30, నవంబర్ 2020, సోమవారం

మా చెల్లెలు అరుణ రచించి పాడిన తెలంగాణా జానపద గీతం

 

 

ఓ మావ జర ఇ నే..

దండ లోని దారమల్లె ఓ మావా
మన  బంధముండి పోవాలి ఓ మావ
పాలు తేనె లెక్క ఓ మావ
మనం కలసి మెలసి ఉండాలి ఓ మావా


ఊపమంటే  ఊపవు ఉయ్యాల
నే ఉసులెట్టా సెప్పాలా ఇయ్యాల
ఉలకవు పలకవు ఈయెళ
నీ అలకే ట్టా తీర్చేది ఇయ్యాల
ఓహో మావ... ఓ బంగారి మావా

సక్కాని సుక్కను నేనైతే
నా నిండు సందమామ  నువ్వు కదా
రంగుల హరివిల్లు నేనయితే
కురిసేటి కరిమబ్బు నువ్వు కదా
ఓహో  మావా.. ఓ బంగారిమామ

అడుగుల అడుగేసి నీవెంట
నే ఏడడుగులు మరి నడవాలా
ఊరంతా పందిరేసి సెయ్యాలా
మన పెండ్లి వేడుకలు చోద్యంగా
ఓహో మావ.. ఓ బంగారిమామ

ఈ పాట రచన, గానం మా చెల్లెలు అరుణవి. 

మా చెల్లాయి పాట కాబట్టి నాకు బాగుంటుంది సహజంగా. బాగా పాడింది అనిపించి నలుగురికి తెలియజేసి ప్రోత్సహించాలన్న దృష్టితో ఆమె పాటను నా బ్లాగుద్వారా కూడా పరిచయం చేస్తున్నాను.

తను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే బాగా పాడుతున్నదని అనిపించి కొన్ని చిన్న చిన్న పాటలు నేర్పి పాడించే వాడిని. అంతకంటే నేను తనకి చేసింది ఏమీ లేదు.

స్వయంగా తనకళను తానే అభివృధ్ధి చేసుకుంది.

ఇప్పుడు స్వయంగా పాటలు వ్రాసుకొని పాడుతున్నది అంటే చాలా సంతోషం కలిగింది.

ఈ పాట వెనుక పూర్వాపరాలు నాకు అంతగా తెలియవు. నాకు పంపితే విని బాగుందనిపించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాను.

ప్రొద్యూసర్ గారి పేరు రమణ ప్రసాద్.  మ్యూజిక్ డైరక్టర్ పేరు డేవిడ్. వీడియో ఎడిటర్ సింహ అని చెప్పింది.

ఆసక్తి కలవారు ఈపాటను విని అమె పాటను యూ-ట్యూబ్ ఛానెల్ లింక్ వద్ద లైక్ చేసి ప్రోత్సహించండి.

తనకు తెలంగాణా మాండలికం మీద మంచి పట్టు ఉన్నది. 

చాలా కాలం క్రిందట, అప్పుడు తాను స్కూలు పిల్లగా ఉన్న రోజుల్లోనే ఒకసారి ఒక చిన్న సంఘటన. ఎవరో బయట అరుగుమీద ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. ఫక్తు తెలంగాణా మాండలికంలో. అందులో విశేషం ఏమీ‌ లేదు కాని అందులో ఒక గొంతు మాత్రం బాగా పరిచయం ఉన్న గొంతులాగా అనిపించింది. బయటకు వచ్చి చూస్తే స్నేహితురాళ్ళతో‌ అరుణ కబుర్లాడుతున్నది తెలంగాణా యాసలో. 

కబుర్లు పూర్తై ఇంట్లోనికి వచ్చాక అడిగితే, వాళ్ళకి మన ఆంద్రాభాష అర్ధం‌ కాదు అందుకని ఫ్రెండ్స్‌తో వాళ్ళభాషలోనే‌ మాట్లాడుతాను అని చెప్పింది.

అలా చిన్నప్పటినుండి,  హైదరాబాదీ అమ్మాయే అరుణ. అందుకని ఇదం‌ బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నట్లు మాతో ఆంద్రా యాసలోనూ ఇతరత్రా అవసరమైనప్పుడు తెలంగాణా యాసలోనూ ధారాళంగా మాట్లాడుతుంది.

ఇదిగో ఇప్పుడు తెలంగాణా బాణీ  మాండలికం పాటలూ పాడుతోంది. పాడటమే‌ కాదు వ్రాసి మరీ పాడుతోంది.

ఈ పాటను తను పది నిముషాల్లో వ్రాసిందట.

 


29, నవంబర్ 2020, ఆదివారం

తపమెరుగ

తపమెఱుగ జపమెఱుగ తండ్రీ  యేమెఱుగ

నిపుడు నన్నుధ్ధరించు నితరు లెవరి నెఱుగ


ఎఱుక లేక చెడినట్టి వెన్ని జన్మలగు గాక

ఎఱుకలే కుంటినని యిపుడు తెలిసి కొంటిరా

ఎఱుక గల వారి జాడ లెరిగించుము రామయ్య

ఎఱుక లేని నాపైన నించుక దయ చూపవయ్య


వేదములు నేర్వలేదు విదుల శుశ్రూష లేదు

వేదాంతము నేర్వలేదు విన్నాణ మసలులేదు

బూదిపాలైన చాల పుట్టువుల తీరట్టిది

వేదన కలిగేను రామ వేగ దయచూపవయ్య


నిన్ను గూర్చి వినుచుంటి నీవు దయాశాలివట

నన్ను బోలు పామరుల నవ్వుచు రక్షింతువట

నిన్ను చేరి కొలుచు నేను డెన్నడును చెడిపోడట

నన్ను కటాక్షించవయ్య నా తండ్రీ రామయ్య


తాను వలచినది రంభ

తాను వలచినది రంభ తాను మునిగినది గంగ
తాను వేసినది చిందు ధరను పామరునకు

తన జనకుడు శ్రీరాముడు తన గురువు శ్రీరాముడు
తన చుట్టము శ్రీరాముడు తన నెయ్యము శ్రీరాముడు
తన సంపద శ్రీరాముడు తన సర్వము శ్రీరాముడు
తన దైవము శ్రీరాముడు తలప రామభక్తునకు

రాము డిచ్చినది తనువు రాము డిచ్చినది మనసు
రాము డిచ్చినది గుణము రాము డిచ్చినది ధనము
రాము డిచ్చినది మెతుకు రాము డిచ్చినది బ్రతుకు
రాము డిచ్చినది హాయి రామభక్తిపరునకు

తాను పలుకు రామునితో తాను కులుకు రామునితో‌
తాను కుడుచు రామునితో తాను నడచు రామునితో
తాను తిరుగు రామునితో తాను కెరలు రామునితో
తాను చెలగు రామునితో‌ తలప రాముని భక్తుడు

28, నవంబర్ 2020, శనివారం

కాల మిట్టిదనుచు

 కాల మిట్టిదనుచు చెప్పజాల రెవ్వరూ మీ

రాలసింతు రేల హరి నాశ్రయించగ


నేడు రేపు భోగముల వేడుకగా ననుభవించి

వేడుదును పిమ్మట శ్రీవిభుని నే ననగరాదు 

నేడో రేపో యముడు రాడని యనలేముగా

వాడు వచ్చులోన హరిని వేడవలయును


కళ్ళముందు కాలు డొరుల కబళించుట గనుచును

ఎల్లకాల ముండ ననెడు నెరుక గలుగు దెవరికిని

కల్లబ్రతుకు చెదరులోన నిల్లు విడచి కదలు నొడలు

చల్లబడెడు లోన మీరు జానకీశు వేడవలెను


కాలకాలుడైన నీలకంఠు డెపుడు జపియించు

కాలాత్మకుడైన హరి ఘననామసహస్రిలో

చాల పేరుగొన్ప రామచంద్రుని నామమును మీరు

కాలవశులు కాకమున్నె మేలుగా జపించవలెను


రామా నిన్ను నమ్మితిని

రామా నిన్ను నమ్మితిని నామనసు నిచ్చితిని

కామితము నీపాదకమలసేవ యంటిని


సుజనులతో చేరుటయే సుగుణమని తెలిసితిని

కుజనులతో వాదములు కూడవని విడచితిని

స్వజను లనగ నీదు భక్తజను లనుచు నెరిగితిని

నిజభక్తుల భవముక్తుల నీవు చేయు టెరిగితిని


నా కన్నియు నీవనుచు నమ్మి నిన్ను కొలిచితిని

లోకు లాడు నిందలకు శోకించక నిలచితిని

శ్రీకరమౌ నీరూపమె చిత్తములో నిలిపితిని 

చేకొని నిజ భక్తుల రక్షింతువని తెలిసితిని


ఎన్నో జన్మము లెత్తితి నేనెన్నెన్నో చూచితిని

ఎన్నో చోట్ల తిరిగితి నే నెందరినో చూచితిని

ఎన్ని చిక్కులైనను నిన్నెపుడు మరువకుంటిని

నన్ను నీవు విడువవని నమ్ముకొని యుంటిని


27, నవంబర్ 2020, శుక్రవారం

హౌస్ క్లీనింగ్

అందరమూ ఇల్లు సర్దుకోవటం లేదా హౌస్ క్లీనింగ్ అనే పనిని ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటాం.

కొందరైతే ఈపనిని చాలా శ్రధ్ధగా చేస్తారు.

