మరి యెందుకు పుట్టినట్లు మనుజునిగా ఆ
నరజన్మము చెడి రామా
పురుగగు పులుగగును చెట్టుపుట్టువు గాంచున్
కం. జగమే శ్రీరామమయం
బుగ నెఱిగన వాని కన్న పుడమిని ధన్యుం
డగుపడునే మాబోంట్లకు
జగమంతయు దుఃఖమయము జగదీశ హరీ
హరీ, ఓ జగదీశ్వరా!
ఈప్రపంచం అంతా రామమయం అని చక్కగా లోనెఱిగిన మనిషే ధన్యుడు. వాడి కంటే ధన్యుడు మరొకడు ఉండనే ఉండడు.
సరేలే, మాబోటి వాళ్ళ మాట వేరే చెప్పాలా?
మాకు ఈజగమంతా దుఃఖమయం అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది.
యథాఽస్మై రోచతే విశ్వం తథేదం పరివర్తతే అన్నారు. అందుకే విశ్వం రామమయం అనుకొంటే అంతే దుఃఖమయం అనుకొంటే అంతే.
చిన్నివిల్లు చేతబట్టె శ్రీరాముడు భలే
చిన్నిచిన్ని నగవులతో శ్రీరాముడు
బాలుడవు నీకెందుకు బాణము లంటే
చాల యలిగి చూచుచుండు బాలరాముడు
ములకులతో నెవ్వరిని మొత్తెద వంటే
పలువురు రాకాసుల నను బాలరాముడు
చాలు వారిజోలి కేగ నేలర యంటే
నేలను నాకెదు రెవరను బాలరాముడు
పరముదుష్టులయ్య వారు వద్దుర యంటే
పరమవీరుడను నేనను బాల రాముడు
వారు దాగికొందు రేమొ బాలుడ యంటే
వారిని నే వెదకెద నను బాలరాముడు
వారిని గురిచేయు టేల బాలుడ యంటే
వార లధర్మాత్ములనును బాలరాముడు
పరమహరిభక్తులకు బాధలు లేవు
పరులకు లేనట్టి బాధలు లేవు
ధరకు దిగి వచ్చిన హరిని కొలుచుట మాను
పరమమూర్ఖులకు లేని బాధలు లేవు
హరియుండ రక్షకుడై యన్యులను వేడుకొను
పరమమూర్ఖులకు లేని బాధలు లేవు
హరేరామ హరేకృష్ణ యనుటకు మనసొప్పని
పరమమూర్ఖులకు లేని బాధలు లేవు
హరిని భవతారకుని యనిశము ప్రార్ధించని
పరమమూర్ఖులకు లేని బాధలు లేవు
వరములిఛ్చు రాముని వదలి యన్యుల గొలుచు
పరమమూర్ఖులకు లేని బాధలు లేవు
సరాసరిగ రామునకు శరణాగతులు కాని
పరమమూర్ఖులకు లేని బాధలు లేవు
ధర్మాత్మున కైనను కర్మిష్ఠున కైనను
నిర్మలున కైనను నిర్మోహున కైనను
వేదముల నేర్చినా విజ్ఞానము కలిగినా
వేదాంత మెఱిగనా విశ్వమర్మ మెఱిగినా
సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం
సీతారాం సీతారాం శ్రీరఘురాం జయ సీతారాం
ఇనకులతిలక సీతారాం ఇందువదన హరి సీతారాం
వనరుహలోచన సీతారాం భండనపండిత సీతారం
దనుజవిమర్దన సీతారాం దశరథనందన సీతారాం
మనసిజమోహన సీతారాం వనజాసననుత సీతారాం
శ్రీరఘునాయక సీతారాం శ్రితజనపోషక సీతారాం
మారుతిసేవిత సీతారాం మంగళరూప సీతారాం
కారణకారణ సీతారాం కారుణ్యాలయ సీతారాం
నారాయణ హరి సీతారాం ఘోరభవాంతక సీతారాం
సీతారాం హరి సీతారాం శివదేవనుత సీతారాం
సీతారాం హరి సీతారాం చిన్మయరూప సీతారాం
సీతారాం హరి సీతారాం శ్రీకర శుభకర సీతారాం
సీతారాం హరి సీతారాం చింతితఫలద సీతారాం
రామనామమే మధురం
