31, అక్టోబర్ 2013, గురువారం

విజ్ఞప్తి



ఇది ప్రజాస్వామ్యదేశమౌ నెడల ప్రజల
అభిమతమ్ములె రాజకీయములు చేయు
వారలకు దారిచూపించ వలయు గాని
తద్విలోమంబు నాశించ తగదు నిజము

తమతమ ప్రాంతము లందును
తమమాటకు విలువలేని  ధర్మప్రభువులున్
తమబుధ్ధికి తోచిన య
ట్లమరించగ నాంధ్రజాతి యది యెట్లొప్ప్పున్

ఏండ్ల తరబడి చర్చించి యెట్లు చేయ
నైన ధైర్యంబు చాలని యట్టి కేంద్ర
మిపుడు త్వరపడుచున్నదే యిందు రాజ
కీయలాభాక్షయొకటె మిక్కిలిగ దోచు


ఆరిపోయెడు దీపమైనట్టి కాంగి
రేసు పార్టీకి యుసురులు తీసివేయ
రేపు రానున్న ఎన్నిక లేపగిదిని
దాటరాకున్న భయమున తత్తరపడి


అల్పసత్వులు నాయకు లందరచట
ఈ చిరంజీవితో కార్యమింత లేదు
ఎవరు తెలుగుదేశంబున కెదురు నిలచి
సీట్లు సాధింతురన్నట్టి చింత కలిగి


ఆ యాంధ్రయె కీలకమౌ
ఆ యెడలను దెబ్బతినుట ఆత్మహననమౌ
న్యాయంబుగ గెలువని చో
న్యాయంబును విడిచి గెలువ నగునను బుధ్ధిన్


అటు తెలంగాణాలో కేసియారు గలడు
ఇటు సీమాంధ్ర జగనన్న గుటక వేయు
రాష్ట్రవిభజన మేలిర్వురకును పిదప
కాంగిరేసులో జేరిపో గలరు వారు

తనకు తెలగాణలోన పెత్తనము నిచ్చి
గారవించిన సోనియా కోరినట్లు
గా తెరాసాను కాంగిలో కలుపగలడు

కేసియారను నట్టి పేరాసయొకటి

నెత్తిపై నున్న కేసుల నెత్తివేసి
బయట పడవేసి సీమాంధ్రపట్ట మిచ్చి
ఆదరించిన జగనన్న మోద మలర
మనకు లోబడ గలడను మాట యొకటి

చాల బలమున్న తెలుగుదేశంబు నొక్క
ప్రాంతమున గింజుకొన చేయ వచ్చు ననుట
రాష్ట్రవిభజనతో గల్గు రమ్యమైన
లాభ మగునని తోపించు లోభమొకటి

కలిసి తెలుగిల్లు రెండుముక్కలుగ జేయ
తొందరించగ కాంగ్రేసు తొండియాడె
ఇన్ని నాళులు మనసులో‌నున్నమాట
బయటపెట్టని కాంగ్రేసు బయటపడెను

రాష్ట్రవిభజన చేయ నారాట పడెడు
సోనియాగాంధిపై భక్తి చూపువారు
మన తెలంగాణవాదులు మంచి వారు
కాంగిరేసు కపటమును కాన లేరు

సకలసీమాంధ్రజనులును శాంతిపరులు
కాంగిరేసు కపటమున కటకటబడి
రాష్ట్రవిభజన చేయ నారాట పడెడు
సోనియమ్మను చెడతిట్ట బూని నారు

ఏది ఎటుల నైన నీ దేశ మే మైన
ఎవరి కెగ్గు లగ్గు లెటుల నైన
కాంగిరేసు సీట్ల కాసించి దొంగెత్తు
వేయు చుండె గాని వేరు కాదు

సోనియమ్మకొడుకు శూన్యప్రజ్ఞాశాలి
రాహులయ్యగారు రాజ్యమేల
దారి చేయనెంచి తప్పుడు దారిని
పట్టె కాంగిరేసువారి బుధ్ధి

అన్నన్నా యీ‌కుట్రలు
పన్నుట దేశాధిపత్యభాగ్యంబునకా
చిన్నయ్యను తెచ్చుటకే
యన్నది పసివారికైన నవగత మగునే

ఇంత చిన్నవిషయ మెరుగ లే కున్నారె
ఎరిగి కూడ స్వార్ధపరుల యుచ్చు
లోన చిక్కి రాష్ట్రలోభంబు దలపోసి
సంతసింతు రయ్య కొంతమంది

అరువదేండ్లనుండి యన్నిప్రభుత్వంబు
లితర నగరములను వెతల బెట్టి
యకట మేపినారు హైదరాబాదును
దాని కొరకు నేడు తగని గొడవ

మీరు దొంగలన్న మీరేను దొంగలు
నాగ తిట్టుకొనుట సాగుచుండె
నెల్లచోట్ల దీన నేమి సాధింతుము

తెలుగువారి పరువు మలగు గాక

రాజకీయలబ్ధి రాలునో రాలదో
రేపుమాపు కాంగిరేసు గెలిచి
రాహులయ్య నొసట రాజ్యమున్నదొ లేదొ
ముందు తెలుగు గడ్డ ముక్కలగును

విరిగిన మనసుల నతుకుట
మరియా బ్రహ్మకును సాధ్యమగునా ఒక తుం
టరి వాని హీన లాభము
కొరకై మనలోన మనము కొట్లాడుటయా

ఈ తెలుగుజాతి మున్ముం
దే తీరున నుండగలదొ తెలియదు లోలో
నీ తీరగు కలహంబుల
చైతన్యవిహీనమైన చదికిల బడెడున్

కలసియుండిన సౌఖ్యంబు కలదు కాని
చెడుదురన్యోన్నద్వేషంబు చేత ప్రజలు
నలుగురును చేరి చర్చించి నయము మీర
అందరకు మంచి యగు దారి నరయ వలయు

రాజకీయులకిక లొంగ రాదు ప్రజలు
దేశమునకేది హితమౌనొ తెలిసి కలిసి
ఎల్లవారును మెలగుట యెల్ల వేళ
లందు మే లొనగూర్చునో యన్నలార

మృత్యుశకటాలు!

(ఫోటో ఈ‌నాడు సౌజన్యంతో)




అప్పుడొక బస్సు కూలి ముప్ఫైమంది
ఇప్పుడొక బస్సు కాలి నలభైమంది
తప్పించుకొనలేనివీ మృత్యుశకటాలు
అప్పటికప్పుడు నేతల దిగ్భ్రాంతులు
అప్పటికప్పుడు  చకచకా చెక్కింగులు
తప్పుడు ప్రజాస్వామ్యపాలనా చిత్రాలు
తప్పులు దిద్దుకోలేని పాలనావ్యవస్థలు
ఎప్పటికి మారేనో యీ జనం తలరాతలు

అవునా? - 3




నీ సృష్టి ఎందుకు జరిగేదీ నీ యిష్టం
నేను వద్దన్నా ఆపవు కదా
నీ చుట్టూ ఎందుకు తిరిగేదీ నా యిష్టం
నువ్వు వద్దన్నా ఆగను కదా




30, అక్టోబర్ 2013, బుధవారం

అవునా? - 2




ముక్తి కావాలి నాకు
భక్తి కావాలి నీకు
రద్దు కానీ‌ భేషజాలు
ఇద్దరం బిచ్చగాళ్ళమే






29, అక్టోబర్ 2013, మంగళవారం

అవునా?



నేను నా కోసం‌ బ్రతుకుతున్నంత కాలమూ
నీకు చిరాకుగా ఉండేదని విన్నాను
నేను నీ కోసం తపించటం‌ మొదలు పెట్టాక
నీకు పరాకుగా ఉందని తెలుసుకున్నాను




నాన్నగారి పర్యవేక్షణ వలన బతికిపోయాం

మా పాఠశాలకోటా మార్కుల మీద నాన్నగారి పర్యవేక్షణ గురించి వ్రాస్తూ, ఈ మార్కుల విషయంలో కక్షసాధింపుకు నేనూ, నా స్నేహితుడు కన్నబాబూ దాదాపుగా బలి ఐన సంఘటనను ప్రస్తావించాను కదా.  వివరాలు ఇప్పుడు చెబుతాను.

ఈ కన్నబాబు అనే ముద్దుపేరుగల పిల్లవాడి పేరు కందుకూరి వీర వేంకట సత్యనారాయణ.  మా ఇద్దరిదీ మంచి స్నేహం.  ఇద్దరం కలిసి చదువుకుంటూ ఉండేవాళ్ళం తరచుగా వాళ్ళింటి ఔట్‌హౌస్‌లో కూర్చుని.  మాయిద్దరి మైత్రి వెనుక మా తండ్రిగార్ల మైత్రీ బంధం ఉంది మరి.  కన్నబాబు తండ్రి భాస్కరంగారు మా నాన్నగారికి క్లాస్‌మేట్.  భాస్కరంగారు స్టేట్ బ్యాంక్‌లో పనిచేసేవారు.  చాలా మంచి మనిషి మరియు చాలా చాలా  ఖచ్చితంగా వ్యవహరించే మనిషి కూడా.  కాబట్టే ఆయన్ను దూరంగా తనకల్లు బదిలి చేసారని  కొందరు అనేవారు.  అక్కడాయన చాలా కాలం పని చేసారు.   ప్రతివారం కొత్తపేట వచ్చి వెళ్ళేవారు.  కన్నబాబు కూడా స్టేట్ బ్యాంక్ లోనే మంచి పొజిషన్‌లొ రిటైర్ అయ్యాడు ఈ‌ మధ్యనే.  వాళ్ళు హైదరాబాదులోనే ఉంటారు.  మా నాన్నగారి తరం నుండి మాతరం వరకూ మా రెండు కుటుంబాలకూ మంచి మైత్రి ఉంది.   మా కన్నబాబు నా కన్నా చురుకైన విద్యార్థి.  భాస్కరంగారు ప్రతిసంవత్సరమూ కార్తీకపౌర్నమికి లక్షబిల్వార్చన చేసేవారు స్థానిక శివాలయంలో.  ఆయన దయతో నాకూ కొన్ని సార్లు అ బిల్వార్చనలో పాల్గొనే అదృష్టం కలిగింది.   బిల్వార్చన తరువాత వారింట్లో రాత్రి చాలా వైభవంగా సమారాధన జరిగేది.

చిన్నతనం చిన్నతనమే. అమాయకంగా పిల్లలు చేసే పనులు ఒక్కొక్క సారి పెద్దలకు తలవంపులు తెస్తాయి. ఒక్కొక్కసారి అవి పెద్దవాళ్ళ తప్పుల్నీ‌ బయట పెడతాయి.

రావుగారని సోషల్ స్టడీస్ టీచరు.  ఆయన పూర్తిపేరు నాకు గుర్తు ఉంది.  కాని అది ప్రస్తావించాలని అనుకోవటం లేదు.   ఆయన మాకు తొమ్మిదో తరగతిలో అనుకుంటాను పాఠాలు చెప్పేవారు.  ఆయన  మేప్ డ్రాయింగ్ కోసం పుస్తకం‌ డిజైన్ చేసి, వాటి కాపీలు పిల్లలందరికీ ఇవ్వమని మా క్లాసులీడరు బండ్లమూడి నాగేశ్వరరావుగారికి ఇచ్చారు.  ఒక్కో పుస్తకం ఖరీదు మూడు రూపాయలు.

బండ్లమూడి నాగేశ్వరరావు నాకు మంచి మిత్రుడు. చాలా సౌమ్యంగా మాట్లాడేవాడు.  అందరికీ తలలో నాలుకలా ఉండే వాడు. అతడి తమ్ముడూ మా తమ్ముడూ క్లాస్‌మేట్లు.  తరవాతి కాలంలో ఒక విచిత్రమైన విషయం తెలిసి ఆశ్చర్య పోయాం.  నాగేశ్వరరావు తమ్ముడికి కమ్మఫీలింగ్ అని ఒక భావన ఉండేదట.  అంటే కమ్మవారైన తాము కమ్మవారితో తప్ప  స్నేహంగా ఉండటం అనవసరం అన్న భావన అన్నమాట.  నిజమో అబధ్దమో నాకు తెలియదు.  ఒకటి రెండు సార్లు ఆ అబ్బాయితో నేను మాట్లాడినప్పుడు అలాంటి ధోరణి ఏమీ కనిపించలేదు మరి.  వట్టి అనుమానమే కావచ్చును.  ఐతే, ఇలాంటి కమ్మఫీలింగ్ అనే అమాయకపు భావన ఒకటి నిజంగానే కొందరిలో ఉండేది ఆ రోజుల్లో

మళ్ళీ విషయంలోకి వద్దాం.  నాకూ‌ కన్నబాబుకూ ఒక కోతి అలోచన వచ్చింది.  అంత ఖరీదు ఎందుకు  పెట్టటం?  ఆ పుస్తకం ఏదో మనమే కుట్టుకోవచ్చును కదా అని.  ఊళ్ళోనే గౌరీశంకర్ బైండిగ్ వర్క్స్ అనే చిన్న షాపులో చక్కగా అవే మేప్‌లు దొరికాయి.  అదే రకమూ, రంగూ కల కార్డుబోర్డు అట్ట కూడా ఆ బైండింగ్ షాప్ ఎదురుగా ఉండే నాగా అండ్ కో షాపులో దొరకనే దొరికింది సులువుగా.  ఇంకేం‌ కావాలీ?

 మేమూ, మేప్ డ్రాయింగ్ పుస్తకాలు సిధ్ధం చేసుకున్నాం. సోషల్ మేష్టారికి లెక్కకి మేప్ డ్రాయింగ్ పుస్తకాలు సరిపోయాయి అందరూ‌ తీసుకున్నట్లుగా.  కాని బండ్లమూడి ఇచ్చిన పద్దు ప్రకారం ఇంకా ఇద్దరు కొనాలి.  ఎవరూ ఆ కొనని వాళ్ళూ  అనగానే మా పేర్లు సులువుగానే  బయటికి వచ్చాయి.  అంతవరకూ ఒక ఎత్తు.  ఆ పైన జరిగినది మరొక ఎత్తు!

"ఏమిట్రా ఇది?" అని రావుగారు నిలదీసారు మమ్మల్ని.

"మేమే కుట్టుకున్నా మండి"

"ఒక్కో పుస్తకానికి ముప్పావలా మాత్రమే ఐందండీ"

ఈ  మా జవాబులతో పాపం  మాష్టారికి అవమానం జరిగిపోయింది కదా!
నిజానికి ఇలా చేయటం ఆయనకు తలవంపుల వ్యవహారం అవుతుందన్న ఇంగితం మాకు లేనే లేదు!

విషయం మా నాన్నగారి దృష్టికి తీసుకుని వెళ్ళారు మాష్టారు.
ఎలాగో, ప్రధానోపాధ్యాయులు రమణయ్య పంతులుగారి దృష్టికీ వెళ్ళింది వ్యవహారం.
నన్నూ కన్నబాబునీ పిలిచి మా నాన్నగారి సమక్షంలో పంతులుగారు పంచాయితీ పెట్టారు.
భాస్కరంగార్నీ పిలిపించేవారేమో కాని ఆయన తనకల్లులో ఉన్నారనుకుంటా.

పంచాయితీ అంటే,  మా యిద్దర్నీ పిలిచి, జరిగిన సంగతి అంతా పంతులుగారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తరువాత  "సరే,క్లాసులోకి పోండి" అని పంపేసారు. అంతే.

ఎవరూ  మా యిద్దర్నీ ఏమీ అనలేదు!
రావుగారు కాని పంతులుగారు కాని మమ్మల్ని  మరేమీ అనలేదు.
ఎవరూ మమ్మల్ని శిక్షించలేదు.
కాని మిగతా పిల్లలందరికీ తలొక రెండు రూపాయల పావలా చొప్పునా  రావుగారు బండ్లమూడి ద్వారా సొమ్ము వాపసు ఇచ్చేసారు.  అలా ఇచ్చేయమని పంతులుగారి ఆర్డరని తరువాత చాలా కాలానికి తెలిసింది.

ఈ‌సంఘటనతో, మా నాన్నగారు మాత్రం చాలా అసౌకర్యానికి లోనయ్యారు.  అయన నన్ను బాగా చీవాట్లు వేసారు.  పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ టీచర్లతో పోట్లాటకు దిగకూడదని హెచ్చరించారు.

అనంతరకాలంలో ఆనాటి పంచాయితీ విషయం నాన్నగారు నాతో ప్రస్తావిస్తూ, పంతులుగారు "టీచర్లు పాఠశాలలో వ్యాపారకార్యక్రమాలు చేస్తే ఊరుకునేది లేదని" హెచ్చరించారని చెప్పారు.  రావుగారు నామీద కడుపులో కక్షపెట్టుకుంటారేమో నని నాన్నగారు సందేహించారట.  ఆయన ముందు ముందు కాలంలో నాకు క్లాసు టీచరుగా రావచ్చును కదా మరి.  అదీ కాక నాకూ కన్నబాబుకూ కూడా మిగతా మాష్టర్ల దృష్టిలో చెడు అభిప్రాయం వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం.

అనుకున్నట్లే రావుగారు నాకు పాఠశాల విద్య చివరి రెండేళ్ళూ సోషల్ స్టడీస్ చెప్పారు. ఆయన నిర్లక్ష్యంగా పేపర్లు దిద్దుతారనీ, ట్యూషన్ పిల్లలకి మాత్రమే మంచి మార్కులు వేస్తారనీ విద్యార్థిలోకంలో ఒక అభిప్రాయం గట్టిగా వ్యాప్తిలో ఉండేది.  అందుచేత పిల్లలు ఆయనంటే బాగా భయపడేవారు.

పదకొండవతరగతిలో ఆయనకూ నాకూ మళ్ళీ  ముఖాముఖీ తగాదా వచ్చింది. అదీ ఉత్త పుణ్యానికి!

హాఫ్ ఇయర్లీలో అనుకుంటాను, మహ్మద్ బిన్ తుగ్లక్  పరిపాలనను గురించిన ప్రశ్నకు సవిస్తరంగా జవాబు వ్రాస్తూ, అతను తోలు నాణాలూ ముద్రించి చెలామణీ చేసాడని వ్రాసాను.  అ మాట మా టెక్స్ట్ పుస్తకంలో లేని విషయం.  అందుచేత రావుగారు ఎర్రసిరాతో అండర్‌లైన్ చేసి ఆక్షేపించారు. ఆ ప్రశ్నకు నాకు బొటాబొటీ మార్కులు వేసారు.  నేను ప్రశ్నించే స్వభావం‌ ఉన్నవాడిని కాబట్టి నిలబడి అడిగాను. 

ఆయనకు ఆగ్రహం వచ్చి, నా సమాధానాన్ని చదివి క్లాసులో వినిపించి, "వాడు తోలు నాణాలు వేసాడట్రా, వీడు కనిపెట్టాడు" అని ఎద్దేవా చేసారు. ఈ మాట కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారి మహమ్మదీయ మహాయుగం అనే పుస్తకంలో ఉందనీ, అది చదివి నేను జవాబులో వ్రాసాననీ అంటే ఆయన నన్ను ఛాలెంజ్ చేసారు.   మరునాడు నేను ఇంటి నుండి ఆ పుస్తకం తీసుకు వెళ్ళి ఆయనకు చూపించాను.  అయనేమీ సంతోషించలేదు.  మధ్యలో ఈ‌ లక్ష్మణరావెవడూ? పాఠ్యపుస్తకంలో ఉన్నది మాత్రమే  వ్రాయాలి అని తీర్పు చెప్పారు.

అక్కడితో ఆగక , ఆయన ఆ రోజు నుండి నన్ను "తుగ్లక్" అని పిలవటం మొదలు పెట్టారు!  ఆ నిక్‌నేమ్‌  కొంత పాప్యులర్ అయింది కూడా.  చివరికి కొంతమంది స్నేహితులూ సరదాగా అలా పిలిచేవారు నన్ను!  ఇది నాకు చాలా మనస్తాపం కలిగించింది కాని నేను ఎవరికీ చెప్పలేదు.  నాన్నగారికీ  ఎన్నడూ చెప్పలేదు. ఎలా చెప్పాలో తెలియలేదు.