మరికొందరైతే ఈపనిని శ్రధ్ధగానే కాదు, చాలా తరచుగానూ ప్రణాళికాబధ్ధంగానూ చేస్తూ ఉంటారు. నాబోటి గాళ్ళు అనేకమందైతే ఇంక తప్పని సరి ఐతే చచ్చినట్లు చేస్తారు.

ఈ ఇల్లు సర్దుకోవటం అంటె కేవలం, ప్రహ్లాదుడు చెప్పినట్లు "ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలోపలన్" అన్నట్లుడే నివాసగృహం‌ అనబడే దానికి మాత్రమే పరిమితం కాదు. అబ్బో‌ ఇంకా చాలా వాటికి కూడా భేషుగ్గా వర్తిస్తుంది.

ఒకప్పుడు ఆఫీసులో నాచేతిలో ఒకసారి అనేక ప్రాజెక్టులు ఉండి ఉక్కిరిబిక్కిరిగా ఉన్న పరిస్థితిలో ఒక రోజున మా బాస్ నా సీట్ దగ్గరకు వచ్చి "కొంచెం తీరిక చేసుకొని నీ‌ టేబుల్ కాస్త నీట్‌గా సర్దుకోవయ్యా" అని సలహా ఇచ్చి చక్కాపోయాడు. ఆ టేబుల్ అంత ఘోరమైన అరణ్యంలా ఉంది మరి!

పనిలో‌పనిగా టేబుల్ పైన ఉన్నవే‌ కాక దాని అరల్లో ఉన్న కాగితాలూ‌ కలాలూ వగైరా మొత్తం సామాను బయటకు ఈడ్చి సర్దటం‌ మొదలు పెడితే ఆ పని ఒక రోజంతా పట్టేసింది. చివరకు నాదగ్గర ఉన్న దానిలో చెత్తను పాడేస్తే పదిశాతం కూడా పనికివచ్చేవి లేవు కదా అని తేలింది.

మన యిళ్ళల్లోనూ‌ అంతే కదా తరచుగా. ఇప్పుడు మాయింట్లో ఉన్న చెత్తను కూడా ఊడ్చి పారేసే చూస్తే తొంభైశాతం బయటకు నడిచిందని తేలుతుంది. మీయింట్లో సంగతి యేమో కాని మా యింట్లో చెత్త లేదని బడాయికి పోకండి. అలా అంటే దానర్ధం మీఇంట్లో ఏమేం‌ ఉన్నాయో అన్నది మీకు బొత్తిగా తెలియదని. కొత్తగా పెళ్ళై ఇంకా ఇంటికి కావలసినవి ఏర్పాటుచేసుకుంటున్న వారిని మినహాయిస్తే అందరిళ్ళల్లోనూ 80-20 రూల్ అప్లై అవుతుంది. ఈ  80-20 రూల్ ప్రకారం అన్ని సందర్భాల్లో 80 శాతం పొల్లు అని. మీకు వందమంది ఫ్రెండ్స్ ఉంటే అందులో  20 మంది మాత్రమే అక్కరకు వచ్చేవారు. మీరు ఒక ప్రోగ్రాం వ్రాస్తే అందులో ఏ సమయంలో ఐనా ఇరవై శాతం‌ మాత్రమే చురుగ్గా ఉండే కోడ్. ఏదేశంలో ఐనా సరే 80శాతం సంపద 20శాతం మంది చేతుల్లో ఉంటుంది. ఇదంతా Pareto రూల్ అంటారు. మీరూ ఇలాంటివి బోలెడు ఊహించుకోవచ్చును. ఆకాశమే హద్దు.

అమెరికాలో కొన్నాళ్ళు శాన్‌ఫ్రాన్సిస్కో ఈష్ట్‌బే ఏరియాలో అలమీడాలో ఉన్నాను. అబ్బే ఎంతో‌ కాలం లేనండీ ఆర్నెల్లంటే అర్నెల్లేను. అక్కడ నాకు రాజేంద్ర అని ఒక స్నేహితుడు దొరికాడు. ఆయన ఒకరోజున ఉదయం టీ టైమ్‌లో అనుకుంటాను నలుగురి మధ్యలో ఒకరిని ఉద్దేశించి ఒకమాట అన్నాడు. అది ఇప్పటికీ‌ భలే గుర్తు. "అందరూ ఇక్కడకి ఇండియా నుండి రెండేసి సూట్‌కేసులతో  వచ్చినవాళ్ళే. సరిగ్గా రెండేళ్ళు గడిచేసరికి ప్రతివాడి కొంపలోనూ‌ రెండు ట్రక్కుల సామాను పైనే ఉంటుంది. అందులో ముప్పాతికశాతం వేష్ట్ పర్చేజెస్. ఏం చేస్తున్నారయ్యా మీరు, కనిపించిన దల్లా కొనెయ్యటమేనా? మీ‌దగ్గర ఉన్న సామానుల్లో ఎనభై శాతం కేవలం  మీకు అవసరం లేని చెత్తే"

జంతికల గొట్టం లేదని ఒకటి కొంటాం. కొన్నాళ్ళకు మరేదో వస్తువు కోసం వెదుకుతుంటే అప్పుడు ఈ‌ జంతికల గొట్టంతో పాటు మరొక జంతికల గొట్టం కూడా కనిపిస్తుంది. అరె అనుకుంటాం. జాగ్రత్తగా రెండూ ఒకచోట పెడతాం. తమాషా ఏమిటంటే జంతికలు చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ రెండు గొట్టాలూ కూడా పత్తా ఉండవు. వెదికి విసుగొచ్చి పక్కింటి పిన్నిగారిది అరువు తేవటమే. ప్రక్కింటి పిన్నిగారు ఇవ్వనంటే, ఒళ్ళుమండి పిల్లాణ్ణి బజారుకు తోలి మరొకొటి తెప్పించటమే.

అసలు ఈజంతికల గొట్టాలో మరొకటో ఎందుకు కనిపించవూ‌ అంటే ఇంటినిండా సామాను ఎక్కువై పోతే వాటి మధ్యలో ఎక్కడో ఇరుక్కుని కనిపించవు అన్నమాట.

రాజేంద్ర ఒక సలహా ఇచ్చాడు. ఏదన్నా కొనాలీ అంటే అది కచ్చితంగా మనకి అవసరమా? అది మనకి ఇప్పుడే బాగా అవసరమా? అన్న ప్రశ్నలు వేసుకోవాలట. ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తుందిలే అని ఏదీ కొనకూడదు అని ఆయన గట్టిగా హెచ్చరించాడు అందరినీ.

తరువాత ఇల్లు సర్ధుకుందాం వీలు చూసుకొని అని అందరూ ఎప్పుడో ఒకప్పుడు అనుకొనే ఉంటారు. ఇప్పుడు కూడా చదువరుల్లో ఆముక్క ఈరోజునో నిన్ననో అనుకున్న వాళ్ళూ తప్పక ఉండే ఉంటారు. అయ్యా ఆ వీలు అన్నది జన్మలో దొరకదు. గ్యారంటీ. మీరేమో ఆ వీలు కోసం ఎదురుచూస్తూ ఉండగానే ఏదో ఒకవస్తువును ఇంట్లో వెదకి పట్టుకోవటం అత్యవసరం ఐపోయి నానా గోలా అవుతుంది. ఇది కూడా గ్యారంటీ. తప్పనిసరై ఇల్లుపీకి పందిరి వేస్తారు. అంతకంటే ఇంట్లో అనవసరమైన సామాను చేర్చకుండా ఉండటమూ, తరచూ ఉన్నసామాగ్రిని పొందికగా సర్దుకోవటమూ చేస్తూ ఉంటే ఇల్లూ‌ శుభ్రంగా ఉంటుంది. అత్యవసరం వెదుకులాటలూ తప్పుతాయి. ఓస్ ఈమాత్రం నాకు తెలుసు అంటారు. తప్పకుండా అంటారు మీరు. కానీ మీరూ నేనూ అందరమూ తెలిసితెలిసే ఇళ్ళను గోడౌనుల్లా ఉంచుకుంటున్నాం కదా. అనుమానం ఉంటే ఒక్కసారి మీ యింటిలో అన్ని గదుల్లోనూ పరిస్థితి ఎలా ఉందీ అన్నది బేరీజు వేస్తూ పరిశీలించి రండి. అప్పుడు చెప్పండి నామాట ఎంతవరకూ సత్యమో.

ఇల్లు సర్ధుకోవటం అవసరం అని ఇంకా నొక్కి వక్కాణించనక్కర లేదు. కాని ఈ‌యిల్లు సర్దటం అన్నది మాత్రం ఒక మహాయజ్ఞం. ఒకపట్టాన తెమలదు.

అన్నింటికంటే తేలికైన పని ఏదీ అంటే ధర్మరాజుగారు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ఇతరులకు సలహాలు ఇవ్వటం అట. అవును కదా. అందుకని నేను మీకు కొన్ని విలువైన సలహాలు ఇస్తాను.

మొదటిది. ఖరీదైన వస్తువులు. వీటిని కొని వాటి బిల్లులూ, వారెంటీ‌ కాగితాలూ మాన్యువల్స్ వంటివి ఒక పద్దతిలో దాచిపెట్టరు. ఇది గొప్పగొప్ప చిక్కులను సృష్టిస్తుంది. అవసరమైనప్పుడు కంపెనీవాడు మిమ్మల్ని కాగితాలు అడుగుతాడు. ఎంతవెదికినా అవి మీకు దొరకవు! అందుచేత ప్రతి ఖరీదైన వస్తువు తాలూకు ముఖ్యమైన కాగితాలూ ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో ఉంచి అలాంటి కవర్లనీ ఒక ఒక జిప్ ఫోల్డర్ వంటి దానిలో ఉంచాలి.

