30, నవంబర్ 2015, సోమవారం

రాముడి గురించి వ్రాస్తూనే ఉంటాను.




 ఉ. రాముడు నాకు సర్వమగు రాముడు నాకు గురుండు దైవమున్
 రాముడు నాకు స్నేహితుడు రాముడు నాకు విశిష్టబంధువున్
 రాముడు నాదు చిత్తమున రాజిలు తేజము గాన నేను నా
 రాముని గూర్చి పల్కుదు విరామ మెఱుంగక సంతసంబునన్



ఈ పద్యాన్ని హరిబాబు గారి బ్లాగులో ఒక వ్యాఖ్యలో వ్రాసాను. ఆసక్తి కలవారు ఆ జూలై 29నాటి ఆ వ్యాఖ్యని పరిశీలించగలరు.



శ్రీరామ సింహరేఖ





        సింహరేఖ.       
        రూపమా వినీలమేఘం
        చాపమా కృతాంతదండం
        చూపులో కృపాప్రవాహం
        తాపహారి రామతత్వం
        



సింహరేఖ

ఇది భలే పొట్టివృత్తం. దీనికి గణాలు ర - జ - గగ. అంటే‌పాదానికి 8అక్షరాలే అన్నమాట. అల్పపాదప్రమాణం కల వృత్తాల్లో యతిస్థానం ఉండదు కాబట్టి ఈ వృత్తానికి యతినియమం లేదు. వృత్తం కాబట్టి ప్రాసనియమం మాత్రం తప్పకుండా పాటించాలి.

గురుఘు ప్రస్తారంచేస్తే (U I U) (I U I) (U U ). దీనినే‌ మరొక రకంగా  చూస్తే    (U I) (U I) (U I) (U U ). అంటే  మూడు 'హ' గణాల మీద 'గగ' అన్నమాట.   ఇలా ఉండటంలో ఒక చమత్కారం ఉంది. వీలైతే‌ త్రిస్రగతిలో కూడా బండి నడిపించవచ్చును!

శ్రీ చింతారామకృష్ణారావుగారి ఆంధ్రామృతం  బ్లాగులో ఒకచోట దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన సింహరేఖావృత్తం ఒకటి కనిపిస్తోంది.

      రామ రామా రామ రారా
      రామ రా మా రామ రారా
      రామ రా గారామ రారా
      రామ రా శ్రీ రామ రారా.

ఇందులో‌ పద్యాన్ని మొత్తంగా కొద్ది అక్షరాలతో నిర్మించటం‌ ఒక సంగతి ఐతే అది గోమూత్రికా బంధం అనే చిత్రకవిత కావటం‌ మరొక విశేషం. మీకు ఆసక్తి ఉంటే, పైన చెప్పిన కవిగారి పద్యం‌ ఉన్న లింకుకు వెళ్ళి ఆ గోమూత్రికా బంధం కథా కమామిషూ ఏమిటో‌ ఒకసారి చూడవచ్చును.

ఇంక నేను పైన చెప్పిన పద్యం విషయం.  చిన్నపద్యంలో‌ రాముడి మూర్తిని సాక్షాత్కరింప జేసుకోవటానికి ప్రయత్నం. ఎంతవరకూ‌ ఫలించిందో చదువరులే చెప్పాలి మరి. సంస్కృతపదాలు దండిగానే ఉన్నా సాధారణంగా అవన్నీ అందరికీ సుపరిచితమైన పదాలే‌ కావటం వలన ఈ‌ పద్యం సుబోధకంగానే ఉంటుందని అనుకుంటున్నాను.

ఇలాంటి చిట్టిపొట్టి పద్యాలను సులువుగానే సాధన చేయవచ్చునేమో వీలైతే మీరూ‌ ప్రయత్నించండి.



29, నవంబర్ 2015, ఆదివారం

రామాయణ పాదపం





        పాదపము.
        వారినిధిల్ పొడిబారెడు దాకన్
        తారలు నింగికి తప్పెడు దాకన్
        వారిజమిత్రుని పంచత దాకన్
        ధారుణి రామకథామృత ముండున్





పాదపం.

ఈ పాదపం అనేది మరొక పొట్టి వృత్తం. దీనికి గణాలు భ - భ - భ - గగ అనేవి. యతిస్థానం 7వ అక్షరం.
ప్రబంధసాహిత్యంలో పింగళిసూరనగారి కళాపూర్ణోదయం నాలుగవ ఆశ్వాసం చివరి ఆశ్వాసాంత పద్యం చూడండి.

      మాన సుయోధన మంగళ నిత్యా
      నూన యశోధన యుజ్వల కృత్యా
      దాన సుబోధన ధర్మద కృత్యా
      దీన మహాధన దీపిత సత్యా

ఎమెస్కోవారిప్రతిలో పై పద్యాన్ని పొరపాటున తోటకము అని పేర్కొనటం జరిగింది. కాని పాదపవృత్తానికీ తోటకమనే పేరు కూడా ఉందని తెలుస్తోంది.

ఈ‌ పాదపవృత్తానికి  దోదక, తోధక , తోదక , తోటక , దోధక , తరంగక , బందు , భిత్తక అనే నామాలు కూడా ఉన్నాయట! ఒక్క వృత్తానికి ఎన్ని పేర్లో, అందులోనూ తోటక వంటి వేరే లక్షణాలు కల వృత్తాలపేర్లూ కలుపుకోవటం. అంతా నానా కంగాళీగా ఉంది వృత్త నామాల పరిస్థితి చూస్తే.

ఆధునికులు శ్రీ నేమాని సన్యాసి రావు గారి పాదపవృత్తం శంకరాభరణం బ్లాగు ప్రత్యేకవృత్తాలు-3  టపా నుండి క్రింద చూపుతున్నాను.

      శ్రీరఘునందన! చిన్మయ! రామా!
      మారుతి సేవిత! మంగళధామా!
      వీరవరేణ్య! త్రివిక్రమ! రామా!
      క్ష్మారమణా! పర గర్వ విరామా!

ఈ పాదపవృత్తంలో వ్రాసిన పై పద్యాలలో అంత్యానుప్రాసను కూర్చటం గమనించండి.

నేను ఇక్కడ వ్రాసిన పద్యాన్ని పోలిన పద్యం ప్రాచీనమైనది ఒకటి ఉంది.

     యావత్తోయధరా ధరా ధర ధరాధారాధర శ్రీధరా
     యావచ్చారుచచారుచారుచమరం చామీకరం చామరమ్
     యావద్రావణరామ రామరమణం రామాయణం శ్రూయతే
     తావద్భో భువి భోగభోగ భువనం భోగాయ భూయాద్విభో

కొంచెం పలుగురాళ్ళ పాకంలో ఉన్న ఈ పద్యం హనుమంతులవారు వ్రాసారని ప్రతీతి కల హనుమద్రామాయణం లోనిదట. ఆసక్తి కలవారు అర్థతాత్పర్యాలతో సహా ఈ పద్యం గురించి  శంకరాభరణం - చమత్కార పద్యాలు - 144 టపా ద్వారా తెలుసుకోవచ్చును.

సరే ప్రస్తుతం‌ ఈ‌ పాదపం‌ నడక దగ్గరకు వద్దాం. దీని నడక గణానువర్తిగా కనిపిస్తోంది. యతిస్థానం దగ్గర విరామం. ఇతరత్రా గణాంతాల్లో కించిల్లఘువిరామంగా చతురస్రగతిలో దీని నడక పొడచూపుతున్నది.

        వారిని - ధుల్పొడి - బారెడు - దాకన్
        తారలు -  నింగికి - తప్పెడు - దాకన్
        వారిజ - మిత్రుని - పంచత - దాకన్
        ధారుణి - రామక - థామృత - ముండున్

ఆసక్తి కలవారు ఈ‌ పాదపాలను కూడ సులభంగా సాధించవచ్చును. వీలైతే ప్రయత్నించండి.

28, నవంబర్ 2015, శనివారం

శిఖరిణీ వృత్తంలో విన్నపం








      శిఖరిణి.
      ధనాశం భూలోకంబున శుభదమౌ ధర్మము నెడన్
      మనుష్యు ల్నిత్యంబున్ విముఖులగుచున్ మానక సదా
      ఘనంబుల్పాపంబుల్ సలుపుదురయా కావగదవే
      మనశ్చాంచల్యంబుల్ రఘుపతి వెసన్ మాన్పి కృపతో
 







ఈ శిఖరిణవృత్తం కొంచెం‌గడ్డు ద్యమే అని చెప్పాలి. దీనిలో  గురువులూ లఘువులూ గుంపులుగా వచ్చేస్తాయి మరి. ఈ వృత్తం‌గణవిభజన  య - మ - న - స - భ - వ  అని. అంటే మొత్తం 17 అక్షరాలు.  యతిస్థానం 13వ అక్షరం. ఈ శిఖరిణీవృత్తంలో పాదానికి గురులఘువుల అమరిక ఇలా ఉంటుంది:

    I U U   U U U   I I I   I I U   U I I   I U
        య      మ       న       స       భ     వ

చూసారా? ఈ వృత్తంలో మొదట్లోనే ఐదుగురువులు వరసగా వస్తాయి. ఆ కష్టం చాల దన్నట్లు అ వెంటనే వరసపెట్టి ఐదు లఘువులు వస్తాయి. 

