్‌ కాంగ్ సినిమా చూసాం, అందరూ చాలా బాగుందంటే.  సినిమా అర్థం చేసుకునే ఇంగ్లీషు ఎవరికి వచ్చు కాని , గొరిల్లాని చూడటం కోసం జనం పొలోమని ఆ సినిమాకి ఎగబడ్డారు.  ఆ సినిమా వారం రోజులు ఆడినట్లు గుర్తు.

హిందీ సినిమాలు అడపా దడపా వచ్చినా మేము ఆసక్తి చూపటం తక్కువే.

కొన్నాళ్ళకు ఊరికి ఆవలి చివరన ఒక టూరింగ్ టాకీస్ వెలిసింది.  అంటే అది వట్ఠి తడికెల హాలన్న మాట. దాని పేరు వేంకటేశ్వరా టాకీస్.  ఆ హాలు ఆట్టే ఏళ్ళు నిలవలేదు. ఆ హాల్లోకూడా కొన్ని సినిమాలు చూసాం.

ఒకసారి వేంకటేశ్వరాలో సినిమాకి వెళ్ళినప్పుడు మాకో చిత్రమైన అనుభవం ఎదురైంది. మా బంధువర్గంలో ఒకాయన ఏదో మంచి హోదాలో, ప్రభుత్వోద్యోగంలో ఉండే వాడు. ఆయనంటే కిట్టని వారు ఆయనమీద  కుట్రలు పన్ని లంచగొండి అనో మరొకటనో‌ సాక్షాలు పుట్టించి ఆయన ఉద్యోగం తీయించేసారు.  ఆయన సకుటుంబంగా కొత్తపేట వచ్చారు.  చాలా అభిమానం కల వ్యక్తి.  ఎంతో మృదువుగా మాట్లాడేవారు.  మేము సినిమా హాలుకు వెళ్తే,  అక్కడ గేటు దగ్గర ఆయన టిక్కెట్లు చింపుతున్నారు.  మాకు ఎంతో బాధకలిగింది.   మా అమ్మగారికి కన్నీళ్ళు వచ్చాయి.  ఇది వ్రాస్తుంటే నాకూ ఇప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి. టిక్కెట్లు చింపుతూ ఆయన మా అమ్మానాన్నలతో, "అంతా దేవుడి లీలండీ. ఫరవాలేదు" అన్నారని నాకు గుర్తు. మా నాన్నగారు ఎప్పుడూ గంభీరంగా ఉంటారు. అయనా ఇంటికి వచ్చి చాలా ఆవేదనపడ్డారు.  ఇలా మా బంధువుగారు కష్టాలు పడుతుంటే చూసి, సహాయం చేయాలని మా ఊరిలో వ్యాపారులు ఆయనకు అండగా నిలిచారు.  దానితో ఆయనకూ‌ మరింత గౌరవప్రదమైన జీవనమూ లభించింది, ఆయన కుటుంబపరిస్థితి కూడా కుదుట పడింది. ఆయన కూదా ఆ ఊరి వ్యాపారులకు,  వ్యాపారలావాదేవీలలో సహాయం చేస్తూ ఉండే వారు.  అప్పుడప్పుడు అయనకు పై ఊళ్ళూ వెళ్ళవలసి వచ్చేది.  అలా ఒకసారి పొరుగూరికి వెళ్ళి వస్తూ లారీ‌ప్రమాదంలో మృతిచెందారు.  ఇది జరిగి ఇంచుమించు నాలుగు దశాబ్దాలు అయింది.  పిల్లలంతా మంచి వృధ్ధిలోకి వచ్చి ఆ కుటుంబం అంతా ఇప్పుడు బాగున్నారు.

వేంకటేశ్వరా హాలులోనే  బీస్ సాల్ బాద్ సినిమా చూసాం. అదీ చివరిరోజు రాత్రి ఆఖరి ఆటను! అప్పటికే ఆ సినిమాలోని  కహిఁ దీప్ జలే కహిఁ దిల్ అనే పాట చాలా చాలా పాప్యులర్ మరి.  మా నాన్నగారిని, ఆ సినిమా చూస్తాం అని నేనూ మా తమ్ముడూ కలిసి, ఒకటే సతాయించేసాం కొన్ని రోజుల పాటు.

మారుతీ‌ టాకీస్‌లో అంగుళీ మాలా అని మరొక హిందీ సినిమా చూసాను. అప్పటికే అది పాత సినిమా అని గుర్తు. నేను ఒక్కడినే వెళ్ళినట్లుగా కూడా గుర్తు. అందులో ఒక రాజకుమర్తె కాబోలు ఉంటుంది.  ఆమె వస్త్రధారణ నాకు చాలా అసభ్యంగా అనిపించి ఇంక హిందీ సినిమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చూడకూడదు అని నిర్ణయం తీసేసుకున్నాను.

