10, ఏప్రిల్ 2013, బుధవారం

పూతన - 4. పూతన నందనందను గాంచుట

కం. ఇరుగమ్మలు బొరుగమ్మలు 
నరుదెంచిరి యమ్మ ద్ద నఖిలేశ్వరుడౌ
హరి చన్ను గుడుచు శిశువై
పరమాధ్బుతలీల నుండ వాని గనగన్ 

వ. వల్లవవనితాగణంబు బాలుని గని హర్షాతిరేకంబున నొండొరులతో

సీ. ఘననీలదేహంబు గాంచరే సతులార
      వెన్నుడే యనునట్టు లున్న వాడు
ఉరమున పెన్మచ్చ నువిదలు కంటిరే
      ఇది వెన్నునకు దప్ప నెవని కుండు
సరసిజాక్షుని యట్లు సరసిజాక్షుడు వీడు
      సరిసిజాక్షులు చక్క నరయ రమ్
యీ హరిభక్తుల యింటకి శ్రీహరి
      పుత్రుడై విచ్చేసె బొలతులార

తే.గీ. ఇంతకాలమ్మునకు వీరి యిల్లు నిడె
నెట్టి వ్రతములు చేసెనో యిందువద
యెన్ని నోములు నోచెనో యీ యశోద
నంద రాజెంత పుణ్యాత్ము డందు మమ్మ

కం. ని యువిదలు గడు మోద
బున సరసిజముఖి యశోద పుణ్యంబుల ప్రో
నగా గలిగిన బిడ్దను
వినుతించిరి వినెడు తల్లి వీను లలరగన్

వ. ఇట్లాభీరాంగలు సతీర్చి పలుకుచుండు నవసరంబున బాలగోపాలుండు కన్ను లరమోడ్చి యున్న గని యశోద వానిని పర్యంకంబున నుంచి తరుణీమ‌ణులతో‌ ముచ్చట లాడు చుండ

సీ.  తరుణేందుమూర్తియే తరుణి ఫాలంబుగా
        నరుణుడే బొట్టుగా నమరి యుండ
తారకామాలికల్ దళుకుల హారా
    పంక్తులై గళసీమ వరలుచుండ
మదనుని శంఖమే మదవతి కంఠమై
    కులగిరుల్ గుచములై కులుకు లొలుక
కాలమేఘము దన ఘనమైన కొప్పుగా
    శంపాలతిక హాసంబు కాగ
తే.గీ. మన్మథుని తల్లి యనిపించు మంచి రూపు
దాల్చి పూతన సతుల చిత్తంబు లలర
బాలగోపాలు డున్నట్టి పాన్పు జేరి
యెత్తుకొని బల్కె నిట్లు గమ్మత్తుగాను  

కం. కనులేల మూసికొందువు
కనుదెరువుము చన్ను గుడిచి కనుమూయుగ వ
చ్చునులే నందకుమారా
పనిగొని నీ కొఱకు నేను వచ్చితి నయ్యా

. అని యయ్యసురజాతి జవ్వని బాలునిం గరంబులు సాచి యెత్తుకొని చన్నీయ నుంకించుట గని యశోదాదిగోపికా నివహబు దాని కిట్లనెయె

మ. వనితా యెవ్వరి దాన వెవ్వెతవు నీ వాక్యంబులం జూడ పా
పనికిం బల్మిని పాలు త్రాపుటకునై వాంఛింతు వో చెల్ల నీ
చనుబా లేటికి మా కుమారకున కాశ్చర్యంబు నీ బుధ్ధి మా
కును నీకుం గల దొడ్డ చుట్టరికముం గొంచెంబు వర్ణించవే

ఆ.వె. తల్లి పాలు త్రావి తనయుడు శయనించ
నీవు వచ్చి వాని నిదుర లేపి
పాలు త్రావు మనుచు బలవంతముగ జన్ను
గుడుప చూచె దేల కోమలాంగి 

వ. అనిన నా మాయాసుందరియును

కం. మందను గల నారీజను
లందరిలో నొకతె గానె యకటా యిటు న
న్నందరు వెలిజేయగ గడు
దొందరపడి పలుకనేల తొయ్యలు లారా

ం. నిరుడు మంద జేరి నేడు బాలింతను
రాచపట్టి జూడ రమణు లార
వేడ్క మీర వచ్చి విదిలింప బడితిని
కాల మెవరి కైన గడువ కాదు

వ. అని నయంబొప్ప బలికి వారు నమ్మక గుజగుజలు వోవుచున్న నీక్షించి రాకాసి

ఆ.వె. వీరి తోడ నేల వెచ్చింప సమయంబు
బాలు డొకడె నాకు వలయు గాన
ముగుద లెల్ల నిదుర మునుగ జేసెద గాక
యనుచు వారి నరసి యంబుజాక్షి

కం. మాయను బన్నిన నంతట
హాయిగ నిందురించ దొడగి రందరు తరుణుల్
మాయాభీరాంగనయును
మాయాధృతబాలవేషు మాధవు గదిసెన్

వ. చేరి

సీ. నీవే న టోయి యీ నేల నేలెడు వాని
      నేల గూల్చెడు నట్టి నిర్భయుడవు
నీవే‌ న టోయి యా నిర్జరారాతిని
      నిర్జించు వాడవు నీలదేహ
నీవే న టోయి వానికి భాగినేయు
      వగుచు న్మించిన యంతకుడవు
నీవే‌ న టోయి మన్నీటి కంటికి నిద్ర
      లేకుండ జేసిన లేత మొలక

తే. బాలుడా నీవు చూడ నెవ్వాడ వేని
నేడు నా పాల బడి కుఱ్ఱవాడ యింక
నెందు బోయెద వాయువు నీకు చెల్లె
కరుణ లేనిది పూతన కాచు కొనుము

వ. అని పలికి కలికి కులుకుచు నులుకక తన్నరమోడ్పు కన్నులు నరయుచున్న బాలగోపాలునకు జన్నీయ నుద్యమించు నవసరంబున