సంస్కృతంలో ఐతే ఈ వృత్తంలో బండి లాగించెయ్యవచ్చునూ అనటానికి శంకరాచార్యులవారే సాక్షి. వారి అమోఘమూ అద్వితీయమూ ఐన సౌందర్యలహరీస్తోత్రం పూర్తిగా శిఖరిణీవృత్తాల్లోనే‌ ఉంది. 

తెలుగులో‌ మాత్రం శిఖరిణీ స్తోత్రం వ్రాయటం కత్తిమీదసాము అనే చెప్పాలి.

అందుకనే తెలుగు కవులుశిఖరిణీ‌వృత్తాన్ని ఆదరించినట్లు కనిపించటం లేదు. 

పండిత నేమాని సన్యాసిరావుగారి అధ్యాత్మ రామాయణము గ్రంథంలో నుండి ఒక శిఖరిణి

నమస్తే సోమాయ త్రిభువన శరణ్యాయచ నమో
నమస్తే రుద్రాయ త్రిదశనుత విజ్ఞాన నిధయే
నమస్తే శర్వాయ ప్రమథ గణ వంద్యాయచ నమో
నమస్తే తామ్రాయ శ్రిత భవ భయఘ్నాయచ నమః

ఐతే తెలుగు గ్రంథంలోని ఒక సంస్కృతవృత్తమే‌ కాని ఇది తెలుగుపద్యం కాదు.  యతిప్రాసలను పాటించి తెలుగుపద్యం అనిపించుకోవటమే ఇక్కడ జరిగింది.

ప్రబంధకవులెవరైనా శిఖరిణీవృత్తాన్ని వాడారా అన్నది అనుమానమే.

ధునికకాలంలో ఈ శిఖరిణీ వృత్తాన్ని గురించిన చిన్న ప్రయత్నం ఒకటి శంకరాభరణం బ్లాగులో జరిగింది. దాని వివరాలు ఇక్కడ ఇక్కడ చూడవచ్చును. అ ప్రయత్నంలో భాగంగా శ్రీశంకరయ్యగారి శిఖరిణీ వృత్తాన్ని ఎత్తి చూపుతున్నాను:

     పురారాతీ! శూలీ! మునిజననుతా! మోక్షఫలదా!
     స్మరద్వేషీ! భర్గా! శశిధర! హరా! మాధవసఖా!
     సురూపా! సర్వజ్ఞా! సుబల! శుభదా! శోకదహనా!
     పరాకేలా? స్వామీ! పతితుఁడను, కాపాడుము శివా!  


ఈ ప్రయత్నంలో శంకరయ్యగారు సఫలీకృతులనే చెప్పాలి.  సంబోధనాప్రథమా విభక్తి ద్వారా వచ్చిన దీర్ఘాక్షరాలు బాగానే సహాయ పడటాన్ని మనం గమనించవచ్చును. ఇంకెవరన్నా శిఖరిణీ వృత్తాలుప్రయత్నించారేమో తెలియదు.


 

27, నవంబర్ 2015, శుక్రవారం

రావణవధకు స్వాగతం





         స్వాగతం. 
         ధీవరుండు నిజ తేజ మెసంగన్   
         దేవదుందుభుల దిక్కులు మ్రోయన్
         దేవసంఘములు తీయగ పాడన్ 
         రావణాసురుని రాము డడంచెన్       




ఈ స్వాగతం అనే వృత్తానికి పాదానికి నాలుగే గణాలు. అవి ర - న - భ - గగ.  గురులఘుక్రమం UIUIIIUIIUU యత్తిస్థానం 7వ అక్షరం. పాదానికి కేవలం 11 అక్షరాలతో ఇది కూడా ఒక చిట్టిపొట్టి వృత్తం అన్నమాట.

ఈ స్వాగతవృత్తానికి ముందు మరొక గురువును చేర్చితే అది నీరాంతికం (UUIUIIIUIIUU)  అవుతుంది. గురువుకు బదులుగా రెండు లఘువులను చేర్చితే అది కలహంస (IIUIUIIIUIIUU) అవుతుంది. సౌలభ్యంకోసం క్రీగీటులతో వీటిలోని స్వాగతాన్ని సూచింవాను.

ఈ వృత్తానికి పాదాంతంలో అనుప్రాసను కూర్చటం కూడా మనం చూడవచ్చును.

పింగళి సూరనగారి కళాపూర్ణోదయం ప్రబంధంలో తృతీయాశ్వాసం చివరన ఒక స్వాగతం ఇలా ఉంది:

      నిర్విరామ ధరణీ భర ణాంకా
      గర్వితారి జయకర్మ విశాంకా
      సర్వదిక్చర విశంకట కీర్తీ
      శర్వరీ రమణ సన్నిభ మూర్తీ

ఇక్కడి అంత్యానుప్రాసలను గమనించండి.

శ్రీ నేమాని సన్యాసిరావుగారి స్వాగత వృత్తం చూడండి:

     మౌనివర్య! జనమాన్య చరిత్రా!
     జ్ఞానసారనిధి! స్వాగతమయ్యా!
     మాననీయ గుణ! మంగళదాతా!
     పూని నీ పదము మ్రొక్కెద స్వామీ!

ఈ వృత్తంలో అంత్యానుప్రాసను పాటించలేదు నేమానివారు.

గమనిక:  ఈ టపాశీర్షికను అపార్థం చేసుకోకండి. అందులో ఉన్న "స్వాగతం" అనే పదం ఈ వృత్తం పేరును సూచించేది మాత్రమే. ఇంత చిన్న చిన్న విషయం చెప్పాలా ప్రత్యేకంగా అనకండి. ఈ  మాటను పట్టుకొని ఆవేశపడ్డ వారి అనుచిత స్పందననూ (వేరే చోట) గమనించాకే ఈ గమనికను ఈ టపా క్రింద చేర్చటమైనది.



26, నవంబర్ 2015, గురువారం

లలితమైన రామస్తుతి





 
        లలిత.           

        శ్రీరామంద్రును చిత్తంకిత
        శ్రీరామామున జిహ్వ ావ
        శ్రీరామింతు క్షేమ
        శ్రీరామచంద్రును సేవోక్ష
       







ఈ‌ లలిత వృత్తం కూడా పొట్టి వృత్తమే. పాదానికి నాలుగు గణాలు త - భ - జ - ర అనేవి. యతిస్థానం 8వ అక్షరం. ప్రాసనియమం ఉంది వృత్తం కాబట్టి.

ఈ పద్యలక్షణం‌ లక్షణసారసంగ్రహం అనే గ్రంథంలో చెప్పబడిది.

ఇంతకు ముందు ఈ‌లలిత వృత్త ఛందస్సులో కవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు. 

ాకు అనుపింినిత ృత్తు న ఇలా ఉంది:

     శ్రీరామ - చంద్రునకు - చిత్త మంకితం
     శ్రీరామ - నామమున - జిహ్వ పావనం
     శ్రీరామ - చింతనము - క్షేమదం శుభం
     శ్రీరామ - చంద్రునకు - సేవ మోక్షదం  

ఇటువంటి చిన్నిచిన్న ృత్తాలీరు కూడా ప్రత్నించండి. బాగుంాయి.
 


  

25, నవంబర్ 2015, బుధవారం

సుకేసరవృత్తంలో రామస్తుతి.








      సుకేసర.
      విశదయశోనిధానుడగు వెన్ను డీధరన్
      దశరథ సూనుడై వెలసి ధర్మవీరుడై
      దశముఖ రాక్షసాధముని తాను జంపగా
      దిశలను రేగిమ్రోగినవి దేవదుందుభుల్








సుకేసర వృత్తం.

దీని గణాలు న - జ  - భ  - జ  - ర
చప్పున చంపకమాల గుర్తువస్తున్నదా? సంతోషం. రావలసిందేగా మరి!
చంపకమాలకు  గణాలు  న - జ - భ - జ - జ  - జ - ర  అనేవి. సుకేసరకేమో  న - జ  - భ  - జ  - ర. 
అంటే  చంపకమాల పాదంలోనుండి చివరి రెందు జ-గణాలనీ తీసివేస్తే సుకేసర వృత్తం వస్తుంది.
యతిస్థానం  (చంపకమాలకు లాగానే) 11వ అక్షరం. వృత్తం కాబట్టి ప్రాసనియమం తప్పనిసరి.

ఈ సుకేశర వృత్తానికే ప్రభద్రకం అని మరొక పేరు కూడా ఉన్నది.

