19, నవంబర్ 2015, గురువారం

వంశస్థవృత్తంలో రామస్తుతి.






  
      వంశస్థం.
      ధరాపతుల్ కోరి ధరింపరాని విల్
      బిరాన తానెత్తె విశేష మేమయా     
      పురారివిల్లెత్త మురారికే తగున్
      నరావతారంబున నున్నదాతడే




ఈ వంశస్థవృత్తానికి గణాలు జ - త  జ - ర అనేవి. 7వ అక్షరం‌ యతిస్థానం.  పాదానికి మొత్తం 12 అక్షరాలు మాత్రమే ఉండే పొట్టి వృత్తం. చిట్టిపొట్టి భావాన్ని సూటిగా చెప్పటానికి చాలా బాగుంటుంది.

సంస్కృత కవుల్లో భారవి మహాకవికి వంశస్థం చాలా యిష్టమైన వృత్తం అంటారు.  ఆయన కిరాతార్జునీయంలోని ఒక శ్లోకం చూదాం.

కిరాతార్జునీయంలోని పదిహేనవసర్గ చిత్రకవిత్వం పుట్ట! దానిపైన ప్రత్యేకం వ్రాయాల్సిందే.  ఆ పదిహేనవసర్గ అంతా కిరాతరూపంలో ఉన్న శంకరుడికీ పాండవమధ్యముడైన అర్జునుడికీ మధ్య జరిగిన అతిచిత్ర విచితమైన యుధ్ధం. అందుకే‌ మరి భారవి ఆ సర్గనంతా చిత్రకవిత్వమయం చేసాడు.  అందులోని ఒక వంశస్థం చూపుతాను.

    వికాశమీయుర్జగతీశమార్గణా
    వికాశమీయుర్జగతీశమార్గణాః
    వికాశమీయుర్జగతీశమార్గణా
    వికాశమీయుర్జగతీశమార్గణాః

మీరేమీ పొరబడటం లేదు.  మొదటి చరణమే,మిగిలిన మూడు చరణాలూను. దీన్ని మహాయమకం అంటారు. ఊరికే సరదాగా అలా భారవి రాసెయ్యలేదండి. ఈ శ్లోకానికి అర్థం భేషుగ్గా ఉంది. అదంతా ఇక్కడ ప్రస్తుతం‌ కాదు.


4 కామెంట్‌లు:

  1. చిట్టి పొట్టి పద్యం ముచ్చటగా ఉంది. ఏక వాక్య పద్య భావం చెప్పల్సిందే ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భారవి శ్లోకం గురించేనా? చెబుతానండి తొందరలోనే.

      తొలగించండి
    2. పురారి విల్లెత్త - శివుని విల్లెత్త ?

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీగారూ, అవును శివుని విల్లు ఎత్తటం అనేనండి. అక్కడ పాదం 'పురారి విల్లెత్త మురారికే తగున్' అని కదా. పురారి అంటే శివుడే. ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే ఈ పురారి అన్న మాట త్రిపురారి అన్నమాటకు సంక్షిప్తరూపం. ఇక్కడ పురారి అన్న మాటనే వాడితీరాలి. ఎందుకంటే 'ర' గుణింతం (ద్విత్వసంయుక్తాక్షరాలు కాక) ఉన్న అక్షరం రెండవదిగా వచ్చే మాటతోనే ప్రతి పాదమూ మొదలవ్వాలి. పాదంలో రెండవ అక్షరం ప్రాస కదా, ఇక్కడ 'ర' కారం ప్రాసస్థానంలో ఉంది కదా, అందుకని అన్నమాట.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.