5, ఏప్రిల్ 2013, శుక్రవారం

పూతన - 2. కంసుడు పూతనను నియమించుట

మ. మన వా రంద రెఱింగి నట్టి కథయే మా దేవకీదేవి పెం
డ్లిని యాకాశపువాక్య మామె కొడుకే లీలాక్రియం నన్ను జం 
పునటంచున్ వినిపించు సంగతియు లావుం దక్కి నే భీతిమై
యనుగుం జెల్లెలి నామె పెన్మిటిని కారాగారమందుంచుటన్  


ఉ. ఇంతకు పూర్వ మాడు శిశు వెన్నడు పుట్టదె నేడు పుట్టి తా  
నింతలు కన్నులున్న నిసు గిప్పడు దేవకి గర్భమందు న
న్నెంతయు మోసపుచ్చి వెస నేగుచు నింగికి నిన్ను చంపు వా
డింతకు మున్నె పుట్టెనని డెందము గుందగ బల్కి నవ్వదే!

ఉ. దీనిని బట్టి చూడ గడు దెల్లముగా వసుదేవు పుత్రునిం
బూనిక నన్ను జంపుటకు భూమి జనించిన వాని మాయచే
దానొక చోట దాచి యొక దామిణి దేవత చిన్ని బిడ్డ రూ
పాన హసించి పోయిన దవారిత సత్త్వుని నన్ను కంసునిన్


చ. ఎవడు చిరాయువై నిలచి యేలును భూమిని పుట్టు వెట్టిదో
యవల కళేబరంబు విడనాడుట యట్టిదె యట్టు లయ్యు నీ
కువలయ మందు నెవ్వడును కూలుట కోర్వడు మిత్తి నెట్టులే 

నవలకు ద్రోయ జూచు మఱి యాయువు గోరని వాడు గల్గునే

ఉ. బాలుర దేవకీ సుతుని ప్రాయపు వారల జాడలారయన్

జాల సమర్ధులైన మన చారులు వేవురు మారుమూల గ్రా
మాలను జల్లెడం బఱపి మాకెఱిగించిన వార్త నంద గో               
పాలుని గేహమం దొకడు బాలుడు పుట్టుట గానవచ్చుటన్    


కం. ఆ నందుడు వసుదేవుని
ప్రాణంబున బ్రాణమైన వాడను విషయం
బే నెఱుగుదు నీ వెఱుగుదు
వీ నగరం బున నున్న వార లెఱుగుదురు కదా

ఉ. నందుని బోలి లేడు మఱి నందుని పత్నిని బోలి లేడు నా
విందుము వీడు నందునకు బిడ్డడె నమ్మగ రాదు కొంచెమున్

సందియ మిందు లేదు నను జంపగ నుద్భవుడైన దుష్ట గో
విందుడె కాన శీఘ్రముగ వీని వధింపుము వాసుదేవునిన్


వ. నావుడు పూతన బాలవధోద్యోగంబున కొప్పక 

ఉ. మంచిది కంస రాజ శిశుమాత్రుని చంపు మటంచు నాఙ్ఞ సే
యించితి విట్టి దాని మరి యెందును గానము నీవు బుధ్ధి నూ
హించిన శత్రునిర్మధనహీనవిధానము నీక జెల్లు ని 

న్మించిన రాజనీతిధను మేదిని గానము నిశ్చయంబుగన్

కం. పగవాడగు మగవాడొక
డగుపడుచో నణచవచ్చు నణగించదగున్ 

దగునే కడు నసహాయుం
డగు శిశువును జంపబూను టనగా ఱేడా

వ. యని బలికిన విని కంసుడునుం దానిని జూచి


ఉ. ఇంతకు మున్ను నీ పలుకు లిట్టుల నెన్నడు లేవు కాదె నీ
వింతిరస్కరించుటకు నెయ్యది కారణభూత మాయె నీ
వింత తలంపు నీ యెడద వెఱ్ఱియె కుఱ్ఱని జంపకుండ ని
శ్చింతగ నుండ వచ్చునె విచిత్రపు టూహ లివేల పూతనా 

ఉ. వెన్ను డనంత రూపముల విశ్వమునందు రహించి మాయలం
బన్నుచు దైత్యనాయకుల బట్టి వధించుచు నుండు వాని ప్ర
ఛ్ఛన్ను దురాత్ము దేవగణసన్నుతు దుర్జయు బాలరూపమం
దున్నను రూపుమాపుటది యొప్పగు కార్యము కాదె చూడగన్ 

మ. అది కాదోయి బిరాన మానవుడు పామాగారముం దూరినన్    
వెదకున్ జంపును గాని దాని దయతో వీక్షించునేయ్యయో
యిది పాపం బొక చిన్ని పాము విడుడీ యేదో విధిం దానె నె
మ్మదిగా బోవు గృహంబు వీడి యని సంభావించునే వెఱ్ఱియై?


ఆ.వె. బాలు డనుచు నొక్క పగతుని విడిచిన
 వాడు పెరిగి పెద్దవాడు కాడె
వాని వలన జావు వచ్చెడు నందాక
విడచిపుచ్చు జాలి వెఱ్ఱి గాదె

తే. చిన్న పామును జంపగా జేత నొక్క
పెద్దకఱ్ఱను బట్టుట వింత గాదు
పగతు డత డెంత బాలుడై యగపడినను

జంపకుండిన వానిచే జావుగలుగు

కం. నందుని యింటికి వెసజను 

మందుండిన శిశువు సర్వదైత్యాంతకుడౌ
సందేహింపక వానిని
మ్రందింపుము వాని చావు మనకు శుభంబౌ
 

చం. అదియును గాక రాజులు ధరామరులున్ గలహించ విప్రులన్        
వెదకి వధించుచో నృపులు వేలకు వేలుగ బ్రాహ్మణార్భకుల్
మెదలక మాతృగర్భముల మెల్గెడు వారును జచ్చినారు నే
మొదలెడు నట్టిదే యిటుల బొల్చెడు వాని వధించుటన్నచో

వ. మరియును నిన్నంపుట యందొక్క విశేషముం గలదది యెట్టి దందు వేని


కం. దానవకాంతాస్తన్యము
మానవబాలునకు విషము మరి చతురతతో
వానికి నీ‌ చన్నిచ్చిన 
బ్రాణములకు దప్పు త డవశ్యము వింటే 

వ. కావున శషభిషలు చాలించి నందుని యింటం డాగియున్న వాసుదేవహతకుని జంపి రమ్ము పొమ్మనిన నదియును

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.