నా కైతే యతివిషయంలో కొంత ఆసంతృప్తి ఉన్నది ఈ వృత్తం‌ నదకను చంపకమాలలాగా చూడకూదదు. అందుచేత పదవ అక్షరం యతిస్థానం అని చంపకమాలకు లాగా వేయటం సబబు కాదు.  ఈ వృత్తానిది వేరే నడక.

నడక ప్రకారం దీని గణ విభజన (నల) - (ర) - (న - హ) - (ర).  అందుచేత ఈ వృత్తానికి నిజంగా శోభించే యతిస్థానం 8వ అక్షరం అవుతోంది ఈ‌నడకకు.

నేను చూపిన నడక ప్రకారం చూస్తే  పై సుకేసర వృత్తం ఇలా ఉంటుంది.

    విశదయ - శోనిధా - నుడగు వెన్ను  - డీధరన్
    దశరథ  - సూనుడై  - వెలసి  ధర్మ - వీరుడై
    దశముఖ -  రాక్షసా  - ధముని  తాను -  జంపగా
    దిశలను - రేగిమ్రో  - గినవి దేవ - దుందుభుల్

ఈ సుకేసర వృత్తం నా దృష్టిలో ఐతే చాలా అందమైన వృత్తం.

24, నవంబర్ 2015, మంగళవారం

సత్యనారాయణ వ్రతం సంగతులు

సత్యనారాయణ వ్రతం.

ఈ రోజు సత్యనారాయణవ్రతం గురించి ఒక టపా క్రింద ఒక వ్యాఖ్యను ఉంచాను.

తిరిగే కాలూ తిట్టే నోరూ ఊరుకోవన్నారు కదా. ఆట్టే ప్రమాదం లేదనుకున్న చోటో,  ఈ మాట చెప్పటం వలన ఆవలి వారికి ఉపయోగం ఉందను కున్నప్పుడో ఒక ముక్క వ్రాస్తూ ఉంటాను.  తరచుగా, లేని ప్రమాదం కొని తెచ్చుకున్నట్లు అవుతూ ఉంటుంది -ఎవరెవరో ఏవేవో అంటే పడవలసి రావటం వలన. ఎవరికో ఉపయోగం ఉండవచ్చునూ అనుకొని చెప్పిన ముక్కబుట్టదాఖలా అవుతూ ఉంటుంది. మధ్యలో ఎవరెవరో వచ్చి ఏమేమో మాట్లాడతారు. ఎలాగూ‌ మన మాటకు ఆట్టే విలువా ఉండదు. అలాంటప్పుడు ఊరుకోవచ్చును కదా అంటారా. అంతే నండీ అనకుండా ఉండలేం‌ పడకుండా బయట పడలేం అన్నమాట. అదంతా ఇప్పుడు అవసరం లేదు లెండి వ్రతం గురించిన వ్యాఖ్యకు చీవాట్లు ఏమీ రాలేదు.  ఈ‌రోజున చాలా అదృష్టవంతుణ్ణన్నమాట.

మా నాన్నగారికి సత్యనారాయణ వ్రతం అంటే ఇష్టంగా ఉండేది.  చాలా భక్తిశ్రధ్ధలతో చేసేవారు.  అందరిళ్ళలో లాగే మాయింట్లో కూడా మొదట్లో పురోహితులవారు వచ్చి చేయించటం జరిగేదని గుర్తు.  కాని మా నాన్నగారు పురోహితుడి అవసరం లేకుండా స్వయంగా చేసుకోవటం మొదలు పెట్టారు. మొదట్లో కారణం నాకు తెలియదు. నిజానికి  ఈ విషయమై నేను మా నాన్నగారిని ప్రశ్నించటం కూడా ఎన్నడూ జరుగలేదు.

కొత్తపేటలో మేము గర్ల్స్ హైస్కూల్ ఎదురుగా ఉన్న తాడిగడప రాఘవరావుగారి యింటిలో అద్దెకు ఉండే వారము. దగ్గరలోనే గోటేటి నరసింహమూర్తిగారనే ఒక సౌమ్యమూర్తి మా నాన్నగారి స్నేహితులు ఒకాయన స్వంతయిల్లు కట్టుకొని నివాసం ఉండేవారు. నరసింహమూర్తిగారూ మానాన్నగారూ ఇద్దరూ ఉపాధ్యాయవృత్తిలో ఉండటమే కాదు స్నేహకారణం. ఇద్దరూ చిన్నతనంలో కలసి చదువుకున్నారు కూడా. ఈ సందర్భంలో మరొకాయన గురించి ప్రస్తావించాలి. మా నాన్నగారితో కలసి చదువుకున్న స్నేహితులు కందుకూరి భాస్కరరావుగారు కూడా మా యింటికి దగ్గరలోనే ఉండే వారు. ఆయనదీ స్వంతయిల్లే. గోటేటివారి పిల్లలు మాకు స్నేహితులూ పాఠశాలలో సహాధ్యాయులూ. కందుకూరివారి అబ్బాయి,  నా క్లాస్‍మేట్ వీర వేంకట సత్యనారాయణ నాకు చాలా మంచి స్నేహితుడు కూడా.  కార్తీకమాసం వచ్చిందంటే కందుకూరివారు నాకు మనస్సులోనికి వస్తారు.  శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారిగుడిలోని శివాలయంలో కందుకూరివారు ప్రతియేటా లక్షపత్రిపూజ నిర్వహించేవారు. ఆనాడు పూజ తరువాత వారింట్లో తప్పక లక్షపత్రిపూజా సమారాధన జరుగుతుంది. గోటేటి వారు సత్యనారాయణ వ్రతం చేసేవారు కార్తీకమాసంలో. కొత్తపేటలో చాలా మంది కార్తీకమాసంలో సత్యనారాయణ వ్రతాలు చేసే వారు. పున్నమి నాడు మరీ జోరుగా.

ఒకసారి ఒక తమాషా జరిగిందట.  ఈ సంగతి నాకు అది జరిగిన చాలా కాలం తరువాత మా అమ్మగారు నాతో ఏదో మాటల సందర్భంలో ప్రసావించారు. గోటేటివారింట్లో జరిగిన ఒక కార్తీకపౌర్ణమీ సత్యనారాయణ వ్రతం సంగతి. వ్రతం సాయంకాలం జరిగింది. ఉదయం నుండీ కుటుంబంలో అందరూ ఉపవాసం  చేసి వ్రతం నిష్ఠగా చేసుకున్నారు.  వ్రతం చేయించే పురోహితులవారు కూడా ఉపవాసం ఉన్నారు కాబట్టి ఆయనకూ నీరసంగానే ఉందట. మధ్యలో ఆయన పాలు కాఫీలు సేవించి కొంత సేదదీరారు. ఇలా వ్రతం బాగా చేసుకున్న ఒకటి రెండు రోజుల తరువాత ఒక విషయం తెలిసి అందరూ విస్తుపోవటమూ బాధపడటమూ జరిగింది. నిజానికి వ్రతం చేయించిన పురోహితుడు ఉపవాసం ఏమీ చేయలేదు. మధ్యాహ్నమే ఆ ఊళ్ళోనే ఒకరి ఇంట్లో తద్దినం పెట్టించి భోక్తగాకూడా కూర్చొని హాయిగా బొజ్జనిండా తిని వచ్చాడట.  పైగా ఉపవాసం అని ఆపసోపాలు నటన అన్న మాట! ఇది తెలిసి చాలా బాధపడ్దారట మా నాన్నగారు కూడా - అయ్యో ఇలాగు చేసాడేమిటీ ఆయన అని. ఏమాట కామాట చెప్పుకోవాలి. ఆ పురోహితులవారి అన్నగారు చాలాపేరున్న నిష్ఠాగరిష్ఠుడైన సద్బ్రాహ్మణుడు - గజారోహణం చేసి సువర్ణకంకణం తొడిగించుకొన్న మహా వేదవేత్త. బాగా పేరున్న  ఘనాపాఠి. ఆయన తమ్ముడేమో ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అన్నట్లు ఘనాపాఠిగారి కుమారుడు  లక్ష్మీనారాయణ నాకు స్నేహితుడే. అతడిని తండ్రిగారు వైదికవృత్తిలోనికి తీసుకొని రాలేదు. ఆధునిక విద్యను బేర్పించారు. ఈ లక్ష్మీనారాయణ మంచివాడే కాని కొంచెం చిలిపి కుఱ్ఱవాడు లెండి. అది వేరే సంగతి.

ఈ తమాషాగురించి చెప్పి మా అమ్మగారు మరొక మాట చెప్పారు.  ఇలాంటి సంఘటన ఒకటి ఒకప్పుడు మాయింట్లో కూడా జరగటంతో మా నాన్నగారికి మనస్తాపం కలిగి అప్పటినుండి ఎవరినీ వ్రతం చేయించటానికి పిలిచేది లేదూ లక్షణంగా నేనే చేసుకుంటాను స్వయంగా అని ప్రకటించటమూ, ఊరికే అప్పుడు కొంచెం ఆవేదనతో ఆ మాట అనటం కాదు, నిజంగానే అప్పటినుండీ సత్యనారాయణవ్రతాన్ని స్వయంగా తానే చేసుకోవటం చేస్తూ వస్తున్నారట. ఇంతకీ మా యింట్లో జరిగిన సంగతి ఏమిటంటే పునఃపూజ చేయకుండానే పురోహితులు వ్రతాన్ని సమాప్తం చేసి ఉద్వాసన మంత్రాలు చదివేసి కలశం ఎత్తేశారట. అందుకే మా నాన్నగారు బాగా నొచ్చుకున్నది.