నా స్కూలు చదువు ముగిసి కాలేజీలో చేరాక, నేను డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగా కాబోలు నాన్నగారు ఒకరోజున ఈ విషయం నాకు చెప్పారు.  గురువులతో తగాదాలు పెట్టుకోవటం ప్రమాదకరం అని చెప్పటానికి ఈ విషయం ప్రస్తావించారేమో.  బహుశః కాలేజీలో అధ్యాపకులతో నా సంబంధాలు ఎలాగుంటున్నాయో అని ఆయన ఆందోళన కావచ్చును. ఆ సంభాషణలోనే కన్నబాబుకు కూడా సోషల్‌లో స్కూలు తరపున చిన్నమార్కులే వచ్చిన విషయమూ తెలియ వచ్చింది.

పన్నెండో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా పాఠశాలవారి కోటాలో మా ఇద్దరికీ సోషల్ స్టడీస్‌లో వచ్చిన మార్కులు ఒకట్లస్థానంలోనే ఉన్నాయట.  సహజంగానే ఇది స్క్రూటినీ చేసే ఉపాధ్యాయుల ఉపసంఘం దృష్టికి వచ్చింది.  మా ఇద్దరికే కాదు, మరికొందరికీ ఈ సబ్జెక్టులో తక్కువ మార్కులు పడటంతో మొత్తం వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది.  మాకైతే చాలా అన్యాయంగా పడ్దాయి మార్కులు.  అప్పుడు అందరి పేపర్లనీ క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా తమాషా బయటకు వచ్చిందట.  ఓపిగ్గా అంతా  సరిచేసారట.

మా నాన్నగారు నాకూ ఉపాధ్యాయులకూ‌మధ్యన ఉండే సంబంధాల గురించి అంతగా ఆందోళన పడటానికి మరొక చిన్న కారణం ఉంది. నేను ఎనిమిదిలో ఉండగా ఒక రోజున  ఒక ఆరోపణ వచ్చింది నామీద. ఎవరన్నారో, ఎందుకన్నారో తెలియదు. రమణయ్య పంతులుగారిని నేను దూషించి మాట్లాడానని!  మా నాన్నగారు తీవ్రంగా అందోళన చెందారు.  వదలకుండా అ రాత్రి  ఎనిమిది గంటలకు నన్ను వెంట బెట్టుకొని పట్టీ మేష్టారి వద్దకు వెళ్ళారు.  ఆయన ఒక సెకండరీ‌గ్రేడ్ తెలుగు పంతులుగారు పాఠశాలలో.  ఎప్పుడూ‌పట్టీ వేస్తూ ఉండేవారు.  అందుకే ఆయనకా పేరు.  అయనద్వారా నాన్నగారికి యీ వార్త వచ్చిందట మరి.  ఆయన దగ్గరకు పోయి విచారిస్తే, తనకు మరెవరో ఫలానివారు చెప్పారని నీళ్ళు నమిలారు.  నాన్నగారు వదలకుండా తాడంతా లాగి విచారిస్తే అసలు అంతా గాలివార్త అని తేలింది.  ఇలాంటి వార్తలు పుట్టించే వాళ్ళకు పనిలేదేమో.  ఐతే అప్పటి నుండి నాన్నగారు నా యోగక్షేమాలు వెయ్యి కళ్ళతో కనిపెడుతూనే ఉండేవారు.  ఐనా ఒకటి రెండు తగవులు వచ్చి పడనే పడ్డాయి చూసారా?  అందుకు ఆయనకు కొంచెం ఆందోళన అనుకుంటాను.

ఈ కాసిని విషయాలూ పక్కన పెడితే, నా కొత్తపేట చదువు చాలా మంచి స్నేహాలూ, మంచి జ్ఞాపకాలతోనే ముగిసింది.

28, అక్టోబర్ 2013, సోమవారం

పాఠశాలకోటా మార్కులమీద నాన్నగారి పర్యవేక్షణ.

నాకు  నాన్నగారి దయవల్ల గడచిన హిందీగండం గురించి ముందే వ్రాసాను కదా.  ఆ టపాలోనే మాకు పబ్లిక్ పరీక్షల్లో 75మార్కులకి పేపర్లూ, స్కూలువారి చేతిలో మిగతా 25మార్కుల వాటా ఉండేదనీ కూడా వ్రాసాను. ఆ 25 మార్కులనీ పాఠశాలవారు లెక్కవేయటానికి ఒక పధ్ధతి ఉంది. మాకు  11 మరియు 12వ తరగతులు రెండేళ్ల కోర్సుమీదా నిర్ధాక్షిణ్యంగా  పబ్లిక్ పరీక్షలు ఉండేవి. ఆ రెండు సంవత్సరాలలోనూ విద్యార్ధి  పాఠశాలవారి పరీక్షల్లో సంపాదించుకొన్న మార్కుల ఆధారంగా కొలిచి 25కి ఎన్ని ఇవ్వాలో నిర్థారించేవారు.

నిర్దాక్షిణ్యం అని ఎందుకన్నానో చెప్పాలి కదా.  లెక్కల పేపరూ, సైన్సు పేపర్లు రెండింటిలోనూ సరిగ్గా పది అంటే పది ప్రశ్నలు ఇచ్చే వారు. ప్రతిప్రశ్నకూ‌ మార్కులు సమానము. 10 x 10 = 100 అని నిర్మొగమాటంగా ప్రశ్నపత్రం మీదే వ్రాసేవారు. ఒక్క ప్రశ్న తప్పిపోయినా పది మార్కులు గోవిందా. పేపర్లు వంద మార్కులకు ఇచ్చి 75మార్కులకు త్రైరాశికం చేసేవారన్న మాట. కొన్ని కొన్ని ప్రశ్నలు రెండు పార్టులుగా ఉండేవి. అచ్చుపుస్తకాల్లోని  అధ్యాయాల్లోని ప్రశ్నల్లోంచి ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా ఇవ్వని సందర్భాలూ సాధారణం. పైగా రెండేళ్ళ కోర్సు మీద పరీక్ష కాబట్టి తట్టెడు సిలబస్ తిరగేసుకోవాలి విద్యార్ధులు. పిల్లల్ని ఎలా ఫెయిల్ చేయాలా అన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ఇచ్చినట్లుండేవి ప్రశ్నాపత్రాలు!

మా బేచ్ వాళ్ళకి ఐతే పగవాడికీ రాకూడని ఒక కష్టం కూడా వచ్చి పడింది.  ఇంగ్లీషు మీడియం కోసం అని  విద్యార్థుల్లోంచి మెరికల్లాంటి వాళ్ళని ఏరి ఒక సెక్షన్ చేసారు.  ఐతే జిల్లాపరిషత్ విద్యాశాఖ వారి నుండి అనుమతి రాలేదు. సరేలే అని మాకు తెలుగులోనే బోధన చేసారు.   ఇంక పబ్లిక్ పరీక్షలు మూడు నెలలు ఉన్నాయనగా, ఆ మహా గొప్ప పర్మిషన్ కాస్తా మా పాఠశాల మీదికి విసిరేసారు.  ఇదేం అన్యాయం అని పోయి మొత్తుకున్నా స్కూలు వారి మాట చెల్లలేదు.  అప్పటి కప్పుడు మాకు స్పెషల్ కోచింగ్ మొదలు. అప్పటికప్పుడు ఇంగ్లీషు మీడియం పుస్తకాలు కొనుక్కున్నాం.  మొదట్లో జుట్లు పీక్కున్నా వాటిలో పాఠాలు సరిగా అర్థం కాక చాలా అవస్థపడి పోయాం.  ఎలాగోలా అంతా బండి లాగించేసాం కాని, మొదటినుండి ఇంగ్లీషు మీడియంలో చదివించి ఉంటే మాకు మరిన్ని మంచి మార్కులు వచ్చేవి కదా!

మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉడతల రమణయ్య పంతులుగారు చాలా మంచివారు.  అలాగే ఆయన చాలా నిక్కచ్చి మనిషి కూడా. ఆయన పుత్రరత్నాల్లో చిన్నవాడు వేణుగోపాలరావు మా సహవిద్యార్ధి కూడా.  అతని తమాషా ఒకటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం.

మేము పన్నెండో తరగతిలో ఉన్నప్పుడు రమణయ్య పంతులుగారే లెక్కలు చెప్పేవారు. ఐతే, ఆయనకు పాఠశాల అడ్మినిష్ట్రేషన్ వ్యవహారాలలో మాకు పీరియడ్‌లు తీసుకోవటం తరచుగా కుదిరేది కాదు. అలాంటప్పుడు వేరే మాష్టారుగారు వచ్చి ఆయన క్లాసులు కవర్ చేసేవారు.  పంతులుగారు మాత్రం కుదిరినప్పుడు వచ్చి చాలా బాగా పాఠాలు చెప్పేవారు. ఒకసారి ఆయన మాకు నిర్వహించిన తరగతి పరీక్షల్లో అందరికీ పాతికకూ పాతికమార్కులూ వచ్చాయి. ఎక్కడో తమషా జరిగిందని ఆయనకు అర్థమయింది. ఐనా పిల్లల్ని ఏమీ అనలేదు.  మీరంతా హఠాత్తుగా జీనియస్‌లు ఐపోయారే అని మాత్రం అన్నారు. కాని ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ తిరిగి నిర్వహించారు. ఈ సందర్భంలో,  మా నాన్నగారు నన్ను వాకబు చేసారు. అసలేం జరిగిందీ‌ అని.  పంతులుగారి అబ్బాయి వేణూ  లెక్కలపేపర్ని లీక్ చేసాడనీ అందరికీ అందుకే పూర్తి మార్కులు వచ్చాయనీ నిజం చెప్పాను. అసలు సంగతి విని ఆయన బాధపడ్డారు. ఇలాంటివి జరగకూడదు. నీకు  తెలిసిన వెంటనే నాకెందు చెప్పలేదూ‌ అని కోప్పడ్డారు.  చిన్నతనం.  పేపరు దొరికిపోయిందన్న ఆనందంలో అది తప్పు అన్న స్పృహ రాలేదు.  పంతులుగారు కూడా వేణూని దండించలేదు.  అలా చేయకూడదు తప్పు అని మాత్రం అన్నారట.

రమణయ్య పంతులుగారికి, పిల్లలకి రావలసిన పాతికమార్కుల కోటాలో వాటాలు సరిగా ఉపాధ్యాయులు కొలిచి ఇస్తున్నారా అన్న అనుమానం ఉండేది.  అనుమానం ఉన్నా లేకున్నా, ఆ విషయంలో పాఠశాల పెద్దగా పర్యవేక్షణ చేసే బాధ్యత ఆయన మీద ఉంది కదా. డిఇవో ఇన్‌స్పెక్షన్‌లో ఇలాంటివీ పరిశీలిస్తారు మరి. అందుచేత ఈ స్కూలు తాలుకు మార్కులు పిల్లలకు సరిగా వేస్తున్నారా లేదా క్లాస్‌టీచర్లు అన్నది, పంతులుగారు జాగ్రత్తగా గమనించేవారు.

ఆ పాఠశాలలో మా నాన్నగారు ఒక సీనియర్  బిఇడి ఉపాధ్యాయులు.  అప్పటికే ఆయనకు పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా చేసిన మంచి అనుభవం కూడా బాగా ఉంది.  మంచి బోధకులుగానే కాక, మంచి నిర్వాహకులుగా కూడా నాన్నగారికి జిల్లాస్థాయిలో చాలా పేరుండేది కూడా.  అందు చేత  ఈ‌ పాతిక మార్కుల కోటాను పర్యవేక్షించే బాధ్యతను పంతులుగారు మా నాన్నగారి మీద పెట్టేవారు.  ఆయనొక్కరే కాదు మరొక రిద్దరూ ఈ పనిలో నాన్నగారితో కలిసి పనిచేసేవారు.

ఈ మార్కుల కొలతల్లో  చాలా తమాషాలు జరుగుతూ ఉండేవని నాన్నగారు ఆ రోజుల్లోనే నా దగ్గర  కొన్ని సార్లు అసంతృప్తి వెలిబుచ్చేవారు.  కొన్ని కొన్ని  ఔదార్యాలూ, తరచుగా కక్షసాధింపులూ కనిపిస్తూ ఉండేవట.  అలాంటి కక్షసాధింపుకు నేనూ, నా స్నేహితుడు కన్నబాబూ  దాదాపుగా బలి ఐన సంఘటన కూడా జరిగింది.  ఈ‌ తమాషానీ నాన్నగారే పట్టుకున్నారు. అది తరువాత చెబుతాను.

కొంత మంది ఉపాధ్యాయులు పిల్లలమీద దయకొద్దీ హెచ్చు మార్కులు వేసేవారు ఈ కోటాలో. ఒక ఉదాహరణ చెబుతాను.

మేము 12వ తరగతిలో ఉండగా జరిగిన సంగతి.  హిందీ‌ పాఠం చెబుతున్నారు పుప్పాల వేంకట్రావు గారు.  మా వయసువాడే ఒక పిల్లాడు వచ్చి గుమ్మంలో నుంచున్నాడు.  మాష్టారు వాణ్ణి లోపలికి రారా అన్నారు.  వాడు వచ్చి ఒక చీటీ‌ ఇచ్చి మాష్టారి ముఖంలోకి ఆదుర్దాగా చూస్తూ ఉన్నాడు.  వేంకట్రావుగారు ఆ చీటీ చదువుకొని, "సరే, నువ్వెళ్ళు.  నేను హెడ్మాష్టరుగారితో మాట్లాడతానులే" అని చెప్పి, వాడిని పంపేసారు.  ఆ కుర్రాడు వెళ్ళిపోయాక మేష్టారు మాతో అన్న మాటలు ఇంకా చక్కగా గుర్తున్నాయి.

"ఒరే, ఈ‌ దిక్కుమాలిన హిందీ అందరికీ  బాగా రావాలని లేదు. అందుకే, అన్ని సబ్జెక్టుల్లోనూ  ముఫై ఐదు పాస్ మార్కులు అనీ, హిందీకి పదిహేను  చాలనీ అన్నారు.  వీడికి ఆ పదిహేనూ తెచ్చుకోవటం కష్టం కాబట్టి నా చేతిలో ఉన్న పాతికకూ, పోనీలే అని పద్నాలుగు వేసాను. ఆ మిగిలిన ఒక్క మార్కూ తెచ్చుకోలేక ఫెయిల్ ఐతే ఎలాగర్రా?  మళ్ళీ స్కూల్లో చేర్చుకోండీ అని వచ్చాడు.  నువ్వు రికమెండ్ చేస్తావా అంటారు పంతులుగారు.  ఏం చెయ్యాలో మీరే చెప్పండ్రా?"

నిజానికి హిందీలో పాస్ మార్కులు చాలా సులువుగా వచ్చేవి. 'నే' ఎ క్కడ వాడాలీ, 'కి ' ఎక్కడ వాడాలీ లాంటి కొన్ని గ్రామరు సూత్రాలు వస్తే సులువుగా పదిహేను మార్కుల సెక్షన్ లో పదికి పైనే వచ్చేవి. ఉత్తరం రాయటం‌ ప్రహసనంలో చూస్తే, ఉత్తరంలో విషయం ఏమీ అవసరం లేదు - సరైన ఫార్మాట్‌లో రాసి పారేయటమే. లెటర్ బాడీగా ఆ ప్రశ్నపత్రం లోంచి ఒక లైను ఎక్కించినా చాలు.  పదిహేనుకూ పది మార్కులు గ్యారంటీ.  ఇలాంటి సుళువులు బోలెడు ఉండేవి.  స్కూలు వారు ఎంత చెడ్డా పదో పరకో వేసే పంపేవారు.  చివరికి చచ్చుపక్షం పాతిక -ముఫై  మార్కులు వచ్చి పడేవి ఒళ్ళో.  కావలసిన పాస్ మార్కులు పదిహేనూ రాక ఎవరూ తప్పవలసిన అగత్యం ఉండేదే కాదు.   ఐనా, ఈ‌ పిల్లవాడు  75మార్కులకు ఒకటీ తెచ్చుకోలేక పోవటం వింతే మరి!  అలాంటి వాడికి పద్నాలుగు ఎలా వేసి పంపావని ఇప్పుడు పంతులుగారు వేంకట్రావుగారిని నిలదీసే పరిస్థితి!

పుప్పాల వేంకట్రావుగారిలా అందరూ  అంత దయగల ఉపాధ్యాయులు కారు.  ఆ రోజుల్లో పంతుళ్ళు ఇళ్ళవద్ద స్టూడెంట్లకి ప్రైవేట్లు చెప్పటం మహా జోరుగా ఉండేది.  చాలా మంది తమతమ ఇళ్ళకు ప్రైవేటుకు వచ్చే వారికి ఒకలాగా మిగతా వారికి మరొకలాగా మార్కులు వేసేవారు!  ఆ మరొకలా అనేది అప్పుడప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా ఉండేది.

ఈ‌ స్వపక్షం విద్యార్థులకి మంచి మార్కుల కోసం కొందరు టీచర్లు పేపర్లు దిద్దే విధానం చాలా తమాషాగా కూడా ఉండేది అనటంలో వీసమంత అతిశయోక్తి కూడా లేదు.  అందుచేత స్కూలు నుండి పిల్లలకు మార్కుల విషయంలో అన్యాయం జరగకుండా చూడటం అంటే ఆవరేజ్ చేయటంలో పొరపాట్లు పట్టుకోవటమే కాదు, ఆ రెండేళ్ళ పేపర్లూ అన్నీ సరిగా దిద్దారా లేదా అన్నదీ క్షుణ్ణంగా చూసేవారు.  ఉదాహరణకు, ట్యూషన్ పిల్లలు తమ మాష్టారు బట్టీ పట్టించిన సాదాసీదా సమాధానం వ్రాసి పదికి పదీ‌ తెచ్చుకుంటే, మిగతా విద్యార్థులకు పదికి మూడూ నాలుగూ‌ పడేవి అంతకంటే మంచిగా సమాధానం వ్రాసినా సరే.  నాకే ఇలాంటి అనుభవాలు కొల్లలుగా అయ్యాయి! మేష్టర్లు తమ ట్యూషన్ పిల్లలకు ప్రశ్నపత్రాలు లీక్ చేయటమూ తరచుగా జరిగేదంటే పరిస్థితి అర్థం చేసుకోండి.

నాకు తెలిసి ఇంగ్లీషులో ట్యూషన్ చెప్పించుకునే పిల్లలే కాని తెలుగులోనో, హిందీలోనో ఆ  అవసరం పడే పిల్లలెవరూ ఉండేవారే కాదు. లెక్కలూ సైన్సూ సబ్జెక్టులకు ట్యూషన్ అన్నది సర్వసాధారణం. మా నాన్నగారే నాకు అన్నీ చెప్పేవారు అవసరమైతే.  కాబట్టి నేను ట్యూషన్లకు వెళ్ళే పని ఉండేది కాదు.

హిందీలో అలా వేంకట్రావుగారు దానకర్ణుళ్ళా పదులూ పద్నాలుగులూ వేసేస్తుంటే డిఇవోలు పట్టుకుని అభ్యంతరం చెప్పరా అని అనుమానం వస్తుంది కదా?  నాకు అదే అనుమానం వచ్చి నాన్నగారిని అడిగితే పై చదువులకు హిందీ అంత అవసరం కాదుగదా, ఆ హిందీలో పిల్లలు అనవసరంగా ఫెయిల్ కావటమెందుకూ అని ఈ సబ్జెక్టు విషయంలో మాత్రం అంతా -అంటే అన్ని స్కూళ్ళ లోనూ- కొంచెం ఉదారంగా ఉంటారని చెప్పారని గుర్తు. "పది వరకూ ఫరవాలేదు. మరీ ఎక్కువగా వేసేయకండీ" అన్నా  వేంకట్రావుగారు వినేవారేకాదట.