రెండవది. రకరకాల సర్టిఫికేట్లు, నగానట్రాకొన్న రసీదులు, ఆస్తుల దస్తావేజులు. వీటినీ పైవిధంగానే చేయాలి.

మూడవది. చిన్నచిన్న విలువైన వస్తువులు. అది మీ నాన్నగారి వాచీ‌ కావచ్చు, మీ అత్తగారు పెట్టిన, ఇప్పుడు మీ వేలికి పట్టని , ఉంగరం కావచ్చు. ఇలాంటి వన్నీ చిన్నచిన్న పెట్టెల్లో దాస్తారు లెండి తెలుసు. కాని ఏది ఏపెట్టెలో? ఇలాంటి వివరాలను ఒక నోట్ పుస్తకంలో రికార్డు చేసుకొని అది వారెంటీ పేపర్లూ వగైరా దాచే సంచీలో ఉంచండి.

మీరు ఎవరికైనా అప్పున్నా, మీకు ఎవరైనా అప్పున్నా అటువంటి వ్యవహారాలు కూడా అలాంటి రికార్డులో ఉండాలి.

ఇలాంటి సూత్రాలూ గట్రా మీరే తయారు చేసుకోవచ్చును. కాని చిక్కల్లా నిష్టగా పాటించటం దగ్గరే.

ఈ సర్దుకోవటం అన్నది ఇంటికే‌ కాదు అనేక చోట్ల అవసరం అని చెప్పాను కదా. అలాంటి అవసరాలు కొన్ని చూదాం.

మీ‌ దగ్గర బోలెడు పుస్తకాలుంటాయి. ఒక్కోసారి అందులో మీకు అనవసరం అనిపించేవీ‌ ఉంటాయి. మీరు గమనించరు అంతే. నా దగ్గర అలాంటివి చాలానే ఉన్నాయి. అమెరికాలో నా ఫ్రెండ్ ఒకతనికి టీ షర్టుల పిచ్చి. ఎన్నో‌ కొంటూ‌ ఉండే వాడు. ఒకసారి ఒక తమాషా విషయం చెప్పాడు. లివర్ మూర్ వెళ్ళి అక్కడ ఒక టీ షర్టు కొన్నాడు, ఏదో ఫాక్టరీ ఔట్‌లెట్ దగ్గర. మర్నాడు ఎందుకో అనుమానం వచ్చి వెదికితే మెర్విన్ వాడి దగ్గర కొన్న మరొక టీషర్ట్ బయటపడింది. అదే‌ డిజైన్ అనే కాదు అదే‌ షర్ట్ మరొక కాపీ. మెర్విన్ వాడి స్టిక్కర్ ఇంకా దాని మీదే ఉంది $17 అని. ఇప్పుడు అరవై మైళ్ళ దూరం పోయి తెచ్చుకున్నది చవగ్గా కేవలం $40 ధరకే. ఫన్నీగా లేదూ. అతను మాత్రం కొంచెం విచారంగా నాట్ సో ఫన్నీ అన్నాడనుకోండి. ఇలా ఎందుకు జరిగిందీ అంటే కొని పాడేసి ఎప్పుడొ బుధ్ధిపుట్టినపుడు వేసుకొనే అలవాటు వలన ఎన్నో‌ పోగులు పడ్డాయి. చెత్త పేరుకుపోయి స్పష్టత లేక శృంగభంగం అయింది. ఇది అతడి ఉద్దేశమే నాది కాదు!

అమ్మాయిలూ‌ తక్కువ కాదు ఈవిషయంలో . అమ్మాయిల హేండ్ బ్యాగుల్లో ఏముంటాయి? అన్నీ‌ పనికి వచ్చేవేనా? నాకు లలితా శ్రీనివాసన్ అని ఒక ఫ్రెండ్ ఉండేది. ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఎందుకో ఒకనాడు ఒక పిన్నీసు అవసరం పడింది. పిన్నీసు కదా అని లలిత డెస్క్ దగ్గరకు వెళ్ళి నీదగ్గర ఒక పిన్నీసు ఉంటే ఇవ్వవా అని అడిగాను. అమె తన హేండ్ బ్యాగ్ తెరిచి ఒక పెద్ద చైన్ అఫ్ పిన్నీసులు తీసింది. ఆ తోరణంలో ఒక ఒక యాభై ఉంటాయి. ఇంత పెద్ద దండ ఎందుకూ అన్నాను. నవ్వుతూ బ్యాగ్ లోనుండి మరొక దండ తీసింది అందులో నూటయాభై పైన ఉంటాయి. ఓర్నాయనో అనుకున్నాను. ఇలాగని సూర్యప్రభ గారు అనే‌ మరొక ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడతో‌ చెప్తే, ఆవిడ కసురుకుంది. అమ్మాయి హేండ్ బ్యాగ్ అంటే మినీప్రపంచం తెలుసా పో అంది. అలా అని ఊరుకుందా, ఆవిడ తన హేండ్ బ్యాగ్ నా ముందు బోర్లించింది టేబుల్ మీద. అప్పుడు  అందులోంచి ఒక కీ బయటపడి అవిణ్ణే అశ్చర్యానికి గురిచేసింది. దానికోసం మొన్ననే వెదుక్కుందిట ఆవిడ.  మరి అలాగని అమ్మాయిలు తమ హేండ్ బ్యాగులు ఎప్పుడన్నా సర్దుకుంటూ ఉంటారా అంటే ఏమో‌ తెలియదు.

మీ దగ్గర కంప్యూటరు ఉంది. లేదా కనీసం మొబైల్ ఉంది. అదీ నానా గడ్డీ గాదంతో‌ నిండిపోయి గోల అవటం చూస్తూనే ఉన్నాం కదా. ఈ‌వాట్సాప్ పుణ్యమా అని ఈ‌నిండిపోవటం దారుణమైన వేగంతో‌ జరుగుతుంది తరచుగా. అన్నట్లు వాట్సాప్ వాడు వారం తరువాత హుష్ కాకీ అని కొత్త ఫీచర్ ఇచ్చి నిన్ననే పుణ్య‌ం కట్టుకున్నాడు.

మీ దగ్గర వందల వాట్సాప్ కాంటాక్ట్ లిష్ట్ ఉంది కదా. అది ఎప్పుడన్నా క్లీన్ చేసారా? ఎనభై శాతం‌ పైచిలుకు చెత్తే‌ అక్కడ చూసుకోండి! అసలు మీ ఫోన్ కాంటక్ట్స్ లిష్ట్ ఒకమాటు పరిశీలించండి బోలెడు మంది అక్కడ అనవసరంగా ఉన్నారని తెలుస్తుంది.

మీ కొక బ్లాగు ఉంది. లేదా బోలెడు బ్లాగులున్నాయి. కాని ప్రతిబ్లాగులోనూ కాలంచెల్లిన టపాలూ, ఇప్పుడొకసారి చదివి చూసుకొంటే అనవసరంగా వేసాం అనిపించే టపాలూ,  అసమగ్రంగా ఉన్నాయని ఇప్పుడనిపించే టపాలూ, మనకే ఇప్పుడు నచ్చని టపాలూ వగైరా బోలెడు చెత్త టపాలు కనిపిస్తాయి. అందులో‌ కొన్ని ఫక్తు అయోమయం టపాలూ ఉంటాయి చూసుకోండి. అవన్నీ ఎప్పుడు క్లీన్ చేస్తారూ? ఎన్ని టపాలు వేసాం అన్నది ముఖ్యం అన్న స్థితిని మీరు దాటిపోయి ఉంటే మీరు తప్పకుండా వాసిగల టపాలు ఎన్ని అని ఆలోచించుకొన వలసిన సమయం వచ్చే ఉంటుందని గమనించండి. ఇలా బ్లాగ్ క్లీనింగూ ఒక హౌస్ క్లీనింగే. చాలా ముఖ్యమైన క్లీనింగ్ కూడా.

బ్లాగు అనే‌ కాదండి. మనిషి బుఱ్ఱ ఆనేదీ చెత్తతో నిండిపోతూ ఉంటుంది తరచుగా. చెత్త అభిప్రాయాలూ, చెత్త నిర్ణయాలూ, చెత్తఆలోచనలూ, చెత్తవిషయాలూ, చెత్తసమాచారమూ, చెత్తలెక్కలూ వంటివి బోలెడు మన బుఱ్ఱల్లో నిండిపోయి గందరగోళం సృష్టిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడూ ఆత్మావలోకనం చేసుకుంటూ చెత్తను వదలించుకుంటూ 'అలా ముందుకు పోవాలి' లేదా చెత్తబ్రతుకు ఐపోతుంది. చెత్తవదిలించుకోవటం అంటే‌ అది మూడు విభాగాలుగా ఉంటుంది. 'మూల కారణం బెవ్వడు' అంటూ ప్రతిచెత్తకూ మూలాల్ని గ్రహించి వాటిని దూరం‌ పెట్టాలి. చెత్తను సరే‌ ఎలాగూ వదిలించుకోవాలి. మూడవది ఆ చెత్తయొక్క మూల కారణం మనకు దగ్గర కావటానికి కల మన బలహీనతలూ పొరపాట్లూ ఏమిటో గ్రహించి వాటినీ‌ నిగ్రహించాలి. అప్పుడు మనం సరిగ్గా ముందుకు పోగలం.


