20, నవంబర్ 2015, శుక్రవారం

మంగళమహాశ్రీతో మనవి          మంగళమహాశ్రీ
          లోకమున నెల్లపుడు లోకులకు సాజములు
                  లోపములు పాపములు నీవే
          మా కలిమి మా బలిమి మా తెలివి మా బ్రతుకు
                  మా  జయము మా యపజయంబుల్
          మా కలలు నీ యెడల మాకు గల ప్రేమలును
                  మా భయము లన్నిటిని రామా
          నీ కరుణతో నరసి నిర్భయత మాకొసగి
                  నీ దరికి చేర్చుకొన వయ్యా
           
  మంగళమాహాశ్రీ వృత్తం.

ఇది చాలా పొడుగైన పాదాలున్న వృత్తం. పాదానికి ఏకంగా 26 అక్షరాలుంటాయి.

సంప్రదాయికమైన గణవిభజన ప్రకారం ఐతే దీని గణాలు  భ - జ - స - న - భ - జ - స - న - గగ .  కాని ఇలా గణవిభజన చూపటం వలన ఈ మంగళమహాశ్రీ వృత్తం నడక సులభగ్రాహ్యంగా ఉండదు. ఇది కూడా ఒక లయ  ప్రథానమైన వృత్తం. దీని నడకను అనుసరించి గణవిభజన ఇలా ఉంటుంది:

   భల - భల - భల - భల - భల - భల - గగ

ఇక్కడ 'భల' అంటే భగణం పైన ఒక లఘువు (U I I I) గా ఒక నాలుగక్షరాల గణం. 6 సార్లు 'భల' గణమూ ఆపైన ఒక గగ (U U) ఉంటాయి మంగళమహాశ్రీ ప్రతి పాదం లోనూ.

వృత్తం కాబట్టి ప్రాసనియమం ఉందని మళ్ళా వేరుగా ఎంచి చెప్ప నక్కర లేదు.  ఈ  మంగళమహాశ్రీ వృత్తానికి 9వ అక్షరమూ,  17వ అక్షరమూ దగ్గర అంటే మొత్తం మీద రెండు యతిస్థానా లున్నాయి.   రెండు స్థానాల్లోనూ యతిమైత్రి పాటించాలి. ఏదో ఒకచోట అని ఐఛ్చికం ఏమీ లేదు. అది విశేషం.  యతి స్థానాలను చూపుతూ దీని విభజన  (భల - భల)  (భల - భల)   (భల - భల  - గగ) అని ఖండాలుగా చెప్పుకోవాలి.

ఈ వృత్తాన్ని పొడుగుపొడుగు పాదాల్లో చదవటం‌ కన్నా పఠన సౌలభ్యం కోసం విరచి వ్రాయటం‌ బాగుంటుంది.
ఒకపధ్ధతిలో

  భల - భల - భల
  భల - భల - భల - గగ

అని పాదాన్ని రెండు ఖండాలుగా వ్రాయటం ఉంది.  రెండు ఖండాలుగా పాదాన్ని విరచితే పద్యం ఎనిమిది లైనులలో వస్తుంది. అలాకాక మరింత సొంపుగా అధునాతంగా వ్రాయవచ్చును

  భల - భల
  భల - భల
  భల - భల - గగ

ఇలా ప్రతి యతిస్థానం దగ్గరా విరచి వ్రాయటంతో ఒక సొగసు వస్తుంది. చదవటానికీ‌ చాలా బాగుంటుంది. కాని పద్యం దీర్ఘంగా  పన్నెండు లైనుల్లో వస్తుంది. కాని చదవటానికి బాగుంటుంది కదా.

స్వర్గీయ పండిత నేమాని సన్యాసి రావుగారు  వ్రాసిన మంగళమహాశ్రీ పద్యం చూడండి.

      మంగళము శ్రీరమణ! మండిత గుణాభరణ! మంగళము సప్తగిరివాసా! 
      మంగళము దేవవర! మంగళము చక్రధర! మంగళము దీనజనపోషా! 
      మంగళము వేదనుత! మంగళము భక్తహిత! మంగళము భవ్యవరదాతా! 
      మంగళము సాధుజన మానస విహారరత! మంగళము మంగళమహాశ్రీ!

ఈ మనోహరమైన పద్యాన్ని వారు  శంకరాభరణం బ్లాగులో ఒకటపాలో  వ్రాసారు.  ఇది పద్యం లక్షణాన్నీ నడకనూ చక్కగా పట్టి చూపుతూ ఉండటం కారణంగా దీన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. 