అన్ని రకాల కారణాలూ‌ కలిసి ప్రతి సంవత్సరమూ చాలా మంది విద్యార్థులకి స్కూలు కోటా మార్కుల్లో సమస్యలు వస్తూ ఉండటమూ,  వాటిని నాన్నగారూ మరొకరిద్దరూ‌ మాష్టర్లు కూర్చుని పట్టుకుని సరిచేయవలసి వస్తూ ఉండటమూ అటు పంతులుగారికీ, ఇటు నాన్నగారికీ ఆందోళన కలిగించేది.  ఈ విషయం నాన్నగారే నాతో కొన్ని సార్లు ప్రస్తావించి బాధపడ్డారు.  ఉపాధ్యాయవృత్తి పవిత్రతకు భంగం వాటిల్లుతోందని విచారించే వారు.

26, అక్టోబర్ 2013, శనివారం

ఇంట్లో చెప్పకుండా హిందీమాట్నీకి వెళ్ళటం - నాన్నగారికి దొరికి పోవటం.

కొత్తపేటలో మేము 1963నుండి 1972 ఆగష్టు వరకూ ఉన్నాం. నా ఉన్నత విద్యాభాసం అంతా కొత్తపేటలోనే చేసాను. అమలాపురంలో  SKBR కాలేజీలో చదివిన మూడేళ్ళూ  ప్రతి ఆదివారమూ ఇంటికి వచ్చి వెడుతూ‌ఉండే వాడిని.

కొత్తపేటలో మొదట్లో ఒకే సినీమా హాలు ఉండేది.  దాని పేరు మారుతీ టాకీస్.  అప్పట్లో నేలక్లాసు టికెట్టు 35పైసలూ, బెంచీక్లాసు 50పైసలూ, కుర్చీక్లాసు75పైసలూ, రిజర్వుడు అని ఒక వరస మంచి కుర్చీల క్లాసు 1రూపాయి ఖరీదు ఉండేవి. ఒక సారి పిల్లలం, నేల క్లాసుకు వెడితే అది దరిద్రంగా ఉంది.  అందుచేత అప్పటి నుండి నాన్నగారు పిల్లలకి బెంచీ క్లాసు టికెట్లు తీసుకునే వారు. అమ్మా నాన్నలు మాత్రం రిజర్వుడు క్లాసు అన్నమాట.

మారుతీ టాకీస్‌లో ఎప్పుడోకాని హిందీ సినిమాలు వచ్చేవి కావు.  ఒకవేళ ఎప్పుడైనా హిందీ సినిమా వచ్చినా అది మాట్నీ ఆటకే పరిమితంగా మూడు నాలుగు రోజులే ఉండేది.  అంతకంటే ఆ టౌనులో కలెక్షన్లు కష్టం.  సకృత్తుగా ఇంగ్లీషు సినిమాల మాట్నీలు  కూడా వేసేవారు.  అలా  కింగ్‌ కాంగ్ సినిమా చూసాం, అందరూ చాలా బాగుందంటే.  సినిమా అర్థం చేసుకునే ఇంగ్లీషు ఎవరికి వచ్చు కాని , గొరిల్లాని చూడటం కోసం జనం పొలోమని ఆ సినిమాకి ఎగబడ్డారు.  ఆ సినిమా వారం రోజులు ఆడినట్లు గుర్తు.

హిందీ సినిమాలు అడపా దడపా వచ్చినా మేము ఆసక్తి చూపటం తక్కువే.

కొన్నాళ్ళకు ఊరికి ఆవలి చివరన ఒక టూరింగ్ టాకీస్ వెలిసింది.  అంటే అది వట్ఠి తడికెల హాలన్న మాట. దాని పేరు వేంకటేశ్వరా టాకీస్.  ఆ హాలు ఆట్టే ఏళ్ళు నిలవలేదు. ఆ హాల్లోకూడా కొన్ని సినిమాలు చూసాం.

ఒకసారి వేంకటేశ్వరాలో సినిమాకి వెళ్ళినప్పుడు మాకో చిత్రమైన అనుభవం ఎదురైంది. మా బంధువర్గంలో ఒకాయన ఏదో మంచి హోదాలో, ప్రభుత్వోద్యోగంలో ఉండే వాడు. ఆయనంటే కిట్టని వారు ఆయనమీద  కుట్రలు పన్ని లంచగొండి అనో మరొకటనో‌ సాక్షాలు పుట్టించి ఆయన ఉద్యోగం తీయించేసారు.  ఆయన సకుటుంబంగా కొత్తపేట వచ్చారు.  చాలా అభిమానం కల వ్యక్తి.  ఎంతో మృదువుగా మాట్లాడేవారు.  మేము సినిమా హాలుకు వెళ్తే,  అక్కడ గేటు దగ్గర ఆయన టిక్కెట్లు చింపుతున్నారు.  మాకు ఎంతో బాధకలిగింది.   మా అమ్మగారికి కన్నీళ్ళు వచ్చాయి.  ఇది వ్రాస్తుంటే నాకూ ఇప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి. టిక్కెట్లు చింపుతూ ఆయన మా అమ్మానాన్నలతో, "అంతా దేవుడి లీలండీ. ఫరవాలేదు" అన్నారని నాకు గుర్తు. మా నాన్నగారు ఎప్పుడూ గంభీరంగా ఉంటారు. అయనా ఇంటికి వచ్చి చాలా ఆవేదనపడ్డారు.  ఇలా మా బంధువుగారు కష్టాలు పడుతుంటే చూసి, సహాయం చేయాలని మా ఊరిలో వ్యాపారులు ఆయనకు అండగా నిలిచారు.  దానితో ఆయనకూ‌ మరింత గౌరవప్రదమైన జీవనమూ లభించింది, ఆయన కుటుంబపరిస్థితి కూడా కుదుట పడింది. ఆయన కూదా ఆ ఊరి వ్యాపారులకు,  వ్యాపారలావాదేవీలలో సహాయం చేస్తూ ఉండే వారు.  అప్పుడప్పుడు అయనకు పై ఊళ్ళూ వెళ్ళవలసి వచ్చేది.  అలా ఒకసారి పొరుగూరికి వెళ్ళి వస్తూ లారీ‌ప్రమాదంలో మృతిచెందారు.  ఇది జరిగి ఇంచుమించు నాలుగు దశాబ్దాలు అయింది.  పిల్లలంతా మంచి వృధ్ధిలోకి వచ్చి ఆ కుటుంబం అంతా ఇప్పుడు బాగున్నారు.

వేంకటేశ్వరా హాలులోనే  బీస్ సాల్ బాద్ సినిమా చూసాం. అదీ చివరిరోజు రాత్రి ఆఖరి ఆటను! అప్పటికే ఆ సినిమాలోని  కహిఁ దీప్ జలే కహిఁ దిల్ అనే పాట చాలా చాలా పాప్యులర్ మరి.  మా నాన్నగారిని, ఆ సినిమా చూస్తాం అని నేనూ మా తమ్ముడూ కలిసి, ఒకటే సతాయించేసాం కొన్ని రోజుల పాటు.

మారుతీ‌ టాకీస్‌లో అంగుళీ మాలా అని మరొక హిందీ సినిమా చూసాను. అప్పటికే అది పాత సినిమా అని గుర్తు. నేను ఒక్కడినే వెళ్ళినట్లుగా కూడా గుర్తు. అందులో ఒక రాజకుమర్తె కాబోలు ఉంటుంది.  ఆమె వస్త్రధారణ నాకు చాలా అసభ్యంగా అనిపించి ఇంక హిందీ సినిమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చూడకూడదు అని నిర్ణయం తీసేసుకున్నాను.

అప్పట్లో చిన్న టౌన్లలో హిందీ సినిమాలు చూపిస్తున్నప్పుడు సినిమాహాళ్ళవారు ఒక సదుపాయం చేసేవారు. ఒక గుమ్మందగ్గర  హిందీ డైలాగుల్ని తెలుగులోకి తర్జుమా చేసి ఒకతను రన్నింగ్ కామెంటరీ లాగా చెబుతూ ఉండే వాడు. లేకపోతే ఎవరికి హిందీ అర్థం అవుతుంది అక్కడ? సినిమాలో పాటలు వచ్చినప్పుడే  అలా తర్జుమా చేసే వాడికి కాస్త విశ్రాంతి అన్నమాట.

ఒకసారి, మా నాన్నగారొక్కరే సినిమాకు వెళ్ళారు.  అది చాలా అరుదు.  ఎందుకలా అని అడిగితే మా అమ్మగారు 'ఈ రోజు నాన్నగారి పుట్టిన రోజర్రా' అందు కని మేట్నీ సినిమాకి వెళ్ళారు అని చెప్పారు. హిందీ‌సినిమా కాబట్టి ఆవిడ వెళ్ళలేదట.  నాకూ మా తమ్ముడికీ కూడా ఆ సినిమాకి వెడదాం అనిపించింది.  నాన్నగారు మమ్మల్ని తీసుకుని వెళ్ళలేదుగా.  అందుకని ఉక్రోషం అన్నమాట.  మా దగ్గర బెంచీటిక్కెట్లకి సరిపడా డబ్బులున్నాయి కదా అని మేమూ సినిమాకు వెళ్ళిపోయాం.

అది 'కైసే కహూఁ' అనే  1964లో విడుదలైన  ఏడాది రెండేళ్ళ పాత హిందీ సినిమా.   బాగుందో బాగోలేదో మాకేం తెలుసు.  సినిమా చూసేసాం అంతే.

సినిమా చూసి సాయంత్రం ఇంటికొచ్చాక, అమ్మ కొంచెం కోపంగా 'ఎక్కడి కెళ్ళారు?' అని నిలదీసింది.  నాన్నగారు అక్కడే ఉన్నారు.  ఆయన కేసి భయం భయంగా చూస్తే , ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు.  విషయం‌ బయటపడి పోయిందని  అర్థమై, బిక్కముఖాలు వేసాం. హాల్లోంచి బయటకు వస్తున్న మమ్మల్ని ఆయన చూసేసారన్న మాట!

అలాగే అన్‌జానా అనే మరో సినిమా కూడా 1970లో అనుకుంటాను, మారుతీలోనే చూసాను. అప్పుడు కూడా సినిమా ఏమీ అర్థం కాలేదు.  ఐతే అందులో ఒక పాట హమ్‌ బెహనోం‌కే లియె మేరె భయ్యా  అన్న పాట మాత్రం చాలా బాగుంది అనిపించింది.  అంటే ఆ పాట ట్యూన్ అంత మెలోడియస్‌గా ఉండి ఆకట్టుకుందన్న మాట.

అమలాపురంలో కాలేజీ చదువు  వెలిగిస్తున్న రోజుల్లో  చూసిన హిందీ సినిమా ఒక్కటే. రాజేష్ ఖన్నా చేసిన ఆరాధన. ఆ సినిమా చూస్తున్నప్పుడు,  మేరే సప్‌నోంకి రానీ కబ్ ఆయేగి తూ అనే పాట వస్తూండగా, కరెంటు పోయి ప్రదర్శన ఆగింది కొంచెం సేపు. ఆ అగటం కూడా,  జీపు సరిగ్గా రైలు పట్టాలు దాటబోతున్నప్పుడు!  తిరిగి కరెంటు వచ్చాక హాలు వాడు ప్రదర్శన ఆగిన చోటినుండే కొనసాగించబోతే, హాల్లోని స్టూడెంట్లు ఒప్పుకోక గోలగోల చేసారు.  చేసేది లేక, ఆ  సినిమాని మళ్ళీ  మొదటి నుండి ప్రదర్శించారు. సినిమా కథ మొత్తానికి  సరిగానే అర్థమైనా, డైలాగులు మాత్రం ఒక్కటీ అర్థం కాలేదు నాకు. నాకు తెలిసి నా బోటి స్టూడెంట్లందరి పరిస్థితీ అంతే! ఐనా పాటలు బాగున్నాయని సినిమాని బాగానే ఆదరించారు అమలాపురంలో.

మా స్నేహితులు కొందరు అలా అర్థం ఐనా కాకపోయినా అమలాపురం వచ్చిన ప్రతి హిందీ సినిమానీ చూసేవారు. అది డిగ్రీ‌కాలేజీ‌గట్రా ఉన్న కాస్త పెద్ద టౌన్ కాబట్టి హిందీ సినిమాలు కూడా కాస్త తొందరగానే వచ్చేవి. అప్పటికే అమలాపురంలో ఆరు సినిమా హాళ్ళు ఉండేవి.  ప్రస్తుతం ఎన్నో తెలియదు.  మేము డిగ్రీ మూడవ సంవత్సరంలో ఉండగా అనుకుంటాను, ఒక హిందీ సినిమా ప్రచారం కోసం, కోటి రూపాయల పెట్టుబడితో‌నిర్మించిన భారీ చిత్రం అని కరపత్రాలు ముద్రించి అమలాపురం అంతా పంచిపెట్టారు కూడా.  ఆ సినిమా పేరు ఇప్పుడుగుర్తులేదు నాకు.

అలాగే మా డిగ్రీ చివరి సంవత్సరంలోనో, డిగ్రీ పూర్తి ఐన కొత్తలోనో కొత్తపేటలో సంతపాకల దగ్గరలోనే సత్యనారాయణా టాకీస్ అని ఒక కొత్త సినిమా హాలు వెలిసింది. నాకు గుర్తున్నంత వరకూ, మేము ఇంకా కొత్తపేటలోనే ఉన్న ఆ ఒకటి రెండేళ్ళల్లో సత్యనారాయణా టాకీస్ వాళ్ళు హిందీ సినిమాలు ఏమీ వేయలేదు.

కోస్తా జిల్లాల్లో  టౌన్లల్లో హిందీ సినిమాలు అప్పుడప్పుడూ వచ్చి ఆడేవంటే, మంచిమంచి మెలోడీ వరసలు ఉన్న పాటలు ఉన్నప్పుడే.  సాధారణంగా ఆ ప్రాంతంలో హిందీ మాట్లాడే వారు తక్కువ కదా. అసలు ఆ భాష అర్థం అయ్యే వారే తక్కువ. కోస్తాజిల్లాల్లో యావన్మందీ తెలుగే మాట్లాడతారు.  నాకు తెలిసి ముస్లిములు కూడా తెలుగులోనే మాట్లాడేవారు.

ఆ రోజుల్లో, ప్రతి బుధవారమూ,  రాత్రి 8గంటలకు రేడియోలో బినాకా గీత్ మాలా అని హిందీ పాటలు వేశేవారు ఒక అరగంటపాటు. ఏడెనిమిది పాటలు వేసేవారు.  అన్నీ కొత్తవీ - మంచి హిట్ పాటలూ మాత్రమే.  ఆ ప్రోగ్రాం కోసం మాత్రం కుర్రకారు అంతా ఎదురుచూసే వాళ్ళం.  పాటల్లో ఒక్క ముక్కా అర్థం కాకపోయినా, ఆ పాటల వరసలు వినసొంపుగా ఉండేవి కాబట్టి గొప్ప క్రేజ్ ఉండేది ఆ ప్రోగ్రాం మీద.  అప్పట్లో, రేడియో కూడా అందరి ఇండ్లలోనూ‌ఉండేది కాదు! నా క్లాస్‌మేట్ మరియు ఆప్తమిత్రుడు గుడిమెళ్ళ పాండురంగారావు ఇంట్లో ఐతే, అసలు కరెంటే లేదు.  ఐనా అలాగే కిరోసిన్ దీపాలక్రింద చదివి అతను మా కొత్తపేట స్కూల్‌కు ఫస్ట్ వచ్చాడు 1968లో.  బుధవారం బుధవారమూ,  మాయింటికి ఠంచనుగా వచ్చే వాడు బినాకా గీత్ మాలా కోసం.  వాడి హిందీ‌పాండిత్యమూ నా పాండిత్యం లాంటిదే కాని, వాడు తెలుగేమి హిందీ యేమి కొత్త సినిమాలు అన్నీ చూసేవాడు. తెలుగులో, నాగేశ్వరరావు సినిమా ఐతే మొటిరోజు మొదటి ఆట తప్పదు.  వాడికో ఫ్రెండ్ ఉండేవాడు.  హిందీ సినిమా పాటల ట్యూన్లు హమ్మింగ్ చేసేవాడు ఎప్పుడూ.  మళ్ళీ‌  ఆ పాటల అర్థం మాత్రం వాడికి ఏమీ‌ తెలియదు.  ఇలాంటి స్టూడెంట్లు  బోలెడు మంది.

25, అక్టోబర్ 2013, శుక్రవారం

నాన్నగారి దయవల్ల గడచిన హిందీగండం!

ఈ మధ్య నేను వ్రాసిన ఒక టపా తెలుగువారు రాహుకాలం పాటించాలా? అనే టపాకువచ్చిన ఒక వ్యాఖ్యలో శ్రీధర్‌గారు ఒక హిందీ పుస్తకాన్ని ప్రస్తవించారు. సమాధానంగా నేను అ జ్యోతిష్ ఔర్ కాల్ నిర్ణయ్ పుస్తకం తెలుగు అనువాదం దొరికితే పరిశీలిస్తాను కాని మూలం చదివేటంత హిందీ పాండిత్యం నాకు లేదని చెప్పాను.అందుచేత హిందీభాషకీ నాకూ ఎంత సయోధ్య ఉన్నదీ కూడా ఒక సారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని అనిపించింది.

చదువుకునే రోజుల్లో నాకు హిందీ అంటే చచ్చేంత భయంగా ఉండేది. ఆ భాష నాకు ఒక ఏమీ కొరుకుడు పడేది కాదు.

1958-63 సంవత్సరాల కాలంలో నాన్నగారు తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడికి చాలా దగ్గరలోనే ఉన్న గెద్దనాపల్లి లోని మిడిల్ స్కూలుకు  ప్రధానోపాధ్యాయులుగా ఉండేవారు. ఆ పాఠశాలలో నేను ఆరు, ఏడు తరగతులు చదివాను. ఆ రోజుల్లో ఆ తరగతుల్లో ఇంగ్లీషు హిందీ  భాషల సిలబసులు  కాస్తా అక్షరాలూ, చిన్న చిన్న వాక్యాల వరకే ఉండేది.

శేషగిరిరావుగారని ఒక మాష్టారు ఆరవతరగతిలో మాకు ఇంగ్లీషు నేర్పేవారు. మొదట్లో నాకు ఆ భాష అంతగా నచ్చలేదు.  ఒక రోజున "ఈ ఇంగ్లీషు పిచ్చిభాషలా ఉందండీ" అన్నాను నాన్నగారితో. "అర్థం కావట్లేదా " అని నాన్నగారు అనుమాన పడ్డారు. "ఈ భాషలో చాలా అక్షరాలు లేవండీ, గా ఏదీ చా ఏదీ" అన్నాను నేను.  నాన్నగారు చాలా సేపు నవ్వుకున్నారు.

అలాగే ఒక రోజున, దిస్ అంటే ఎడమవైపున అనీ, అలాగే దట్ అంటే కుడివైపున అనీ, నేను సులువుగా కనిపెట్టేసానని చెప్తే కూడా చాలా నవ్వుకున్నారు.  మా ఆరవతరగతి ఇంగ్లీషు వాచకంలో మొదటి పాఠమే,  దిస్ ఈజ్ రామ అనీ దట్ ఈజ్ సీత అనే బొమ్మల్తో కూడా వేసిన వాక్యాలతో ప్రారంభం అవుతుంది.  దిస్ ఈజ్ రామ అని వ్రాసి దానికి ఎడమవైపున రాముడి బొమ్మ వేసారు.  అలాగే, దట్ ఈజ్ సీత అని వ్రాసి ఆ వాక్యానికి కుడివైపున సీత బొమ్మ వేసారు మరి!  అలాగే ఈజ్‌లాండ్ సిమ్యుల్‌టేన్యువస్లీ అంటూ అక్షరాలన్నీ జాగ్రత్తగా కలేసి అమాయకంగా పలుకుతూ ఆయనకు బోలెడు వినోదం కలిగించాను కూడా.   అలా మొదలైన నా ఇంగ్లీషు భాషాభ్యాసం నాన్నగారి శిక్షణలో త్వరత్వరగానే బాగా మెరుగయ్యింది.  ఎనిమిదిలోకి వచ్చేసరికే నేను స్వంతంగా తప్పుల్లేకుండా వ్రాయగలిగే స్థితికి వచ్చాను. ఇంగ్లీషు ఇలా చకచగా నేర్చుకో గలిగాను కాని హిందీని మాత్రం అస్సలు పట్టుకోలేక పోయాను!