ఈ సోదంతా ఎందుకు వ్రాసానూ అంటే‌ నాకే‌ సమాధానం తెలియదు. కాని వ్రాయాలని అనిపించింది. వ్రాసాను. ఎవరికైనా ఈ వ్యాసం వలన ఉపయోగం ఉంటే మంచిది. నా వరకు నాకు ఈ‌ఆలోచన ఇక్కడ ఉంచటానికి ఉన్న కారణం ఈబ్లాగులో కూడా చెత్తను తీసివేయటం అనే కార్యక్రమం అవసరం అని నా భావనగా చెప్పటం. చదువరులు తమతమ బ్లాగుల్లో చెత్తను వదల్చుకోవటం‌ మానటం తమయిష్టం. కొందరైతే చెత్తను పేర్చటమే‌ ఏకైక కార్యక్రమంగా తమ బ్లాగుల్ని నడిపిస్తున్నారనుకోండి. వాళ్ళెవరని అడక్కండి. మీకూ‌ తెలుసు నాకూ తెలుసు సమాధానం.

చెత్తను వదల్చటం అంటే చెత్త మెటీరియల్ అనే‌ కాదు, చెత్తగా అనిపించిన లేదా చెత్తగా తయారైన విధానాలను కూడా వదల్చుకోవటం అన్న నా భావన చదువరులు అర్ధంచేసుకోగలరు. నాకా నమ్మకం ఉంది. నా బ్లాగులో చెత్తను ఎత్తివేయటం‌ మొదలు పెడుతున్నాను. చెత్తవిధానాలూ కొన్ని మార్చుతున్నాను. వాటి గురించి త్వరలోనే‌ మరొక లఘువ్యాసంలో చెప్తాను.
 
 

26, నవంబర్ 2020, గురువారం

తప్పులే మాయందు

తప్పులే మాయందు తరచు కదప్పా మా

అప్పా రామప్పా ఓ ఒప్పులకుప్పా


కటకటపడ నించుక కారణమున్న

దిటవుచెడి నీదయలే దేబిరించేము

చిటికెడంత సుఖభావన చేకూరినచో

చటుకున నిను మరచి సంచరింతుము


తలగాచు నీవు మా దాపున నున్న

కలిసిరాని చుట్టాలకు కాళ్ళుపట్టేము

అలుగని నీదయలతో ఆపద కడచి

సులువుగ నిను మరచి మెలగుచుందుము


వెన్నుడ ఓ దేవుడా వివర మెరిగియు

మున్నెరుగని దేవుళ్ళకు మ్రొక్కుచుందుము

ఎన్ని తప్పు లున్న గాని ఎంతో దయతో

మన్నింతు వని మేము మరువకుందుము

గోంగూర పచ్చడి లేక..

గోంగూర పచ్చడి లేక గొప్ప విందు కాదు

శృంగార మన్నది లేక జీవితమే కాదు


హరిశాస్రము కాదా అది చదువే కాదు

‌హరిభక్తులు లేరా అది సభయే కాదు

హరిసేవకు పోదా అది తనువే కాదు

హరిప్రసాదము కాదా అన్నమే కాదు


హరేరామ యనదా యది నోరే కాదు

హరిభక్తులు లేరా అది యూరే కాదు

హరితీర్ధము కాదా అది సేవ్యమె కాదు

హరి భజనము లేని సభ కందమే లేదు


రామజపము లేక దినము రమ్యమే కాదు

రామకీర్తన లేని భజన రమ్యమే కాదు

రామస్మరణ లేని బ్రతుకు రమ్యమే కాదు

రామకోవెల లేని యూరు రమ్యమే కాదు


పందెం చెప్పమంటే

పందెం చెప్పమంటే నీవు పలుకవేమయ్యా ఓ

అందగాడ నాతో ఆట అంత కఠినమా


అందగాడ నేనోడితే పందె మేమంటే నే

నెందు బోక నీసేవలే యెపుడు చేసెదను నీ

కెందును లోటు రానీయక యేమరకుందును ఆ

నందముగా నాలో నిలిపి ఆరాధించెదను


అందగాడ నీవోడితే పందె మేమయ్యా నరు

లందరితో కలియ మరల నరుడవయ్యేవో నీకు

చెందిన ఐశ్వర్యమునే నా చేతికిచ్చేవో ఆ

నందముగా సెలవీవయ్య పందె మేమిటో


అందగాడ నీకపజయ మన్నదున్నదా నీ

పందెమేమి పందెమేమి పావనగుణధామ ఏ

పందెమైన గెలుపు నీదే పట్టాభిరామ ఆ

నందముగా నన్నోడించు నాస్వామి రామ


24, నవంబర్ 2020, మంగళవారం

అసంభావితాలు?


ఈ జిలేబి గారికి బహుసరదా ఐన వ్యాపకాల్లో రెండవది తన బ్లాగులో తానే పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యలు వ్రాసుకోవటం. మొదటి వ్యాపకం గురించి అందరికీ తెలిసిందే ఎక్కడపడితే అక్కడ కందాలను పోలినవి వ్రాస్తూ వీలైన చోట్ల పుల్లలు పెడుతున్నట్లు హడావుడి చేస్తూ ఇల్లేరమ్మలాగా బ్లాగ్లోకం అంతా కలయదిరుగుతూ ఉండటం.

ఆవిడ తన ద్వంద్వం అన్న టపా క్రింద తానే వ్రాసిన ఒక వాఖ్యలో  ఇలా అన్నారు.

ఇందులో రెండు అసంభావితాలున్నాయి. ఏమిటవి ? :)
చిలుకలు, సింహముల్, కరులు చెన్నుగ చక్కెర బొమ్మలాయె నా
వెలుతురు బోవ గుట్టుగ ప్రవేశము చేయుచు కూక లేకనా
యెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్,
పిలిచె జిలేబి యయ్యరును భీతిని చెందుచు వంటయింటిలోన్!

ఇక్కడ విన్నకోట నరసింహా రావు గారు అసంభావితాలు అంటే ఏమిటా అని సందేహం వెలిబుచ్చారు. దానికి జిలేబీ‌  గారు వినరా వారూ మీరు తెలుగువారేనా ? అసంభావితాలు అన్న పదం తెలీక పోవడమేమిటండీ  అని హాశ్చర్యం వెలిబుచ్చారు. మరి "ఆంధ్రభారతి" వారు కూడా అటువంటి పదమేమీ లేదు పొమ్మన్నారు అని విన్నకోట నరసింహా రావు గారు మరలా విన్నవించుకొన్నారు. మరి జిలేబీ గారు ఉలకరు పలకరు. చిత్రం.జిలేబీకీ సైలెన్స్ అన్నమాటకీ చుక్కెదురు కదా.

అవునూ? ఈ అసంభావితాలు అంటే ఏమిటీ‌?

ఈ సందేహం మీకూ వచ్చిందా?

ఐతే చదవండి.

ముందు ఒక పదం భావితం అన్నదానిని గురించి తెలుసుకోవాలి. భావితం అన్నది భావితము అనే మాటకు కొంచెం క్లుప్తరూపం. 

భావన అన్న మాట గురించి తెలుసును కదా. ఆలోచన అని దానికి అర్ధం అని కూడ తెలుసును కదా.  అలాగే ఇంచుక్ ప్రత్యయం చేర్చితే ఈ‌ భావన అన్న మాటకు మనకు భావించు అన్న మాట వస్తున్నదనీ తెలుసును కదా. ఇప్పుడు ఈ‌భావించు అన్న మాట గురించి కూడా సాధారణంగా వాడబడే‌మాట కాబట్టి దాని గురించి కూడా తెలుసును కదా. "భావన చేయు" అన్న అర్ధంతో భావించు అన్న మాటను వినియోగిస్తారని అందరూ సులభంగానే గ్రహిస్తారు కాబట్టి ఇక్కడ ఎవరికీ ఏ యిబ్బందీ లేదు కదా.

ఇప్పుడు ఆ భావితము అన్న మాట భావన అన్న మాట నుండి ఏర్పడింది అని సులువుగానే తెలుస్తుంది తెలుగులోకానికి. భావింంచ బడినది భావితము. మనం ఏదైనా వస్తువును గురించి కాని విషయాన్ని గురించి కాని భావిస్తూ ఉంటే, అదేనండీ భావన చేస్తూ ఉంటే ఆ వస్తువో భావనో ఇక్కడ భావితము అన్నమాట. మీరు ఆఫీసు పని చేస్తూనో ఆరో తరగతి పుస్తకం చదువుతూనో పులుసటుకుల్ని గురించి మనస్సులో ఆలోచిస్తున్నారనుకోండి. అప్పుడు ఆ భావితము ఐనది పులుసు అటులుకు అన్నమాట. అన్నమాట కేం‌ లెండి, ఉన్నమాటే.

మీరెప్పుడైనా సంభావన అన్న మాట విన్నారా? వినే ఉంటారు లెండి. ఈ‌సంభావన అన్న మాటకు రెండు అర్ధాలున్నాయి. గౌరవపూర్వకంగా అందిచేది, మనస్సులో చక్కగా తలచుకొనేది అని. నిజానికి మొదట చెప్పిన గౌరవపూర్వకంగా అందించేది అన్న అర్ధం కూడా మనస్సులో చక్కగా ఇష్టపూర్వకంగా తలంచుకొని ఇస్తున్నది అన్న భావన నుండే ఏర్పడిన అర్ధం. కాబట్టి సంభావన అంటే మనస్సులో చక్కగా భావించటం. మనస్సులో భావించటం అన్న అర్ధంలో భావన అంటే సం అన్న ఉపసర్గను ముందు చేర్చి  సం+భావన => సంభావన అనటం ఎందుకంటే ఆ తలంచుకోవటం అన్నది ఎంతో‌ ప్రీతితో చేయటం అని నొక్కి చెప్పటానికి తప్ప మరేమీ‌ లేదు.