ఇలా ఇదంతా వ్రాసానని నాకు పురోహితులపైన కాని పురోహితవృత్తిపైన కాని చులకన భావం ఉందని దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకండి. నిజానికి పురోహితుల అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది. వారిని సమాజం వినిమయవస్తువుల్లాగా చూసి చులకన చేయటమే కాని తగినంత గౌరవం ఇవ్వటం లేదన్నది బాధాకరమైన సత్యం.  ఈ పరిస్థితి నన్నయ్యగారి కాలానికే ఉందని అనిపిస్తుంది. శ్రీమదాంధ్రమహాభారతం ఆదిపర్వంలో అమృతాపహరణోపాఖ్యానంలో గరుత్మంతుడి దెబ్బకు దేవతలు పలాయనం చిత్తగించటాన్ని వర్ణిస్తూ ఆదికవి నన్నయ గారు ఒక మాట అన్నారు "వసువులు వసుహీన విప్రుల క్రియ పరిగి దక్షిణాశ్రితులైరి" అని. అంటే డబ్బులేని బ్రాహ్మణులు దక్షిణకోసం పరుగులు పెట్టినట్లుగా అష్టవసువులు దక్షిణ దిక్కుకు పారిపోయారట. 

వర్ణాశ్రమధర్మం బ్రాహ్మణులకు విధించిన విహితధర్మాలు ఆరే. అవి అధ్యయన-అధ్యాపనములు, యజన-యాజనములు, దాన-ప్రతిగ్రహములు అనేవి. అంటే భ్రాహ్మణులు వేదాధ్యయనం చేసుకోవటమూ,  అర్హులైన ఇతరులచే వేదాధ్యయనం చేయించటమూ, యజ్ఞాలు చేయటమూ, యజ్ఞాలు చేయించటమూ, దానాలు ఇవ్వటమూ, దానాలు పుచ్చుకోవటమూ అన్న ఈ ఆరు తప్ప ధనార్జనకోసం భ్రాహ్మణులు ప్రాకులాడకూడదు అని విధించారు శాస్త్రంలో.  బ్రాహ్మణులది నిష్కామంగా విద్య నేర్పటం తప్ప ధనవ్యామోహానికి వారు లోబడకూడదని శాస్త్రకారుల ఉద్దేశం. ఈ బ్రాహ్మణులని సమాజమే పోషించాలి. అదే సమాజవిధి-సమాజహితమూ. అందుచేత బ్రాహ్మణులు సంతోషంగా బీదగానే ఉండే వారు. కాని వారి జీవనపరిస్థితులు ఏమంత బాగా ఉండేవి కావు. ఈ విషయంలో శ్రీనాథుడి పద్యం ఒకటి గుర్తుకు వస్తుంది.

దోసెడు కొంపలో పసుల త్రొక్కిడి మంచము దూడ రేణమున్
బాసిన వంటకంబు పసి బాలుర శౌచము విస్తరాకులున్
మాసిన గుడ్డలున్ తలకు మాసిన ముండలు వంట కుండలున్ 
రాసెడు కట్టెలున్ తలపరాదు పురోహితునింటి కృత్యముల్

పురోహితవృత్తిలో ఉండే వారి పరిస్థితిని ఇది ఎలా ఎత్తిచూపుతోందో చూసారా!

ఆధునిక యుగంలో పరిస్థితి వేరు. వర్ణాశ్రమధర్మాల స్థితిగతులు మారాయి. బ్రహ్మద్వేషమూ నాస్తికత్వమూ కూడా పెరిగాయి. పూజాపునస్కారాలూ, పితృవిధులూ అన్నీ మ్రొక్కుబడి తంతులైపోయాయి. అపరాహ్ణకాలంలో చేయవలసిన పితృతిథి క్రియాకలాపం అంతా ఉదయం నుండే చేసేస్తున్నారు. ఎందుకలా అంటే ఆఫీసులో లీవు దొరకదూ, ఆరోగ్యం సహకరించదూ అన్న మాట వినవస్తోంది. బ్రాహ్మణులూ నవీన విద్యాభ్యాసానికి, నవీన జీవనవిధానానికి రాక తప్పలేదు. చాలా మంది బీదవారే వీరిలో. వైదికవృత్తిలో ఇంకా చాకచక్యంగా రాణించ గలుగుతున్న వారూ ఉన్నారు. విద్వత్తు ఉన్నా ఆదరణలేక తిండికి ముఖంవాస్తున్నవారూ ఉన్నారు నేడు.

చాకచక్యం అంటే గుర్తు వచ్చింది ఒక ఐతిహ్యం. బ్రతుకు తెరువు కరవై ఒకాయన గోదావరిజిల్లాలనుండి డభ్భైల్లో వలసవచ్చారు. ఎవరో సినిమావాళ్ళకి అర్జంటుగా ఒక పురోహితుడి అవసరం వచ్చింది - సమయానికి అనుకున్నాయన రాలేకపోవటంతో. ఎవరో వచ్చి ఈ కొత్తాయనను పిలుచుకొని వెళ్ళారు. ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. ఇంకేముందీ. ఈ గోదావరిశాస్త్రుల్లు గారినే పిలవండి ముహూర్తం షాట్‍కి అని ఆయనకు గిరాకీ వచ్చింది. మేడలు కట్టాడట ఆయన ఆ తరువాత! ఆయన గారి పేరే గోదావరిశాస్త్రి అని రూఢికెక్కిందట.

కాని సాధారణంగా చాలా మందికి జరుగుబాటు ఈ వృత్తిలో అంతంత మాత్రం అని వింటున్నాను. మరొక పిట్టకథ చెప్పాలిక్కడ. ఇది మా స్నేహితుడు చావలి నరసింహం చెప్పినది. అతడూ నేనూ ఒకేసారి ఉద్యోగంలో ఒకే ఆఫీసులో చేరాం. అతనూ నేనూ ఒకే బల్లకు అటూ ఇటూ కూర్చుని పనిచేసే వాళ్ళం. అప్పట్లో, నలభై ఒక్క సంవత్సరాల క్రిందట,  అతను చెప్పినది ఈ మామిడిపళ్ళ రాజుగారి కథ. సాధారణంగా వైదికులకు రాజు అని పేరుచివర ఉండటం తక్కువ అనుకుంటాను. నియోగుల్లో మామూలే. మరెందుకనో ఆయన పేరు రాజుగారు. సదరు పురోహితుడు రాజుగారు కాస్తా మామిడి పళ్ళ రాజుగారిగా మారటమే కథ. అందరికీ తెలిసిందే కదా వైదికవృత్తిలో ఉన్నవాళ్ళు తరచుగా బొడ్డూడని పసిపిల్లలకి ఒడుగు చేసేస్తూ ఉంటారు - బ్రాహ్మణీకాలకి పనికొస్తారని.  ఈ రాజుగారి మనవడూ ఆ బాపపతే. ఈ తాతా మనవళ్ళు ఒకరోజు ఒకరింట్లో తద్దినం భోజనం చేస్తుంటే ఆ గృహమేథి వాళ్ళకి మామిడిపళ్ళు విస్తళ్లలో వేసారు. పిల్లవాడు రుచి చూసి, "తాతా పొధ్ధున వాళ్ళు వేసిన మామిడిపళ్ళే బాగున్నాయి కదా" అన్నాడు.  తినేటప్పుడు మౌనంగా తినాలని శాస్త్రం. ఈ అమాయకపు బాల బ్రహ్మచారికి శాస్త్రం తెలుసునా లౌక్యం తెలుసునా? అందుకని తుసుక్కున పొద్దున్నే వేరే చోట తద్దినం భోజనం ఒకటి చేసే మళ్ళా ఇక్కడకు వచ్చి తద్దినం పెట్టిస్తున్న సంగతి బయటపెట్టేశాడు! అప్పటినుండి ఆ రాజుగారు మహరాజులాగా మామిడిపళ్ళ రాజుగారు ఐపోయారట.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను? బ్రాహ్మల పరిస్థితి ఇలా దీనంగా ఏడ్చింది అని.  పొద్దున్నే ఒక తద్దినం పెట్టి మళ్ళా సత్యనారాయణ వ్రతం చేయంచినా మరొక తద్దినం పెట్టించినా అదంతా పాపం పొట్టతిప్పల్లో భాగమే.  మాయింట్లో పునఃపూజ చేయకుండా హడావుడి పడ్ద పురోహితులకు కూడా మరేదో కార్యక్రమానికి సమయం ఐపోబట్టే కంగారులో మరచిపోయారేమో.

