27, నవంబర్ 2020, శుక్రవారం

హౌస్ క్లీనింగ్

అందరమూ ఇల్లు సర్దుకోవటం లేదా హౌస్ క్లీనింగ్ అనే పనిని ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటాం.

కొందరైతే ఈపనిని చాలా శ్రధ్ధగా చేస్తారు.

మరికొందరైతే ఈపనిని శ్రధ్ధగానే కాదు, చాలా తరచుగానూ ప్రణాళికాబధ్ధంగానూ చేస్తూ ఉంటారు. నాబోటి గాళ్ళు అనేకమందైతే ఇంక తప్పని సరి ఐతే చచ్చినట్లు చేస్తారు.

ఈ ఇల్లు సర్దుకోవటం అంటె కేవలం, ప్రహ్లాదుడు చెప్పినట్లు "ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలోపలన్" అన్నట్లుడే నివాసగృహం‌ అనబడే దానికి మాత్రమే పరిమితం కాదు. అబ్బో‌ ఇంకా చాలా వాటికి కూడా భేషుగ్గా వర్తిస్తుంది.

ఒకప్పుడు ఆఫీసులో నాచేతిలో ఒకసారి అనేక ప్రాజెక్టులు ఉండి ఉక్కిరిబిక్కిరిగా ఉన్న పరిస్థితిలో ఒక రోజున మా బాస్ నా సీట్ దగ్గరకు వచ్చి "కొంచెం తీరిక చేసుకొని నీ‌ టేబుల్ కాస్త నీట్‌గా సర్దుకోవయ్యా" అని సలహా ఇచ్చి చక్కాపోయాడు. ఆ టేబుల్ అంత ఘోరమైన అరణ్యంలా ఉంది మరి!

పనిలో‌పనిగా టేబుల్ పైన ఉన్నవే‌ కాక దాని అరల్లో ఉన్న కాగితాలూ‌ కలాలూ వగైరా మొత్తం సామాను బయటకు ఈడ్చి సర్దటం‌ మొదలు పెడితే ఆ పని ఒక రోజంతా పట్టేసింది. చివరకు నాదగ్గర ఉన్న దానిలో చెత్తను పాడేస్తే పదిశాతం కూడా పనికివచ్చేవి లేవు కదా అని తేలింది.

మన యిళ్ళల్లోనూ‌ అంతే కదా తరచుగా. ఇప్పుడు మాయింట్లో ఉన్న చెత్తను కూడా ఊడ్చి పారేసే చూస్తే తొంభైశాతం బయటకు నడిచిందని తేలుతుంది. మీయింట్లో సంగతి యేమో కాని మా యింట్లో చెత్త లేదని బడాయికి పోకండి. అలా అంటే దానర్ధం మీఇంట్లో ఏమేం‌ ఉన్నాయో అన్నది మీకు బొత్తిగా తెలియదని. కొత్తగా పెళ్ళై ఇంకా ఇంటికి కావలసినవి ఏర్పాటుచేసుకుంటున్న వారిని మినహాయిస్తే అందరిళ్ళల్లోనూ 80-20 రూల్ అప్లై అవుతుంది. ఈ  80-20 రూల్ ప్రకారం అన్ని సందర్భాల్లో 80 శాతం పొల్లు అని. మీకు వందమంది ఫ్రెండ్స్ ఉంటే అందులో  20 మంది మాత్రమే అక్కరకు వచ్చేవారు. మీరు ఒక ప్రోగ్రాం వ్రాస్తే అందులో ఏ సమయంలో ఐనా ఇరవై శాతం‌ మాత్రమే చురుగ్గా ఉండే కోడ్. ఏదేశంలో ఐనా సరే 80శాతం సంపద 20శాతం మంది చేతుల్లో ఉంటుంది. ఇదంతా Pareto రూల్ అంటారు. మీరూ ఇలాంటివి బోలెడు ఊహించుకోవచ్చును. ఆకాశమే హద్దు.