 ఏమాటకామాట చెప్పుకోవాలి సంభావన ఇస్తున్నారు అంటే లెక్కప్రకారం ఎంతో‌ ప్రీతితో‌ అదరించి ఏదన్నా ఇస్తున్నారు అని సుళువుగానే అందరికీ‌ బోధపడుతూ‌నే ఉన్నా అన్ని సందర్భాల్లోనూ అది పైపైపలుకే. ఇప్పుడు అలా అంటే మనవాళ్ళకి అర్ధం అవుతూ‌ ఉండవచ్చును కాని పూర్వమూ అంతేనూ అంటేనే గొప్ప హాశ్చర్యం‌ కలుగుతుంది.

ఒకప్పుడు అడిదం సూరకవి గారు ఎవరింటికో పనిబడి వెళ్ళారట. సరిగ్గా ఆనాడు అక్కడ ఆ గృహస్థు ఏదో శుభకార్యం చేసుకుంటున్నాడు. ఎందరో వచ్చారు అక్కడికి సంభావనల కోసం. ఏం చేస్తారు చెప్పండి. ఈ బ్రాహ్మలంతే. నన్నయ్యే అనేశాడు కదా ఆదిపర్వంలో "వసువులు వసుహీనవిప్రులక్రియ  పరగి దక్షిణాశ్రితులైరి" అని. ఈ‌ముక్కలో భలే‌సొగసుగా రెండర్ధాలు వస్తాయి దక్షిణాశ్రితులైరి అన్నప్పుడు. వసువులు దక్షిణదిక్కుగా పారిపోయారని చెప్పటం ఒకటి ఐతే మరొక ఆ పారిపోవటాన్ని డబ్బులేని బ్రాహ్మలు దక్షిణలను ఆశ్రయించి నట్లు అని అనటం. ఏం చేస్తారు గతిలేని వారు, ఎవరో ఇంత సంభావన అని చెప్పి పడేస్తే, ఆ అరకొరకే ఆనందపడి వారిని ఆశీర్వదించి పోవటం తప్ప. సరే ఆ గృహస్థు ఇంటికి అలా దక్షిణలకోసం బోలెడు మంది వచ్చారు. గుమ్మందగ్గర కొందరు వీళ్ళని చూసుకొందుకు ప్రత్యేకంగా ఉన్నారట. అబ్బెబ్బే‌ వాళ్ళు దక్షిణలు ఇచ్చి పంపటానికి కాదండి. సెలెబ్రిటీ బ్రాహ్మల్ని తిన్నగా లోపలికీ, మిగిలిన జనాభాని దొడ్డిలోనికి పంపించటానికి. కార్యక్రమంలో సెలెబ్రిటీలకు దక్షిణలు ఇచ్చి ఆశీర్వాదాలూ పద్యపంచరత్న స్తుతులూ వగైరా అందుకొన్నాక గృహస్థు ఆనవాయితీగా దొడ్డిలోనికి వచ్చాడు అక్కడ పోగైన బ్రాహ్మలకి సంభావనలు ఇవ్వటానికి. అప్పట్లో సెలెబ్రిటీకి రూపాయి సంభావన. రూపాయేనా అనకండి అది నేటి ఒక ఐదొందలైనా చేస్తుంది. దొడ్డిసంభావన లెక్క పావలా. వరసగా అందరూ వచ్చి గృహస్థు దగ్గర పావలా సంభావన పుచ్చుకొని వెళ్తున్నారు. హఠాత్తుగా గృహస్థు ముందుకు వచ్చి చేయి జాచిన ఒకాయన్ను చూసి తెల్లబోయాడు. "అయ్యయ్యో ఇదేమి చోద్యం భావగారూ మీరిక్కడ ఉన్నారేమిటీ‌ లోపలికి దయచెయ్యక" అని గడబిడపడ్డాడు. సూరకవి నవ్వేసి, ఈవేళ ప్రాప్తం ఇంతే‌ భావగారూ అన్నాడట. ఇంతకూ‌ ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం‌ అంటే, ఇలా ఇచ్చే‌ దొడ్డిసంభావన అత్యంత ప్రీతిపూర్వకం కాదు కాని ఉట్టి విధాయకం అని తెలుస్తున్నది కదా, దీన్ని బట్టి సంభావన అంటే ఇలా గూడా ఉండవచ్చునూ అని తెలుసుకుందుకు అన్నమాట.

ఇప్పుడు సంభావితము అంటే ఏమిటో మీకు చూచాయగా బోధపడి ఉంటుంది. ఏ విషయం లేదా వస్తువు మనస్సులో ప్రీతిపూర్వకంగా తలచుకోబడిందో అది సంభావితము అన్నమాట. నిజంగా అంతే. ఐతే కవులు కొంచెం‌ డాంబికంగా తమ గణాలూ‌ గట్రా బాగా కుదరటానికీ అనిచెప్పి ఉత్తుత్తినే కూడా భావితము అనటం బదులు సంభావితము అని వాడిపారేస్తూ ఉంటారు. అది మనం గమనించి సందర్భాన్ని బట్టి ఆ 'సం' అన్న ఉపసర్గని కోవలం పూరణాయాసం క్రిందో‌ బడాయి క్రిందో లెక్కగట్టి మరీ అంత పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది.

అలాగని కవులంతా ఊరకే సంభావిత అన్న మాటను భావిత అంటే సరిపోయే చోటకూడా బడాయికి వాడేస్తారని అనుకోకండి. మహాకవులు తెలిసే వాడుతారండీ. కావలిసి వస్తే మీరీ కవిబ్రహ్మ గారి పద్యం చూడండి.

ఉ. నీవును జూచి తట్టి సభనేని వినంబడ దేయుగంబులన్
భూవలయంబులో నది యపూర్వము సర్వమనోజ్ఞ మిష్టభో
గావహ మేక్రియం బడసె నయ్య మహాత్ముఁడు దాన నేమి సం
భావిత భాగ్యుఁ డయ్యెను బ్రభాకర తేజుఁడు ధర్మజుం డిలన్. 

ఎంత గడుసుగా సొగసుగా చెప్పారో చూసారా ధర్మరాజు గారి భాగ్యం గురించి? రాజసూయం తర్వాత రగిలిపోతున్న ధుర్యోధనుడు అంటున్నాడూ, ధర్మరాజు గారి భాగ్యం అక్కడికి వచ్చిన జనం అందరిచేతా సంభావితం ఐనది అని. అంటే ఆ రాజలోకమూ తదితరులూ అందరూ ఆయన భాగ్యగరిమని మనస్సులో మిక్కిలి ప్రీతితో మనస్సుల్లో తలచుకుంటున్నారని అసూయతో రగిలిపోతూ దుర్యోధనుడు 'అయన భాగ్యం సంభావితం ఐనదీ' అంటున్నాడు. అదీ‌ మహాకవి ప్రయోగం అంటే!

మరి అసంభావితము అంటే ఏమిటీ అన్న ప్రశ్న గురించి ఇప్పుడు ఆలోచించాలి. 

ఈ 'అ' అన్న ఉపసర్గను వ్యతిరేకార్థంలో వాడుతాం‌ అన్నది అందరికీ తెలిసిందే. అందుచేత సంభావితము కానిది అసంభావితము అన్న మాట.

మీరు పులుసటుకుల గురించి భావిస్తూ ఉంటే అది సంభావితము అనుకోవచ్చును. భేషుగ్గా అనుకోవచ్చును. మరి ఈ సందర్భంలో అసంభావితములు ఏమిటండీ? ఇక్కడ సంభావితము కానిది అని కదా. అంటే పులుసటుకులు కానిది అని అర్ధం. అందుబాటులో ఉన్నవో కానివో‌ కాని పులుసటుకులు కాని సవాలక్ష ఖ్యాద్యపదార్దాల్లో ప్రతిదీ అసంభావితమే అన్నమాట. 

ఏడ్చినట్లుంది. ఇది ఫలానా అని నిర్దేశించక ప్రపంచంలో నేను తలచుకొనే ఫలానాది కానిది అని డొంకతిరుగుడు ఏమిటీ అనవచ్చును మీరు. మరంతే. అదే అసంభావితము అన్న మాటకి అర్ధం.

ఒక్కసారి జిలేబీ‌ పద్యాన్ని పరిశీలనగా చదివి అర్ధం చేసుకోండి. 

 అయ్యబాబోయ్ అంటారా. నేనూ అదే అంటానండీ. 

ఊరికే‌ మాటవరసకి అర్ధం చేసుకోండి అన్నాను. అందులో జిలేబి సంభావించినవి ఏమన్నా ఉంటే మిగిలినవన్ని అసంభావితాలు అన్నమాట.

అదీ జిలేబీ "ఈ‌ పద్యంలో రెండు అసంభావితాలున్నాయి. ఏమిటవి?" అనటం వెనుక ఉన్న ఆంతర్యం. మరింకేం అవుతుందీ? అంతే‌ కావాలి.

కాని ఎక్కడో తేడా కొడుతున్నదా.