ఈ పద్యంలో ఒక విశేషం ఏమిటంటే అన్ని పాదాల్లోనూ ప్రథమాక్షరం 'మం' అలాగే అన్ని యతిస్థానాల్లోనూ దానికి మైత్రికి నిలిపిన అక్షరం కూడా 'మం'  అందుచేత యతిమైత్రి మహబాగా కుదురుతుంది. నిజానికి ఆ అన్నిచోట్లా ఉన్నది 'మంగళము' అన్న పదమే. ఎవరికైనా న్యాయంగా ఒక సందేహం రావాలి. అదేమిటండీ పద్యంలో ఒకేమాటను మళ్ళా రెండోసారి వాడితే 'పునరుక్తి' (మళ్ళా చెప్పటం) అనే పెద్దదోషం కదా నేమాని వారు అలా ఎలా అంత పునరుక్తిని ఎలా చేసారూ అని.  సమాధానం ఏమిటంటే భక్తి కవిత్వంలో మాత్రం పునరుక్తి దోషం లేదు అని.  ఈ మాట మరెవరికైనా ఉపయోగించ వచ్చునేమో అన్న అభిప్రాయంతో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను. మాట వరసకు  మధురాష్తకం  చూడండి.  ఆ మధురం అన్న మాట భలేగా తేపతేపకూ వస్తూనే ఉంటుంది. అది సాభిప్రాయమూ - ఆస్తోత్రానికి అందమూ కూడా. అలాగే ఈ పద్యానికి 'మంగళము' అన్న మాట సాభిప్రాయమూ అన్నది కూడా అందరమూ గ్రహించాలి.

అందమైన ప్రబంధం పారిజాతాపహరణంలో ఆఖరి పద్యం ఒక మంగళమహాశ్రీ. దాన్ని చూడండి.

     చిత్తజభి దంఘ్రియుగ చింతన కళాధిగత జిష్ణుసమ వైభవ విశేషా 
     విత్తరమ ణామరగవీ తరణిభూ జలద విశ్రుత కరాంబురుహ గోష్ఠీ
     నృత్త మణిరంగతల నీతిమనురాజనిభ నిర్భరదయారస పయోధీ 
     మత్తగజయూథ మదమగ్నసుఖితాళిరవ మాన్యగృహ మంగళమహాశ్రీ

చివరగా మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకట రత్నం పంతులు గారు వ్రాసిన మంగళమహాశ్రీ పద్యం ఒకటి.

     పాడి రటఁ దుంబురుఁడు పావనియు శ్యామలయు వాణియును రాణ దనరంగా 
     నాడి రొగి నుర్వశియు నాదటను రంభ శివుఁ డంతటను భృంగియు నెసంగన్ 
     గూడి రమరుల్ మునులు గుంపులుగ మానవుల కోటులన నెంత పువువానల్ 
     పోఁడిగను బెండ్లి యది భూదివులు మెచ్చఁగను బొల్పెసఁగె మంగళమహాశ్రీ 

ఆశ్వాసాంతంలో వ్రాసే మంగళమహాశ్రీల చివరన మంగళమహాశ్రీ అని మంగళానుశాసనం చేయంటం బ్రహ్మాండంగా ఉంటుంది కదా.

ఇక నేను పైన వ్రాసిన పద్యాన్ని ఆధునిక ధోరణిలో పాదవిభన చేసి వ్రాస్తే ఎలా వస్తుందో చూదాం.

          లోకమున నెల్లపుడు
          లోకులకు సాజములు
          లోపములు పాపములు నీవే
       
          మా కలిమి మా బలిమి
          మా తెలివి మా బ్రతుకు
          మా  జయము మా యపజయంబుల్
       
          మా కలలు నీ యెడల
          మాకు గల ప్రేమలును
          మా భయము లన్నిటిని రామా
       
          నీ కరుణతో నరసి
          నిర్భయత మాకొసగి
          నీ దరికి చేర్చుకొన వయ్యా


8 కామెంట్‌లు:

 1. మంగళ మహాశ్రీ వృత్తం కొద్దిగా ఇబ్బంది పెట్టేదే! దీని మీరు చాలా సునాయాసంగా ఛేదించారు, వందనాలు. ఇంతకు మించి నాకు ఆనందంలో మాతలు దొరకలేదు.
  మీదగ్గర విద్వత్తు ఉంది. దానిని బయటకు తీయాలన్నదే నా కోరిక. ప్రస్థుతం లో ఏమీ అడగదలచలేదు, కోర్క ఉందిగాని. శిఖరిణీ వృత్తం అడగాలనుకున్నా....:)
  నా బాల్య చాపల్యాన్ని మన్నించండి.
  మరొకమారు ఆనందః

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంగళమహాశ్రీ పద్యాన్ని అలాగే అంతపొడుగు పద్యంగానూ చూసే వాళ్ళకు కొంచెం భయం వేయవచ్చు - ఎలాగురా బాబూ దీనిని వ్రాయటం అని. నిజానికి దీన్ని పైన టపాలో చెప్పినట్లు ఖండికలుగా చేసుకొని పరిశీలిస్తే కొంచెం తక్కువశ్రమతో పని కానీయవచ్చును. కాని పాదానికో రెండుసార్లు యతివేయటం‌ అభ్యాసం తక్కువగా ఉన్నవారిని తప్పక ఇబ్బంది పెడుతుంది.

