15, నవంబర్ 2015, ఆదివారం

నన్నపార్యుడి నాగస్తుతి

ఈ రోజు నాగుల చవితి.  తెలుగువారికి యిష్టమైన పండగల్లోఒకటి. అందునా, నాకు మిక్కిలి ఇష్టమైన పండుగల్లో ఒకటి. ఎందుకు అంత యిష్టమో విడిగా చెబుతాను.  ప్రస్తుతానికి ఈ‌టపాలో శ్రీమదాంధ్రమహాభారతంలో మన ఆదికవి నన్నయ్యగారు వ్రాసిన నాగస్తుతిని మీ ముందు ఉంచుతున్నాను.

ఈ నాగస్తుతికి దారితీసిన పరిస్థితి ఏమిటంటే, నాగరాజైన తక్షకుడు, ఉదంకుడనే మునిని రహస్యంగా వెంబడించి తిరుగుతూ ఉన్నాడు. ఎందుకలా? ఆ ఉదంకముని కుమారుడు పౌష్యుడనే మహారాజుగారి భార్యను అడిగి ఆవిడగారి చెవికుండలాలను తీసుకొని వెడుతున్నాడు. తనకోసం కాదులెండి. గురుపత్నిగారు ముచ్చటపడి అడిగింది. ఆ కుండలాలు తెచ్చి ఇవ్వవోయ్ నా వ్రతానికి ఉద్యాపన చేసుకోవాలీ, అనక తిరిగి పంపించేద్దాం అని. అదీ సంగతి. ఆ తక్షకుడు వీటికోసం ప్రయత్నిస్తాడు జాగ్రత్త అబ్బాయీ అని రాణిగారు ముందే హెచ్చరించి మరీ ఇచ్చారు కుండలాలని. ఉదంకుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా వాటిని తక్షకుడు ఎత్తుకుపోయాడు! ఎలా అన్నసంగతి ఇప్పుడు అవసరం లేదు లెండి. విషయం అది. ఐతే, ఉదంకుడు నాగరాజుల్ని ప్రార్థించి వాళ్ళ అనుగ్రహంతో మళ్ళా ఆ కుండలాలను సంపాదించాలని ప్రయత్నిస్తూ ఇలా నాగస్తుతి చేసాడు. ఇక నన్నయ్యగారి పద్యాలను చదవండి.

అదిశేషుడిని ప్రార్థిసూ చెప్పినది:
  చ. బహువనపాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
  సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు
  స్సహతర మూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అ
  య్యహిపతి దుష్కృతాంతకు డనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్

వాసుకి స్తుతి:
  చ. అరిది తపోవిభూతి నమరారుల బాధలు వొందకుండగా
  నురగల నెల్ల గాచిన మహోరగనాయకు డానమత్సురా
  సుర మకుటాగ్రరత్నరుచి శోభిత పాదున కద్రినందనే
  శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకు బ్రసన్నుడయ్యెడున్

ఐరావతనాగ గణాలకు స్తుతి:
  ఉ. దేవ మనుష్య లోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సం
  భావిత శక్తిశౌర్యులు నపార విషోత్కట కోప విస్ఫురత్
  పావక తాపి తాఖిల విపక్షులు నైన మహానుభావు లై
  రావత కోటి ఘోర ఫణిరాజులు మాకు ప్రసన్నులయ్యెడున్

తక్షకుడిని స్తుతిస్తూ చెప్పినది:
  ఉ. గోత్రమహామహీధర నికుంజములన్ విపినంబులం గురు
  క్షేత్రమునం బ్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వసేనుడై
  ధాత్రి బరిభ్రమించు బలదర్ప పరాక్రమదక్షు డీక్షణ
  శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు బ్రసన్నుడయ్యెడున్

ఈ స్తోత్రాన్ని ఈ  నాగులచవితి పర్వదినాన తప్పక పఠించండి. శుభకరం.  

ఈ స్తోత్రాన్ని గురించి విపులంగా అర్థం తెలుసుకోవా లనుకునే వారు  తెలుగు పద్యం  బ్లాగులో  ఉదంకుడి కథ - 2వ భాగం, ఉదంకుడి కథ - 3 వ భాగం చదవండి. నేను అంతకంటే వ్రాయవలసినదీ లేదు. నేను అంత బాగా వ్రాయనూ లేను.

అన్నట్లు అనంతరకథ ఏమిటీ అన్నది కూడా క్లుప్తంగా చెబుతాను. నాగరాజులు కాదు కానీ సాక్షాత్తూ త్రిలోకాథిపతి ఇంద్రుడే సహాయానికి వచ్చాడు! కార్యం నెరవేరింది.

2 కామెంట్‌లు:

  1. మంచి కాలం ! రంగనాయకమ్మ గారు బ్లాగు లోకం లో లేరు ! ఉండి ఉంటె ఈ కథ కి మరో కోణం చెప్పి ఉండే వారు :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆవిడ అభిప్రాయాలు ఆవిడవి. వాటితో‌ మనకు నిమిత్తం లేదు.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.