అమెరికాలో కొన్నాళ్ళు శాన్‌ఫ్రాన్సిస్కో ఈష్ట్‌బే ఏరియాలో అలమీడాలో ఉన్నాను. అబ్బే ఎంతో‌ కాలం లేనండీ ఆర్నెల్లంటే అర్నెల్లేను. అక్కడ నాకు రాజేంద్ర అని ఒక స్నేహితుడు దొరికాడు. ఆయన ఒకరోజున ఉదయం టీ టైమ్‌లో అనుకుంటాను నలుగురి మధ్యలో ఒకరిని ఉద్దేశించి ఒకమాట అన్నాడు. అది ఇప్పటికీ‌ భలే గుర్తు. "అందరూ ఇక్కడకి ఇండియా నుండి రెండేసి సూట్‌కేసులతో  వచ్చినవాళ్ళే. సరిగ్గా రెండేళ్ళు గడిచేసరికి ప్రతివాడి కొంపలోనూ‌ రెండు ట్రక్కుల సామాను పైనే ఉంటుంది. అందులో ముప్పాతికశాతం వేష్ట్ పర్చేజెస్. ఏం చేస్తున్నారయ్యా మీరు, కనిపించిన దల్లా కొనెయ్యటమేనా? మీ‌దగ్గర ఉన్న సామానుల్లో ఎనభై శాతం కేవలం  మీకు అవసరం లేని చెత్తే"

జంతికల గొట్టం లేదని ఒకటి కొంటాం. కొన్నాళ్ళకు మరేదో వస్తువు కోసం వెదుకుతుంటే అప్పుడు ఈ‌ జంతికల గొట్టంతో పాటు మరొక జంతికల గొట్టం కూడా కనిపిస్తుంది. అరె అనుకుంటాం. జాగ్రత్తగా రెండూ ఒకచోట పెడతాం. తమాషా ఏమిటంటే జంతికలు చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ రెండు గొట్టాలూ కూడా పత్తా ఉండవు. వెదికి విసుగొచ్చి పక్కింటి పిన్నిగారిది అరువు తేవటమే. ప్రక్కింటి పిన్నిగారు ఇవ్వనంటే, ఒళ్ళుమండి పిల్లాణ్ణి బజారుకు తోలి మరొకొటి తెప్పించటమే.

అసలు ఈజంతికల గొట్టాలో మరొకటో ఎందుకు కనిపించవూ‌ అంటే ఇంటినిండా సామాను ఎక్కువై పోతే వాటి మధ్యలో ఎక్కడో ఇరుక్కుని కనిపించవు అన్నమాట.

రాజేంద్ర ఒక సలహా ఇచ్చాడు. ఏదన్నా కొనాలీ అంటే అది కచ్చితంగా మనకి అవసరమా? అది మనకి ఇప్పుడే బాగా అవసరమా? అన్న ప్రశ్నలు వేసుకోవాలట. ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తుందిలే అని ఏదీ కొనకూడదు అని ఆయన గట్టిగా హెచ్చరించాడు అందరినీ.

తరువాత ఇల్లు సర్ధుకుందాం వీలు చూసుకొని అని అందరూ ఎప్పుడో ఒకప్పుడు అనుకొనే ఉంటారు. ఇప్పుడు కూడా చదువరుల్లో ఆముక్క ఈరోజునో నిన్ననో అనుకున్న వాళ్ళూ తప్పక ఉండే ఉంటారు. అయ్యా ఆ వీలు అన్నది జన్మలో దొరకదు. గ్యారంటీ. మీరేమో ఆ వీలు కోసం ఎదురుచూస్తూ ఉండగానే ఏదో ఒకవస్తువును ఇంట్లో వెదకి పట్టుకోవటం అత్యవసరం ఐపోయి నానా గోలా అవుతుంది. ఇది కూడా గ్యారంటీ. తప్పనిసరై ఇల్లుపీకి పందిరి వేస్తారు. అంతకంటే ఇంట్లో అనవసరమైన సామాను చేర్చకుండా ఉండటమూ, తరచూ ఉన్నసామాగ్రిని పొందికగా సర్దుకోవటమూ చేస్తూ ఉంటే ఇల్లూ‌ శుభ్రంగా ఉంటుంది. అత్యవసరం వెదుకులాటలూ తప్పుతాయి. ఓస్ ఈమాత్రం నాకు తెలుసు అంటారు. తప్పకుండా అంటారు మీరు. కానీ మీరూ నేనూ అందరమూ తెలిసితెలిసే ఇళ్ళను గోడౌనుల్లా ఉంచుకుంటున్నాం కదా. అనుమానం ఉంటే ఒక్కసారి మీ యింటిలో అన్ని గదుల్లోనూ పరిస్థితి ఎలా ఉందీ అన్నది బేరీజు వేస్తూ పరిశీలించి రండి. అప్పుడు చెప్పండి నామాట ఎంతవరకూ సత్యమో.