అది 1964వ సంవత్సరం.  నేను 8వ తరగతిలో ఉన్నాను. ఇప్పుడు మేము కొత్తపేట వచ్చేసాము.  ఇక్కడ నాన్నగారు సీనియర్ బి.ఇడి టీచర్.  ఉడతల రమణయ్య పంతులుగారని మా ప్రధానోపాధ్యాయులు. ఆయన నల్లగా ,పొడుగ్గా ఉండేవారు. ఫుట్‌బాల్ కూడా ఆడేవారు.  నాకు ఇంకా కొంత మంది ఆ పాఠశాల గురువుల పేర్లు గుర్తున్నాయి. హిందీ మాష్టారి పేరు  పుప్పాల వేంకట్రావుగారు. ఈయనా నల్లగా ,పొడుగ్గా, కొంచెం సన్నగా ఉండే వారు. వేంకట్రావుగారు హిందీ ఉర్దూలు రెండూ బాగా వచ్చిన వారట.  ఈ ఎనిమిదో తరగతిలో హిందీ పాఠాలు నిజంగా మొదలయ్యాయి. ఈ హిందీ భాష  నాకు చుక్కలు చూపించింది. నాగరిలిపిని చదవటమే నాకు మహాకష్టంగా ఉండటం వలన ఆ భాషలో అభ్యాసం నాకు వీలు కాని వ్యవహారం ఐపోయింది.  ఆ సంవత్సరం క్వార్టర్లీ పరీక్ష నా బండారం బయట పెట్టింది.

కొత్తపేటలోని పాఠశాల హైయర్ సెకండరీ అండ్ మల్టీపర్పస్ స్కూల్. అంటే ఎనిమిది నుండి పన్నెండు వరకు తరగతులు. నూటికి 75మార్కులకి పరీక్ష పేపర్లు. మిగతా  25 మార్కులూ, పాఠశాల వారి చేతిలోఉంటాయి. సరే, ఇంతకీ నాకు ఆ క్వార్టర్లీ పరీక్ష లో అన్ని సబ్జెక్టుల్లోను చక్కగా వచ్చాయి మార్కులు  - ఒక్క హిందీ‌లో తప్ప.  హిందీలో వచ్చింది అక్షరాలా మూడు మార్కులు. దాంతో కంగారుపడి, వేంకట్రావుగారు మాయింటికి వచ్చి నా సంగతి ఆందోళనకరంగా ఉందని నాన్నగారితో చెప్పి చక్కాపోయారు.

ఆ రాత్రి భోజనాలయ్యాక, నాన్నగారు  నన్ను కూర్చో బెట్టుకుని ప్రశాంతంగా "హిందీ టెక్స్ట్" తియ్యరా అన్నారు. తీసాను. తీరా చదవమంటే అక్షరాలు చదవటమే గగనమాయె నాకు. నిజంగా నాన్నగారు కూడా అందోళన పడ్డారు.

అప్పటి నుండి, నాకు నాన్నగారి దగ్గర రోజూ హిందీలో ప్రత్యేక శిక్షణ ప్రారంభం. అక్షరాలను గుర్తుపట్టటం నుండి మొదలైన ఆ శిక్షణ మార్కులు తెచ్చుకోవాలంటే తెలుసుకోవలసిన కిటుకుల దాకా నడిచింది కొన్ని నెలల పాటు.

అర్థసంవత్సరం పరీక్షలు వచ్చి వెళ్ళాయి. ఇప్పుడు హిందీ అంటే మరీ అంత బెరుకు లేదు. అంటే కొంచెమే నన్నమాట!

నాకు ఆ అర్థసంవత్సరం పరీక్షలో హిందీలో వచ్చిన మార్కులు క్లాసులో చెబుతూ వేంకట్రావుగారు చాలా ఆశ్చర్యపోయారు.  75కి ,72 మార్కులు! నాకైతే నమ్మశక్యం కాలేదు.

ఇంక హిందీ అంటే భయం పోయింది అంటా ననుకోకండి.  ఆ భయం నేటికీ అలానే ఉంది.

పుప్పాల వెంకట్రావుగారిని మరొకసారి ఆశ్చర్యంలో ముంచెత్తే అవకాశమూ నాకు మరో రెండు మూడేళ్ళకి వచ్చింది.

పాఠశాల వార్షికోత్సవాలకి పిల్లలకి పెట్టిన పోటీల్లో హిందీ పోయెట్రీ రెసిటేషన్ అనేది ఒకటి.  నేనూ పేరిచ్చాను.  ఆకాశవాణి వివిధభారతిలో హిందీ కవితలు ఎలా గానం చేస్తారో వినీ వినీ బాగా పట్టుకున్నాను.  తరగతి వాచకంలో ఉన్న 'చాహ్ నహీ మైఁ సుర్ బాలాకే గహనోం మే గుంథా జాఁవూఁ' అనే కవితను అచ్చం రేడియో వాడి ఫక్కీలో చదివి ఫస్ట్ ప్రైజ్ సంపాదించేసాను. ఆ సందర్భంలో న్యాయనిర్ణేతగా ఉన్న వేంకట్రావుగారైతే చాలా ఆనందించారు.  ఆ విషయం ఆయన నాతో చాలా సార్లే చెప్పారు తరవాత కాలంలో.  ఆ పోటీలో బహుమతిగా  'కుచ్ కవితాయేం' అనే  కవితాసంకలనం ఇచ్చారు.  అదింకా నా దగ్గర ఉంది.

పన్నెండో తరగతి పబ్లిక్ పరీక్షలు ఇచ్చినప్పుడు నేను హిందీ పాఠ్యపుస్తకం ఒకసారి తిరగా బోర్లా చదువుకుని వెళ్ళానంతే.  నాకు  ఏ సబ్జెక్టుకూ నోట్సు వ్రాయటం అస్సలు అలవాటు లేదు. తరగతి గదిలో వినటమే. లెక్కలకు హోంవర్క్ పుస్తకం ఒకటి తప్ప మిగతా  సరంజామా అంతా నాదగ్గర కేవలం పాఠ్యపుస్తకాలే.

మా నాన్నగారు నాకు శ్రధ్ధగా హిందీ‌ నేర్పకపోతే అది నా కొంపముంచి ఉండేది నిస్సందేహంగా.

1975లో నాన్నగారు స్వర్గస్థులయ్యే దాకా ఆయన హిందీలో పరీక్ష (రాష్ట్రభాష కాబోలు) ఇచ్చారన్న విషయం తెలియదు నాకు!  అన్నట్లు మా నాన్నగారి దగ్గర దుర్గాదాస్ అని ఒకటీ మరికొన్ని (పేర్లు గుర్తులేవు) హిందీ పుస్తకాలు ఉండేవి.   నేనెప్పుడూ వాటి జోలికి పోలేదనుకోండి.

24, అక్టోబర్ 2013, గురువారం

హీరో నాగేశ్వరరావునే గురుపట్టలేదు మా నాన్నగారు.

అది 1972వ సంవత్సరం.  ఆ యేడాదిలో మానాన్నగారు స్వర్గీయ వేంకట సత్యనారాయణగారికి రంపచోడవరం హైస్కూలుకు హెడ్మాష్టరుగా బదిలీ అయింది. అప్పటి దాకా మేము కొత్తపేటలో ఉండేవాళ్ళం.

ముందుగా నాన్నగారు వెళ్ళి రంపచోడవరంలో ఛార్జీ తీసుకుని వచ్చారు.  ఒక తమాషా విషయం చెప్పారు.  ఊరిపెద్దలు నాన్నగారికి ఊరు తిప్పి చూపించారట.  ఒక చిన్న గుడిసెలాంటి ఇంటిముందుకు వచ్చాక ఆ యింటిలోని ఒకావిడ వచ్చి పరిచయం చేసుకున్నారట.  ఆవిడ పేరు రత్నాబాయి అని నాన్నగారు చెప్పినట్లు గుర్తు.  అవిడ అక్కడ ఎమ్మెల్యే.   ఆ సంవత్సరం ఆగష్టు 14న మా కుటుంబం అంతా రంపచోడవరం వచ్చాము.

మాకు క్వార్టర్స్ ఇచ్చారు.  అందులో రెందు పోర్షన్లు.  ఒకటి ప్రధానోపాధ్యాయులకు.  మరొకటి మరెవరైనా ఇతర  ఉపాధ్యాయులకు తాత్కాలిక వసతిగా ఇచ్చేందుకు ఉద్దేశించబడ్దాయి ఆ పోర్షన్లు.  అన్నట్లు వాటిలో కరెంటు సదుపాయం లేదు అప్పటికి. 1975లో వచ్చింది వాటికి కరెంటు.

శ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారు హీరోగా బాపుగారు తీసిన అందాలరాముడు సినిమా 1973సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చింది. ఈ  సినిమాకోసం  తూర్పుగోదావరిజిల్లా ఏజన్సీ ప్రాంతం లోని దేవిపట్నంలో  విస్తారంగా షూటింగ్ చేసారు.  దేవీ పట్నానికి రోడ్డు మార్గం అంటే వయా రంపచోడవరం.

ఆ రోజుల్లో జై ఆంధ్రా ఉద్యమం చాలా జోరుగా సాగుతూ ఉండేది.

వేసంగి సెలవుల్లో పాఠశాలలకు సెలవులు. ఉపాధ్యాయులంతా స్వస్థలాలకు వెళ్ళి మళ్ళీ బడి తెరచే రోజుకు చేరుకుంటారు. ప్రధానోపాధ్యాయులకు మాత్రం సెలవులు కావా ఏమిటి. వారికీ సెలవులే. ఐతే మా నివాసం స్కూలుకు అతిసమీపం లోనే.  స్కూలు ఎదురుగా ఆటస్థలం. అందులోనే ఒక మూల మా క్వార్టర్స్ అన్నమాట.  అటస్థలానికి మరొక పెడగా పిల్లలకు హాస్టల్ ఉంది. అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట నాన్నగారు అఫీసుకు వెళ్ళి  కాగితాలు చూసుకుంటూ ఉండేవారు.

అలా ఒక రోజున ఆయన ఆఫీసు పనిలో నిమగ్నమై ఉన్నారు.

ఒక వ్యక్తి అఫీసు గుమ్మం వద్దకు వచ్చి నిలబడ్డారు.

ఎవరో వచ్చిన అలికిడి గమనించి  నాన్నగారు 'కమిన్' అని ఆహ్వానించారు.

ఆ  లోనికి వచ్చిన పెద్దమనికి కుర్చీ చూపించి కూర్చుండబెట్టి 'చెప్పండి, ఏ పని మీద వచ్చారు' అన్నారు నాన్నగారు.

వచ్చిన పెద్దమనిషి  కుర్చీలో కొంచెం  ఇబ్బందిగా కదిలి, 'నా పేరు నాగేశ్వరరావంటారండీ. నేను సినిమాల్లో  వేషాలు వేసుకుంటూ ఉంటాను' అన్నారు.

వచ్చిన పెద్దమనిషి సినిమాహీరో‌ నాగేశ్వరరావుగారు అన్నది అర్థం కావటానికి మానాన్నగారికి ఒక నిమిషం పట్టింది.  చాలా ఆశ్చర్యపోయారు.  సినిమా హీరోగారికి ఒక పాఠశాలతో ఏం‌ పనబ్బా అనుకున్నారు.

నాగేశ్వరరావుగారు సందర్భం వివరించారు. జై ఆంధ్రా ఉద్యమకారులు రంపచోడవరంలో నాగేశ్వరరావుగారి కారుని ఆపి ఉద్యమాన్ని సమర్థిస్తూ‌  పత్రికా ప్రకటన విడుదల చేయాలని డిమాండు చేసారట. అలాగే నని చెప్పి ఆయన వారిని సముదాయించి బయట పడ్డారు. ఆ తరువాత ఆయన తిన్నగా స్కూలు దగ్గరకు వచ్చారు.

"రామారావుగారితో మాట్లాడాలండీ.  మద్రాసు నుండి ఆయన మా ఇద్దరి తరపునా పత్రికలకు  ప్రకటన ఇస్తారు ఈ‌ విషయమై" అన్నారు నాగేశ్వర రావుగారు మానాన్నగారితో.

"ఇక్కడ మీ‌ స్కూలులో‌ టెలిఫోన్ ఉంటుందని పిల్లలు చెబితే వచ్చాను.  మీరు ఈ‌ విషయంలో దయచేసి సహాయం చేయాలి" అని నాగేశ్వరరావు గారు తాను స్కూలుకు ఎందుకు వచ్చిందీ వివరించారు.

మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. "స్కూల్లో ఫోన్ లేదండీ. మీరు మద్రాసుకి ఫోన్ చేయాలంటే పోష్టాఫీసుకు వెళ్ళాలి" అని సలహా ఇచ్చారు.

"అలాగా " అన్నారు నాగేశ్వరరావు గారు.

నాన్నగారు "బుచ్చన్నా" అని  పిలుస్తే  గుమ్మందగ్గరే తచ్చాడుతున్న బంట్రోతు లోపలికి వచ్చాడు.  వాడు జరుగుతున్న తమాషా అంతా గుమ్మంలోంచి చూస్తూనే ఉన్నాడు. "నువ్వు పోష్టుమాష్టరు సాంబమూర్తిగారికి ఈ చీటీ అందించు" అని అప్పటి కప్పుడు చీటీ వ్రాసి పంపారు నాన్నగారు.

కొద్ది సేపటికి బుచ్చన్న తిరిగి వచ్చాడు, అంతా సిధ్ధం అన్న వర్తమానంతో.  నాన్నగారు బుచ్చన్ననీ, నాగెశ్వరరావుగారినీ వెంట బెట్టుకొని పోష్టాఫీసుకు వెళ్ళారు.

సాంబమూర్తిగారు ఒక రూములో ఫోన్ పెట్టించి ఉంచారు అప్పటికే.  ఆ తరువాత నాగేశ్వరరావుగారు రామారావుగారిని ప్రకటన విషయమై సంప్రదించి ఉంటారు.

ఈ  సంఘటన నా కళ్ళముందు జరగ లేదు. జరిగిన విషయం అంతా బుచ్చన్న వచ్చి మా అమ్మగారికి పూస గుచ్చినట్లు వివరించాడు.

రంపచోడవరంలో బ్యాంక్  ఉద్యోగి రామ్మోహనరావుగారనీ ఒకాయన నా స్నేహితులు. బహుశః అప్పుడు నేను ఆయన దగ్గరకు వెళ్ళి ఉంటాను.  మేము రంపచోడవరం నుండి రాజోలు బదిలీ జరిగి వెళ్ళాక కూడా రామ్మోహనరావుగారు మా కుటుంబానికి చాలా సహాయం చేసారు.  ఆ విషయం వేరే చెప్పుకోవాలి.

నేను సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక,  ఆ రోజు జరిగిన సంఘటన  విషయం మా అమ్మగారు నాకు చెప్పారు.

ఎదురుగా నాగేశ్వరరావుగారు వచ్చి కూర్చుంటే,  మా నాన్నగారు ఆయన్ని సుతరామూ గుర్తు  పట్టలేకపోవటం నాకైతే  చాలా తమాషాగా అనిపించింది.

( నేను నిన్న లక్ష్మీఫణి గారి బాతాఖానీ బ్లాగులో గుర్తుంచుకోవటం టపాకు సందర్భం వచ్చి వ్రాసిన ఒక వ్యాఖ్య తరువాత, ఆ విషయం వివరంగా అక్షరబధ్ధం చేసుకోవాలని అనిపించి ఈ బ్లాగులో వ్రాసుకున్నాను. )

23, అక్టోబర్ 2013, బుధవారం

పవన్ రాజకీయాలలోకి వస్తాడా?

పవన్ రాజకీయాలలోకి వస్తే అన్న విషయం మీద చర్చలు జరుగుతున్నాయి.

అందరికీ పవన్ కాస్తా అన్నగారిలా (అంటే సీనియర్ నందమూరి తారకరామారావుగారిలా) హిట్టవుతాడా? స్వంత అన్నయ్యలా ఫట్టవుతాడా?  అని ఆలోచనలూ అందోళనలూ అనుమానాలూ.  వెరసి బోలెడన్ని చర్చాగోష్ఠులూ!

ఇవన్నీ మంచి కాలక్షేపం చర్చలే అనటంలో సందేహం లేదు.

ఇప్పుడు తెలుగునాట ఉన్న పార్టీలు తెలుగువారి భవిష్యం కోసం ఏదో ఉడబొడిచేశాయా లేదా ప్రస్తుతం ఊడబొడుస్తున్నాయా?  ముందు ముందు కాలంలో ఏమైన ఉధ్ధరించ బోతున్నాయా?

అలాంటి దేమీ‌ లేనే లేదు కద?

ఉన్న సవాలక్ష పార్టీలూ తమ తమ మనికి కోసం, ఆ మాట కొస్తే  అసలు ఉనికి కోసం పాకులాడే పరిస్థితిలో ఉన్నాయనటంలో సందేహం ఎవరికైనా ఉందా?

ఇప్పుడు మరో పెద్దమనిషి మరో కొత్త పార్టీ‌ పెట్టి నన్నూ జనం మీద పడి బతకనివ్వండి అనబోతాడా అనడా అని మనం చర్చించ వలసిన అవసరం ఏమన్నా ఉందా?

ఈ స్వతంత్రభారతదేశంలో అన్ని రాజకీయపార్టీలూ జనం మీద పడి బతుకుతున్నాయే కాని ఏ ఒక్క పార్టీ‌ కూడా జనంకోసం బతకటం లేదు.

సామాజికస్ఫహ లాంటి మాటలు బాగుంటాయి వినటానికి.  క్రియలోకి వచ్చేసరికి ఈ‌ మాటా,  ప్రజాసేవ గట్రా మాటలూ మాట్లాడే వాళ్ళు చేస్తున్న రోతపనులకి చివరికి ఆ మాటల అర్థం మీదే జనానికి అనుమానం వచ్చే టంత గొప్పగా ఉంది పరిస్థితి.

మనదేశంలో  రాజకీయనాయకులు అధికారం కోసం ఏమైనా చేస్తారు.

మనదేశంలో బడాదొంగలు రాజకీయాల్లోకి వచ్చి పవిత్రులై పోతారు.  వాళ్ళని పవిత్రీకరించటానికి రాజకీయాల్లో బోలెడు అవసరాలూ, మార్గాలూ ఉంటాయి కూడా.

మనదేశంలో, మేధావులు నిత్యం రకరకాల గొప్ప చర్చలు చేస్తూ వినోదిస్తుంటారు.

మనదేశంలో, ప్రజల్లో చదువుకున్న వాళ్ళమని గర్వపడేవాళ్ళు మేధావుల చర్చలను ఫాలో ఐపోతూ ఆవేశపడిపోతుంటారు.

మనదేశంలో, ప్రజల్లో అత్యధిక శాతం మంది ఓట్లపండగ రోజున తమ వర్గం వాడికో, తమ కులం వాడికో, తమ అభిమాన నాయకుడికో, వాడి పాదదాసుడికో, తమకు తాయిలాలు అందిచ్చిన వాడికో ఓటు వేసి తరించిపోతుంటారు.

మనదేశంలో, జనం తిండికి మాడి చస్తూనే,  దొరతనాలు ప్రకటించే అంకెలగారడీలతో అవలీలగా పేదరికం రేఖని దాటేస్తూ‌ ఉంటారు.

మనదేశంలో, క్రికెట్టూ, రాజకీయాలూ, సినిమాలూ వంటివి, జనాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయి రోజూ.  కాని ఏరోజూ దేశపుభవిష్యం గురించి ఆలోచించే‌ టంత తీరికా ఓపికా ఎవరికీ‌ ఉండవు. అవును మరి. అదేమన్నా ఏమన్నా వినోదాత్మకమైన కాలక్షేపమా, సమయం దానిమీద చెచ్చించేందుకు?

ఇష్టమైతే, అంతగా దురద పుడితే, పవన్ ఒక రాజకీయ పార్టీ‌ పెడితే పెట్ట నివ్వండి.
ప్రజకి ఒరిగేది ఏమీ‌ ఉండదు.

