శిఖరిణి. ధనాశం భూలోకంబున శుభదమౌ ధర్మము నెడన్ మనుష్యు ల్నిత్యంబున్ విముఖులగుచున్ మానక సదా ఘనంబుల్పాపంబుల్ సలుపుదురయా కావగదవే మనశ్చాంచల్యంబుల్ రఘుపతి వెసన్ మాన్పి కృపతో |
ఈ శిఖరిణవృత్తం కొంచెంగడ్డు పద్యమే అని చెప్పాలి. దీనిలో గురువులూ లఘువులూ గుంపులుగా వచ్చేస్తాయి మరి. ఈ వృత్తంగణవిభజన య - మ - న - స - భ - వ అని. అంటే మొత్తం 17 అక్షరాలు. యతిస్థానం 13వ అక్షరం. ఈ శిఖరిణీవృత్తంలో పాదానికి గురులఘువుల అమరిక ఇలా ఉంటుంది:
I U U U U U I I I I I U U I I I U
య మ న స భ వ
చూసారా? ఈ వృత్తంలో మొదట్లోనే ఐదుగురువులు వరసగా వస్తాయి. ఆ కష్టం చాల దన్నట్లు అ వెంటనే వరసపెట్టి ఐదు లఘువులు వస్తాయి.
సంస్కృతంలో ఐతే ఈ వృత్తంలో బండి లాగించెయ్యవచ్చునూ అనటానికి శంకరాచార్యులవారే సాక్షి. వారి అమోఘమూ అద్వితీయమూ ఐన సౌందర్యలహరీస్తోత్రం పూర్తిగా శిఖరిణీవృత్తాల్లోనే ఉంది.
తెలుగులో మాత్రం శిఖరిణీ స్తోత్రం వ్రాయటం కత్తిమీదసాము అనే చెప్పాలి.
అందుకనే తెలుగు కవులుశిఖరిణీవృత్తాన్ని ఆదరించినట్లు కనిపించటం లేదు.
పండిత నేమాని సన్యాసిరావుగారి అధ్యాత్మ రామాయణము గ్రంథంలో నుండి ఒక శిఖరిణి
నమస్తే సోమాయ త్రిభువన శరణ్యాయచ నమో
నమస్తే రుద్రాయ త్రిదశనుత విజ్ఞాన నిధయే
నమస్తే శర్వాయ ప్రమథ గణ వంద్యాయచ నమో
నమస్తే తామ్రాయ శ్రిత భవ భయఘ్నాయచ నమః
ఐతే తెలుగు గ్రంథంలోని ఒక సంస్కృతవృత్తమే కాని ఇది తెలుగుపద్యం కాదు. యతిప్రాసలను పాటించి తెలుగుపద్యం అనిపించుకోవటమే ఇక్కడ జరిగింది.
ప్రబంధకవులెవరైనా శిఖరిణీవృత్తాన్ని వాడారా అన్నది అనుమానమే.
ఆధునికకాలంలో ఈ శిఖరిణీ వృత్తాన్ని గురించిన చిన్న ప్రయత్నం ఒకటి శంకరాభరణం బ్లాగులో జరిగింది. దాని వివరాలు ఇక్కడ ఇక్కడ చూడవచ్చును. అ ప్రయత్నంలో భాగంగా శ్రీశంకరయ్యగారి శిఖరిణీ వృత్తాన్ని ఎత్తి చూపుతున్నాను:
పురారాతీ! శూలీ! మునిజననుతా! మోక్షఫలదా!
స్మరద్వేషీ! భర్గా! శశిధర! హరా! మాధవసఖా!
సురూపా! సర్వజ్ఞా! సుబల! శుభదా! శోకదహనా!
పరాకేలా? స్వామీ! పతితుఁడను, కాపాడుము శివా!
ఆధునికకాలంలో ఈ శిఖరిణీ వృత్తాన్ని గురించిన చిన్న ప్రయత్నం ఒకటి శంకరాభరణం బ్లాగులో జరిగింది. దాని వివరాలు ఇక్కడ ఇక్కడ చూడవచ్చును. అ ప్రయత్నంలో భాగంగా శ్రీశంకరయ్యగారి శిఖరిణీ వృత్తాన్ని ఎత్తి చూపుతున్నాను:
పురారాతీ! శూలీ! మునిజననుతా! మోక్షఫలదా!
స్మరద్వేషీ! భర్గా! శశిధర! హరా! మాధవసఖా!
సురూపా! సర్వజ్ఞా! సుబల! శుభదా! శోకదహనా!
పరాకేలా? స్వామీ! పతితుఁడను, కాపాడుము శివా!