ఇల్లు సర్ధుకోవటం అవసరం అని ఇంకా నొక్కి వక్కాణించనక్కర లేదు. కాని ఈ‌యిల్లు సర్దటం అన్నది మాత్రం ఒక మహాయజ్ఞం. ఒకపట్టాన తెమలదు.

అన్నింటికంటే తేలికైన పని ఏదీ అంటే ధర్మరాజుగారు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ఇతరులకు సలహాలు ఇవ్వటం అట. అవును కదా. అందుకని నేను మీకు కొన్ని విలువైన సలహాలు ఇస్తాను.

మొదటిది. ఖరీదైన వస్తువులు. వీటిని కొని వాటి బిల్లులూ, వారెంటీ‌ కాగితాలూ మాన్యువల్స్ వంటివి ఒక పద్దతిలో దాచిపెట్టరు. ఇది గొప్పగొప్ప చిక్కులను సృష్టిస్తుంది. అవసరమైనప్పుడు కంపెనీవాడు మిమ్మల్ని కాగితాలు అడుగుతాడు. ఎంతవెదికినా అవి మీకు దొరకవు! అందుచేత ప్రతి ఖరీదైన వస్తువు తాలూకు ముఖ్యమైన కాగితాలూ ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో ఉంచి అలాంటి కవర్లనీ ఒక ఒక జిప్ ఫోల్డర్ వంటి దానిలో ఉంచాలి.

రెండవది. రకరకాల సర్టిఫికేట్లు, నగానట్రాకొన్న రసీదులు, ఆస్తుల దస్తావేజులు. వీటినీ పైవిధంగానే చేయాలి.

మూడవది. చిన్నచిన్న విలువైన వస్తువులు. అది మీ నాన్నగారి వాచీ‌ కావచ్చు, మీ అత్తగారు పెట్టిన, ఇప్పుడు మీ వేలికి పట్టని , ఉంగరం కావచ్చు. ఇలాంటి వన్నీ చిన్నచిన్న పెట్టెల్లో దాస్తారు లెండి తెలుసు. కాని ఏది ఏపెట్టెలో? ఇలాంటి వివరాలను ఒక నోట్ పుస్తకంలో రికార్డు చేసుకొని అది వారెంటీ పేపర్లూ వగైరా దాచే సంచీలో ఉంచండి.

మీరు ఎవరికైనా అప్పున్నా, మీకు ఎవరైనా అప్పున్నా అటువంటి వ్యవహారాలు కూడా అలాంటి రికార్డులో ఉండాలి.

ఇలాంటి సూత్రాలూ గట్రా మీరే తయారు చేసుకోవచ్చును. కాని చిక్కల్లా నిష్టగా పాటించటం దగ్గరే.

ఈ సర్దుకోవటం అన్నది ఇంటికే‌ కాదు అనేక చోట్ల అవసరం అని చెప్పాను కదా. అలాంటి అవసరాలు కొన్ని చూదాం.

మీ‌ దగ్గర బోలెడు పుస్తకాలుంటాయి. ఒక్కోసారి అందులో మీకు అనవసరం అనిపించేవీ‌ ఉంటాయి. మీరు గమనించరు అంతే. నా దగ్గర అలాంటివి చాలానే ఉన్నాయి. అమెరికాలో నా ఫ్రెండ్ ఒకతనికి టీ షర్టుల పిచ్చి. ఎన్నో‌ కొంటూ‌ ఉండే వాడు. ఒకసారి ఒక తమాషా విషయం చెప్పాడు. లివర్ మూర్ వెళ్ళి అక్కడ ఒక టీ షర్టు కొన్నాడు, ఏదో ఫాక్టరీ ఔట్‌లెట్ దగ్గర. మర్నాడు ఎందుకో అనుమానం వచ్చి వెదికితే మెర్విన్ వాడి దగ్గర కొన్న మరొక టీషర్ట్ బయటపడింది. అదే‌ డిజైన్ అనే కాదు అదే‌ షర్ట్ మరొక కాపీ. మెర్విన్ వాడి స్టిక్కర్ ఇంకా దాని మీదే ఉంది $17 అని. ఇప్పుడు అరవై మైళ్ళ దూరం పోయి తెచ్చుకున్నది చవగ్గా కేవలం $40 ధరకే. ఫన్నీగా లేదూ. అతను మాత్రం కొంచెం విచారంగా నాట్ సో ఫన్నీ అన్నాడనుకోండి. ఇలా ఎందుకు జరిగిందీ అంటే కొని పాడేసి ఎప్పుడొ బుధ్ధిపుట్టినపుడు వేసుకొనే అలవాటు వలన ఎన్నో‌ పోగులు పడ్డాయి. చెత్త పేరుకుపోయి స్పష్టత లేక శృంగభంగం అయింది. ఇది అతడి ఉద్దేశమే నాది కాదు!