ఈ‌ మాట పవన్‌కే‌ కాదు మరెవరికైనా సరే వర్తిస్తుంది.

అన్నట్లు కిరణ్ కుమార్ కూడా ఒక కొత్త పార్టీ‌ పెడతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  ఐతే ఏమిటట?

ఒకవేళ కిరణ్‌గారికి కొంత మంచి పబ్లిసిటీ వచ్చింది కాబట్టి, పార్టీ ఒకటి పెట్టినా ఆనక ఎలక్షన్ ముచ్చట్లు కాస్తా పూర్తయ్యాక, శుభముహూర్తం చూసుకుని స్వగృహప్రవేశం చేయరని గ్యారంటీ‌ ఏమీ లేదు కదా?

పవన్‌గారు కొత్తపార్టీ పెట్టినా ఎన్నికల తర్వాత అది కాస్తా ఉంటుందో ఆయన పార్టీకి కూడా ఆయన అన్నగారు చిరుకు లాగే జ్ఞానోదయం కాదని గ్యారంటీ‌ ఏమీ లేదు కదా?

ఐనా రాజకీయనాయకులు ఎవరూ కూడా, తమ మాటల్ని తామే గౌరవించుకోరే, అలాంటిది వారి గురించి జనం నమ్మకాలూ అంచనాలూ ఏమిటీ అసయ్యంగా?

మన పవిత్రభారతదేశంలో, రాజకీయాలు జూదంకన్నా, మరొకదానికన్నా కూడా పరమనీచంగా నడుస్తున్నాయి!

ఐతే తప్పంతా రాజకీయనాయకులదీ రాజకీయాలదీ అనుకోకండి!!

ఇలాంటి రాజకీయవాతావరణాన్ని పోషిస్తున్న మనపవిత్రభారతదేశప్రజదే ఈ‌ తప్పంతా!

ఐతే ఆ మాట ఒప్పుకుందుకు మటుకు, మనకు ఆభిజాత్యం అనండి, అహం అనండి, అది అడ్డం వస్తుంది.  అందుచేత ఎప్పుడూ రాజకీయాలు బాగుపడాలీ రాజకీయనాయకులు మంచివాళ్ళైపోవాలీ లేదా మంచివాళ్ళే రాజకీయాల్లోకి రావాలీ అని తెగ గింజుకుంటాం.  కాని అంతకంటే ఒక్క పిసరు కూడా ఏమీ చేయం.

అవును మరి. మనది ప్రజాస్వామ్య దేశం కదా?  రూలు ప్రకారం మనకు కాలక్షేపంగా చర్చలు చేసుకునే హక్కు తప్పకుండా  ఉంది.  అలాగే ఈ‌ ప్రజాస్వామ్యం పుణ్యమా అని నిష్క్రియాపరవాక్శూరులుగా కూడా ఉండే హక్కు కూడా తప్పకుండా ఉంది.

అందుచేత నా బోటి వాడి నస పట్టించుకోకండి.

హాయిగా చర్చించుకోండి.   పవన్ రాజకీయాల్లోకి వస్తాడా? అని

19, అక్టోబర్ 2013, శనివారం

నవ్వే వారెల్ల నా వారే!



నవ్వే వారెల్ల నా వారే నా

నొవ్వుల గని రామ దవ్వున నిలిచి



నీ వేమో నా భావన నుండెద

వీ నీ శ్రీపద మే నా యునికి

యే విధమైన యెడబాటైన

నావేశపడి యావేదనపడ



శరములవలనే వరముల విసిరే

కరుణాళుడవని ఘనతకెక్కియు

మరపు నటించుచు చిరునగవులనే

కరువు జేయ నే కటకటబడగా



ఎవరు నవ్విన నేమను కొనిన

నెవరున్మాదిగ నెంచిన గానియు

తవిలి యుంటి నని తలపక నీవే

చెవులకు చేర్చవు నా వినతులని


18, అక్టోబర్ 2013, శుక్రవారం

రామ జగదభిరామ




  

రామ జగదభిరామ రవికులసోమ దాశరథీ
నా మనవి విని నా మనమునను స్వామి నిలువు మయా



మేర యెరుగని తీరుగను దయ  వారిజ నయన
కోరకనె తనివార గురిసెడు వారిధరమవుగ  
॥రామ॥


కామితములని  యేమి యడిగితి కోమలహృదయ
రామ యలిగితి  వేమి పెడమొగ మై మసలెదవు
॥రామ॥


నాదు దొసగుల  కేది పరిమితి  వాదన గలదె
మోద మలరగ చేదు కొను మిక వేదనలుడుగ
॥రామ॥




15, అక్టోబర్ 2013, మంగళవారం

తెలుగువారు రాహుకాలం పాటించాలా?


గత కొంత కాలంగా మన తెలుగుపంచాంగాల్లో రాహుకాలం అనే క్రొత్త విషయం వచ్చి చేరింది.  దానితో ఈ రాహుకాలం అనేది చెడ్డకాలం కాబట్టి దీని విధిగా విసర్జించాలీ అనుకుని గడబిడ పడుతున్నారు చాలా మంది తెలుగువాళ్ళు.  ఈ రాహు కాలం కూడా మనకు అలవాటైన వర్జ్యం, దుర్ముహూర్తం అనే వాటి సరసన చేర్చి దీనికి భయపడటం పెరుగుతోంది.  ఈ‌ రాహుకాలం ప్రతిరోజూ వస్తుంది.  రాహుకాలం సమయాలు ఇలా కనిపిస్తున్నాయి కాలెండర్లలో.

వారం సమయము మొదలు-వరకు
ఆదివారం సాయంత్రం 4.30 - 6.00
సోమవారం ఉదయం 7.30 - 9.00
మంగళవారం మధ్యాహ్నం 3.00 - 4.30
బుధవారం మధ్యాహ్నం 12.00 - 1.30
గురువారం మధ్యాహ్నం 1.30 - 3.00
శుక్రవారం ఉదయం 10.30 - 12.00
శనివారం ఉదయం 9.00 - 10.30


చాలా పంచాంగాలు, గోడ కేలండర్లలో పైన చూపిన పట్టిక ప్రకారం రాహుకాలం చూపించటం బహుళంగా కనిపిస్తుంది.  కాని ఇది చాలా తప్పు.

సూర్యోదయం ఉదయం గం.6:00 మరియు సూర్యాస్తమయం సాయంత్రం గం.6:00 ఐతే మాత్రమేపై పట్టికలో చూపించిన సమయాలు వర్తిస్తాయి.

కాని సాధారణంగా సూర్యోదయసూర్యాస్తమయ సమయాలు అలా ఉండవు.  సర్వ సాధారణంగా దినప్రమాణం ఖచ్చితంగా 12గంటలు ఉండదు.  అలా పగలు రాత్రీ కూడా సమానంగా 12గంటలుగా ఉండేది సంవత్సరంలో‌కేవలం రెండు రోజులే సుమా!  అందుచేత  సూర్యోదయం నుండి సూర్యోదయం వరకూ పగటి సమయం ఎంత కాలమో దాన్ని ఎనిమిది భాగాలు చేసి, సూర్యోదయం నుండి ఆ భాగాలు లెక్కిస్తూ ఈ క్రింది పట్టికలో చూపినట్లుగా సరియైన విధంగా రాహుకాలం గ్రహించాలి.


వారం రాహుకాల భాగం
ఆదివారం 8వ భాగం
సోమవారం 2వ భాగం
మంగళవారం 7వ భాగం
బుధవారం 5వ భాగం
గురువారం 6వ భాగం
శుక్రవారం 4వ భాగం
శనివారం 3వ భాగం


సూర్యోదయం ఉదయం 5గం. ప్రాంతంలో కూడా రావచ్చు వేసవిలో మే నెలలో.  అటువంటప్పుడు సూర్యాస్తమయం సా॥7గం. కు అవుతుంది.  అంటే పగటి సమయం ఇంచుమించు 14గం. పాటు ఉంటుంది. రాహుకాలం ప్రమాణం 14/8 = గం.1:45ని॥అవుతుంది.  అలాగే శీతకాలంలో రాహుకాలం గం.1:15ని॥ కావచ్చును కూడా.  రాహుకాలం‌ ప్రారంభ కాలాలు కూడా చాలా తేడాగా వస్తాయి.  ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే గోడకాలెండర్లలో ఉన్న రాహుకాలాలు ఎంత శుధ్ధతప్పో తెలుస్తోంది కదా!

ఉదాహరణకు ఒక వేసవికాలం ఆదివారం నాడు సూర్యోదయం గం.5:00 సూర్యాస్తమయం సాయంత్రం గం.7:00 ఐతే నాటి రాహుకాలం  సాయంత్రం 5:15 నుండి 7:00 అవుతుంది కాని కేలండర్లలో ఇస్తున్నట్లుగా సాయంత్రం 4.30 - 6.00 కాదు. చూడండి ఎంత తేడా వస్తోందో!

అలా గని, అందరూ సరైన రాహుకాలాలు గణనం చేసుకుని వాడాలంటే కాలెండర్లలో సూర్యుడి ఉదయాస్తమయాల వివరాల సదుపాయం తక్కువే మరి.  గోడకాలెండర్లలో కొన్ని కొన్ని మాత్రమే సూర్యోదయం చూపుతున్నాయి.  సూర్యాస్తమయం చూపేవి తక్కువే.  బండగా మొదటి పట్టిలో ఉన్నట్లుగా రాహుకాలాన్ని చూపించేవి మాత్రం కొల్లలు.  మరి రాహుకాలం జనసామాన్యం సరిగా తెలుసుకునేది ఎలా అన్నది ప్రశ్న.

అసలు తెలుగువారు ఈ‌ రాహుకాలం పాటించవలసిన అవసరం లేదు అన్నది జవాబు.   అప్పుడు గణితమూ సరైన విలువా అంటూ గొడవే లేదు కదా!

ఒకవేళ ఎవరైనా రాహుకాలం పాటించి తీరాలీ అన్న స్థిరాభిప్రాయంలో ఉంటే వారికి వార్తాపత్రికలు కొన్ని ఉపకారం చేస్తున్నాయి.  ఉదాహరణకు ఈ‌నాడు పత్రికలో ప్రతిరోజూ ఆ నాటి పంచాంగం వివరాలను సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలతో సహా ఇస్తారు. వాటి ఆధారంతో ఓపిక ఉన్నవారు గణితం‌ చేసుకోవచ్చును.  ఐతే, ఆ సూర్యోదయ సూర్యాస్తమయాలు పత్రిక స్థానిక ఎడిషన్ ప్రాంతానికే వర్తిస్తాయి.  హైదరాబాదు ఎడిషన్ తీసుకుని కాకినాడవారు గణితం చేసుకోరాదు - ఆ అవకాశం తక్కువే అనుకోండి.

నిజానికి రాహుకాలాన్ని తెలుగువారు పాటించటం అన్న ఆచారం లేనే లేదు.  పైన చెప్పినట్లుగా ఈ‌ రాహుకాలం అనేది మన తెలుగుపంచాగాల్లో ఇటీవల చేరిన విశేషం మాత్రమే.  బహుశః గత పాతికేళ్ళలో ఇది మన దగ్గరకు వచ్చింది.

రాహుకాలాన్ని తమిళులు ఎక్కువగా పాటిస్తారు.

శ్రీకప్పగంతు సుబ్బరామశర్మగారు ఆంధ్రభూమి పత్రికలో తమ రాహుకాలం - దుర్ముహూర్తం  అన్న వ్యాసంలో తెలుగువారి పాత పంచాంగాలు తిరగేస్తే మనకు రాహుకాలంలో పంచాగకర్తలు సుముహూర్తాలు ఇచ్చిన దాఖలాలు కనిపిస్తాయని చెప్పారు.   వారు నెల్లూరు నుండి తమిళనాడు, కర్ణాటకలలో రాహుకాలం, నెల్లూరు ఇవతల ఆంధ్రలో దుర్ముహూర్తం వాడకం ప్రధానమైంది అన్న విషయం తెలియ జేసారు.  తమిళనాడు, కర్ణాటకలలో మరి ఇతర రాష్ట్రాల పంచాంగంలో ఇప్పటికీ దుర్ముహూర్తం గోచరించదు, మన పంచాంగవిధానంలో రాహుకాలం కనబడదు. మన పెద్దలు ఆచరించని రాహుకాలం మనం ఎందుకు ఆచరించాలి, అవసరం లేదు అని వారి అభిప్రాయం.  ఇదే నా అబిప్రాయం కూడా.

రాహుకాలం పూజకు మంచి సమయం అన్నది తమిళదేశంలో ఆచారం. తెలుగుదేశంలో‌కాదు.  వ్యాప్తిలోకి వస్తున్న మరొక అభిప్రాయం ఏమిటంటే దుర్గాపూజకు రాహుకాలం మంచిది అని.  ఇది నిరాధారమైన అభిప్రాయం. దుర్గామాతపూజకూ రాహుకాలానికీ ఏ సంబంధమూ‌ లేదు.

ఈ రాహుకాలం పాటించటం అనే దాని మీద వ్యగ్రత ఎంత దూరం వెళ్ళిందంటే రాహు కాలంలో పిల్లలు పుడితే దోషమేనా?  అన్న ప్రశ్నకు జవాబుగా తప్పక కొన్ని శాంతులు చేయించవలసి వస్తుంది అన్న జవాబు ఇచ్చారు తెలుగుబంధు వెబ్ సైట్‌వారు!

14, అక్టోబర్ 2013, సోమవారం

పండగరోజుల నిర్ణయంలో‌ తరచు గందరగోళాలకు కారణాలు

ముందుమాట


దురదృష్టవశాత్తు పర్వదినాల విషయంలో పంచాంగాలు ఏకాభిప్రాయంతో ఇవ్వటం జరగటం లేదు.  ఇది తరచు వివాదాలకు దారి తీస్తోంది. చాలా విచారించ వలసిన సంగతి.

దానికి తోడు, వివాదాల మీద బ్రతకటానికి అలవాటు పడిన మీడియా వారు, ఇలాంటి అవకాశాల్ని చక్కగా అంది పుచ్చుకుంటున్నారు. భిన్నమైన తారీఖులు ఇచ్చిన ఇద్దరు పంచాంగ కర్తల్నీ, అసలు పంచాంగం అంటే ఏమిటో, అదెలా తయారు చేస్తారో అన్న కనీస అవగాహన లేని ఒక ఖగోళశాస్త్ర అధ్యాపకుడినో, ఖగోళశాస్త్ర విద్యార్థినో ఒకరినీ, ఎడ్డెం అంటే తెడ్డెం అనటమే పనిగా మాట్లాడే ఒక హేతువాదినని చెప్పుకునే వాడినీ పోగు చేసి స్టూడియోలో కూర్చో బెట్టి ఒక యాంకరమ్మ చర్చాకార్యక్రమం చేస్తుంది.  అలాంటి మోడరేటరు యాంకరమ్మల్లో  నూటికి తొంభై తొమ్మిది మందికి పంచాంగం అంటే బొత్తిగా తెలియక పోవచ్చు కూడా. ఇక చూడండి, పరమ అసందర్భంగా నడిచే ఆ చర్చ ఎంత వేడిగా వాడిగా కావాలంటే ఛానెలు వారు అలా నడిపించుకుంటారు.  చివరకి టీవీ ముందు కూర్చుని చూసిన వారికి మరింత గందరగోళమూ, తలనొప్పీ తప్పవు.

ఒక్కొక్క సారి మనలో కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకూ కొన్ని కొన్ని తప్పుడు అభిప్రాయాల కారణంగా గందరగోళ పరిస్థితులు వస్తాయి.  ఈ‌ రోజున అక్షరసత్యాలు  బ్లాగులోని పండగలకు ఏకాభిప్రాయం అత్యవసరం అన్న టపాలో ఈ‌ వాక్యం చూసాను "శాస్త్రం ప్రకారం పండగల సందర్భంలో సూర్యోదయానికి ఆ పండగ తిథి ఉన్న దినాన్నే గ్రహించటం జరుగుతుంది".  ఇది అన్ని సందర్భాలలోనూ వర్తించే సూత్రం కాదు. ప్రతి పండుగనూ నిర్ణంచటానికి ధర్మశాస్త్రగ్రంథాలు తరచు వేరే వేరే నియమాలు ఇస్తాయి. అన్నింటికీ ఒకే నియమం కాదు.

ఈ విషయంలో కొంత స్పష్టత ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాను.

ఇక్కడ గమనించ వలసిన కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి.

పంచాగగణనంలో విభిన్నపధ్ధతులు


చాలా మంది పంచాంగ కర్తలు సరిగా దృక్సిధ్ధాంతం ప్రకారం పంచాంగం తయారు చేస్తున్నారు.  కాని కొందరు ఇంకా సూర్యసిధ్ధాంతం‌ ప్రకారం‌ పంచాంగం చేస్తున్నారు.

దృక్సిధ్ధాంతం ప్రకారం సూర్యచంద్రుల, గ్రహాల స్థితిగతులు ఆధునిక ఖగోళశాస్త్రగణితం ప్రకారం సిధ్ధించే ఫలితాలతో సరిపోలుతాయి.  నిజానికి ఈ‌ రోజున చాలా మంది పంచాంగ కర్తలు ఆధునిక ఖగోళశాస్త్రగణితం ఇచ్చే వివరాల ప్రకారం పంచాంగం చేస్తున్నారు. కాబట్టి ఆ పంచాంగాలలో ఇచ్చే వివరాలు నిర్ధుష్టమైనవి.  అవశ్యం ఆమోదించ దగినవి.

ప్రాచీన మైన సూర్యసిధ్ధాంతం చాలా అందమైనది.  చాలా వరకు ఆధునిక ఫలితాలకు దగ్గర ఫలితాలను ఇవ్వగలిగింది. కాని ఈ‌సిధ్ధాంతం ప్రకారం పంచాంగం చేయాలంటే కలియుగాదిగా రోజుల సంఖ్యను తీసుకొని, కొన్ని కొన్ని  స్థిరాంకాల, కొన్ని కొన్ని గణిత ప్రక్రియల సహాయంతో కావలసిన దినానికి సూర్యచంద్రుల, గ్రహాల స్థితిగతుల్ని లెక్క వేస్తారు.

కంప్యూటర్లు జన సామాన్యానికి అందుబాటులోకి ఈ‌ మధ్యనే వచ్చాయి.  కాని పంచాంగ గణనం మనవాళ్ళు శతాబ్దాలుగా చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద అంకెలతో కూడిన గణితం చేయటం, అది కూడా కేవలం చేతి తోనే చేయటం అనేది ఒక కత్తిమీద సాము వంటిది. చిన్న పొరపాటుతో మొత్తం గణితం చెడుతుంది - పంచాంగం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది.

ఈ చిక్కును తొలగించటానికి మహానుభావులు అనేకమంది గణితాన్ని సులభం చేసేందుకు మార్గాలు చూపారు.  సుక్ష్మంగా వివరిస్తాను.

పంచాంగణనంలో‌ అతి ముఖ్యమైన సంఖ్య అహర్గణం.  అంటే కలియుగం  ప్రారంభమైన రోజు సంఖ్య ౦ అనుకుని,కావలసిన రోజు వరకు ఎన్ని దినాలు గడిచాయో ఆ సంఖ్యయే అహర్గణం. మాట వరసకు  కలిప్రారంభదినం నుండి సరిగా 5000 సంవత్సరాల  తరువాత అహర్గణం విలువ 365.25*5000 = 1826250 రోజులు అవుతుంది. ఇలా గణితం ప్రారంభసంఖ్య పెద్దదిగా ఉంటే గణనం కష్టం కదా.  అందు చేత పెద్దలు కొన్ని కొన్ని కరణగ్రంథాలు చేసారు. కరణగ్రంథం అంటే సులభ పంచాంగ గణిత గ్రంథం అన్నమాట.  కరణగ్రంథాల్లో  అహర్గణాన్ని కలియుగం ప్రారంభం నుండి లెక్కించటం కాక గ్రంధకర్త అప్పటికి దగ్గలో ఉన్న ఒక గత దినం నుండి ప్రారంభం చేస్తారు.  దీని వలన గణితం చిన్న సంఖ్యతో మొదలు పెట్టవచ్చునన్నమాట.  అంతే కాదు, గణిత విధానంలో కూడా కొన్ని కొన్ని సులభమైన అడ్డదారులు చూపిస్తారు. దీనితో గణితం సులభం అవటం వలన పంచాంగ కర్తలు తక్కువ శ్రమతో సంవత్సరం మొత్తానికి పంచాంగం చేయటం వీలవుతుంది.  ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.  గణితం చేయటంలో సులభవిధానాలు అత్యంత నిర్దుష్టమైన ఫలితాలు ఇవ్వలేవు.  ఎంతో కొంత తప్పు ఉంటుంది అన్ని ఫలితాల్లోనూ.  కాని ఈ తప్పులు అన్నీ నిముషంలోపు కాలమానం తప్పటం తప్ప గంటల్లో తేడా తీసుకు రావు.  అందుకే‌ కరణగ్రంథాల  ప్రాశస్త్యం.