మీరు సరిగానే గమనించారు. జిలేబీ గారి పద్యం (పద్యం లాంటిది!?) చదివిన తరువాత కూడా మీ బుఱ్ఱలు అమోఘంగా పనిచేస్తున్నాయంటే గట్టిబుఱ్ఱలే! అభినందనలు. 

నేనైతే అంత సాహసం చేయలేదు. ఈ వ్యాసం వ్రాయాలి కదా! బుఱ్ఱని జాగ్రతగా చూసుకోవాలి కదా!

సరే విషయంలోనికి వస్తున్నాను.

మీరెప్పుడన్నా కావ్యదోషాలు అన్న మాట విన్నారా?

మూడురకాల దోషాలను కావ్యంలో జాగ్రతగా కవులు పరిహరించాలీ అని పెద్దలు చెప్తారు. అవి అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అనేవి.

అతివ్యాప్తి అంటే అక్కడొక నల్లని కాకి ఉంది అని చెప్పటం‌ లాంటిది. కాకులన్నీ నల్లగానే ఉంటాయికదా. (కోటి కొక బొల్లికాకి ఉంటే ఉండనీండి). కాకి అంటే సరిపోయే దానికి నల్లనికాకి అని చెప్పటం అనవసరం. ఇది అతివ్యాప్తి అంటారు. 

అవ్యాప్తి అంటే అరుదైన విషయాన్ని సాధారణం అన్నట్లు చెప్పటం. అక్కడ పదో పదిహేనో త్రాచుపాములున్నాయి, ఒక్కోటీ పది పది-పన్నెండు అడుగుల పొడవుంది అని చెప్పటం. త్రాచుపాము ఎక్కడన్నా అరుదుగా ఒకటి పదడుగులు ఉందంటే అది వేరే సంగతి కాని ఓ గుంపు త్రాచులు పన్నెండేసి అడుగులున్నవి ఉన్నాయని చెప్పటం బాగోదు. అలా ఎక్కడా ఉండదు. ఇటువంటివి అవ్యాప్తి.

ఇంక అసంభవం అంటే, వాడా గుఱ్ఱాన్ని రెండుకొమ్ములూ‌ గట్టిగా పట్టుకొని లొంగదీసుకున్నాడు అని చెప్పటం వంటిది. కొమ్ములుండవు గుఱ్ఱాలకి. అందుచేత గుఱ్ఱాన్ని రెండుకొమ్ములూ‌ గట్టిగా పట్టుకొని లొంగదీసుకోవటం అసంభవం.

ఇకపోతే నాదృష్టిలో మరొక మూడు కావ్యదోషాలున్నాయి. అవి అనుచితం,అసందర్భం, అసభ్యం అని. ఏదైనా సందర్భంలో  ఉచితం కాని విధంగా విషయం గురించి చెప్పటం అనుచితం ఐతే‌ సందర్భానికి అతకని విషయాన్ని చెప్పటం అసందర్భం. ఇంక అసభ్యం అంటే వేరే చెప్పలా? ఏది (పదుగురు ఉండే‌) సభలో ప్రస్తావించటం‌ నాగరికప్రవర్తన కాదో అటువంటిది పదుగురినీ చదవమని కావ్యంలో వ్రాయటం.

జరగటానికి వీలే లేని విషయాలు అసంభవాలు కదా. తన పద్యంలో అసంభవమైన విషయాలు రెండు ఉన్నాయని సూచించటానికి జిలేబీ‌ గారు "రెండు అసంభావితాలున్నాయి" అని ఉండవచ్చును అనుకుంటున్నాను. రెండు అసంభవాలు అనే అనవచ్చును కదా మరి అసంభావితాలు అనటం ఎందుకు అని మీరు అడగవచ్చును. 

బాగుండండోయ్ నన్నడుగుతారేమిటీ?

ఏమో కొంచెం‌ డాంబికంగా గంభీరంగా ఒక ముక్క వాడుదాం అని అనుకొని అలా అన్నారేమో మరి జిలేబీ‌గారు.

నాకు తెలియదు. ఆ జిలేబీ‌ గారికే తెలియాలి.

మరైతే ఈ వ్యాసం ఎందుకు వ్రాసినట్లూ.

ఎందుకంటే జిలేబీకి ఇంకే‌పనీ తోచక ఒక పద్యం. నాకేమో మరేమీ‌ తోచక ఈ వ్యాసం.

23, నవంబర్ 2020, సోమవారం

కాలమా నీ యింద్రజాలము

కాలమా నీ యింద్రజాలము నన్ను వంచ

జాలదే నేను రామస్వామి భక్తుడ 


వేయించి రకరకాల వేషాలు నాచేత

మాయదారి నటనలు చేయించి

మోయించితివి బాధల  మూటలను నాచేత

రాయిడించినది చాలు రామునిపై యాన


వేలాది యేండ్లు నన్ను పీడించినది చాలు

యేలాగునో నా కీ యినకులేశు

మేలైన కొలువు దొరికె మిగుల హాయిగ నుంటి

చాలించు నీయాటలు జానకిపతి యాన


నన్ను నే నెరిగితినే నిన్ను నే నెరిగితిని

మిన్నకుండుటే యింక  మేలు నీకు

పన్నక హరి భక్తుల పట్ట నుపాయములు

తిన్నగా నుండవె రామ దేవునిపై యాన


22, నవంబర్ 2020, ఆదివారం

ఎంతతడవి నాతప్పుల

ఎంతతడవి నాతప్పుల నేమి లాభము నీకు నే

నెంతవగచి నాతప్పుల కేమి లాభము నాకు


ధనము కొరకు వెంపర తప్పనిదగు తప్పు యీ

తనువు మీద మోహము తగనిగొప్ప తప్పు

మనికి మీద ప్రేముడి మానలేని తప్పు లోక

మునకు భయపడుటే మనిషి బతుకున తప్పు


కాముకుడై యుండుటే కడు పెద్దతప్పు పెద్ద

లేమి బోధించిన వినని దెంతో గొప్పతప్పు

రామనామమును విడచి బ్రతుకుట తప్పు తాను

నీ మనిషి నని మరచుట నిక్కమైన తప్పు


ఎప్పుడు నే చేయునవే యీ తప్పులు ము

న్నెప్పడో నా కలవడినవి యీ తప్పులు

తప్పులని తెలిసి కూడ తప్పని యీ తప్పులు న

న్నెప్పటికి విడుచు రామ యీ తప్పులు


తప్పులను మన్నించుము

తప్పులను మన్నించుము దశరథరామ నేను

తప్పక నీవాడ గద దశరథరామ


తప్పులెన్ని పెద్దలనే దశరథరామ నేను

తప్పులనే చేసినాను దశరథరామ

తప్పక నే దండ్యుడనే దశరథరామ యిట్టి

తప్పు లింక చేయనయ్య దశరథరామ


ధరను మనుజజాతికి దశరథరామ యిదే

తరణోపాయ మనుచు దశరథరామ  

తరచు నామస్మరణమునే దశరథరామ మరచు

తరళితాంతరంగుడను దశరథరామ


విశదయశుడ వీవయ్య దశరథరామ పాప

ప్రశమనైక నాముడవని దశరథరామ

దిశలన్నిట నీతేజము దశరథరామ నిండ

కుశలమె నీవారి కెపుడు దశరథరామ


19, నవంబర్ 2020, గురువారం

అటుతిరిగిన నిటుతిరిగిన

 అటుతిరిగిన నిటుతిరిగిన హరివారలన్నదే

స్ఫుటమైన సత్యము సుజనులార వినుడు


హరి యెడల కలిగెనా పరమప్రేమభావము

హరిని గూర్చి తలచుచుండు నన్నివేళల మనసు

హరిని గూర్చి భావించు నన్నిచోటుల మనసు

హరికన్యము వినబడదా హరికన్యము కనబడదు


హరి యెడల కలిగెనా పరమద్వేష భావము

హరిని గూర్చి తలచుచుండు నన్నివేళల మనసు

హరిని గూర్చి భావించు నన్నిచోటుల మనసు

హరికన్యము వినబడదా హరికన్యము కనబడదు


ఆహరహమును రామరామ యనుచుండెడి వారైన

అహరహమును రామునిపై నరచుచుండు వారైన

అహహా శ్రీరామచంద్రు నందు బుధ్ధి నిలుపుకొనుచు

విహరించుచు నున్నారు వేడుకతో వసుధమీద


తరచుగా నింద్రాదులు

 తరచుగా నింద్రాదులు హరిని జూడ వత్తురు

హరి దౌవారికుల నల్పు లన్నటుల జూతురు


పరమభాగవతుల మని భావించుకొనుచుందురు

పరమభాగవతుల గూడి వచ్చుచుందు మందురు

పరమభాగవతుల దౌవారికుల జయవిజయుల

పరమనిరాదరణ చేసి పలుకరించకుందురు


నిత్యము హరిసన్నిధిలో నిలచియుండు వారల

సత్యమైన భాగ్యగరిమ క్షణమైనను తలుపక

భృత్యమాత్రులే యని యీ పెద్దలు భావించుట

అత్యంతము దుస్సహమని యలిగిరి జయవిజయులు


తనవారల పరితాపము తనకే పరితాపమాయె

సనకసనందనుల వలన శాపము మిష హరిచేసె

ఘనులు జయవిజయులు రాకాసులై విక్రమించ

కనులుతెరచి వారి గొప్ప కనుగొనిరా సురవరులు


18, నవంబర్ 2020, బుధవారం

నాగులచవితి


 


 

నాగులచవితి పాటను బసవరాజు అప్పారావు గారు రచించారు. ఇది కన్యాశుల్కం సినిమాలో ఉపయోగించుకున్నారు.


