18, నవంబర్ 2015, బుధవారం

మాలినీవృత్తంలో హితబోధ







          మాలిని.
          ధనము బడయ వచ్చున్
              ధారుణిం‌ బొంద వచ్చున్
          వనిత నరయ వచ్చున్
              వంశముం‌ బెంచ వచ్చున్
          తనివిని గొనవచ్చున్
              దానిచే నేమి వచ్చున్
          వినుము కొనుము ముక్తిన్
              వేడుకన్ రామభక్తిన్
          
          


మాలిని

సంప్రదాయం ప్రకారం దీని గణవిభజన న - న - మ  - య  - య.  నడక చూస్తే న-న-గగ  ర-ర-గ అన్న ట్లుంటుంది.  

భాసుని కాలమునుంచీ మాలినీవృత్తము వాడకంలో ఉంది.

పాదం ఎనిమిది అక్షరాలకు విరుగుతుంది.  మాలినికి సామాన్యముగా అర్ధపాదములకు అంత్యప్రాస ఉంచుతారు. అంటే ఏ‌ పాదాన్నైనా యతిస్థానం దగ్గర రెండు ముక్కలుగా చేస్తే ఆ రెండు భాగాలకూ అంత్యప్రాస ఉండాలన్న మాట. ఆన్ని పాదాలకూ ఒకే అంత్యప్రాస అవసరం కాదు. ఏ పాదానికి అ పాదంలోని భాగాల మధ్యనే అంత్య ప్రాస కూర్చవచ్చును. నేను ఇక్కడ చెప్పిన పద్యంలో నాలుగవ పాదానికి అంత్యప్రాస వేరేగా ఉంది చూడండి.


శివమానసపూజ, శివాపరాధక్షమాపణ స్తోత్రము, శివానందలహరి, త్రిపురసుందరీమానసపూజా స్తోత్రములలో మాలిని మనకు కనబడుతుంది.

శివమానసపూజ నుండి ఒక ఉదాహరణ చూదాం.

   కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా 
   శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్
   విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
   శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభోః

బమ్మెర పోతన్నగారి శ్రీమదాంధ్రమహాబాగవతం నుండి మరొకటి చూదాం:

  ధరణిదుహితృరంతా ధర్మమార్గానుగంతా
  నిరుపమనయవంతా నిర్జరారాతిహంతా
  గురుబుధసుఖకర్తా కోసలక్షోణిభర్తా
  సురభయపరిహర్తా సూరిచేతోవిహర్తా

ఇలా మెత్తం ప్రతిస్కందాంతంలోనూ ఒక్కొక్క మాలిని ఉంది తెలుగుభాగవతంలో.

ఈ మాలినీవృత్తానికి ఉన్న అనుప్రాసనియమం కారణంగా, ఒక చిక్కు ఉంది. అదేమిటంటే ఏదైనా కథను నడిపించటానికి అనుప్రాసలతో కూడిన ఇలాంటిపద్యాలను వ్రాస్తూ కూర్చోవటం‌ కష్టం. గమ్మున కథాకథనానికి సందర్భోచితం కూడా ఐన మాటలను అనుప్రాసలతో ఉన్నవి పట్టుకొని వాటితో ఇలాంటి పద్యం అల్లటం కించిత్తు శ్రమతో కూడినదే. ఏదైనా వర్ణనలు వగైరా అవసరం ఐన చోట వాడటానికి ఉపయోగించవచ్చును. కాని మనకవులు ఈ పద్యాన్ని అశ్వాసాంతంలో వాడే పద్యాల లిష్టులో వేసేసారు.

అందుకే దీన్ని ప్రత్యేకంగా వ్రాయటమే కాని కావ్యంలో విస్తారంగా వాడటం ఉండదు.

స్వర్గీయ పండిత నేమాని సన్యాసిరావుగారి పద్యం  శంకరాభరణం టపాలో

    జయము జయము రామా! సర్వలోకాభిరామా!
    జయము జయము శ్యామా! శాశ్వతానందధామా!
    జయము జయము శౌరీ! సాధు చేతో విహారీ!
    జయము జయము నేతా! సర్వ సౌఖ్యప్రదాతా! 