అప్పట్లో చిన్న టౌన్లలో హిందీ సినిమాలు చూపిస్తున్నప్పుడు సినిమాహాళ్ళవారు ఒక సదుపాయం చేసేవారు. ఒక గుమ్మందగ్గర  హిందీ డైలాగుల్ని తెలుగులోకి తర్జుమా చేసి ఒకతను రన్నింగ్ కామెంటరీ లాగా చెబుతూ ఉండే వాడు. లేకపోతే ఎవరికి హిందీ అర్థం అవుతుంది అక్కడ? సినిమాలో పాటలు వచ్చినప్పుడే  అలా తర్జుమా చేసే వాడికి కాస్త విశ్రాంతి అన్నమాట.

ఒకసారి, మా నాన్నగారొక్కరే సినిమాకు వెళ్ళారు.  అది చాలా అరుదు.  ఎందుకలా అని అడిగితే మా అమ్మగారు 'ఈ రోజు నాన్నగారి పుట్టిన రోజర్రా' అందు కని మేట్నీ సినిమాకి వెళ్ళారు అని చెప్పారు. హిందీ‌సినిమా కాబట్టి ఆవిడ వెళ్ళలేదట.  నాకూ మా తమ్ముడికీ కూడా ఆ సినిమాకి వెడదాం అనిపించింది.  నాన్నగారు మమ్మల్ని తీసుకుని వెళ్ళలేదుగా.  అందుకని ఉక్రోషం అన్నమాట.  మా దగ్గర బెంచీటిక్కెట్లకి సరిపడా డబ్బులున్నాయి కదా అని మేమూ సినిమాకు వెళ్ళిపోయాం.

అది 'కైసే కహూఁ' అనే  1964లో విడుదలైన  ఏడాది రెండేళ్ళ పాత హిందీ సినిమా.   బాగుందో బాగోలేదో మాకేం తెలుసు.  సినిమా చూసేసాం అంతే.

సినిమా చూసి సాయంత్రం ఇంటికొచ్చాక, అమ్మ కొంచెం కోపంగా 'ఎక్కడి కెళ్ళారు?' అని నిలదీసింది.  నాన్నగారు అక్కడే ఉన్నారు.  ఆయన కేసి భయం భయంగా చూస్తే , ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు.  విషయం‌ బయటపడి పోయిందని  అర్థమై, బిక్కముఖాలు వేసాం. హాల్లోంచి బయటకు వస్తున్న మమ్మల్ని ఆయన చూసేసారన్న మాట!

అలాగే అన్‌జానా అనే మరో సినిమా కూడా 1970లో అనుకుంటాను, మారుతీలోనే చూసాను. అప్పుడు కూడా సినిమా ఏమీ అర్థం కాలేదు.  ఐతే అందులో ఒక పాట హమ్‌ బెహనోం‌కే లియె మేరె భయ్యా  అన్న పాట మాత్రం చాలా బాగుంది అనిపించింది.  అంటే ఆ పాట ట్యూన్ అంత మెలోడియస్‌గా ఉండి ఆకట్టుకుందన్న మాట.

అమలాపురంలో కాలేజీ చదువు  వెలిగిస్తున్న రోజుల్లో  చూసిన హిందీ సినిమా ఒక్కటే. రాజేష్ ఖన్నా చేసిన ఆరాధన. ఆ సినిమా చూస్తున్నప్పుడు,  మేరే సప్‌నోంకి రానీ కబ్ ఆయేగి తూ అనే పాట వస్తూండగా, కరెంటు పోయి ప్రదర్శన ఆగింది కొంచెం సేపు. ఆ అగటం కూడా,  జీపు సరిగ్గా రైలు పట్టాలు దాటబోతున్నప్పుడు!  తిరిగి కరెంటు వచ్చాక హాలు వాడు ప్రదర్శన ఆగిన చోటినుండే కొనసాగించబోతే, హాల్లోని స్టూడెంట్లు ఒప్పుకోక గోలగోల చేసారు.  చేసేది లేక, ఆ  సినిమాని మళ్ళీ  మొదటి నుండి ప్రదర్శించారు. సినిమా కథ మొత్తానికి  సరిగానే అర్థమైనా, డైలాగులు మాత్రం ఒక్కటీ అర్థం కాలేదు నాకు. నాకు తెలిసి నా బోటి స్టూడెంట్లందరి పరిస్థితీ అంతే! ఐనా పాటలు బాగున్నాయని సినిమాని బాగానే ఆదరించారు అమలాపురంలో.