అన్నవరంలో సాక్షాత్తూ స్వామివారి గుడిలో సత్యనారాయణ వ్రతం ఐనా అది క్లుప్తీకరించబడుతోందీ అంటే అందులో పూజార్ల తప్పు ఉందని అనుకోను. గుడి యాజమాన్యం ఒక ప్రక్క నుండి టిక్కట్లు అమ్ముతూ ఉంటుంది.  టిక్కట్లు కొన్న ప్రతివారికీ ఎంతత్వరగా తమను వ్రతానికి పిలుస్తారా అన్న ఆదుర్దా ఒకటి ఉంటుంది. పండగలూ పబ్బాలూ వచ్చాయంటే టిక్కట్లు మరీ జోరుగా తెగుతాయి. అందరికీ సావధానంగా చేయించటానికి అక్కడ అవకాశం తక్కువ. ఒకరిద్ధరు పూజార్లను అదనంగా పురమాయించినా, మరొక హాలు వ్రతాలకు కేటాయించినా ఆ రద్దీకి సావధానంగా చేయించుకొనే అవకాశం ఉండదు. అందుకని పూజార్లనే తప్పుపట్టలేమేమో. వ్యవస్థను సరిదిద్దుకోవలసి ఉంది కాని బక్క పూజార్లను ఏమని నిందించగలం. పాపం వారికి ఇచ్చిన సమయానికి వారు బేచ్ తరువాత బేచ్ చొప్పున పూర్తిచేసి చూపవలసి ఉంది. లేకపోతే వేచి ఉన్న జనం అసహనం వ్యక్తం చేస్తారు. అధికార్లు పూజార్లను బాధ్యులను చేసి నిందిస్తారు. జీతపురాళ్ళకోసం పనిచేసే వారు అధికార్లు చెప్పింది చేయక మరే దారీ లేదు కదా.

ఇక పోతే, ఈ సత్యనారాయణ వ్రతం ఏమీ వరలక్ష్మీ వ్రతం ఏమీ అసలు ఏ వ్రతమైనా సరే సీడీలూ కాసెట్లూ సహాయంతో ఎవరింట్లో వారు చేసుకోవటమూ ప్రచారంలో ఉంది.  మా బంధువుల ఇంట్లో అలా చేయటం చూసాను. కాని వారింట్లో అలా వ్రతాలు చేయొంచే సీడీల్లో కొన్ని కొన్ని లోపాలు కనిపించాయి. కాని నోరు తెరచి ఇది పొరపాటుగా ఉందని అనటం దండగ కాబట్టి అలాంటి విషయాలని ఎత్తిచూపటం ఎన్నడూ‌ చేయట్లేదు. చేసినా పెద్దగా ఉపయోగం ఉందదు. ఒకప్పుడు శివుడు తెల్లగా ఉంటాడండి అని ఒక నీలంరంగు శివుడి ఫోటోను ఉద్దేశించి చెబితే బంధుబలగంలో అనేకులు వీడికేమీ తెలీయదే అని జాలిపడ్డారు నామీద. అదీ సంగతి.

సరే మా యింట్లో సత్యనారాయణవ్రతం మేమే స్వయంగా చేసుకోవటం అన్నది మొదలు పెట్టాం. అది చాలా కాలం కొనసాగింది. నాకు కూడా వావిళ్ళవారి పుస్తకంలో ఉన్నప్రకారం వ్రతం చేసుకోవటం అలవాటైనది.ఇలా వ్రతం చేసుకోవటంలో ఒక సంఘటనా బాగా గుర్తుంది. ఇక్కద ప్రస్తావించటం‌ బాగుంటుంది.

సూర్యప్రభగారని నా సహోద్యోగి ఒకావిడ నాకు బాగా ఆప్తమిత్రురాలు. మా యింట్లో సత్యనారాయణవ్రతం రండీ అని పిలిస్తే చెల్లెళ్ళూ‌ తమ్ముళ్ళతొ సహా వచ్చిందావిడ. ఐతే నా వ్రతం ఎప్పటికీ తెమలటం లేదు. సూర్యప్రభగారికి బాగా నీరసం వచ్చేసింది. మా అమ్మగారు ఆ సంగతి కనిపెట్టి, ఆమెతో, "నువ్వేమన్నా కొంచెం పాలో మరొకటో తీసుకోవమ్మా, వీడి పూజ ఇప్పట్లో అయ్యేలా లేదూ" అని ఆవిడ ఆకలి తీర్చారు. "ఇంత సేపేవిటయ్యా నీ‌ వ్రతం" అని ఆవిడ నామీద సున్నితంగా కోప్పడ్డారు తరువాత.  అదెప్పుడో‌ నా చిన్నతనం రోజులు. ఇప్పుడు ముసలాణ్ణై పోయాను కదా, ఆట్టే సేపు నేను ఆగలేను. అన్నట్లు అదొక కారణం వ్రతాదికాలు త్వరగా పూర్తికావాలని జనం కోరుకోవటంలో. ఏ కొత్తదంపతులో పెళ్ళైన మర్నాడు వ్రతం చేస్తున్నారనుకోండి. అప్పటికే వాళ్ళ ఒళ్ళు పచ్చిపులుసై ఉంటుంది క్రిందటి రోజు తంతులతో, ఇప్పుదు ఆట్టే సాగదీస్తే ఎలా పాపం. నాలాంటి లేదా నాకన్న వృధ్ధులుంటారు. వారు ఆట్టే సేపు కూర్చోలేరుగా. ఇల్లాంటి సందర్భాల్లో పురోహితులు గబగబా కానివ్వటం అనే చాకచక్యం చూపుతారన్న మాట.

కాలం ఒకే తీరుగా ఉండదు కదా. ప్రస్తుతం పురోహితులను పిలిచే వ్రతం చేస్తున్నాం మేం కూడా.

బ్లాగులోకంలో చూస్తూనే ఉన్నారు కదా, నాకేమీ తెలియదని వెక్కిరించే వారికి కొదవేమీ లేదు. వారి అభిప్రాయం వారిది. వారు నా వ్రాతలు చదువనవసరం లేదు. అంతే. అక్కడితో సరి. బ్లాగుప్రపంచంలో లాగానే నిజప్రపంచంలో కూడా నాకేమీ తెలియదని నమ్మే వారు కూడా బాగానే ఉన్నారు. ఇంకొంచెం బాగా చెప్పాలంటే మా కుటుంబ సభ్యుల్లో సగం మంది అన్నమాట, వారితో నాకు ఈ వ్రతం స్వయంగా చేసుకునే సామర్థ్యం ఉంది అని వాదించి ఒప్పించటం అంత అవసరం అనిపించలేదు. అందుచేత అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటోంది కదా అని సత్యనారాయణ వ్రతాన్ని పురోహితుల సహాయంతోనే నిర్వహిస్తున్నాం మా యింట్లో కూడా. గత చాలా సంవత్సరాలుగా మా కుటుంబానికి పౌరోహిత్యబాధ్యతలు చూస్తున్న దత్తాత్రేయశర్మగారు చాలా సమర్థులూ  మంచివారు కావటంతో ఏ ఇబ్బందీ లేదు కూడా.


రేపు కార్తీకపౌర్ణమి సందర్భంగా మాయింట్లో సత్యనారాయణవ్రతం!


మదనవిలసితం.








         మదనవిలసితం.
         సురరిపుగణ సం
         భరమును చిదుమన్
         హరి రఘుపతియై
         ధర పొడమెనయా
 
   









మదనవిలసితం.
ఇది ఇంకొక చిట్టిపొట్టి వృత్తం.
దీనికి గణాలు  - న - గ అనేవి. అంటే పాదానికి 7 అక్షరాలే. ఆరులఘువులమీద ఒక గురువు.
28అక్షరాల్లో పద్యం సమాప్తం.
వృత్తం‌ కాబట్టి ప్రాస నియమం ఉంది. చిట్టిపాదాలు కాబట్టి యతిస్థానం ఏమీ లేదు.
పూర్వకవులు ఎవరన్నా ఈ వృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.

నడక ప్రకారం చూస్తే ప్రతిపాదమూ  కిటకిట - తకిటా అన్నట్లు వస్తుంది. పైన ఇచ్చిన పద్యాన్ని ఇలా విరుపుతో చూపవచ్చును.

      సురరిపు  - గణ సం
      భరమును - చిదుమన్
      హరిరఘు - పతియై
      ధరపొడ  - మెనయా

ఇలా మదనవిలసితం నడచతురస్రగతిలో నడుస్తున్నది అన్నమాట.  అంటే నాలుగు మాత్రల తరువాత విరుపు.
ఆసక్తి కలవారు కొన్ని  మదనవిలసితాలు వ్రాయటానికి పూనుకోండి.    

అన్నట్లు ఈ‌ విలసితాన్ని అనంతుడు అనే ఆయన తన ఛందోగ్రంథంలో 'మధుమతి' అన్నాడు. 
  