ఇక్కడే ఒక ముఖ్య మైన సంగతీ తెలుసుకోవాలి.  ఏదైనా కరణగ్రంథం ఆథారంగా పంచాంగం వ్రాస్తే ఫలితాల్లో వచ్చే తప్పుల విలువలు స్థిరం కాదు ఎప్పూడు విసర్జించటానికి!  గ్రంథకర్త ఇచ్చిన మొదటిరోజునుండి అహర్గణం విలువ పెద్దది అవుతున్న కొద్దీ, ఈ తప్పు పరిమాణమూ పెరుగుతూ వస్తుంది. అలాగైతే ఏ నూరేళ్ళో రెండువందలఏళ్ళో అయ్యే సరికి తప్పుల పరిమాణం భరించలేనంతగా పెరిగి మొత్తం కరణగ్రంధం చెప్పిన గణితం దండగ అవుతుంది.  దీనికి విరుగుడూ చెబుతాయి కరణగ్రంథాలు.

కరణగ్రంథాలు అహర్గణం ప్రారంభదినం నాటి గ్రహాల స్థితిగతుల్ని ఇస్తాయి.  వీటిని బీజాలు అంటారు. ఇష్టదినానికి ఒక గ్రహం స్థితిని ఇంచుమించుగా తెలుసుకోవాలంటే, అహర్గణాన్ని ఒక భిన్నంతో హెచ్చవేసి దానికి ఆ గ్రహం తాలూకు బీజం (గ్రంథం ఇచ్చిన ఆరంభం నాటి గ్రహస్థితి) కలుపుతారు. కాలం గడిచినకొద్దీ ఈ స్థూలస్థితి తప్పుడు విలువ అవుతుంది కాబట్టి, ఇన్నేళ్ల కొకసారి  ఈ విలువకు ఫలానా నిర్దిష్టమైన విలువను కలపాలీ అని కరణగ్రంథాలు చెబుతాయి. ఇలా  అదనంగా విలువను కలిపి / తీసివేసి సరిచేయటాన్ని సంస్కరించటం అంటారు.  తరచుగా ఇన్నేళ్ళ కొకసారి బీజవిలువలను ఇలా సంస్కరించి సరిచేసుకుని అక్కడనుండి అహర్గణం లెక్కవేసుకుని గణితం చేయమనీ కరణగ్రంథాలు చెబుతాయి.  దీని వలన తప్పులు ఆన్నేసి యేళ్ళ చక్రం యొక్క కాలానికి పరిమితం కావటం వలన పంచాంగం ఖచ్చితంగా వస్తుంది.

దురదృష్టవశాత్తు ఇక్కడ ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు సాంప్రదాయిక గణితంతో పంచాగాలు చేసేవాళ్ళు. చాలా మంది వారి తండ్రి తాతలు చేసిన బీజాల విలువలతోనే పంచాంగగణనం చేస్తున్నారు కాని బీజాలని సంస్కరించుకోవటం లేదు. అనేక మంది అడ్డగోలు వాదన ఏమిటంటే మా పూర్వీకులనుండీ సంప్రదాయంగా వచ్చిన గణితం మార్చటం తప్పూ - ఆ గణితమే‌ ప్రమాణం అని.  ఇలా ప్రాచీనమైన సూర్యసిథ్థాంతం ఆధారంగా చేసే గ్రహగణితంలో కొన్ని కొన్ని గ్రహాలు డిగ్రీల స్థాయిలో తప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. తిథుల గణనం మరింతం ఘోరంగా తయారయింది.  ఒక్కోసారి ఆరేడు గంటలదాకా ఆకాశంలో కనబడే తిథికీ, వాళ్ళ పంచాంగాల్లో తిథికీ పొంతన తప్పిపోతోంది.

అన్నింటి కంటే పెద్ద చిక్కు వచ్చేది గ్రహణాల విషయంలో.  పాత పంచాగం పథ్థతిలో గ్రహణాలు బొత్తిగా ఆకాశస్థితులతో పోలటం లేదు.  అందు చేత అనేక మంది పాతపథ్థతి పంచాగ కర్తలు కూడా గ్రహణాలు మాత్రం ఆధునిక ఖగోళగణితం ఆధారంగానే లెక్కవేస్తున్నారు.

ఆధునిక ఖగోఖశాస్త్రం ఆధారంగా చేసిన పంచాగాలకీ, పాతపధ్దతి వాళ్ళ పంచాంగాలకీ‌ తిథులలో చాలా వ్యత్యాసం రావటమే కాదు.  మరొక ముఖ్య విషయం ఉంది.  అనేక కరణ గ్రంథాలు ఉన్నాయి పంచాంగగణనం కోసం. వాటిని వాడుతూ‌ పంచాంగం చేసేవాళ్ళు బీజసంస్కారాలు చేయకపోవటం వలన, అవన్నీ ఒకదానితో మరొకటి పొంతన లేని విధంగా పంచాగాలని ఇస్తున్నాయి.  ఇన్ని రకాల పంచాంగాలు మార్కెట్లో కనబడే సరికి సామాన్యులకు ఏది సరైన పంచాంగం అన్న సంగతి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

మన పండుగలని నిర్ణయించటంలో తిథుల , నక్షత్రాల పాత్ర కీలకం. అవి తప్పుగా ఇస్తే, పండుగలూ చాలాసార్లు పంచాంగానికీ పంచాంగానికీ తేడాగా వస్తాయి.  అందుకే ఒకే పండుగకి ఒక్కొక్క పంచాంగం ఒక్కక్క విధంగా తారీఖుని ఇవ్వటం‌ కనబడుతోంది.

పండుగల నిర్ణయంలో భిన్న సంప్రదాయాలు


పండుగలను నిర్ణయించటంలో  మరొక ముఖ్య పాత్ర మతసాంప్రదాయాలది. హిందూ మతం అంటూ నిజానికి ఏమీ‌లేదు. మనది ఆర్షజీవనవిధానం.  అంటే ఋషులు చెప్పిన మంచి దారుల్లో నడవటమే మన విధానం అన్న మాట. మన సంప్రదాయంలో నేడు ముఖ్యంగా మూడు భిన్న మైన శాఖలు ఉన్నాయి. అవి స్మార్తం, వైష్ణవం, శైవం అనేవి. కొన్ని కొన్ని పండగలను విభిన్న మతశాఖలు విభిన్నమైన విధంగా నిర్ణయిస్తాయి. ఉదాహరణకు చైత్రశుధ్ధనవమీ తిథినాడు శ్రీరామనవమి.  స్మార్తసంప్రదాయంలో నవమి తిథి ముఖ్యం.  శ్రీవైష్ణవ సంప్రదాయంలో వారికి పునర్వసు నక్షత్రం ముఖ్యం.  ఈ చిన్న తేడా వలన ఒక్కొక్కసారి స్మార్తులకూ వైష్ణవులకూ పండుగ ఒక రోజు తేడా వస్తుంది.  అంతే కాదు, పండుగల నిర్ణయం గురించి ధర్మశాస్త్రగ్రంథాల్లో నియమాలు చెప్పబడి ఉంటాయి. ఒక్కో పండుగకూ‌ దానికి సంబంధించిన ప్రత్యేక నియమాలు ఉంటాయి తరచుగా.  వాటిని పంచాంగానికి సరిగా అన్వయించటంలో, పంచాంగకర్తల మధ్యన అప్పుడప్పుడూ అభిప్రాయ బేధాలు వస్తూ ఉంటాయి.  ఇవి కూడా గందరగోళం సృష్టిస్తూ ఉంటాయి.

పంచాంగాన్ని గ్రహించటంలో పొరపాట్లు


అనేక మంది పంచాంగకర్తలు పంచాంగాలు ప్రకటిస్తున్నారు.  రాజమండ్రి, విజయనగరం, కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాదు వగైరా అనేక నగరాలనుండి పంచాగాలు వెలువడుతున్నాయి. బజారులో లభించే పంచాంగం ఏదో‌ ఒకటి కొనుక్కునే వారు, ఫలానివారి పంచాంగం అంటూ అడిగి తీసుకునే వారుగా మనవాళ్ళు పంచాగాలు కొని వాడుకచేస్తూ ఉంటారు. జాగ్రత్రగా గమనించండి, ప్రతి పంచాంగంలోనూ అది ఏ ప్రాంతానికి గణితం చేయబడిందో స్పష్టంగా చెబుతారు. అంతే కాదు ఏదైనా ఇతరప్రాంతం వాళ్ళు ఆ పంచాంగాన్ని వాడుక చేయాలంటే‌ పంచాంగంలో ఇచ్చిన విలువలను ఎలా సరిచేసుకుని గ్రహించాలో కూడా ఒక పట్టిక ఉంటుంది.  విచారించ వలసిన విషయం ఏమిటంటే, చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళకూ ఈ విషయం మీద అవగాహన లేదు. పంచాంగంలో ఉన్న వివరాలు ఎలా ఉన్నవి అలా వాడేస్తారు. కాకినాడకో విజయనగరానికో గణితం చేసిన పంచాగాన్ని ఉన్నదున్నట్లుగా హైదరాబాదులో వాడుతున్నవాళ్ళు బోలెడు మంది.

లగ్నాలూ సూర్యోదయ చంద్రోదయాదులూ ప్రదేశాన్ని బట్టి మారతాయి. అందుకే పంచాంగ విలువలని సరిగా మార్పు చేసుకుని వాడాలి.

పండగల విషయంలో ఈ మార్పులు ప్రభావం చూపిస్తాయి. ఐతే పండగలు సార్వజనీనంగా జరుపుకోవటం ఆచారం. ఊరికో రోజున చేయటం సంప్రదాయం కాదు.  అందు కని పండుగలని మాత్రం మరింత జాగ్రత్తగా నిర్ణయించాలి. ఉగాది తెలుగువా రందరి ఉమ్మడి పండుగ కాబట్టి దానిని రాజధాని నగరానికి వర్తించే నాడే అందరూ చేసుకోవటం ఉత్తమం.

ఇలాంటి ముఖ్యవిషయాలలో పంచాగకర్తలకు అవగాహనా, వాళ్ళ మధ్య సమన్వయం ముఖ్యం.  దురదృష్టవశాత్తు అవి లోపించి చాలా గొడవలు.

సంప్రదాయం సరిగా తెలియని కొందరు పంచాంగకర్తలు


సంప్రదాయం సరిగా తెలియకపోవటం.  ముఖ్యంగా పర్వదినాల నిర్ణయంలో ధర్మశాస్త్ర గ్రంథాల మీద మంచి పట్టు ఉండటం పంచాంగ కర్తకు చాలా అవసరం.  ఈ రోజున పంచాంగ చేసే వాళ్ళలో చాలా మంది కుటుంబాచారాలుగా వస్తున్న సులభ సూత్రాల ఆధారంగా నిర్ణయాలు చేస్తున్నారు.

యువతరం పంచాంగకర్తలూ, కొందరు పెద్దలూ కూడా సంవత్సరం పొడవునా దినవారీ గ్రహస్థితుల్ని ఖగోళశాస్త్ర పరిశోధనాశాలలనుండి గ్రహించి హాయిగా పంచాంగం చేస్తున్నారు. ఇది మంచిదే. వాళ్ళు ఇష్టపడో, సులభమనో ఈ‌దారికి వచ్చి ఆధునిక గణితం ద్వారా మంచి పంచాగాలు చేస్తున్నారు.  కానీ, ఒక తిరకాసు ఉంది. ప్రతిరోజూ ఉ॥5-30ని॥కు అన్ని గ్రహాల స్థితులూ తీసుకుని, తిధి ప్రవేశాన్ని గణితం చేయటానికి అనేకులు తిన్నగా స్కూలు పిల్లల్లా త్రైరాశికం చేస్తున్నారు.  ఇది సరికాదు. చెప్పుకోదగ్గ తప్పు ఉంటుంది అసలు విలువకూ ఇలా చెస్తే వచ్చే విలువకూ. కొందరు మాత్రం కంప్యూటరు పరిజ్ఞానం ఉన్నవారు మంచి సాఫ్ట్‌వేర్ ఆధారంతో గణితం చేయించుకుంటూ ఖచ్చితమైన విలువలు ఇస్తూ ఉండవచ్చును. ఈ‌ రెండు రకాల ఆధునిక పంచాగాలూ ఇచ్చే విలువల్లో కొంచెం తేడాలు ఉంటాయి. పండుగల నిర్ణయాలూ ప్రభావితం కావచ్చును.

ఆయనాంశా గణనంలో‌తేడాలు


ఈ విషయంలో చాలా మంది చదువరులకు అవగాహన ఉండక పోవచ్చును. ఆధునికమైన ఖగోళ శాస్త్రం ప్రకారం వచ్చే గ్రహస్థితులు అన్నీ పంచాంగకర్తలకు, జాతక చక్రాలు వేయటానికీ మనకు యథాతథంగా పనికి రావు. అవన్నీ సాయన విలువలు అంటారు. మనదేశంలో నిరాయన గ్రహస్థితులు వాడుతాము. ఇది కొంచెం సాంకేతికమైన విషయం.  ఆట్టే వివరాలు ఇక్కడ చెప్పటం కుదరరు. మన గణితం‌ రాశిచక్రం స్థిరంగా ఉన్నట్లుగా భావించి చేసేది. నిజానికి రాశిచక్రం భూమి నుండి చూస్తే  చాలా మెల్లగా కదలుతూ ఉంటుంది. శాస్త్రీయ గణితం ఇచ్చే విలువలు ప్రస్తుత రాశిచక్రస్థితికి వర్తిస్తాయి. మన స్థిరరాశిచక్రం నుండి ప్రస్తుతం కనిపించే రాశిచక్రం కదిలి పోయిన దూరం (డిగ్రీల్లో)కొలిచి దాన్ని ఆయనాంశ అంటారు.  ఈ‌ ఆయనాంశను గణించటంలోనే అనేక అభిప్రాయ భేదాలున్నాయి. ఎక్కువ మంది లాహిరీ ఆయనాంశను వాడుక చేస్తున్నా, కొంతమంది రామన్ ఆయనాంశ వాడేవాళ్ళున్నారు.  సంప్రదాయిక పంచాంగ కర్తలు వారి వారి పథ్థతుల్లో ఆయనాంశాసంస్కారం చేస్తారు.  వీ‌ళ్ళ ఆయనాంశ గణితాలు అన్నీ‌ ఆధునిక విలువలతో సరిపోలక పోయే అవకాశాలే హెచ్చు.

తిథి గణితంలో ఆయనాంశ ప్రభావం ఉండదు.  కాని నక్షత్రం నిర్ణయించటంలో చంద్రుడికి సరిగా ఆయనాంశ సంస్కారం చేయటం జరిగిందా అన్నదీ  ముఖ్యమే. పంచాంగకర్తలు ఆయనాంశలు రకరకాలుగా లెక్కిస్తే  పర్వదినాలు, ముఖ్యంగా వైష్ణవ పర్వదినాలు తప్పిపోయే అవకాశం మెండు.

అమాయక పురోహితవర్గం పాత్ర


అనేక మంది పండుగల విషయంలోనూ పితృతిథుల విషయంలోనూ పురోహితుల నిర్ణయం తీసుకుంటారు.  శుభ ముహుర్తాల విషయంలో ఐతే పురోహితుల్ని సంప్రదించటం అత్యంత ఆవశ్యకం కూడా.  తప్పు లేదు. 

కాని అటువంటి పురోహితుల్లో ఎంతమందికి పంచాగం గురించి సరైన అవగాహన ఉన్నదీ అన్నది మనకు తరచు తెలియదు.  పట్టించుకోము కూడా.  రాజమండ్రీ పంచాంగం ప్రకారం హైదరాబాదులో యథాతధంగా ముహూర్తాలు నిర్ణయిస్తున్న పురోహితుణ్ణి చూసాను.  ఆయనకు ఎవరి దగ్గరో పంచదశకర్మలు చేయించటంలో శిష్యరికం చేసి తెలుసుకున్న పరిజ్ఞానమే కాని స్వయంగా పధ్ధతిగా అభ్యసించిన జ్యోతిషసంబంధమైన పరిజ్ఞానం శూన్యం. అసలు దృక్సిధ్ధాంతం అనే పేరే వినని పురోహితులూ చాలా మంది.  సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను పితృతిథినిర్ణయం ఎలా చేయాలో దాదాపు పురోహితవర్గంలో తొంభైశాతం మందికి నేడు తెలియదంటే అసత్యం లేదు. ఈ విషయంలో చాలా ఫార్సులు ఉన్నాయి కాని వాటి గురించి తరువాత ఎప్పుడైనా వ్రాస్తాను.

అనేక మందికి సహజంగా పంచాగాల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయీ అన్న విషయం మీద ఏమీ తెలియటం లేదు. చాలా మంది చెప్పే సమాధానం  తమ గురువు గారు వాడుతున్న ఫలాని పంచాంగ సరైనదే కావాలి కాబట్టి దాని ప్రకారం చేయటమే సరైన విధానం అని.  ఇది అస్పష్టమైన సమాధానం కావటం వలన అనేకులకు అసంతృప్తి కలుగుతోంది.

ముగింపు


భారతప్రభుత్వ సమ్మతమైన పంచాంగ విధానం దృక్సిధ్ధాంతమే. అంటే ఖగోళంలో కనిపించే గ్రహస్థితులను ఆధునిక గణితం ద్వారా లెక్కించటమే సమ్మతం.  అనేక మంది ఈ విషయంలో పాతపధ్ధతులనీ, తప్పుడు గణితాలనీ అశ్రయించటం వంటి విధానంతో జనబాహుళ్యానికి అసౌకర్యం కలిగిస్తున్నారు  అది కాక మరొకొన్ని గందరగోళాలకి దారితోసే పరిస్థితులనీ పైన విశ్లేషించాను.

ఇంకా మరొకొన్ని ఇక్కడ ప్రస్తావించని ఇతర కారణాలు కూడా తరచు గందరగోళానికి కారణం అవుతున్నాయి.  ఇలాంటి గందరగోళాల వలన ప్రజల్లో పంచాంగం పట్ల చులకన అభిప్రాయం కలిగే అవకాశాలు పెరుగుతున్నాయి.

కాని ప్రస్తుతానికి ఈ‌వివరణతో చదువరులకు తగినంత అవగాహన ఏర్పడి ఉంటుందని భావించి ఈ వ్యాసం ముగిస్తున్నాను.

మీ మీ‌అభిప్రాయాలు తప్పక తెలియ జేయండి.

12, అక్టోబర్ 2013, శనివారం

శ్రీలలితాసహస్రనామస్తోత్రంలో బ్రహ్మతత్త్వాన్ని చెప్పే నామాలు - 1


132. నిరాధారా
అమ్మకు ఏ విధమైన ఆధారమూ అవసరం లేదు అని అర్థం. అమ్మ సర్వజగత్తులోనూ‌ ఉన్నది.  సర్వజగత్తుకూ ఆమె తల్లి. అమెకు వేరొకరు ఎవరూ ఆధారం కాదు - తనంత తానుగా ఉండేది అమ్మ. అమ్మయే సర్వాధిష్ఠాన బ్రహ్మతత్త్వం కాట్టి ఆమె నిరాధార అని అర్థం.