ఈ ప్రయత్నంలో శంకరయ్యగారు సఫలీకృతులనే చెప్పాలి. సంబోధనాప్రథమా విభక్తి ద్వారా వచ్చిన దీర్ఘాక్షరాలు బాగానే సహాయ పడటాన్ని మనం గమనించవచ్చును. ఇంకెవరన్నా శిఖరిణీ వృత్తాలుప్రయత్నించారేమో తెలియదు.
బాల్య చాపల్యంతో అడిగేశాను, మన్నించండి.
రిప్లయితొలగించండివృత్తాన్ని అందంగా అందించినందుకు ధన్యవాదాలు.
ఇక అడగనండి.
మిత్రులు శర్మగారు,
తొలగించండిపెద్దతనం ఒకరకమైన బాల్యమే. ఎందుకంటే తొలిసంజ మలి సంజలు రెండింటా మానవులం ఇతరుల సహాయం అపేక్షించక జరుగదు కదా. నేను ప్రవేసించుతున్న మంలిసంజలోనికి మీరు ఇప్పటికే ప్రవేశించి దాని ముచ్చట్లను మాబోంట్లకు పంచుతున్నారు. ఇకపోతే చపలత్వం అంటారా, అది యావజ్జీవం మానవనైజంగా ఉంటేదే, కాని పరిస్థితులను బట్టి దాని ఆకారవికరాలు మారుతూ ఉంటాయి. చూసే వారికి చపలత్వం వలె అనిపించినది మనకు అవసరం కావచ్చును కద.
ఇకపోతే శిఖరిణీవృత్తాల సంగతి. ఈ వృత్తానికి ఒక లయని ఆపాదించటం దుష్కరం. సందర్భానుగుణంగా పాఠకులో గాయకులో దానిని గమనించుకోవలసిందే. ఈ కాలంలో సంస్కృతభాషాపరిచయం చాలక చాలమంది శిఖరిణిలో ఉన్న స్తోత్రాలను సరిగా గానం చేయటం లేదని నా అభిప్రాయం. అసలు ఆంధ్రభాషాపరిచయమే ఒక ప్రక్కన నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్నట్లుండగా సంస్కృతం ఘోష గురించి ఏం చెప్పేదీ! నాకూ ఈ శిఖరిణి కొంచెం మంచి పరీక్షనే పెట్టింది. వీలైతే శిఖరిణీవృత్తాలలో రామకథాగానం కూడా క్లుప్తంగా చేయాలని యోచిస్తున్నాను. ఆ పైన రామేఛ్ఛ.
ఇందాక ఈముక్క వ్రాయటం మరచి పోయానండి మన్నించాలి.
తొలగించండిమీరు అడుగుతూ ఉండటం నేను చెబుతూ ఉండటం నాకు మహధ్బాగ్యం. దాన్ని వీలైనంతగా కొనసాగనివ్వండని ప్రార్థన.
తొలగించండిశర్మ గారు,
శ్యామలీయం లాంటి మంచి మనసులున్న కవీశ్వరులు అరుదు. వారి చేతే కోరి రాయించు కున్న జిలేబి గీతికలు ఎన్నో మార్లు !
త్రీ చీర్స్ టు శ్యామలీయం వారు.
జిలేబి
నేనేమీ కవీశ్వరుడను కానండి. ఐతే గియితే, కేవలం ఒక అల్పకవిని. మందః కవియశః ప్రార్థీ అని కాళిదాస మహాకవి వాక్రుచ్చినట్లు ఏదో నా రాముడికి నేనీయ గలిగినది ఇస్తున్నాను. ఈ వాగ్రూపసేవకూడా సజావుగా ఈకాలపు జనం చేసుకోనీయటంలేదంటే అది వారి తప్పుకాదు - కలిప్రభావం. అంతే. ఒకప్పుడు స్వర్గీయ పండిత నేమాని సన్యాసిరావుగారు శంకరాభరణం బ్లాగులో నా మీద ఒక ఒక పద్యంలో ఆశీర్వచనం చేసారు. దాని చివరన 'కవికుంజర సత్తమా' అన్నారు. అలా వద్దండీ, నా కేమి సత్తా ఉందీ, లేదు కదా, మీరిలాగు అంటే నాకు కొమ్ములు వచ్చేస్తాయేమో అని నా భయం వ్యక్తం చేసాను. దానికి వారు అలాంటిది జరుగదు పో అని పునరాశీర్వచనం చేసారు. ఆధ్యాత్మరామాయణకర్తగారి ఆశీర్వచన బలం వలన ఎప్పటికీ కొమ్ములు రాకూడదనే కోరుకుంటున్నాను. మీకు నా కవిత్వప్రయోగం నచ్చుతున్నదుకు అనేక ధన్యవాదాలు.
తొలగించండి