మా స్నేహితులు కొందరు అలా అర్థం ఐనా కాకపోయినా అమలాపురం వచ్చిన ప్రతి హిందీ సినిమానీ చూసేవారు. అది డిగ్రీ‌కాలేజీ‌గట్రా ఉన్న కాస్త పెద్ద టౌన్ కాబట్టి హిందీ సినిమాలు కూడా కాస్త తొందరగానే వచ్చేవి. అప్పటికే అమలాపురంలో ఆరు సినిమా హాళ్ళు ఉండేవి.  ప్రస్తుతం ఎన్నో తెలియదు.  మేము డిగ్రీ మూడవ సంవత్సరంలో ఉండగా అనుకుంటాను, ఒక హిందీ సినిమా ప్రచారం కోసం, కోటి రూపాయల పెట్టుబడితో‌నిర్మించిన భారీ చిత్రం అని కరపత్రాలు ముద్రించి అమలాపురం అంతా పంచిపెట్టారు కూడా.  ఆ సినిమా పేరు ఇప్పుడుగుర్తులేదు నాకు.

అలాగే మా డిగ్రీ చివరి సంవత్సరంలోనో, డిగ్రీ పూర్తి ఐన కొత్తలోనో కొత్తపేటలో సంతపాకల దగ్గరలోనే సత్యనారాయణా టాకీస్ అని ఒక కొత్త సినిమా హాలు వెలిసింది. నాకు గుర్తున్నంత వరకూ, మేము ఇంకా కొత్తపేటలోనే ఉన్న ఆ ఒకటి రెండేళ్ళల్లో సత్యనారాయణా టాకీస్ వాళ్ళు హిందీ సినిమాలు ఏమీ వేయలేదు.

కోస్తా జిల్లాల్లో  టౌన్లల్లో హిందీ సినిమాలు అప్పుడప్పుడూ వచ్చి ఆడేవంటే, మంచిమంచి మెలోడీ వరసలు ఉన్న పాటలు ఉన్నప్పుడే.  సాధారణంగా ఆ ప్రాంతంలో హిందీ మాట్లాడే వారు తక్కువ కదా. అసలు ఆ భాష అర్థం అయ్యే వారే తక్కువ. కోస్తాజిల్లాల్లో యావన్మందీ తెలుగే మాట్లాడతారు.  నాకు తెలిసి ముస్లిములు కూడా తెలుగులోనే మాట్లాడేవారు.

ఆ రోజుల్లో, ప్రతి బుధవారమూ,  రాత్రి 8గంటలకు రేడియోలో బినాకా గీత్ మాలా అని హిందీ పాటలు వేశేవారు ఒక అరగంటపాటు. ఏడెనిమిది పాటలు వేసేవారు.  అన్నీ కొత్తవీ - మంచి హిట్ పాటలూ మాత్రమే.  ఆ ప్రోగ్రాం కోసం మాత్రం కుర్రకారు అంతా ఎదురుచూసే వాళ్ళం.  పాటల్లో ఒక్క ముక్కా అర్థం కాకపోయినా, ఆ పాటల వరసలు వినసొంపుగా ఉండేవి కాబట్టి గొప్ప క్రేజ్ ఉండేది ఆ ప్రోగ్రాం మీద.  అప్పట్లో, రేడియో కూడా అందరి ఇండ్లలోనూ‌ఉండేది కాదు! నా క్లాస్‌మేట్ మరియు ఆప్తమిత్రుడు గుడిమెళ్ళ పాండురంగారావు ఇంట్లో ఐతే, అసలు కరెంటే లేదు.  ఐనా అలాగే కిరోసిన్ దీపాలక్రింద చదివి అతను మా కొత్తపేట స్కూల్‌కు ఫస్ట్ వచ్చాడు 1968లో.  బుధవారం బుధవారమూ,  మాయింటికి ఠంచనుగా వచ్చే వాడు బినాకా గీత్ మాలా కోసం.  వాడి హిందీ‌పాండిత్యమూ నా పాండిత్యం లాంటిదే కాని, వాడు తెలుగేమి హిందీ యేమి కొత్త సినిమాలు అన్నీ చూసేవాడు. తెలుగులో, నాగేశ్వరరావు సినిమా ఐతే మొటిరోజు మొదటి ఆట తప్పదు.  వాడికో ఫ్రెండ్ ఉండేవాడు.  హిందీ సినిమా పాటల ట్యూన్లు హమ్మింగ్ చేసేవాడు ఎప్పుడూ.  మళ్ళీ‌  ఆ పాటల అర్థం మాత్రం వాడికి ఏమీ‌ తెలియదు.  ఇలాంటి స్టూడెంట్లు  బోలెడు మంది.