ఒక ఆసక్తి కరమైన ఐతిహ్యం చెప్తాను.

 తాతల నాటి కథ.  ఒక కుటుంబానికి కులదైవంగా నాగేంద్రుడు ఉన్నాడు. దంపతులు సంతానభాగ్యం కోసం పరితపిస్తున్న రోజుల్లో ఒకనాడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది.

ఎవరో వాకిట ముందుకు వచ్చి ఆనాటి ఉదయం "భవతీ భిక్షాం దేహి" అన్నాడు.

ఇంటి ఇల్లాలు ఇన్ని తండులాలు భిక్షతీసుకొని వచ్చి వేసింది.

ఆ బిచ్చగాడు చూడటానికి ఎవరో ఒక సాధువు గారిలా ఉన్నాడు కాషాయవస్త్రాల్లో. అయన భిక్షను స్వీకరించి ఇలా అన్నాడు. "అమ్మా సంతానభాగ్యం లేదని మీరిద్దరూ చాలా విచారంలో ఉన్నారు కదా, నిజమేనా?"

"అవును స్వామీ" అన్నది ఆ గృహిణి.

"మీ ఇలవేల్పు నాగేంద్రుడు. కొన్నాళ్ళుగా అయనకు సరిగా మీ‌యింట ఆదరణ లభించటం లేదు. అందుకే మీకు సంతానం ఆలస్యం అవుతున్నది" అన్నాడు సాధువు.

"అయ్యో అలాగా స్వామీ, ఇప్పుడు మాకు ఏదన్నా దారి చూపండి" అని అమె వేడుకొన్నది.

"భయపడకండి. మీరు కావాలని అలక్ష్యం చేయలేదు. ఇకనుండి శ్రధ్ధవహించండి. నాగుల చవితి వస్తోంది. మీరిద్దరూ‌ ఉపవాసం ఉండి నాగేంద్రుణ్ణి ప్రార్ధిచండి. మీకు శుభం‌ కలుగుతుంది." ఇలా ఊరడించి ఆ సాధువు వెళ్ళి పోయాడు.

నాగులచవితి వచ్చింది. దంపతులు నిష్టగా నాగేంద్రుణ్ణి ఆరాధించి వేదుకొన్నారు.

మరలా కొన్నాళ్ళకు ఆ సాధువు మరలా ఇంటి ముందుకు వచ్చాడు.

గృహిణీ ముఖం విప్పారింది. ఆనందంగా భిక్ష వేసింది.

సాధువు ఇలా అన్నాడు. "మీ‌యందు నాగేంద్రుడు ప్రసన్నుడై ఉన్నాడు."

గృహిణి సంతోషంతో సాధువుకు నమస్కారం చేసింది. అనందంతో ఆవిడ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.

సాధువు "మరొక్క మాట అమ్మా. ఒకనాటి రాత్రి మీరు శయనించి ఉండగా నాగేంద్రుడు మీ‌పడకగదిలో ప్రత్యక్షం అవుతాడు. ఏమీ‌ భయపడకండి. మీరు నమస్కరించుకోండి. మీకంతా శుభం‌ కలుగుతుంది. మీ‌ పిల్లవాడికి నాగేంద్రుడి పేరు పెట్టుకోవాలి సుమా" అని చెప్పి వెళ్ళపోయాడు.

సాధువు గారు చెప్పినట్లే‌ జరిగింది. ఒకనాటి రాత్రి వారి శయనమందిరంలో ఆయన ఏకంగా దంపతులు యిద్దరి నడుమకు వచ్చి దర్శనం ఇచ్చాడు. 

 బుస వినిపించి. ఏదో‌ మెత్తటి స్పర్శ తగిలి ఇద్దరూ మేలుకాంచారు. మధ్యలో‌ పెద్ద పాము!

ఇద్దరూ‌ భయంతో క్రిందికి ఉరికారు. కరచరణాలు ఆడలేదు వారికి. మెల్లగా సాధువు చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకున్నారు. భయం భయంగానే నమస్కారాలు చేసారు. ఆ నాగేంద్రుడు బయటకు వెళ్ళిపోయాడు.

కొన్నాళ్ళకు వారికి పుత్రసంతానం కలిగింది. ఆ పిల్లవాడికి సుబ్బారావు అని పేరు పెట్టుకున్నారు.

ఆసుబ్బారావు గారు మా పితామహులు.

ఆ నాటి నుండి మా యింటిలో నాగేంద్రుడు అప్పుడప్పుడు ప్రత్యక్షం కావటం వాడుకగా ఉన్నది.

 

*   *   *      *   *   *


ఒక వేసవి కాలం మధ్యాహ్నం. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని. అదే‌ పడుకగది. మానాన్నగారు, అయన ప్రక్కన నేను పడుకొని నిదురపోతున్నాం భోజనానంతరం.

భోజనాలవసారాకు ఆ పడుకగది నుండి ఒక కిటికీ ఉంది. అక్కడ నిలబడి మా నాయనమ్మ గారు మెల్లగా పిలుస్తున్నారు మమ్మల్ని.

ముందు నాకు మెలకువ వచ్చింది. మా నాన్నగారిని లేపాను. మా బామ్మ గారు కిటికీ ఆవల నిలబడి "పామురా పాము" అంటూ చెప్తున్నారు.

పడుకగది తలుపులు తెరచి బయటకు వస్తున్నాం.

పడుకగది తలుపులు ఇంటి మధ్యన ఉన్న హాలులోనికి తెరచుకుంటాయి. ఆ హాలులో పైన పెద్ద అటక ఉంది. ఆ అటక ముఖగహ్వరం పడకది గుమ్మానికి ఎదురుగా పైకి ఉండి అక్కడి నుండి చక్కగా కనిపిస్తూ ఉంటుంది.

అటక మీద ముఖద్వారం దగ్గర ఒక నిట్రాటను చుట్టుకొని ఒక పెద్ద తెల్లని సర్పం మాకు దర్శనం ఇచ్చింది.

అందరం చాలా భయపడ్దాం.

చూస్తూ‌ ఉండగానే అది నిట్రాటను దిగి అటక లోపలికి వెళ్ళిపోయింది.

మానాన్నగారు పాములవాళ్ళని పిలిపించారు. వాళ్ళు మాయింటి పెరటి వైపున ఎదురుగా కొంచెం దూరంలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరనే ఉంటారు.  వాళ్ళు ధైర్యంగా అటక ఎక్కి గాలించారు. పాము జాడ లేదు.

అటక మీదికి కరెంటు వైర్లు పరిచి ప్రయత్నించారు. మళ్ళా మళ్ళా గాలించారు. 

అటక మీదనే‌ కాదు ఇల్లంతా బాగా గాలించారు, పెరడుతో‌ సహా.

మా నాన్నగారికి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు. లేకపోతే ఆయనకే తోచిందో. ఊళ్ళో ఎవరో మంత్రాలు వేసే అయన దగ్గరకు వెళ్ళి మంత్రించిన మినుములు తెచ్చారు. వారిచ్చిన సలహా మేరకు ఆ మినుముల్ని ఇంట్లో అన్ని చోట్లా చల్లాం. ఇంటి బయట పెరట్లోనూ‌ సందులోనూ‌ కూడా చల్లాం. ఇంటి సింహద్వారం ముందూ, పెరటి గుమ్మం దగ్గరా కూడా చల్లాం.

ఐనా మాకు భయంభయం‌ గానే ఉంది.

రాత్రి భోజనాలు కానిచ్చి నిదురపోతున్నాం. అర్ధరాత్రి ఏవో‌ ఘాటు సువాసనలతో‌ మెలకువ వచ్చింది అందరికీ. నిజానికి ఎవరమూ ఆదమరచి నిద్రపోవటం లేదు.

కాసేపు మల్లెపూవుల సువాసన వచ్చింది.

ఆతరువాత మొగలి పూవుల వాసన.

కొద్ది సేపటి మరొక సువాసన.

ఈ వాసనలన్నీ‌ దగ్గరలో ఉన్నట్లే వస్తున్నాయి.

లైట్లన్నీ వేసాం. అప్పటికి ఒకటి రెండు సంవత్సరాల క్రిందటనే‌ ఇంటికి కరెంటు కనెక్షన్ పెట్టించాం.

మా వీధిలో మొత్తం మూడు ఇళ్ళు. అంతే. మాది మధ్యలోని. అటూ ఇటూ‌ఉన్న ఇళ్ళూ మా జ్ఞాతులవే. కుడిప్రక్క ఇంట్లో ఉండే గోపాలం నాకు అన్నయ్య అవుతాడు. అతనూ మరి కొందరూ కర్రలు వేసుకొని వచ్చారు. ఇల్లంతా గాలించారు. పెరట్లో ఒక ఇటుకల దిబ్బ ఉంది. పాము అందులో కాని దూరిందేమో అని వాళ్ళు అనుమానించారు.

ఎలాగో రాత్రి గడిచింది.

ఉదయం మానాన్న గారు మళ్ళా ఆ మంత్రాలు వేసే ఆయనదగ్గరకు వెళ్ళారు.