23, నవంబర్ 2015, సోమవారం

రామునికై మధుమతి.







          మధుమతి.
          పరమపూరుషు డా
          హరియె రాముడుగా
          ధరకు వచ్చెనయా
          సురల కోరికపై
          
      


మధుమతి ఒక చిన్ని వృత్తం. యతి స్థానం ఏమీ లేదు. పాదానికి గణాలు న-భ-గ అంతే. 7 అక్షరాలు పాదానికి.
మహాసులువు  అందరూ ప్రయత్నించవచ్చును.

ఇది అప్పకవి చెప్పిన మధుమతి వృత్తం. అనంతాదులు చెప్పినది వేరే ఉంది. దానికి మదనవిలసిత అన్నపేరూ ఉంది.


రామావతార ప్రయోజనం గురించి ఒక నర్కుటం







          నర్కుటము.
          మునుకొని యొక్క రాక్షసుని
               మొత్తగ వచ్చిన నా
          తని నొకనిన్ వధించి
               తన దారిని బోవక యా
          దనుజకులంబు సర్వమును
               దండన సేయుట రా
          ముని కన ధర్మరక్షణమె
               ముఖ్యము కావుననే
      



ఈ‌నర్కుటం ఇంచుమించు చంపకమాలలాగే ఉంటుంది.

గణవిభజన:  న - జ - భ - జ - జ - వ  మొత్తం‌ 17 అక్షరాలు.
యతిస్థానం:  11వ అక్షరం.

చంపకమాలకైతే గణవిభజన న - జ - భ - జ - జ - జ - ర  అని ఉండి యతిస్థానం అక్కడ కూడా 11వ అక్షరమే.  అంటే చంపకమాల చివర కొద్ది మార్పు అన్నమాట.  చంపకమాలకు 21 అక్షరాలు.  నర్కుటానికి 17 అక్షరాలు.

చంపకమాల:  I I I - I U I - U I I - I U I - I U I - I U I - U I U
నర్కుటము:  I I I - I U I - U I I - I U I - I U I - I U 

అనగా చంపకమాలలోని చివరి నాలుగు అక్షరాలు తీసివేస్తే అదినర్కుటము అవుతుందన్నమాట!

ఈ‌ నర్కుటము కూడా సాధారణంగా వాడరు - ఏదో ఆశ్వాసాంత పద్యాలలో తప్ప!

పారిజాతాపహరణం ప్రబంధంనుండి ప్రథమాశ్వాసం చివరన ఉన్న నర్కుటము:

     ప్రసృతి విలోచనా కుసుమబాణ! దిశా లలనా 
     ఘుసృణ పటీర లేపకృతి కోవిద! బాహుతటీ 
     విసృమర కీర్తిజాల! రణ వీక్షిత వైరినృప 
     త్యసృగతి పంకిలాసిముఖ! యైందవ వంశ మణీ!

ఇదీ అంతాసంస్కృతమే. తెలుగు నర్కుటం ఎందుకైనదిరా అంటే యతులూ, ప్రాసలు పాటించాం గదండీ అందుకు అని చెప్పుకోవాలి.

ఇప్పుడు పైన నేను వ్రాసిన నర్కుటం గురించి ఒక్కముక్క
          మునుకొని యొక్క రాక్షసుని మొత్తగ వచ్చిన నా     
          తని నొకనిన్ వధించి తన దారిని బోవక నా
          దనుజకులంబు సర్వమును దండన సేయుట రా
          ముని కన ధర్మరక్షణమె ముఖ్యము కావుననే

నర్కుటం నడక చంపకమాల ధోరణిలోనే ఉంటుంది. మన తెలుగుపద్యాల్లో కవులకు ఒక సౌలభ్యం ఉంది. అదే ప్రవాహగుణం. అంటే ఒక పాదం చివర మాట పూర్తికాని సందర్భాల్లో ఆ మాట తరువాతిపాదంలో కొనసాగటం.  అది తరచుగానే పద్యాలు వ్రాయటానికి అవసరం అవుతూ ఉంటుందన్నది అనుభవం మీద బోధపడవలసిన సంగతి. అందుచేత పాఠకులకు పద్యాన్ని చదవటంలో సరిగా విడదీసి చదువుకోవటం తప్పనిసరి ప్రయాస. ఈ‌పద్యాన్ని సరిగా విరిచి చదివితే ఇలా ఉంటుంది.


          మునుకొని యొక్క రాక్షసుని మొత్తగ వచ్చిన(చో)
          ఆతని నొకనిన్ వధించి తన దారిని బోవక 
          (తాను) ఆ దనుజకులంబు సర్వమును దండన సేయుట
          రాముని కన(గా) ధర్మరక్షణమె ముఖ్యము కావుననే

 కుండలీకరణం చేసి చూపిన భాగాలు పద్యంలో భాగాలు కావు. కేవలం అన్వయ సౌలభ్యం కోసం చూపటం జరిగింది. అలాగే కొన్ని ద్రుతాలనూ‌ వదిలి చూపాను.


22, నవంబర్ 2015, ఆదివారం

తోటకవృత్తంలో







          తోటకము.
          జనకాత్మజయున్ రఘుపుంగవుడున్
          జననీజనకుల్ మన కందరకున్
          మనసారగ వారిని వేడినచో
          మన కోరిక లన్నియు తీరు గదా

          తోటకము.
          కలిమాయలు నా కనుగప్పెనురా
          పలుగాకి పనుల్ పచరించితిరా
          కలుషాత్ముని నన్ కరుణించుమురా
          కలుషాంతక రాఘవ ప్రాణవిభో
           
(గమనిక: కావాలని మొదటి పద్యంలో యతిమైత్రి పాటించలేదు. రెండవ పద్యంలో యతిస్థానం 7వ అక్షరంగా తీసుకున్నాను. 2015-11-22 )


          తోటకము.
          నిను దెల్పెడి విద్యల నేర్చితినా
          నిను గూర్చి తపంబున నిల్చితినా
          నిను నమ్మితి నంతియె నిక్కముగా
          నను గావుమయా రఘునాయకుడా

(9వ స్థానంలో యతిమైత్రితో. 2015-12-22)





తోటకం.  చిన్న వృత్తం.

దీనికి గణవిభజన మహాసులువు. పాదానికి వరసగా నాలుగంటే నాలుగే 'స' గణాలు. అంతే. 'స' గణం అంటే తెలుసునుగా రెండు లఘువులపైన ఒక గురువు (I I U).  వృత్తం కాబట్టి ప్రాసనియమం పాటించాలి. తొమ్మిదవ అక్షరం యతిస్థానం. నేనైతే యతిస్థానం అనేది ఇంత చిన్న పద్యంలో  అవసరం కాదనుకుంటాను. నా వాదన కొంచెం ముందుకు వెళ్ళాక వివరిస్తాను.

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం అందరికీ తెలిసినదే అందులో 'కమలాకుచ చూచుక కుంకుమతో'  నుండి వరసగా బోలెడు తోటకవృత్తాలున్నాయి. ఒకసారి  ఇక్కడ వేంకటేశ్వరస్తోత్రంలో  చదివి చూసుకోండి.

     కమలా కుచ చూచుక కుంకుమతో 
     నియతారుణితాతుల నీలతనో
     కమలాయతలోచన లోకపతే 
     విజయీ భవ వేంకటశైలపతే

ఈ శ్లోకంలో మొదటి రెండు పాదాలకు ఒక అంత్యప్రాసనూ, చివరి రెండు పాదాలకూ మరొక అంత్యప్రాసనూ గమనించండి.

తెలుగులో ఐతే తోటకం వాడకం తక్కువే అని చెప్పాలి.  శ్రీమదాంద్రభాగవతంలో పోతనగారు ఒక తోటకం వ్రాసారు.

     కరుణాకర! శ్రీకర !కంబుకరా! 
     శరణాగతసంగతజాడ్యహరా! 
     పరిరక్షితశిక్షితభక్తమురా! 
     కరిరాజశుభప్రద! కాంతిధరా!

ఈ పద్యంలో పోతనగారు లక్షణ గ్రంథాల్లో చెప్పినట్లే 9వ అక్షరం యతిస్థానంగా పాటించారు.

పారిజాతాపహరణంలో‌ నందితిమ్మన్నగారు చతుర్థాశ్వాసం చివర వ్రాసినది ఒక తోటకం ఉంది.

      త్వరి తాధరి తానిలవాజి నట
      త్ఖుర జోరు రజోభర గూఢ రవి
      స్ఫురణా కరణాధిక సూత్కృతి మ
      ద్విరదాకర దారణ వీరబలా

ఈ ప్రరమప్రౌఢతోటకవృత్తం నిజానికి సంస్కృత శ్లోకం క్రిందికే వస్తుంది - తెలుగుముక్క ఎక్కడా లేదు మరి. ఐతే తెలుగుపద్యసంప్రదాయం ప్రకారం ఈ తోటకంలో 9అక్షరం దగ్గర యతిమైత్రి మాత్రం యథావిధిగా కూర్చటం కారణంగానూ, తెలుగు కావ్యంలో ఉండటం కారణంగానూ, సంస్కృతశ్లోకాల్లో ఒప్పుదలకాని పాదోల్లంఘనం ఉండటం (అదీ అన్నిపాదాలకూ) కారణంగానూ కచ్చితంగా ఇది తెలుగుపద్యమే అంటే‌ అప్పీలు లేదు మరి.