అమ్మాయిలూ‌ తక్కువ కాదు ఈవిషయంలో . అమ్మాయిల హేండ్ బ్యాగుల్లో ఏముంటాయి? అన్నీ‌ పనికి వచ్చేవేనా? నాకు లలితా శ్రీనివాసన్ అని ఒక ఫ్రెండ్ ఉండేది. ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఎందుకో ఒకనాడు ఒక పిన్నీసు అవసరం పడింది. పిన్నీసు కదా అని లలిత డెస్క్ దగ్గరకు వెళ్ళి నీదగ్గర ఒక పిన్నీసు ఉంటే ఇవ్వవా అని అడిగాను. అమె తన హేండ్ బ్యాగ్ తెరిచి ఒక పెద్ద చైన్ అఫ్ పిన్నీసులు తీసింది. ఆ తోరణంలో ఒక ఒక యాభై ఉంటాయి. ఇంత పెద్ద దండ ఎందుకూ అన్నాను. నవ్వుతూ బ్యాగ్ లోనుండి మరొక దండ తీసింది అందులో నూటయాభై పైన ఉంటాయి. ఓర్నాయనో అనుకున్నాను. ఇలాగని సూర్యప్రభ గారు అనే‌ మరొక ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడతో‌ చెప్తే, ఆవిడ కసురుకుంది. అమ్మాయి హేండ్ బ్యాగ్ అంటే మినీప్రపంచం తెలుసా పో అంది. అలా అని ఊరుకుందా, ఆవిడ తన హేండ్ బ్యాగ్ నా ముందు బోర్లించింది టేబుల్ మీద. అప్పుడు  అందులోంచి ఒక కీ బయటపడి అవిణ్ణే అశ్చర్యానికి గురిచేసింది. దానికోసం మొన్ననే వెదుక్కుందిట ఆవిడ.  మరి అలాగని అమ్మాయిలు తమ హేండ్ బ్యాగులు ఎప్పుడన్నా సర్దుకుంటూ ఉంటారా అంటే ఏమో‌ తెలియదు.

మీ దగ్గర కంప్యూటరు ఉంది. లేదా కనీసం మొబైల్ ఉంది. అదీ నానా గడ్డీ గాదంతో‌ నిండిపోయి గోల అవటం చూస్తూనే ఉన్నాం కదా. ఈ‌వాట్సాప్ పుణ్యమా అని ఈ‌నిండిపోవటం దారుణమైన వేగంతో‌ జరుగుతుంది తరచుగా. అన్నట్లు వాట్సాప్ వాడు వారం తరువాత హుష్ కాకీ అని కొత్త ఫీచర్ ఇచ్చి నిన్ననే పుణ్య‌ం కట్టుకున్నాడు.

మీ దగ్గర వందల వాట్సాప్ కాంటాక్ట్ లిష్ట్ ఉంది కదా. అది ఎప్పుడన్నా క్లీన్ చేసారా? ఎనభై శాతం‌ పైచిలుకు చెత్తే‌ అక్కడ చూసుకోండి! అసలు మీ ఫోన్ కాంటక్ట్స్ లిష్ట్ ఒకమాటు పరిశీలించండి బోలెడు మంది అక్కడ అనవసరంగా ఉన్నారని తెలుస్తుంది.