6 కామెంట్‌లు:

  1. పరమానందం! బ్రహ్మానందం!!
    రత్నం సానపెడితే ప్రకాశిస్తుంది.
    మరో చిన్న మనవి
    చనువిస్తే చంకనెక్కి కూచునాడనుకోకపోతే
    మానినీ వృత్తం చెప్పండి.

    రిప్లయితొలగించండి
  2. కనుల ముందు కనిపించు ధనము, ధారుణి, వైభవాంగనల్, వంశ వృక్షమున్ మరిచి కనిపించని ఉందో లేదో తెలియని ముక్తి కై తపించు మానవులు ఏమి 'బోడులు ' !

    (జిలేబి పరార్!)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పరారైనవారికి ఎలా చెప్పేదీ? ఎంతగా అరచి చెప్పినా వినబడదు కదా, ఐనా శంకరభగవత్పాదులవారు శివానందలహరిలో బోలెడు చోట్ల తాను పామరుణ్ణనీ తన మనసు కోతీ అనే ధోరణిలో చెప్పింది -మనబోటిగాళ్ళం ఊరుకోమని - తనమీద నెపం వేసుకొని చెప్పటమే కాని వారికి తాము శివస్వరూపులమని తెలియకనా ఏమి? అలాగే మనలాంటి పామరుల సందేహాన్ని ఊహించుకొని జిలేబీగారు తన మీద నెపం పెట్టుకొని అడిగి చక్కాపోయారన్నమాట. బాగుంది.

      ఐతే వినండి. నామమూ రూపమూ అనే రెండు లక్షణాలనూ ప్రదర్శించేది అంతా ప్రకృతి. ప్రకృతిలో దేనికీ స్థిరత్వమూ లేదు, నిత్యత్వమూ లేదు. అన్నీ వచ్చి పోయేవే అన్నది దాని నియమం. శరీరాలు వచ్చిపోయేవి. శరీరధారి యైన వాడు తానే శరీరాన్ననుకుంటాడు - దానినే అవిద్య అంటాం. అలా ఉన్నందు వలననే సుఖదుఃఖాల రూపంలో అనుభవాలను శరీరంద్వారా అనుభవించటం కాని నిజంగా ఆ సుఖమూ లేదు దుఃఖమూ లేదు. ఇవి ఉన్నాయనుకోవటమే మనస్సు లక్షణం - అందుకే మన ఏమ మనుష్యాణాం కారణం‌ బంధ మోక్షయోః అన్నారు. ఆ మనస్సు లయం ఐపోయిన నాడే నిజస్థితి తెలిసి జీవుడు అసలైన ఆనందం పొందుతాడు. ముక్తి అనేది తన నిజమైన తత్త్వమే‌ కాని అది వేరే ఎక్కడినుండో రావటం లేదని తెలుసుకుంటాడు. ఆ తనదే ఐన ముక్తస్వరూపాన్ని అవబోధనం చేసుకోవటానికి సులభోపాయం రామనామాన్ని ఆశ్రయించి మనస్సును ఇంద్రియబంధనాలనుండి మరలించటం. వేరువిధంగా అది సాధ్యం కాదు. నామస్మరణా దన్యోపాయం నహిపశ్యామో భవతరణే అని అందుకే పెద్దలు చెప్పటం.

      తొలగించండి
    2. చిన్న పిల్లవాణ్ణి గిల్లి ఏడిస్తే చూసి నవ్వే అమ్మలాటివారు జిలేబి :)

      చిన్న అనుమానం దృతం తీసేస్తే పద్యం నడక సాఫీగా ఉంటుందేమో!

      తొలగించండి
    3. పాదానికి రెండేసి సార్లు పడిన దృతం, ఛందస్సులో భాగంగా కూర్చుందండీ. తీసి వేయటం కుదరదు. 'నిగమవినుత కీర్తీ నిర్మలానంద మూర్తీ' అన్నట్లుగా వేరే రకంగా దీర్ఘాలు వేసుకుంటూ ఐనా మాలినీవృత్తం వ్రాయక తీరదు - అనుప్రాసలనే సంప్రదాయం ఉందిగా ఈ వృత్తానికి!

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.