శ్యామసుందర సర్వులకు
హరి నీనామమ లన్నిటిలో
పరమమధురమై వరలునది
నరులము మము నీపురమునకు
త్వరగా చేర్చునది
పాపుల నోటను పలికినను
కాపాడుటకై కలిగినది
లోపము లెంచక తాపములు
మాపుచు చెలగునది
కామితమగు మోక్షమునిచ్చే
నామమిదే యని నమ్మెదము
ప్రేమగ నీశుభనామమును
మేము స్మరించెదము
నాలుకపై శ్రీరామనామ మున్నది అది
వీలైన పీఠమని వీడకున్నది
సుందర మగు మంత్రమని సురలు పొగడుచు
నుందురిది శివునికృపను చెందెను నాకు
అందమైన నోటి గూట నమరి యున్నది ఆ
నందసుధాదివ్యరసస్యంది యైనది
బహుజన్మలు తపముజేసి బడసితి దీని న
న్నహరహమును కావ నిది యవతరించెను
ముహూర్తమైన దీని మరచిపోవు టుండునా
వహించి దీని నాలుకపై పరవశించనా
అంది వచ్చిన దపురూప మైనమంత్రము శివు
డందించిన భవతారకమైన మంత్రము
ముందుముందు జన్నలెత్తు ముప్పుతప్పెను ఏ
మందు నింక మోక్ష మదే యందివచ్చెను
ఈరాముడు దేవుడు మీరెల్లరు తెలియు
డీరాముడే దేవుడు
వనిత లక్ష్మి యెకతె వసుమతి యొకతె
తనకు దేవేరు లనగ తనరారు వెన్నుడు
వనజాసను డొకడు మనసిజు డొకడు
తనకు సుపుత్రు లనగ తనరారు వెన్నుడు
దుష్టుల శిక్షించు శిష్టుల రక్షించు
సృష్టికారకుడైన శ్రీమన్నారాయణుడు
సురలు ప్రార్ధింపగ ధరణి ప్రార్ధింపగ
నరుడై జన్మించినట్టి నారాయణ స్వామి
సుజనుల కరుణించి కుజనుల నడగించి
నిజధామ మందున్న నీరజాక్షుడు హరి
శ్రీరామ రామ రామా శ్రితపారిజాత రామా
కారుణ్యధామ రామా కమనీయనామ రామా
సురవైరినాశ రామా పురవైరిస్తుత్య రామా
నరలోకసార్వభౌమా పరమాత్మ సుగుణధామా
సరసీరుహాక్ష రామా శాంతిప్రదాత రామా
ధరణీసుపుత్రిసీతాతరుణీసమేత రామా
జయ జానకీశ రామా జగదేకసార్వభౌమా
జయ ధర్మనిలయ రామా సత్యప్రతిజ్ఞ రామా
జయ నిగమవేద్య రామా జ్ఞానప్రకాశ రామా
జయ భక్తవరద రామా సర్వార్తిశమన రామా
మరుతాత్మజాతసేవ్యమహనీయపాద రామా
వరయోగిరాజహృదయాంబరసూర్యమూర్తి రామా
సురలోకనిత్యవంద్యచరణారవింద రామా
శరణాగతార్తినాశబిరుదప్రసిధ్ధ రామా
పరదైవతములను భావించబోమయ్య
నరనాథ నిన్నెడద నమ్మినామయ్య
సిరులకై మేము వెంపరలాడ మయ్యా
పరమాత్ముడా మమ్ము కరుణించవయ్యా
హరేరామ హరేకృష్ణ యన్నామయ్యా నీవు
సరాసరి వరమిచ్చిన చాలుగదయ్యా
చిన్న పెద్ద తప్పులున్న మన్నించయ్యా మా
కున్నది సద్భక్తి యన్న దొప్పుకోవయ్యా
పప్నగేంద్రశాయి మాంపాహి యన్నామే నీ
కన్న మాకు దిక్కెవ్వరు కరుణించయ్యా
నిన్ను గూర్చి కథలెన్నో విన్నామయ్యా ఆ
పన్నప్రసన్నుండవని భావింతుమయా
కన్నతండ్రి మాప్రార్ధన కాదనకయ్యా మ
మ్మెన్న డింక పుట్టించకు మేలు మాకయ్యా
అన్నన్నా యింకేమీ యడుగబోమయ్యా మా
కున్న దొక్క మోక్షాశయె విన్నావయ్యా
మున్నెందరు భక్తులనో ప్రోచితివయ్యా శ్రీ
మన్నారాయణుడ వీవు మారామయ్యా