రంగనాథుడనే కవి మొదట శ్రీవైష్ణవుడుగా ఉండి శివవిముఖత్వం వలన కన్నులు పోగొట్టుకొని బుధ్ధితెచ్చుకొని శివదీక్షాస్వీకారంచేసి ఆ పైన చాలా శైవసాహిత్యం చేసినట్లూ,  ఆ  రంగనాథుఁడు నూఱు తోటక వృత్తములను గూడ రచించినట్లు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చాటుపద్యమణిమంజరిలో చెప్పారు. ఆ విషయకమైన వేటూరి వారి వ్యాసం వెబ్‌లో లబ్యంగా ఉంది:  రంగనాథుణ్ణి గురించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారి వ్యాసం పరిశీలించండి.

వాసుదాసబిరుదాంకితులు శ్రీ వావిలికొలను సుబ్బారావుగారు తమ ఆంద్రవాల్మీకంలో భగీరధుడి వృత్తాంతంలో చెప్పిన ఒక తోటకం చూడండి.

     జగదీశ్వర నాకు బ్రసన్నుఁడవే 
     నొగినాతపమున్ ఫలయుక్తమయే 
     న్సగరాత్మజులందరు నావలనన్ 
     వగదీరఁగఁ గాంత్రు నివాపములన్


ఈ తోటకవృత్తం నిడివి చిన్నది. పాదానికి పన్నెండు అక్షరాలే. ఐతే ఇంత చిన్న పద్యం యొక్క యతిస్థానం విషయంలో నాకు కొంత సందేహం ఉంది.

ఈ పద్యం నిడివి చాలా చిన్నది కాబట్టి యతిస్థానం అవసరం లేదు అనుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఆధునికులకు చిన్నవృత్తాలను వ్రాయటం గురించి మనం ప్రోత్సహించాలి అనుకుంటే అవకాశం ఉన్న చోట యతిమైత్రి కోసం పట్టుబట్టకుండా ఉండటం మంచిది.

లేదూ మనకు  సాంప్రదాయికపద్యలక్షణం ప్రకారం పోవటమే సమ్మతం అనే పక్షంలో హాయిగా పుస్తకాల్లో లక్షణం చెప్పిన విధంగా 9వ అక్షరం యతి స్థానంగా వాడుకోవచ్చును. ఇందాక చూపిన పోతన గారి పద్యం ఇలా ఉంది యతివిషయకంగా. దీని నడకలో విరుపును కూడా చూపుతున్నాను - గుర్తుతో.

     కరు-ణాకర-శ్రీకర   కంబు-కరా
     శర-ణాగత-సంగత  జాడ్య-హరా
     పరి-రక్షిత-శిక్షిత   భక్త-మురా
     కరి-రాజశు-భప్రద  కాంతి-ధరా


ఈ పోతన్నగారి పద్యంలో అంత్యప్రాసను గమనించండి. కొంచెం అందం పెరిగింది దానివలన అనిపిస్తుంది కదూ?

ఈ తోటకం ఒక సౌష్టవం కల పద్యం.  అంటే ఈ పద్యపాదాన్ని నడిమికి విరచి రెండుగా చేస్తే కుడి ఎడమల్లో ఒకే విధమైన గణవిభజన వస్తుంది. "స-స  స-స" అని. అందుచేత 7వ అక్షరం యతిస్థానంగా ఉండవచ్చునన్న పక్షాంతరం ఒకటి నేను ఇక్కడ సూచిస్తున్నాను. ఈమాట పత్రికలోని ఒక వ్యాసంలో బెజ్జాల కృష్ణమోహన రావుగారు కూడా ఈ విషయంలో "తోటక (ఛిత్తక, భ్రమరావళి, నందినీ) 12 జగతి 1756 – IIU IIU IIU IIU స-స-స-స 9 సంస్కృతములో యతి లేదు. తెలుగులో తొమ్మిదవ అక్షరము, నాకేమో చతుర్మాత్రల అందము పూర్తిగా తెలియాలంటే ఏడవ అక్షరమును యతిగా నుంచాలి, వేదం వేంకటరాయశాస్త్రిగారు కూడ దీనినే ప్రతిపాదించారు." అని వ్రాసారు.

     కలిమాయలు నా నుగప్పెనురా
     పలుగాకిపనుల్ చరించితిరా
          కలుషాత్ముని నన్ రుణించుమురా
          కలుషాంతక రావ ప్రాణవిభో

అందుచేత ఈ తోటకవృత్తానికి ఎలా యతి ఉంటే బాగుంటుందో ఖచ్చితంగా నిర్ణయించటం కష్టం.అసలు ఈ చిన్న పద్యాన్ని యతిమైత్రిగోల వదిలిపెట్టి వ్రాయటం బాగుంటుందనిపిస్తోంది. అందుకే నేను (రంగుడబ్బాలో) ఇచ్చిన ఒక  పద్యంలో యతిమైత్రిని పాటించలేదు. ఈ ప్రయోగం బాగుందో లేదో చదువరులు చెప్పాల్సిందే.


21, నవంబర్ 2015, శనివారం

రామా నీ దయ రానీ.







      స్రగ్విణి.
      నీదు నామంబునే నెప్పుడుం బల్కుగన్     
      నీదు రూపంబు నే నెప్పుడుం జూడగన్
      నీదు తత్త్వంబు నే నెప్పుడుం గొల్వగన్
      నీ దయన్ రామ రానీయవే నాపయిన్




ఈ స్రగ్విణీవృత్తం ఒక పొట్టి వృత్తం. పాదానికి నాలుగు ర-గణాలు. రెండు రగణాల తరువాత అంటే 7వ అక్షరం యతిస్థానం. ఇది వృత్తం కదా, ప్రాసనియమం ఉంది. ఈ వృత్తంలో మంచి లయ ఉంది. పాడుకుందుకు భలేగా ఉంటుంది. ప్రసిధ్ధమైన అచ్యుతాష్టకం నిండా స్రగ్విణీ వృత్తాలే. ఉదాహరణకు ఒకటి:

   అచ్యుతం కేశవం రామ నారాయణం
   కృష్ణ దామోదరం వాసుదేవం హరిం
   శ్రీధరం మాధవం గోపికావల్లభం
   జానకీనాయకం రామచంద్రం భజే 

సంస్కృతంలో అక్షరసామ్యయతి లేదు. కేవలం యతిస్థానం దగ్గర మాట విరగాలన్న నియమం మాత్రం ఉంటుంది. అందుకే పైన మీరు తెలుగులాగా యతిమైత్రి కోసం చూడక్కర్లేదు. అలాగే సంస్కృతంలో మరొక హాయి ఏమిటంటే ప్రాసనియమం  కూడా లేదు.

అన్నట్లు వికీపీడియాలో అచ్యుతాష్టకం ఇక్కడ చదువుకోవచ్చును.

20, నవంబర్ 2015, శుక్రవారం

మంగళమహాశ్రీతో మనవి







          మంగళమహాశ్రీ
          లోకమున నెల్లపుడు లోకులకు సాజములు
                  లోపములు పాపములు నీవే
          మా కలిమి మా బలిమి మా తెలివి మా బ్రతుకు
                  మా  జయము మా యపజయంబుల్
          మా కలలు నీ యెడల మాకు గల ప్రేమలును
                  మా భయము లన్నిటిని రామా
          నీ కరుణతో నరసి నిర్భయత మాకొసగి
                  నీ దరికి చేర్చుకొన వయ్యా
           
  



మంగళమాహాశ్రీ వృత్తం.

ఇది చాలా పొడుగైన పాదాలున్న వృత్తం. పాదానికి ఏకంగా 26 అక్షరాలుంటాయి.

సంప్రదాయికమైన గణవిభజన ప్రకారం ఐతే దీని గణాలు  భ - జ - స - న - భ - జ - స - న - గగ .  కాని ఇలా గణవిభజన చూపటం వలన ఈ మంగళమహాశ్రీ వృత్తం నడక సులభగ్రాహ్యంగా ఉండదు. ఇది కూడా ఒక లయ  ప్రథానమైన వృత్తం. దీని నడకను అనుసరించి గణవిభజన ఇలా ఉంటుంది:

   భల - భల - భల - భల - భల - భల - గగ

ఇక్కడ 'భల' అంటే భగణం పైన ఒక లఘువు (U I I I) గా ఒక నాలుగక్షరాల గణం. 6 సార్లు 'భల' గణమూ ఆపైన ఒక గగ (U U) ఉంటాయి మంగళమహాశ్రీ ప్రతి పాదం లోనూ.

