మానిని. చేసిన తప్పులు చెప్పిన బోవును చెప్పెద నీకడ సిగ్గొకటా దాసుని తప్పులు దండముతో సరి దాశరథీ కృపదాల్చవయా వేసము లన్నియు వేసిన పిమ్మట వేసరి వచ్చెను వీడనుచున్ దోసము లెంచక తొల్లిటి రీతిగ తోచవయా జగదోధ్ధరణా |
మానిని.
ఈ మానినీ వృత్తానికి మదిర అని మరొకపేరు కూడా ఉంది. దీని గణవిభజన చూస్తే - భ - భ - భ - భ - భ - భ - భ - గ. అని వస్తుంది. దీనికి యతి స్థానాలు మూడున్నాయి - 7, 13 మరియు 19వ స్థానాలవద్ద.
ఈ మానినీ వృత్తంలో ప్రతిపాదానికి వరసగా ఏడు భ-గణములు (UII), చివరిగా ఒక గురువు (U) ఉంటాయి కదా. ఈ మానినీవృత్తములో ఉన్న మొదటి గురువును రెండు లఘువులుగా మార్చితే అప్పుడు అది కవిరాజవిరాజితం అవుతుంది.
నన్నయ్యగారు మాలినీవృత్తానికి 13వ అక్షరాన్ని యతిస్థానంగా వాడారు. అయన తరువాతి కాలపు కవులు 7వ, 13వ, 19వ స్థానాలు మూడుచోట్లా యతిమైత్రిని పాటించసాగారు. అంటే ప్రతి మూడవగణం మొదటా యతిమైత్రిని పాటించా రన్నమాట.
నన్నయ్యగారు శ్రీమదాంధ్రమహాభారతంలోని ఆదిపర్వంలో వ్రాసిన ఒక మానినీవృత్తం చూదాం. ఇది నాలుగవ ఆశ్వాసంలో శకుంతలాదుష్యంతుల కథలోనిది.
ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల – నిమ్మగు ఠావుల జొంపములం-
బూచిన మంచి యశోకములన్ సుర-పొన్నల బొన్నల గేదగులం
గాచి బెడంగుగ బండిన యా సహ-కారములం గదళీ తతులం
జూచుచు వీనుల కింపెసగన్ విను-చున్ శుకకోకిల సుస్వరముల్
తిక్కన్న గారి భారతాంధ్రీకరణం నుండి కూడా ఒక పద్యం చూదాం. ఆయన కూడా నన్నయగారి వలెనే 13వ అక్షరం దగ్గర మాత్రమే యతిని పాటించారు.
జూదమునప్పుడు సర్వజనంబులు చూచి భయంపడి యిప్పని యి
మ్మేదిని సేనలకుం గురుకోటికి మృత్యువు గాని నిజం బలఁతిం
బో దని యాడరె యమ్మెయి నాదగుబుద్ధికిఁ దోఁచినసత్యము దా
మోదర పాటిలదే కొడుకంచుఁ బ్రియోక్తులు వల్కిన బెంపు సెడున్.
మరి పోతన్నగారి శ్రీమదాంధ్రభాగవతం దశమస్కందంలో నుండి ఒక పద్యాన్నీ చూదాం చిన్నికృష్ణుణ్ణి చంపుదామని మాయాగోపికావేషంలో పూతన రాకను వర్ణించే పద్యం ఇది:
కాంచనకుండల కాంతులు గండ యుగంబునఁ గ్రేళ్ళుఱుక న్జడపై
మించిన మల్లెల మేలిమి తావులు మెచ్చి మదాళులు మింటను రా
నంచిత కంకణ హార రుచు ల్చెలువారఁగఁ బైవలువంచల నిం
చించుక జారఁగ నిందునిభానన యేగెఁ గుమారుని యింటికి నై.
మించిన మల్లెల మేలిమి తావులు మెచ్చి మదాళులు మింటను రా
నంచిత కంకణ హార రుచు ల్చెలువారఁగఁ బైవలువంచల నిం
చించుక జారఁగ నిందునిభానన యేగెఁ గుమారుని యింటికి నై.
ఇందులో పోతన్నగారు మూడు చోట్ల యతిస్థానం ఉంచటం గమనించండి. ప్రతి మూడవగణం మొదటి అక్షరం యతిస్థానంగా వాడారన్నమాట.
ఈ మానినీవృత్తంలోని పద్యాలు చతురస్ర గతిలో నడుస్తూ చక్కగా తాళయుక్తంగా పాడుకుందుకు వీలుగా ఉంటాయి. ఆది, రూపక, మఠ్య, ధ్రువ తాళాలలో కూడ మానినీ వృత్తం ఒరుగుతుంది. ఒకే వృత్తములో ఇన్ని తాళాలు ఉండడము అరుదని ఆధునిక ఛందశ్శాస్త్ర నిపుణులు బెజ్జాల కృష్ణమోహన్ గారి అభిప్రాయం..