మీ కొక బ్లాగు ఉంది. లేదా బోలెడు బ్లాగులున్నాయి. కాని ప్రతిబ్లాగులోనూ కాలంచెల్లిన టపాలూ, ఇప్పుడొకసారి చదివి చూసుకొంటే అనవసరంగా వేసాం అనిపించే టపాలూ,  అసమగ్రంగా ఉన్నాయని ఇప్పుడనిపించే టపాలూ, మనకే ఇప్పుడు నచ్చని టపాలూ వగైరా బోలెడు చెత్త టపాలు కనిపిస్తాయి. అందులో‌ కొన్ని ఫక్తు అయోమయం టపాలూ ఉంటాయి చూసుకోండి. అవన్నీ ఎప్పుడు క్లీన్ చేస్తారూ? ఎన్ని టపాలు వేసాం అన్నది ముఖ్యం అన్న స్థితిని మీరు దాటిపోయి ఉంటే మీరు తప్పకుండా వాసిగల టపాలు ఎన్ని అని ఆలోచించుకొన వలసిన సమయం వచ్చే ఉంటుందని గమనించండి. ఇలా బ్లాగ్ క్లీనింగూ ఒక హౌస్ క్లీనింగే. చాలా ముఖ్యమైన క్లీనింగ్ కూడా.

బ్లాగు అనే‌ కాదండి. మనిషి బుఱ్ఱ ఆనేదీ చెత్తతో నిండిపోతూ ఉంటుంది తరచుగా. చెత్త అభిప్రాయాలూ, చెత్త నిర్ణయాలూ, చెత్తఆలోచనలూ, చెత్తవిషయాలూ, చెత్తసమాచారమూ, చెత్తలెక్కలూ వంటివి బోలెడు మన బుఱ్ఱల్లో నిండిపోయి గందరగోళం సృష్టిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడూ ఆత్మావలోకనం చేసుకుంటూ చెత్తను వదలించుకుంటూ 'అలా ముందుకు పోవాలి' లేదా చెత్తబ్రతుకు ఐపోతుంది. చెత్తవదిలించుకోవటం అంటే‌ అది మూడు విభాగాలుగా ఉంటుంది. 'మూల కారణం బెవ్వడు' అంటూ ప్రతిచెత్తకూ మూలాల్ని గ్రహించి వాటిని దూరం‌ పెట్టాలి. చెత్తను సరే‌ ఎలాగూ వదిలించుకోవాలి. మూడవది ఆ చెత్తయొక్క మూల కారణం మనకు దగ్గర కావటానికి కల మన బలహీనతలూ పొరపాట్లూ ఏమిటో గ్రహించి వాటినీ‌ నిగ్రహించాలి. అప్పుడు మనం సరిగ్గా ముందుకు పోగలం.


ఈ సోదంతా ఎందుకు వ్రాసానూ అంటే‌ నాకే‌ సమాధానం తెలియదు. కాని వ్రాయాలని అనిపించింది. వ్రాసాను. ఎవరికైనా ఈ వ్యాసం వలన ఉపయోగం ఉంటే మంచిది. నా వరకు నాకు ఈ‌ఆలోచన ఇక్కడ ఉంచటానికి ఉన్న కారణం ఈబ్లాగులో కూడా చెత్తను తీసివేయటం అనే కార్యక్రమం అవసరం అని నా భావనగా చెప్పటం. చదువరులు తమతమ బ్లాగుల్లో చెత్తను వదల్చుకోవటం‌ మానటం తమయిష్టం. కొందరైతే చెత్తను పేర్చటమే‌ ఏకైక కార్యక్రమంగా తమ బ్లాగుల్ని నడిపిస్తున్నారనుకోండి. వాళ్ళెవరని అడక్కండి. మీకూ‌ తెలుసు నాకూ తెలుసు సమాధానం.

చెత్తను వదల్చటం అంటే చెత్త మెటీరియల్ అనే‌ కాదు, చెత్తగా అనిపించిన లేదా చెత్తగా తయారైన విధానాలను కూడా వదల్చుకోవటం అన్న నా భావన చదువరులు అర్ధంచేసుకోగలరు. నాకా నమ్మకం ఉంది. నా బ్లాగులో చెత్తను ఎత్తివేయటం‌ మొదలు పెడుతున్నాను. చెత్తవిధానాలూ కొన్ని మార్చుతున్నాను. వాటి గురించి త్వరలోనే‌ మరొక లఘువ్యాసంలో చెప్తాను.