25, నవంబర్ 2015, బుధవారం

సుకేసరవృత్తంలో రామస్తుతి.
      సుకేసర.
      విశదయశోనిధానుడగు వెన్ను డీధరన్
      దశరథ సూనుడై వెలసి ధర్మవీరుడై
      దశముఖ రాక్షసాధముని తాను జంపగా
      దిశలను రేగిమ్రోగినవి దేవదుందుభుల్
సుకేసర వృత్తం.

దీని గణాలు న - జ  - భ  - జ  - ర
చప్పున చంపకమాల గుర్తువస్తున్నదా? సంతోషం. రావలసిందేగా మరి!
చంపకమాలకు  గణాలు  న - జ - భ - జ - జ  - జ - ర  అనేవి. సుకేసరకేమో  న - జ  - భ  - జ  - ర. 
అంటే  చంపకమాల పాదంలోనుండి చివరి రెందు జ-గణాలనీ తీసివేస్తే సుకేసర వృత్తం వస్తుంది.
యతిస్థానం  (చంపకమాలకు లాగానే) 11వ అక్షరం. వృత్తం కాబట్టి ప్రాసనియమం తప్పనిసరి.

ఈ సుకేశర వృత్తానికే ప్రభద్రకం అని మరొక పేరు కూడా ఉన్నది.

నా కైతే యతివిషయంలో కొంత ఆసంతృప్తి ఉన్నది ఈ వృత్తం‌ నదకను చంపకమాలలాగా చూడకూదదు. అందుచేత పదవ అక్షరం యతిస్థానం అని చంపకమాలకు లాగా వేయటం సబబు కాదు.  ఈ వృత్తానిది వేరే నడక.

నడక ప్రకారం దీని గణ విభజన (నల) - (ర) - (న - హ) - (ర).  అందుచేత ఈ వృత్తానికి నిజంగా శోభించే యతిస్థానం 8వ అక్షరం అవుతోంది ఈ‌నడకకు.

నేను చూపిన నడక ప్రకారం చూస్తే  పై సుకేసర వృత్తం ఇలా ఉంటుంది.

    విశదయ - శోనిధా - నుడగు వెన్ను  - డీధరన్
    దశరథ  - సూనుడై  - వెలసి  ధర్మ - వీరుడై
    దశముఖ -  రాక్షసా  - ధముని  తాను -  జంపగా
    దిశలను - రేగిమ్రో  - గినవి దేవ - దుందుభుల్

ఈ సుకేసర వృత్తం నా దృష్టిలో ఐతే చాలా అందమైన వృత్తం.

8 కామెంట్‌లు:

 1. చిన్న పద్యం పోలికతో చెప్పేరు, బాగుంది.
  నన్ను మరచిపోయారు.:)

  రిప్లయితొలగించండి
 2. మళ్ళీ అమ్మవారు మిస్సింగ్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సింగ్ కాదండి. ఆవిడ బిజీగా ఉన్నట్లున్నారు. అప్పుడప్పుడు వస్తాంలే అన్నారండి. అఁయ్,

   తొలగించండి
 3. సమరము దాటి నిల్చిన నిశాచరాగ్రణుల్
  ప్రముద కపీంద్ర సంఘములు భక్తిమ్రొక్కగా
  నమరగణమ్ము కాంచ ముదమార జానకీ
  రమణి కరమ్ముఁ గైకొనెను రాఘవుండటన్.

  రిప్లయితొలగించండి
 4. సుకవిమిత్రులకు నమోవాకములు!

  మీరు రాస్తున్న చిట్టి వృత్తాలలో రామస్తుతి చాలా బాగున్నది. అభినందనలు.

  "సవరణ చేయఁగావలయు సక్రమమ్ముగన్"

  ఇకపోతే, చంపకమాలా వృత్తమందు గణములు: న జ భ జ జ జ ర
  సుకేసరవృత్తమునకై ఇందలి రెండు జగణాలను (జ జ) తీసివేయాలి.
  యతిస్థానం (చంపకమాలకు లాగానే) 11వ అక్షరం.

  నడక ప్రకారం దీని గణవిభజన: (నల)-(ర)-(న-హ) - (ర)

  సవరణలు చేయగలరు. అన్యథా భావింపవలదని మనవి. వినమ్రపూర్వక నమస్సులతో...
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నమస్కారం. చాలా పొరపాట్లు దొర్లాయి. మన్నించాలి. పద్యనిర్మితిలో మాత్రం సమానంగానే ఉన్నది. సమాచారంలోనే ఓవర్‌సైట్ బాగా వచ్చింది. మీరు చూపిన సవరణలు చేసాను.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.