నేను ఇక్కడ చెప్పిన పద్యాన్ని వచనకవిత్వంలాగా ప్రతిపాదాన్నీ ముక్కలుముక్కలు చేసి చూపిస్తే కొందరికి బాగా నచ్చవచ్చును. ప్రతిపాదాన్నీ యతిస్థానం దగ్గర విరచటం జరిగిందని గమనించండి.
చేసిన తప్పులు
చెప్పిన బోవును
చెప్పెద నీకడ
సిగ్గొకటా
దాసుని తప్పులు
దండముతో సరి
దాశరథీ కృప
దాల్చవయా
వేసము లన్నియు
వేసిన పిమ్మట
వేసరి వచ్చెను
వీ డనుచున్
దోసము లెంచక
తొల్లిటి రీతిగ
తోచవయా జగ
దోధ్ధరణా
ఈ పద్యం అనే కాదు లయప్రధానంగా ఉండే అనేక వృత్తాలను ఇలాగే పొట్టిపొట్టి ముక్కలుగా వ్రాస్తే అధునికులకు నచ్చవచ్చును. అన్నట్లు అదొకటే కాక, కాస్త తక్కువపాళ్ళలో వాడాలి గ్రాంథికభాషని అన్నసంగతి కూడా మర్చిపోరాదు మరి. ప్రతి మూడుగణాలకు ఒకసారి యతిస్థానం ఉంచాలా అన్నది ఆలోచించాల్సిందే. అలా నడిపించటం కొందరికి కత్తిమీద సాములా ఉండవచ్చును. విడిపద్యాల్లో ఐతే ఎలాగో అలా బండినడిపించవచ్చును కాని కావ్యం మధ్యలో కథాకథనంలో భాగంగా అలా అనేక యతులతొ వ్రాయటం చాలా ఇబ్బందికరం కావచ్చును. కృతకమైన పదాలను వాడవలసి వచ్చి ఆ దెబ్బతో పద్యంలో ధార కాస్తా కుంటుపడవచ్చును లేదా పద్యం కాస్తా పలుగురాళ్ళ పాకం ఐపోవచ్చును. తస్మాత్ జాగ్రత.
అద్భుతం.ఆనందం.
రిప్లయితొలగించండితిక్కన గారి ఒక మానినీ వృత్తం
ఝుదమునప్పుడు సర్వజనంబులు చూచి భయపడి యిప్పని యి
మ్మెదిని సేనలకుం గురుకోటికి మృత్యువువు గాని నిజం బలతిం
బో దని యాడరె యిమ్మెయి నా దగు బుద్ధికి దోచిన సత్యము దా
మోదర వాటిలదే కొడుకంచు బ్రియోక్తులు వల్కిన బెంపు సెడున్
ఇబ్బంది పెడుతున్నాననుకోకపోతే, బాల్య చాపల్యంతో అడుగుతున్నదే సుమా
మంగళమహాశ్రీ వృత్తం చెప్పండి
పద్యం మొదటి మాట ’యుద్ధము’ టైపొ
రిప్లయితొలగించండిఇప్పుడు భూమండలము లో జరుగుచున్న యుద్ధముల గని, శర్మ గారు టైపో పెట్టినట్టున్నారు :)
తొలగించండిజిలేబి
యుధ్ధం మానవాళి జీవితంలో ఒక ముఖ్యభాగం కదండీ,
తొలగించండిఇంకా కొన్ని అప్పుతచ్చులు కనిపిస్తున్నాయండి. ఈ పద్యాన్ని నెట్లోనే వెదకి పట్టుకున్నాను. దాన్ని క్కూడా టపాలో చేరుస్తున్నాను.
రిప్లయితొలగించండితప్పులు చాలానే ఉన్నాయండి! సరిచేసి పద్యం ప్రచురించినందుకు ధన్యవాదాలు.
తొలగించండిమంగళ మహా శ్రీ వృత్తం
ఈతడు రణంబునకు!నెత్తిచనుచుండియును!నెంతయును భక్తి గని నాకుం
9,17 స్థానాలు యతి అనుకూంటున్నా.
అవునండి. అవే యతిస్థానాలు. మీరిచ్చినది మంగళమహాశ్రీపాదమే.
తొలగించండిధన్యొస్మి!
రిప్లయితొలగించండిసంతోషం. రామేఛ్చ,
తొలగించండి