   సూర్యుడి కిరణాల ప్రకాశంలో వెయ్యోవంతు పట్టుకొని చంద్రుడు దానిని వెదజల్లుతూ పేరు తెచ్చుకుంటున్నట్లుగా రామానుగ్రహంతో ఆంధ్రపద్యప్రభలోని శతాంశాన్నో సహస్రాంశాన్నో గ్రహించగలిగినట్లు భావించి, నా కవిత్వం‌లాంటి దానితో నా చాపల్యంకొద్దీ‌ ప్రకటిస్తున్నాను. మీ బోటి పెద్దలు ఆనందపడటం కూడా రామానుగ్రహఫలమే‌ అనుకుంటున్నాను.

   ఇకపోతే మీరు అడిగీ‌అడుగనట్లుగా అడిగిన శిఖరిణి. అది చాల బాగుంటుంది. గంభీరమైన నడక గలది! తెలుగులో శిఖరిణీ వృత్తాలు అరుదనుకుంటాను. తప్పక ప్రయత్నిస్తాను.

   తొలగించండి
 2. మరో చిన్న మనవి ఈ టపాలో పద్యానికి అర్ధం చెప్పి పుణ్యం కట్టుకోండి :)
  శర్మ కాలక్షేపంకబుర్లు-నమో మన్మథాయ
  https://kastephale.wordpress.com/

  రిప్లయితొలగించండి
 3. మూడు పాదాల్లో రాస్తే నేటి హైకూ లకి దగ్గరగా ఉందనుకుంటా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంప్రదాయ కవిత్వాన్ని కూడా ఆధునిక ధోరణుల్లో వ్రాసేందుకు అవకాశం ఉందండీ. ఐతే సంప్రదాయకవిత్వాన్ని పండితప్రకాండులే తూకం వేసే పరిస్థితులు ఇంకా పూర్తిగా మారలేదు. కవులకు పాండిత్యం శోభస్కరం కాని, పండితులు సాధారణంగా కవులు కాదు. అందువలన కవిత్వాన్ని పండితుల అంచనాలకు వదిలెయ్యటం చాలా హాని చేసింది, ఇంకా చేస్తోంది. అదంతా పక్కన పెట్టి తెలుగుదనానికి పెద్దపీటవేసి ధారాశుధ్ధిగా రాస్తే మళ్ళా కవిత్వాని జనసామాన్యం దగ్గరకు చేర్చవచ్చునండి. హైకూల గురించే వేరే చెబుతాను,

   తొలగించండి
 4. నమస్తే.
  మూక పంచశతి ని తెలుగులోకి తర్జుమా చేస్తున్నాను.
  ఆర్యా శతకం కందపద్యలలోకి ఇమిడి పోతోంది.
  పాదారవింద శతకం శిఖరిణీ వృత్తంలో ఉంది. తెలుగులో శిఖరిణీ వృత్తంలో ఏవైనా పద్యాలు లబ్దప్రతిష్టులవి ఉంటె ఉటంకించ గలరు.దానిని బట్టి శిఖరిణీ వృత్తంలోకి అమర్చుకుంటా పాదారవింద శతకంను.
  భవదీయుడు
  రాళ్ళపల్లి సున్దర రామ శర్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిత్రులు సుందరరామ శర్మ గారూ,
   మీ ప్రయత్నం ముదావహంగా ఉంది. సంస్కృతంలోని ఆర్యావృత్తాలు కందానికి ఇంచుమించు సరిపోలుతాయి. కందంలోని దీర్ఘపాదాల్లో చివరి గురువును తీసివేస్తే అది ఆర్యావృత్తమే కాబట్టి మీరన్నట్లు అర్యావృత్తాలను కందాలుగా మార్చటం బాగుంటుంది. ఐతే సంస్కృతవిభక్తులు పదస్వరూపాన్ని మార్చుతాయి - తెలుగువిభక్తులు కొత్తపదాలను చేర్చుతాయి కాబట్టి మీకు అన్ని సందర్భాల్లోనూ కందం యొక్క నిడివి సరిపోకపోవచ్చునన్నది నా అనుమానం. శ్రీనాథుడి లాగా గమికర్మీకృత నైకనీవృతుడనై అన్నట్లుగా కాకుండా, తెలుగుదనానికి పెద్దపీటవేసే పక్షంలో కందం యొక్క నిడివి మీకు తరచుగా ఇబ్బంది పెట్టవచ్చును. ఒక్కొక్క శ్లోకానికి ఒకటికంటే ఎక్కువ కందాలు వ్రాయకూడదనుకున్న పక్షంలోనే ఈ ఇబ్బంది.

   ఇకపోతే శిఖరిణీ వృత్తం తెలుగులో ఎట్లా అన్న విషయం గురించి కొంచెం శోధించి వ్రాస్తాను రేపు.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.