133. నిరంజనా
అంజనం అంటే కాటుక -నల్లని మరక వంటిది - చీకటి వంటిది.  మాయ అనబడే అవిద్య కారణంగానే నల్లని మరకలు అంటే దోషాలు. అమ్మ జ్ఞానస్వరూపురాలు. కేవలం శుధ్దవిద్యాస్వరూపురాలు కాబట్టి ఆమెకు  అవిద్య అన్నది లేనేలేదు.  అమ్మ అత్యంతస్వఛ్ఛమైన కేవల జ్ఞానస్వరూపం.

134. నిర్లేపా
అమ్మ ఏవిధమైన కర్మ సంబంధమూ లేనిది అని అర్థం. లేపనం అంటే పై పూత. కర్మ సంబంధమైనది ఇక్కడ ప్రస్తావించిన పూత అనే పదం.  భగవద్గీతలో కూడా లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభసా అని తామరాకు నీళ్ళల్లో ఉన్నా నీరు దానికి అంటనట్లు జ్ఞానికి పాపపు పూత అంటదు చెబుతుంది.

135. నిర్మలా
అమ్మ అత్యంత పరిశుధ్ధురాలు. మురికి అంటే అవిద్యయే. సర్వత్ర సర్వకాలములందూ ఒక్కటే ఐన సత్యవస్తువు బ్రహ్మమును గుర్తించలేక జీవులు రాగద్వేషాలు వంటి ద్వంద్వాలను ఆ అవిద్య కారణంగానే అనుభవిస్తూ ఉంటారు.  కేవల జ్ఞానస్వరూపిణి, సాక్షాత్తూ పరబ్రహ్మమే ఐన అమ్మ వద్ద  అవిద్య ఉండటం అనే ప్రసక్తే ఉండదు.  సూర్యుడి వద్ద చీకటి ఉండదు కదా! అమ్మ అందుకే నిత్యశుధ్ధ.

136. నిత్యా
అమ్మయే నిత్యమైనది. ఆమె త్రికాలల్లోనూ కేవలజ్ఞానస్వరూపిణిగా ఉండి అన్ని లోకాల్లోని అందరు జీవులకూ తల్లియై అనుగ్రహిస్తున్నది. అందరు జీవుల్లోని ఆత్మస్వరూపమూ అమ్మయే.  అవినాశీ వారేయ మాత్మా అని శ్రుతి ఆత్మ వినాశనం లేనిది - నిత్యం అని చెబుతున్నది.

137. నిరాకారా
అకారం లేనిది అని అర్థం. భాగవతం కూడా పరబ్రహ్మ దేవదానవనరాదుల్లో ఎవరి స్వరూపమూ  కలవాడు కాదు. స్త్రీపురుష నపుంసక స్వరూపాల్లో ఏదీ‌ కాదు, త్రిగుణాల్లో ఏదీ కలవాడు కాదు, సత్-అసత్ అని చెప్పబడే ఏదీ కాదు, అయినా అన్నీ‌ తానే, అన్నిటికీ అతీతమైన తత్త్వమూ తానే అని చెబుతుంది.  మనకు తెలిసి స్వరూపం అనేది కరచరణాదులు కలిగి ఉండాలి.  ఐతే కరచరణాదులనే ఇంద్రియాలు త్రిగుణాల కారణంగా వచ్చాయి.  పరతత్త్వమైన శ్రీదేవి ఆ త్రిగుణాలకు పూర్వం నుండే ఉన్నది కదా.  అందుచేత ఆవిడ కేవలం తేజస్స్వరూపురాలు అని భావన.

138. నిరాకులా
ఆకులము అంటే కలత, బాధ. అమ్మ ఆకులము లేనిది. కలత అనేది కేవలం అవిద్య ఉన్న చోటే ఉంటుంది. అమ్మ విద్యాస్వరూపిణి.  శుధ్ధజ్ఞానమూర్తి. అందు వలన అమ్మకు ఎన్నడూ  ఏవిధమైన భావవికారాలూ వాటివలన వచ్చే కలతలూ ఉండవు.

139. నిర్గుణా
అమ్మ త్రిగుణరహితురాలు. అమ్మ యే పరబ్రహ్మము.  పరబ్రహ్మము సృష్టిలో మొదట కలిగినవి ఈ త్రిగుణాలు.  వీటి ఆధారంగా జరిగిన సృష్టిలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలూ, వాటి అధిదేవతాస్వరూపాలూ, జీవులు, వారికి శరీరాకృతులు అన్నీ అమరాయి. అమ్మ అన్నిటి కన్నా ముందు నుండీ ఉన్న నిత్యసత్యస్వరూపిణి. ఆమె గుణాలను సృజించింది కాని అవి ఆమెకు లేవు.  ఈ విషయాన్ని చమత్కారంగా నారదుడు హిమవంతుడితో  "అమ్మాయి జాతకం లోకోత్తరం. ఆమె లక్షణవర్జితురాలు" అని అంటాడు.

140. నిష్కళా
అమ్మ కళలు లేనిది. కళ అంటే అంశం. నిష్కళా అంటే కళలకు అతీతురాలు అని అర్థం.  భగవద్గీతలో కృష్ణుమమైవాంశో జీవలోకః అంటాడు.  లోకం అంతా భగవంతుని అంశ మాత్రమే. బగవత్స్వరూపం మాత్రం నిత్యపూర్ణం. సాధకానాం‌ హితార్థాయ బ్రాహ్మణో రూపకల్పనా అని చెబుతారు . అంటే సాధనా సౌలభ్యం కోసం పరబ్రహ్మమునకు రూపాన్ని కల్పించుకోవటమే కాని బ్రహ్మమునకు నిర్దిష్ఠమైన రూపం లేదు. ఐనా రూపం అనేది నామరూపాత్మకమైన ప్రకృతి లక్షణం - పరబ్రహ్మలక్షణం‌ కాదు.  అమ్మ సంపూర్ణబ్రహ్మతత్త్వం అని అర్థం.

142. నిష్కామా
అమ్మ ఏ కోరికా లేనిది. అమ్మ సర్వజగత్తుకూ అధినేత్రి. ఆమెకన్న పైవా రెవరూ లేరు. అమె తలంపుకు ఎన్నడూ అడ్డులేదు. అందుచేత సర్వకాలము లందూ సర్వదేశము లందూ అమ్మకు కోరవలసినది ఏదీ లేదు. అంతా తానే ఐన తల్లికి, సృష్టిలో అన్నీ తానే ఏర్పరచిన పరబ్రహ్మతత్త్వం ఐన తల్లికి, ఏది తనది కాదు కాబట్టి ఇది నాకు  కావాలీ అన్న కోరిక కలగటానికి?

143. నిరుపప్లవా
ఉపప్లవం అంటే ఆపద, నాశము. సృష్టిలో అన్నింటికీ జనన, వృధ్ధి, నాశములు ఉన్నాయి. అమ్మ సృష్టికే ఆద్యురాలు. అమ్మ అందుకే ఏ విధమైన ఉత్పాతాలు, ఉపద్రవాలూ, వృధ్ధిక్షయాలు లేనిది.  కేవలం మోక్షస్వరూపురాలు అని అర్థం.

144. నిత్యముక్తా
ముక్తము అంటే విడిచిపెట్ట బడింది అని అర్థం. ముక్తా అని స్త్రీలింగం. అర్థం అదే. అమ్మకు బంధాలు ఏమీ లేవు ఎన్నడూ.  బంధం అనేది ఉన్నప్పుడు కదా వాటినుండి విడుదల పొందినస్థితి కలగటం? బంధానికి కారణం అవిద్య. అంటే జ్ఞానరహితమైన స్థితి.  అమ్మ కేవల జ్ఞానస్వరూపిణి. సృష్టికే ఆద్యురాలు. ఆమెకు ఎన్నడూ బంధం లేదు. నిత్యం ఆమె మోక్షస్వరూపిణి.

ముక్తిపొందినట్టి భక్తులచే ఆశ్రయించబడినది అన్న అర్థం కూడా ఈ‌నామానికి చెబుతారు. అమ్మను ఆశ్రయించటం వలన ముక్తి వస్తుందని ధ్వని. ముక్తిపొందినవారు కేవల పరబ్రహ్మంతో సాయుజ్యం కలిగిన వారు కాబట్టి అమ్మయే బ్రహ్మము కాబట్టి అలా ముక్తి పొందినవారితో కూడుకొని ఉంది అమ్మ అని అర్థం.

145. నిర్వికారా
అమ్మ ఏవిధమైన వికారములూ లేనిది. వికారం అంటే మార్పు - పరిణాం. సృష్టిలో సమస్తమూ జననమూ, స్థితీ, క్షయమూ అనే వికారాలు కలిగి ఉంటాయి. జీవులకు వృధ్ధి అనే మరొక వికారమూ, ఆ వృధ్ధిలో బాల్యం, యౌవనం, కౌమారం వార్థక్యం అనే అవస్థలూ ఉంటాయి. జాగదవస్థా, స్వప్నావస్థా, నిద్రవస్థా అనే వికారాలూ ఉంటాయి.  ఇలాంటి వికారాలేవీ లేనిదీ, మహదాతి తత్త్వాలకి అతీతామైనదీ ఐన పరబ్రహ్మము ఒక్కటే. ఆమ్మ శ్రీదేవియే ఆ పరబ్రహ్మము.

146. నిష్ప్రపంచా
ప్రపంచము లేనిది అమ్మ. ప్రపంచం అంటే విస్తరించి ఉండేది. పంచభూతాలు, త్రిగుణముల యొక్క విస్తారం వలన పుట్టినది బాహ్యప్రపంచం. దానిలో పదునాలుగులోకాలు, వాటిలోని చరాచరప్రకృతి అంతా ప్రపంచంలో భాగం. దానిని నడిపించేది కాలం. ఆ కాలం అమ్మ యొక్క స్వరూపమే. జీవులలో ఉండే కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ, పంచ వాయువులు, పంచ ఉపవాయువులూ, అంతఃకరణ చతుష్టయమూ, కామాది షడ్వర్గాలూ వగైరా సరంజామా అంతా కలిపి అంతఃప్రపంచం. అంతఃప్రపంచాలతో కూడిన జీవులంతా బాహ్యప్రపంచంలోని వారు.  అంతఃప్రపంచం జీవుని యందు ఉన్నట్లుగానే సమస్త బ్రహ్మాండాలతో కూడిన బాహ్యప్రపంచమూ అమ్మ యందు ఉన్నది. జీవుల్ని వారి వారి అంతఃప్రపంచ, బాహ్యప్రపంచాదులు నడిపించుతూ ఉంటాయి.  సమస్తమైన ప్రపంచములూ అమ్మయందే ఉన్నాయి కాని అమ్మను నడిపించే ప్రపంచం ఏమీ ఉండదు. ఆమె సర్వాధిష్టాత్రి. కాబట్టి అమ్మ ప్రపంచం లేనిది.

147. నిరాశ్రయా
అమ్మకు (వేరే) ఆశ్రయం ఏమీ లేదు.  విశ్వం ప్రతిష్టితం యస్యాం తస్యాః కుత్ర ప్రతిష్టా? సర్వ విమూ కేవల పరబ్రహ్మమైన అమ్మను ఆశ్రయించుకుని ఉంది కాబట్టి అమ్మకు వేరే ఆశ్రయం అంటూ ఉండటం అసందర్భం. ఆమె ప్రపంచాతీత తత్త్వం.  కాబట్టి తల్లి నిరాశ్రయ.

148. నిత్యశుధ్ధా
అమ్మ త్రికాలములలోనూ మాలిన్యం లేనిది. మాయోపాధి వినిర్ముక్తం శుధ్ధ మిత్యభిధీయతే. అమ్మ మాయకు అతీతురాలు. మాయ ప్రపంచంలోనిది. అమ్మ ప్రపంచానికే అతీతమైన తత్త్వం కదా. కాబట్టి అమ్మ నిత్యశుధ్ధ.

149. నిత్యబుధ్ధా
అమ్మ నిత్యం కేవలం జ్ఞానస్వరూపిణిగా ఉంది అని అర్థం. అమ్మకు త్రికాలములలోనూ అజ్ఞానం యొక్క స్పర్శయే లేదు. కాలం అనేది యే‌ పరబ్రహ్మము యొక్క సృష్టియో, ఆ పరబ్రహ్మమే శ్రీదేవి. ఆ తల్లియే‌ జ్ఞానమునకు మూల స్వరూపం. కాబట్టి అమ్మ నిత్యబుధ్దస్వరూపిణి

అమ్మా నమ్మితి నమ్మా




  

అమ్మా నమ్మితి నమ్మా దయగన వమ్మా ఓ దుర్గమ్మా
ఉమ్మలికమ్ముల గమ్మున ద్రోయగ రమ్మా ఓ దుర్గమ్మా



సర్వాపద్వినివారణనిపుణా సర్వవ్యాధినివారణనిపుణా
సర్వమృత్యునివారణనిపుణా సర్వమంగళా సర్వజ్ఞా
॥అమ్మా॥


సర్వభూతేశి సర్వమోహినీ సర్వగా సర్వతంత్రేశీ
సర్వార్థదాత్రి సర్వాధారా శర్వాణీ సర్వలోకేశీ
॥అమ్మా॥


సర్వాయుధధర దానవలోక గర్వపర్వతఘనదంభోళీ
సర్వోపనిషదుద్ఘుష్టా శాంతా సర్వశక్తిమయి శ్రీమాతా
॥అమ్మా॥




11, అక్టోబర్ 2013, శుక్రవారం

అందరు చక్కగ మ్రొక్కండీ మీ రందరు శుభములు బడయండీ




  

అందరు చక్కగ మ్రొక్కండీ మీ
రందరు శుభములు బడయండీ



చక్కని తల్లికి మ్రొక్కండీ మీ
మక్కువ తీరగ కొలవండీ
ఒక్కుమ్మడిగా తల్లి కీర్తిని
దిక్కులు మ్రోయగ పాడండీ
॥అందరు॥


బంగరు తల్లికి మ్రొక్కండీ మీ
సంగతి తల్లికి తెలుసండీ
మంగళరూపిణి మన దుర్గమ్మ
కొంగుబంగరు మూటండీ
॥అందరు॥


చల్లని తల్లికి మ్రొక్కండీ మీ
రెల్లరు వలసిన వడగండీ
కల్లయు కపటము లేని వారికే
తల్లి యనుగ్రహ ముందండీ 
॥అందరు॥




10, అక్టోబర్ 2013, గురువారం

ఆర్తి తీర్చవమ్మా






  

ఆర్తి తీర్చవమ్మ అరుణమ్మా నీ
కీర్తి కూడ పెరిగేనోయమ్మా



లెక్కకు మిక్కిలి లోకము లేలెడు
ముక్కంటి తనువున మురిసే తల్లీ
చక్కని తల్లీ చల్లని తల్లీ
తక్కువ లేని దయచూప వమ్మా
॥ఆర్తి ॥


పున్నమ చంద్రుని పోలెడు మోమున
సన్నని నగవుల వెన్నెల లొలయగ
అన్ని జగంబుల అతిదయ నేలుచు
మన్నించెదవే మా తల్లీ ఇక
॥ఆర్తి ॥


మంచుకొండకు మంచి కూతురవు
మంచివారకి మంచి తల్లివిగ
అంచితమగు నీ అభిమానము నా
కించుక దయతో నీ యవె తల్లీ 
॥ఆర్తి ॥








నీ వాడను నే కాదా .. నీ దయ నీయగ రాదా



  నిరుపమకరుణానిధి వౌదు కదా నీ వాడను నే కాదా 
  నిరతము గొలిచెడి వాడను కాదా నీ దయ నీయగ రాదా

  పరమశుభంకరి భక్తవశంకరి పాలితకింకరి భవనాశంకరి
  వరదాభయకరి సురజనప్రియకరి వరసుగుణాకరి పాహిశివంకరి   ॥నిరుపమ॥

  యోగవివర్థని బైందవాసని రోగవిమోచని శంకరరమణి
  రాగవినాశని పాపవిమోచని
రవిశశిలోచని పాహిత్రిలోచని  ॥నిరుపమ॥

  పురుషార్థప్రద భక్తసుఖప్రద పుణ్యాపుణ్యవిశేషఫలప్రద
  పరమశుభప్రద నిజసద్గతిప్రద వాంఛితార్థప్రద శివజ్ఞానప్రద   ॥నిరుపమ॥

 


9, అక్టోబర్ 2013, బుధవారం

శ్రీలలితాసహస్రనామస్తోత్రంలో జ్ఞాన ప్రస్తావన కల నామాలు

శ్రీలలితాసహస్రనామస్తోత్రంలోని నేరుగా జ్ఞాన మనే శబ్దాన్ని ప్రస్తావించిన నామాలు కొన్ని ఉన్నాయి.  వీటిని పరిశీలిద్దాం ఈ‌టపాలో

253. విజ్ఞానఘనరూపిణీ
ఇక్కడ ఘన మనగా  దట్టమైనది అని ఒక అర్థం. గొప్పది అని మరొక అర్థం. ఈ అర్థఛ్ఛాయల వలన  ఈ నామానికి  పెద్దగా అర్థభేదం కాదు. సంపూర్ణత్వం కారణంగానే ఈ నామంలో చెప్పబడిన విజ్ఞానానికి గొప్పదనమూ, చిక్కదనమూ అనుకోవచ్చును. విజ్ఞానఘన పదం చిదేకరసమని శ్రుతి. కాబట్టి ఈ‌ నామానికి  అమ్మ  చైతన్యరసస్వరూపిణి అని అర్థం.

574. ప్రజ్ఞానఘనరూపిణీ
నిత్యజ్ఞానం చేత నిరంతరం ఘనమై అవిద్య లేశమాత్రం కూడా లేనిది అమ్మ అని భావం. ఆత్మస్వరూపజ్ఞానం కన్నా మరేవిధమైన వృత్తీ లేని బుధ్ధికి ప్రజ్ఞానఘనం అని పేరు. దానికే తురీయావస్థ అనీ పేరు.  "స యధా సైంధవఘనోఽన్తరోఽబాహ్యః రసఘన ఏవైవం వాఅరేఽయ మాత్మాఽనన్తరోఽబాహ్యః కృత్స్నో ప్రజ్ఞానఘన" అని శ్రుతి.  అంటే  ఉప్పుస్ఫటికం లోపల బయట కూడా ఏ విధమైన రుచి భేదం లేకుండా ఒక్క లాగే ఉంటుందో అలా ఆత్మకు లోపల వెలుపల అన్న భేదం లేకుండా అంతటా ఒక్కలాగే ఉంటుంది. కాబట్టి ఈ నామం అర్థం అమ్మ దేశకాలాలకు అతీతంగా నిత్యమైన జ్ఞానస్వరూపం కలది అని అర్థం.

643. జ్ఞానదా
అమ్మ తన భక్తులకు బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తుందని అర్థం.  జ్ఞానం అనగా స్వస్వరూపజ్ఞానం. అంటే  తాను బ్రహ్మము కన్న వేరుకాదు, దాని యొక్క స్వరూపాన్నే అన్న గ్రహింపు అన్నమాట. ఉపాధిసహజమైన ఇంద్రియ జ్ఞానములూ, నేర్చిన విద్యల వలన వచ్చే జ్ఞానములూ అన్నీ బంధములే.  స్వస్వరూపావబోధ పొందటమే అసలైన జ్ఞానం. అది అమ్మ అనుగ్రహం వలనలే సాధ్యం అని ఈ నామం యొక్క అర్థం.  ఈ  జ్ఞానం పొందటం వలన కలిగే ప్రయోజనం కైవల్యమే.

644. జ్ఞానవిగ్రహా
అమ్మ జ్ఞానమే  ఆకారంగా (శరీరంగా) కలది అని అర్థం. సకలజ్ఞానానికి నిధి ఐన వేదమే అమ్మ యొక్క స్వరూపం అని అర్థం.  సకలజగత్తుకూ అమ్మయే మూలం. అలాగే సకలజగత్తుకూ జ్ఞానమే మూలం అని కూడా చెప్పటం  ఉన్నది.  కాబట్టి అమ్మయే జ్ఞానము అని తెలుసుకోవాలి.  అమ్మను జ్ఞానం యొక్క స్వరూపం అని చెప్పటంలో భావం అమ్మను భజించే వారికి తల్లి అనుగ్రహం చేత జ్ఞానం లభిస్తున్నదని చెప్పటం.