వృత్తం కాబట్టి ప్రాసనియమం ఉందని మళ్ళా వేరుగా ఎంచి చెప్ప నక్కర లేదు.  ఈ  మంగళమహాశ్రీ వృత్తానికి 9వ అక్షరమూ,  17వ అక్షరమూ దగ్గర అంటే మొత్తం మీద రెండు యతిస్థానా లున్నాయి.   రెండు స్థానాల్లోనూ యతిమైత్రి పాటించాలి. ఏదో ఒకచోట అని ఐఛ్చికం ఏమీ లేదు. అది విశేషం.  యతి స్థానాలను చూపుతూ దీని విభజన  (భల - భల)  (భల - భల)   (భల - భల  - గగ) అని ఖండాలుగా చెప్పుకోవాలి.

ఈ వృత్తాన్ని పొడుగుపొడుగు పాదాల్లో చదవటం‌ కన్నా పఠన సౌలభ్యం కోసం విరచి వ్రాయటం‌ బాగుంటుంది.
ఒకపధ్ధతిలో

  భల - భల - భల
  భల - భల - భల - గగ

అని పాదాన్ని రెండు ఖండాలుగా వ్రాయటం ఉంది.  రెండు ఖండాలుగా పాదాన్ని విరచితే పద్యం ఎనిమిది లైనులలో వస్తుంది. అలాకాక మరింత సొంపుగా అధునాతంగా వ్రాయవచ్చును

  భల - భల
  భల - భల
  భల - భల - గగ

ఇలా ప్రతి యతిస్థానం దగ్గరా విరచి వ్రాయటంతో ఒక సొగసు వస్తుంది. చదవటానికీ‌ చాలా బాగుంటుంది. కాని పద్యం దీర్ఘంగా  పన్నెండు లైనుల్లో వస్తుంది. కాని చదవటానికి బాగుంటుంది కదా.

స్వర్గీయ పండిత నేమాని సన్యాసి రావుగారు  వ్రాసిన మంగళమహాశ్రీ పద్యం చూడండి.

      మంగళము శ్రీరమణ! మండిత గుణాభరణ! మంగళము సప్తగిరివాసా! 
      మంగళము దేవవర! మంగళము చక్రధర! మంగళము దీనజనపోషా! 
      మంగళము వేదనుత! మంగళము భక్తహిత! మంగళము భవ్యవరదాతా! 
      మంగళము సాధుజన మానస విహారరత! మంగళము మంగళమహాశ్రీ!

ఈ మనోహరమైన పద్యాన్ని వారు  శంకరాభరణం బ్లాగులో ఒకటపాలో  వ్రాసారు.  ఇది పద్యం లక్షణాన్నీ నడకనూ చక్కగా పట్టి చూపుతూ ఉండటం కారణంగా దీన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. 

ఈ పద్యంలో ఒక విశేషం ఏమిటంటే అన్ని పాదాల్లోనూ ప్రథమాక్షరం 'మం' అలాగే అన్ని యతిస్థానాల్లోనూ దానికి మైత్రికి నిలిపిన అక్షరం కూడా 'మం'  అందుచేత యతిమైత్రి మహబాగా కుదురుతుంది. నిజానికి ఆ అన్నిచోట్లా ఉన్నది 'మంగళము' అన్న పదమే. ఎవరికైనా న్యాయంగా ఒక సందేహం రావాలి. అదేమిటండీ పద్యంలో ఒకేమాటను మళ్ళా రెండోసారి వాడితే 'పునరుక్తి' (మళ్ళా చెప్పటం) అనే పెద్దదోషం కదా నేమాని వారు అలా ఎలా అంత పునరుక్తిని ఎలా చేసారూ అని.  సమాధానం ఏమిటంటే భక్తి కవిత్వంలో మాత్రం పునరుక్తి దోషం లేదు అని.  ఈ మాట మరెవరికైనా ఉపయోగించ వచ్చునేమో అన్న అభిప్రాయంతో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను. మాట వరసకు  మధురాష్తకం  చూడండి.  ఆ మధురం అన్న మాట భలేగా తేపతేపకూ వస్తూనే ఉంటుంది. అది సాభిప్రాయమూ - ఆస్తోత్రానికి అందమూ కూడా. అలాగే ఈ పద్యానికి 'మంగళము' అన్న మాట సాభిప్రాయమూ అన్నది కూడా అందరమూ గ్రహించాలి.

అందమైన ప్రబంధం పారిజాతాపహరణంలో ఆఖరి పద్యం ఒక మంగళమహాశ్రీ. దాన్ని చూడండి.

     చిత్తజభి దంఘ్రియుగ చింతన కళాధిగత జిష్ణుసమ వైభవ విశేషా 
     విత్తరమ ణామరగవీ తరణిభూ జలద విశ్రుత కరాంబురుహ గోష్ఠీ
     నృత్త మణిరంగతల నీతిమనురాజనిభ నిర్భరదయారస పయోధీ 
     మత్తగజయూథ మదమగ్నసుఖితాళిరవ మాన్యగృహ మంగళమహాశ్రీ

చివరగా మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకట రత్నం పంతులు గారు వ్రాసిన మంగళమహాశ్రీ పద్యం ఒకటి.

     పాడి రటఁ దుంబురుఁడు పావనియు శ్యామలయు వాణియును రాణ దనరంగా 
     నాడి రొగి నుర్వశియు నాదటను రంభ శివుఁ డంతటను భృంగియు నెసంగన్ 
     గూడి రమరుల్ మునులు గుంపులుగ మానవుల కోటులన నెంత పువువానల్ 
     పోఁడిగను బెండ్లి యది భూదివులు మెచ్చఁగను బొల్పెసఁగె మంగళమహాశ్రీ 

ఆశ్వాసాంతంలో వ్రాసే మంగళమహాశ్రీల చివరన మంగళమహాశ్రీ అని మంగళానుశాసనం చేయంటం బ్రహ్మాండంగా ఉంటుంది కదా.

ఇక నేను పైన వ్రాసిన పద్యాన్ని ఆధునిక ధోరణిలో పాదవిభన చేసి వ్రాస్తే ఎలా వస్తుందో చూదాం.

          లోకమున నెల్లపుడు
          లోకులకు సాజములు
          లోపములు పాపములు నీవే
       
          మా కలిమి మా బలిమి
          మా తెలివి మా బ్రతుకు
          మా  జయము మా యపజయంబుల్
       
          మా కలలు నీ యెడల
          మాకు గల ప్రేమలును
          మా భయము లన్నిటిని రామా
       
          నీ కరుణతో నరసి
          నిర్భయత మాకొసగి
          నీ దరికి చేర్చుకొన వయ్యా


19, నవంబర్ 2015, గురువారం

వంశస్థవృత్తంలో రామస్తుతి.






  
      వంశస్థం.
      ధరాపతుల్ కోరి ధరింపరాని విల్
      బిరాన తానెత్తె విశేష మేమయా     
      పురారివిల్లెత్త మురారికే తగున్
      నరావతారంబున నున్నదాతడే




ఈ వంశస్థవృత్తానికి గణాలు జ - త  జ - ర అనేవి. 7వ అక్షరం‌ యతిస్థానం.  పాదానికి మొత్తం 12 అక్షరాలు మాత్రమే ఉండే పొట్టి వృత్తం. చిట్టిపొట్టి భావాన్ని సూటిగా చెప్పటానికి చాలా బాగుంటుంది.

సంస్కృత కవుల్లో భారవి మహాకవికి వంశస్థం చాలా యిష్టమైన వృత్తం అంటారు.  ఆయన కిరాతార్జునీయంలోని ఒక శ్లోకం చూదాం.

కిరాతార్జునీయంలోని పదిహేనవసర్గ చిత్రకవిత్వం పుట్ట! దానిపైన ప్రత్యేకం వ్రాయాల్సిందే.  ఆ పదిహేనవసర్గ అంతా కిరాతరూపంలో ఉన్న శంకరుడికీ పాండవమధ్యముడైన అర్జునుడికీ మధ్య జరిగిన అతిచిత్ర విచితమైన యుధ్ధం. అందుకే‌ మరి భారవి ఆ సర్గనంతా చిత్రకవిత్వమయం చేసాడు.  అందులోని ఒక వంశస్థం చూపుతాను.

    వికాశమీయుర్జగతీశమార్గణా
    వికాశమీయుర్జగతీశమార్గణాః
    వికాశమీయుర్జగతీశమార్గణా
    వికాశమీయుర్జగతీశమార్గణాః

మీరేమీ పొరబడటం లేదు.  మొదటి చరణమే,మిగిలిన మూడు చరణాలూను. దీన్ని మహాయమకం అంటారు. ఊరికే సరదాగా అలా భారవి రాసెయ్యలేదండి. ఈ శ్లోకానికి అర్థం భేషుగ్గా ఉంది. అదంతా ఇక్కడ ప్రస్తుతం‌ కాదు.