727. శివజ్ఞానప్రదాయినీ
శివ మనగా బ్రహ్మమే. శివజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమే.  అదే స్వస్వరూపజ్ఞానం - తానే బ్రహ్మ మనే తెలివిడి. అమ్మ అటువంటి పరమమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నదని అర్థం. ఉమా హైమవతీ బహుశోభమానా ఐన దేవి ఇంద్రుడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినట్లుగా కేనోపనిషత్తు. లేదా శాంతుడు, అమలుడు చిన్మాత్రుడు ఐన శివుని గురించిన జ్ఞానం అమ్మ అనుగ్రహం వలన మాత్రమే కలుగుతున్నది అని అర్థం.

791. సత్యజ్ఞానానందరూపా
సత్యజ్ఞానానందములు అమ్మ యొక్క స్వరూపమే అని అర్థం. సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ అనీ విజ్ఞాన మానందం‌బ్రహ్మ అనీ శ్రుతి. సతీ+ఆజ్ఞ+అనానంద+రూప అని విభజన చెప్పినపుడు సద్విద్యా (సతీ), అనభిజ్ఞులు(ఆజ్ఞ లేని వారు), అనానంద(దుఃఖ) శబ్దముల చేత జ్ఞానశూన్యులకి దుఃఖాన్ని ఇచ్చేది అని అర్థం వస్తున్నది. "అంధతమసః ప్రవిశంతి యే అవిద్యా ముపాసతే" అని బృహదారణ్యక, ఈశావాస్య ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాబట్టి దేవిని గూర్చి జ్ఞానం లేనివారికి అమె దయ అలభ్యంగా ఉండిపోవటం వలన దుఃఖం కలుగుతున్నది అని అర్థం చేసుకోవాలి.

902. విజ్ఞానకలనా
విజ్ఞానం అంటే బ్రహ్మసాక్షాత్కారం. అందుచేత విజ్ఞానం యొక్క కలనా అంటే స్వాత్మసాక్షాత్కారం (స్వస్వరూపజ్ఞానం). అమ్మ స్వస్వరూపజ్ఞానకళా స్వరూపం అని అర్థం.

979. జ్ఞానముద్రా
తర్జని (చూపుడు వేలు)యొక్క కొనను అంగుష్ఠం (బొటన వేలు) యొక్క కొనతో కలిపి కుడి అరచేతిని ప్రదర్శించటం అనే ముద్రకే జ్ఞానముద్ర అని పేరు. ఈ రెండూ జీవ బ్రహ్మలకు సంకేతాలు. వీటి కలయికను ప్రదర్శించటం ద్వారా జీవుడూ బ్రహ్మమూ ఒక్కటే అనే సందేశం చూపటమే ఈ ముద్ర ప్రయోజనం. ఈ ముద్ర అమ్మయొక్క స్వరూపమే అని అర్థం. అమ్మ జ్ఞానం చేత సంతోషం‌ కలిగించేది అనీ అమ్మ చిదానంద స్వరూపిణీ అనీ అర్థాలు కూడా ఈ నామం ద్వారా చెప్పబడుతున్నవి. ఏకమేవాఽద్వితీయం బ్రహ్మా, తత్త్వమసి మొదలైన శ్రుతి వాక్యాలు చిన్ముద్రను సూచిస్తున్నాయి. ఈ ముద్రద్వారా జీవుడు ఏ బ్రహ్మముతో ఏకము అని చెప్పబడుతున్నదో ఆ బ్రహ్మము అమ్మయే అని ఈ‌ నామం చెబుతున్నది.

980. జ్ఞానగమ్యా
అమ్మ సాన్నిధ్యాన్ని కేవలం జ్ఞానం చేతనే పొందవచ్చును అని అర్థం. స్కాందపురాణంలో అమ్మ జ్ఞానదృష్టి కలవారు మాత్రమే నా సాన్నిద్యం పొందగలరు అని చెప్పినట్లు ఉన్నది.

981. జ్ఞానజ్ఞేయస్వరూపిణీ
 జ్ఞేయం అంటే తెలుసుకో దగినది అని అర్థం. జ్ఞానజ్ఞేయం అంటే జ్ఞానం చేత మాత్రమే తెలుసుకో వలసింది అని అర్థం. కాబట్టి అమ్మ స్వరూపం జ్ఞానజ్ఞేయం అంటే అమ్మను గురించి కేవలం జ్ఞానం చేతనే తెలుసుకో వచ్చును అని అర్థం. ఈ జ్ఞానమూ జ్ఞేయమూ‌రెండూ మాయా కల్పితాలే. స్వస్వరూపావబోధ కలిగిన తరువాత తెలుసుకో వలసినదీ లేదు, తెలుసుకోవటం అనే‌ క్రియా లేదు. ఎంతకాలం అట్టి బోధ లేదో అంతకాలమే  జ్ఞేయమైనది ఒకటి ఉంటుంది. దానిని తెలుసుకోవటమే జ్ఞానం. అమ్మయే జ్ఞేయమూ దాని వలన లభించే జ్ఞానమూ కూడా. అమ్మకు అన్యమైనది సృష్టిలో లేదు కదా.  అందుచేత తెలుసుకోవటం అనే వ్యాపారం అమ్మయే.  అలా తెలుసుకోబడుతున్న తత్త్వమూ‌ అమ్మయే అని అర్థం.

993. అజ్ఞానధ్వాంతదీపికా
అమ్మయే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపం అని అర్థం.

8, అక్టోబర్ 2013, మంగళవారం

శ్రీలలితాసహస్రనామస్తోత్రంలో భక్తి సంబంధ నామాలు


శ్రీలలితాసహస్రనామస్తోత్రంలో పది నామాలలో భక్తి లేదా భక్త అనే శబ్దాల ప్రయోగం కనబడుతున్నది.  వేయింటిలో ఇది స్వల్పసంఖ్యయే ఐనా, ఈ‌ నామాలను కొంచెం వివరంగా తెలుసుకోవటం వలన శ్రీదేవి భక్తులకు ఉపయోగంగా ఉంటుందని భావించి విడిగా వీటిని చర్చిస్తున్నాను.

టెంబేస్వామిగా ప్రసిధ్ధులైన శ్రీవాసుదేవానందసరస్వతీస్వామివారు ఒకానొక సందర్భంలో సుందరశాస్త్రి అనే పండితుడిని, "నీకు శాస్త్రంపైన అభిమానం ఉంది.  కాని   భగవంతునిపైన భక్తి కుదరలేదు.  భక్తి లేనిదే దేవుడి దయరాదు.  ముక్తి దొరకదు" అని హెచ్చరించినట్లు తెలుస్తున్నది.  కాబట్టి భగవద్భక్తి అనేది అత్యంత ముఖ్యమైన విషయం అని గ్రహించాలి మనం.

117 భక్తసౌభాగ్యదాయినీ
అమ్మ భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం.  భగ శబ్దానికి శ్రీ, కామం, మాహాత్మ్యం, వీర్యం, ప్రయత్నం, సూర్యుడు, కీర్తీనే  అర్థాలున్నాయని ఆగ్నిపురాణం చెబుతున్నది. అలాగే ఐశ్వర్యం, కీర్తి, బలం, సంపద, జ్ఞానం,  వైరాగ్యం అనే ఆరింటీకీ భగమనే వ్యవహారం కూడా ఉంది. వీటిలో ఏదైనా కాని కొన్ని కాని కలిగి ఉండటమే భాగ్యం. ఇవన్నీ‌ కలిగినది తల్లి శ్రీదేవి. అందు చేత సుభగా అని శ్రీదేవి చెప్పబడుతుంది. ఆ తల్లి అనుగ్రహమే సౌభాగ్యం అన్నమాట. శ్రీగౌడపాదాచార్యులవారు శ్రీఆదిశంకరులకు గురుదేవులు. వారు సుభగోదయం అని తల్లిని గురించి ఒక స్తోత్రం చేసారు. దానిలో మరింత విశేషంగా తెలుస్తుంది.  సుభగ ఐన తల్లి  లోకమందలి దుఃఖముల వలన ఆర్తులు, తల్లి  మహిమను తెలుసుకోవాలనునే జిజ్ఞాసువులు, కోరికలతో పూజించేవారు, కేవలం జ్ఞానులు  అనే నాలుగు రకాల భక్తులకూ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నది.  జ్ఞానులైన భక్తులకు లభిస్తున్నది సాయుజ్యముక్తి అని తాత్పర్యం.

118 భక్తప్రియా
అమ్మ భక్తుల పట్ల విశేషమైన ప్రేమ కలది అని అర్థం. ఈశ్వరుడి పట్ల అనురక్తికే భక్తి అని పేరు. ఇటువంటి అనురక్తి కలవారిని ముఖ్యభక్తులు అంటారు. భజ సేవాయాం అని గరుడపురాణం. అంటే భగవంతుడికి సేవ చేయటమే భక్తి.భక్తులు వివిధ విధాలుగా భగవంతుని పట్ల తమ సేవను, అనురక్తిని చాటుతారు. ప్రహ్లాదుడు చెప్పినట్లు  శ్రవణం కీర్తనం విష్ణోః  స్మరణం పాదసేవనం। అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్॥అని నవవిధాలు. ఇది గౌణ భక్తి. ఇలా భక్తి లక్షణం రెండు విధాలు.  అలా ఏ విధమైన ధోరణిలో ఉన్న భక్తుల పట్ల నైనా ప్రీతికలది అమ్మ అని అర్థం చేసుకోవాలి. భక్తి తత్త్వం గురించీ‌భక్తుల లక్షణాలను గురించీ ఆర్షసాహిత్యంలో పురాణేతిహాసాల్లోనూ, నారదభక్తిసూత్రాదుల్లోనూ విపులంగా చర్చను గమనించవచ్చును.

సామవేదం లోని మంత్రాలకు భక్తులని పేరు. అమ్మ సామగాన ప్రియ. అందుచేత అమ్మకు భక్తిప్రియా అని విశేషంగా అన్వయం.

119 భక్తిగమ్యా
అమ్మయే అంటే అమ్మ పాదాలే భక్తులకు గమ్యం అని అర్థం. అమ్మ భక్తి చేతనే ప్రత్యక్షం అయ్యేది.  అమ్మయే బ్రహ్మము - అవ్యక్తమైన బ్రహ్మము. బ్రహ్మ సూత్రాల్లో అపి సంరాధనే అనే సూత్రం చేత అవ్యక్తమైన బ్రహ్మం కేవలం భక్తిచేతనే ప్రత్యక్షం అవుతున్నదని చెప్పబడింది. భగవద్గీతల్లో శ్రీకృష్ణపరమాత్మ భక్త్యా త్వనన్యయా అని అనన్యమైన భక్తిచేత మాత్రమే నన్ను పొందవచ్చును కాని ఇతర విధాలుగా తనని పొందటం అసాధ్యం అని చెప్పారు.  దీనిని బట్టి భక్తిచేతనే బ్రహ్మైక్యం సాధ్యం అని తెలియ వస్తోంది. అందుచేత అమ్మ తనను నమ్ముకున్న భక్తులకు మోక్షం ప్రసాదిస్తున్నదని అర్థం చేసుకోవాలి.

120 భక్తివశ్యా
అమ్మ తన భక్తులకు మాత్రము స్వాధీనురాలు అని అర్థం.  భగవధ్బక్తి కారణంగా ఆత్మ-అనాత్మ అనే విషయాల మీద వివేకం లభిస్తుంది. అంతుచేత స్వస్వరూపజ్ఞానం కలుగుతుంది.  మహావాక్యం ఐన్ తత్త్వమసి అనేది చెబుతున్నట్లుగా తాను భగవంతుని కన్నా అభిన్నం అన్న స్పృహ కలుగుతుంది. అదే అద్వైత సిధ్ధి.  అంటే భక్తి వలన  అమ్మ అనుగ్రహమూ దాని కారణంగా అద్వైతసిధ్ది వశం అవుతున్నాయని ఈ‌ నామం‌యొక్క అర్థం.

353 భక్తిమత్కల్పలతికా
అమ్మ తన యందు భక్తి కలవారికి ఒక కల్పలత లాగా అన్ని కోరికలనూ ఇస్తుందని అర్థం.  స్వర్గంలో నందనం అనే ఉద్యానవనంలో కల్పవృక్షం అనేది ఉంది - అది కోరుకున్న దేనినైనా ప్రసాదించే మహిమకలది.  పురుషపరంగా వృక్షాన్నీ స్త్రీపరంగా లతనీ చెప్పటం సంప్రదాయం కాబట్టి కల్పవృక్షం బదులు  అమ్మవారి పరంగా ఇక్కడ కల్పవృక్షం బదులుగా కల్పలత అని చమత్కారంగా చెప్పబడింది. విషయబేధం లేదు.

మరొక పక్షంలో భక్తిమత్కల్పులు అంటే భక్తులవంటివారు - అనగా అంతగా పరిపూర్ణం కాని భక్తి కలవారు అని అర్థం చెప్పుకోవచ్చును. లతలు క్రమక్రమంగా ఎలా విస్తరిస్తాయో అదే విధంగా అటువంటి అర్థభక్తులకు తన అనుగ్రహాన్ని క్రమంగా విస్తరిస్తూ అమ్మ అందిస్తూ వారిని వారికి గమ్యం ఐన మోక్షం వైపు నడిపిస్తుంది అమ్మ అని అర్థం చెప్పుకోవచ్చును.

372 భక్తమానసహంసికా
పక్షులలో అత్యంత సుందరమూ శ్రేష్ఠమూ ఐనవి జాతి హంసజాతి పక్షులు.  అవి జలాశయాల్లోకెల్లా పావనమైన మానససరోవరంలో విహరిస్తూ ఉంటాయి.  అమ్మ భక్తుల మనస్సులనే మానససరోవరాల్లో విహరించే ఆడుహంస అని చమత్కరించటం ఈ‌ నామం యొక్క అర్థం. ఏ వ్యక్తులు తమ మనస్సులలో పరమేశ్వరి ఐన అమ్మను నిరంతర ధ్యానం చేత  నిలిపి ఉంచుకుంటారో వారు ధన్యులు.  అటువంటి వారి మనస్సులే‌ పరమ ప్రశాంతమైనవి.  పరమ పవిత్రమైనవి. అవి కేవలం మానససరోవరాల్లాగా అతి విశిష్టమైనవి.  వారి మనస్సులలో అమ్మ  సంతోషంగా మానససరోవరంలోని హంసలాగా విహరిస్తూ ఉంటుంది.  అంటే, వారికి అభ్యున్నతి కల్పిస్తుంది అమ్మ అని అర్థం.

404 భక్తహార్థతమోభేద భానుమద్భానుసంతతిః
అమ్మ భక్తుల హృదయాలకు సూర్యతేజస్సు వంటిది . భక్తుల హృదయాల్లో ఉండే  జీవసహజమైన అజ్ఞానపు చీకట్లను చెదరగొట్టే సూర్యకిరణాల పరంపర అమ్మ కటాక్షప్రసారం అని అర్థం.  స్వస్వరూపం విస్మృతికి గురికావటమే భ్రమ.  అదే అజ్ఞానం.  దాని కారణంగానే మనోమాలిన్యం.  దానినే చీకటి అంటున్నారు.  చీకటి యొక్క లక్షణం సత్యవస్తువులను దర్శించనీయక అడ్డుపడటమే కదా!  అమ్మ యందు భక్తి కుదరగానే ఆ తల్లికృపాకటాక్షవీక్షణాలు మధ్యాహ్నకాలం సూర్యకిరణాల సందడిలాగా దూసుకొని వచ్చి, అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి రక్షిస్తున్నది.  ఈ విధంగా అమ్మ రక్ష   లభించగానే, అజ్ఞానం తొలగి సత్యవస్తు దర్శనం అవుతున్నది.  ఆ సత్యమే స్వస్వరూపజ్ఞానం.  జీవుడనని అని అనుకొంటున్న తాను  భగవదంశనే అని గ్రహింపు కలగటానికే స్వస్వరూపజ్ఞానం అంటారు. దాని ప్రయోజనం మోక్షసిధ్ధి.

502 సమస్తభక్తసుఖదా
అమ్మ తన భక్తులందరికీ సుఖం ఇచ్చేది అని అర్థం.  గీతలో చెప్పబడినట్లు ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థకాములు, జ్ఞానులు అనే నాలుగురకాల భక్తులకూ వారివారి అర్హతలకూ అవసరాలకూ అనుగుణంగా వారికి అభ్యుదయపరంపరను చేకూర్చే విధంగా అమ్మ సమస్తమైన సుఖాల్నీ అనుగ్రహిస్తుంది.  వారి వారి అవస్థాభేదాన్ని బట్టి ఐహికమూ ఆముష్మికమూ తల్లి అనుగ్రహించి వారికి తగిన సంతోషం కలిగిస్తున్నది అని అర్థం.  జ్ఞాని అయిన భక్తుడికి అత్యంత సుఖప్రదమైనది మోక్షమే.

567 భక్తనిధిః
నిధి అంటే విస్తారమైన సంపద. ఎంత అవసరమైతే అంతగా తరచుగా గ్రహించినా ఏమాత్రమూ తరుగుదల లేని సంపద యొక్క రాశికే  నిధి అని వ్యవహారం.  భక్తులకు అమ్మ  అన్ని కొరికలనూ తీర్చే గొప్పనిధి అని ఈ‌ నామం యొక్క అర్థం. నిధి లభించినప్పుడు అందులో లభించిన వాటిలో అత్యంత విలువైన వాటిపైనే జీవులకు దృష్టి  కలుగుతూ ఉంటుంది కదా. అది వివేకవంతులకు లక్షణం కదా.  అమ్మ సర్వేశ్వరి, అనంత నిధి.  వివేకవంతుడైన జీవుడు అమ్మ అనే విశేషమైన నిధిని తన భక్తిచేత పొందినప్పుడు, ఆత్మలాభం అనే అత్యంత విలువైన ప్రయోజననాన్నే ఆశిస్తాడని అర్థం చేసుకోవాలి.  అమ్మయే నిధుల్లో కల్లా అతి గొప్ప నిధి.  మరే ఇతర నిధి కూడా మోక్షమనే సంపదను ఇవ్వలేదు.  అందు చేత అమ్మయే భక్తులు కోరుకునే అతి గొప్ప నిధి.  కాబట్టి, మోక్షం అనే గొప్ప సంపదను అనుగ్రహించే గొప్ప నిధి అమ్మ అని ఈ నామం‌ యొక్క అర్థం.  మరొక విశేషం ఏమిటంటే నిధి అనేది స్వపరభేదం లేనిది కదా.  అలాగే అమ్మకూడా బిడ్డలందరికీ సమంగా ఏ పక్షపాతమూ లేక, సమానమైన ప్రేమను పంచి అందరికీ యోగ్యతానుసారంగా అభ్యుదయ పరంపరను అనుగ్రహిస్తున్నది అని అర్థం.

747 భక్తచిత్తకేకిఘనాఘనా
ఈ‌ నామంలో‌  ఉన్న, కేకి అంటే నెమలి, అఘనం అంటే మేఘం.  నెమలికి ఒక జాతి సహజమైన లక్షణం ఉంది. దానికి మేఘం అంటే అత్యంత ప్రీతి.  ఆకాశంలో మేఘం కనిపించగానే నెమలి ఆనందంతో పురివిప్పి నాట్యం చేస్తుంది.  అమ్మవారు ఒక పెద్ద చల్లని దయామేఘం.  ఆ తల్లి దర్శనం చేత భక్తుల హృదయాలు అనే నెమళ్ళు సంతోషిస్తున్నాయని ఈ నామం యొక్క అర్థం.  అమ్మ అనుగ్రహ దర్శనం చేత ఇక్కడ భక్తులు పొందుతున్న ఆనందం యొక్క స్వరూపం సమ్యక్‌జ్ఞానం.  దాని ప్రయోజనం‌ మోక్షమే.