అక్కడి నుండి తిరిగి వచ్చి మా నాన్నగారు అన్నమాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. "నాగేంద్రుడు మన కులదైవం. మనం‌ ఇలా ఆయన్ను తరిమేయాలని మంత్రాలూ వగైరా వేయించటం అపచారం. మనని నాగేంద్రుడు ఏమీ చేయడని దణ్ణం పెటుకుంటే చాలని చెప్పారు."

ఆ రోజున అందరం దణ్ణాలు పెట్టుకున్నాం. మా బామ్మ గారూ, మా అమ్మగారు ఉపవాసం ఉండి పూజ చేసుకున్నారు. 

ఇంక ఆరాత్రి ఏమీ వాసనలు రాలేదు.

 

*   *   *      *   *   *

 

మా యింట్లో అనే‌ కాదు మా తాతమ్మ గారి ఇంట్లో‌ కూడా నాగేంద్రుడిని చాలా నిష్టగా పూజించటం అనే అనవాయితీ ఉంది. మా తాతమ్మగారు నాగులచవితి నాడు చాలాచాలా నిష్టగా ఉండే వారు.

ఒక సారి పెద్దతనం వలన ఆవిడ ఉండలేక ఇబ్బంది పడుతున్నారని అందరూ బలవంతం చేసి ఏ పాలో తాగించారట. అంతే. కొద్ది సేపటికి ఆవిడకు ఒళ్ళంతా బొబ్బలు వచ్చి గందరగోళం అయ్యిందట. ఆవిడ నాగేంద్రుడికి మొక్కుకుంటే ఆ బొబ్బలూ అవీ వెంటనే తగ్గిపోయాయట. నేనిలా 'అట' అంటూ‌ చెబుతున్నాను కాని ఈ‌సంఘటన మా అమ్మగారి ప్రత్యక్షంలోనే‌ జరిగిందని మా అమ్మగారే నాకు చెప్పారు. మా తాతమ్మ గారు మహాతెల్లగా మిసమిసలాడుతూ‌ఉండే వారు పండుముదుసలి ఐనా - అటువంటి వళ్ళంతా బొబ్బలతో ఎరుపెక్కి పోయిందని మా అమ్మగారు అన్నారు. మా తాతమ్మ గారంటే మా అమ్మగారికి చాలా ఆరాధనాభావం ఉండేది.

 

*   *   *      *   *   *

 

మా నాన్న గారు ఉపాధ్యాయులు కాబట్టి మేం‌ మా ఊళ్ళో ఉన్నది తక్కువ ఊళ్ళు తిరిగింది చాలా ఎక్కువ. అప్పుడప్పుడు సకుటుంబంగా స్వంత ఊరికి వచ్చి కొద్దిరోజులు ఉండి వెళ్తూ ఉండే వారం.  మా బామ్మగారు మాత్రం తరచూ మా స్వంత ఇంట్ళోనే దీర్ఘకాలం మకాం వేసి ఉండే వారు.

అలా ఒకసారి స్వంత ఊరికి వచ్చిన మా బామ్మగారు పడకగది అడివిలాగా ఉందని సర్దుతూ ఉంటే పెట్టెలో నాగేంద్రుడు. యధాలాపంగా పైకి తీసి పట్టుకున్నాక తెలిసి కెవ్వున అరిచి బయటకు పరిగెత్తారు.

మళ్ళా మా గోపాలం జనంతో వచ్చి వెతికించాడు కాని ఆ నాగేంద్రుడు జాడ లేదు.

మరొక సందర్భంలో ఇలా సకుటుంబంగా మేము సెలవులకు స్వంత ఊరికి వచ్చి ఉన్న రోజుల్లో మా అమ్మగారు పెరట్లో పని చూసుకొని భోజనాల వసారాలోనికి వచ్చి అనుమానం కలిగి వెనుదిరిగి చూసారు. ఆవిడ దాటి వచ్చింది గుమ్మాన్నే‌ కాదు గడపమీద పరచుకొని ఉన్న నాగేంద్రుణ్ణి కూడా.

ఏముంది, యధా ప్రకారం నలుగురూ చేరి వెదికితే‌ నాగేంద్రుడు పత్తాలేడు. ఎప్పుడో‌ జారుకున్నాడు.

ఇలాంటి సంఘటనలు మరొకొన్ని జరిగాయి.

మా అమ్మగారు ఒకసారి అన్నారు. "నాగేంద్రుడు కూడా మనింట్లో ఒకళ్ళా తిరుగుతున్నాడేమో" అని.

 

*   *   *      *   *   *

 

మా సోదరసోదరీమణుల్లో ఒకమ్మాయి పేరులోనూ ఒకబ్బాయి పేరులోనూ‌ నాగేంద్రుడి పేరును కలుపుకున్నాం. ఆ అమ్మాయి పేరు సూర్యసుబ్బలక్ష్మి, ఆ అబ్బాయి పేరు వేంకట సుబ్రహ్మణ్య వేణు గోపాలకృష్ణ.

మాలో‌ ఆఖరున పుట్టిన వాడికి సత్యప్రకాశ్ అని మా నాన్నగారి పేరు పెట్టుకున్నాం. సత్యప్రకాశ్ తన కుమారుడికి కార్తికేయ అని పేరు పెట్టి నాగేంద్రుడి పేరు పెట్టే సంప్రదాయాన్ని కొనసాగించాడు.

 

*   *   *      *   *   *

 

ఇప్పుడు ఆ యిల్లు లేదు.

నాగేంద్రుడి దర్శనం కూడా లేదు.

మా కుటుంబంలో ఇప్పటికీ నాగేంద్రుడి పట్ల భక్తి ప్రపత్తులు మాత్రం అలాగే ఉన్నాయి.


11, నవంబర్ 2020, బుధవారం

మాయామర్మము

మాయామర్మము లేని మన రాముడుండగా

మాయదారి మాయ గోల మనకెందుకు దాని

మాయలో పడి చెడుట మనకెందుకు


అది చెప్పే మాటలన్నీ అంత నమ్మరానివి

అది యిచ్చే సుఖము లన్నీ ఆట్టేసేపు నిలువనివి

అది చూపే దారు లన్నీ అథఃపాతాళానివి

అది మన ప్రక్కనుంటే ఆపైన నరకమే


అది ధర్మాధర్మముల ఆలోచన వద్దనును

అది దేవు డనేవాడే అబద్ధము పొమ్మనును

అది తనువున వయసున ఆనంద ముందనును

అది ప్రక్కనుంటే చాలు నంతా తలక్రిందులే


అది ఉన్నాయనే బంధా లసలు లేవు నీకు

అది చెప్పే సత్యాలన్నీ అబధ్ధాల పుట్టలు

అది లేడని చెప్పే దేవు డడిగో మన రాముడు

అది మన ప్రక్క నెందు కవతలకు పొమ్మందాం


అన్నన్న ఆ మాయ

అన్నన్న ఆ మాయ యున్నదే అది

నిన్నిదే తగులుకున్నది


వన్నెలచిన్నెల వయ్యారి ఆ మాయ

నిన్ను కాగలించుకున్నది అది

నిన్నెన్నడు విడువ నన్నది నీకు

కన్నుమిన్ను తెలియకున్నది 


ఎన్నడో వెర్రినాగన్న ఆ మాయ యే

నన్నును చిక్కించుకున్నది అది

నన్ను హరి నెన్న వద్దన్నది నాకు

కన్నప్పుడే తెరచుకున్నది


నన్నేలు హరినే వద్దన్న ఆ మాయనే

తిన్నగ చీచీ పొమ్మన్నా నిపు డది

నిన్నెట్టు విడచునా మిన్నంట రామ

అన్నావా ఇంకెక్కడున్నది


8, నవంబర్ 2020, ఆదివారం

శ్రీవిష్ణుదేవుడీ సీతారాముడు

శ్రీవిష్ణుదేవుడీ సీతారాముడు మా

సేవలుగొను చిరునగవుల సీతారాముడు


ఆజానుబాహుడును యరవిందనేత్రుడును

శ్రీజానకిపతియు నీ సీతారాముడు

రాజసమొలికించుచు రమణితో గద్దియ

పైజేరి యున్నాడు పరమాత్ముడు


నారదాది ఋషులిటు నానారాజన్యులటు

చేరి ముచ్చటించుచుండ సీతారాముడు

కూరిమితో లక్ష్మణసామీరియంగదాదులను

ధీరులతో కొలువైన దివ్యపురుషుడు


సవినయులగు భక్తులు సలుపు విన్నపములకు

చెవులొగ్గుచున్నాడు సీతారాముడు

అవనిజయు తలయూచినట్టి కోరికల కెల్ల

నవుననుచున్నాడీ ఆదిపురుషుడు


7, నవంబర్ 2020, శనివారం

పద్యసంకలనాలు...


 ఆ మధ్య జడశతకం అంటూ‌ ఒక ప్రయత్నం వచ్చింది.

మిత్రులు వలబోజు జ్యోతి గారే అనుకుంటాను ఆ విషయం నాతో అప్పట్లో ప్రస్తావించినది. ఒక వేళ పొరబడితే ఆవిడ నన్ను మన్నించాలి. 

ఈ జడశతకం ప్రయత్నం ఏమిటంటే వీలైనంత మంది కవిశబ్దవాచ్యులం అనుకొనే వారు జడ అనే అంశం పైన కంద పద్యాలు వ్రాసి ఒకరికి పంపాలి. వారు ఆ పద్యాలన్నింటినీ‌ కలిపి ఒక సంకలనంగా వెలువరిస్తారు.

నాకైతే ఆ ప్రయత్నం నచ్చలేదు. అప్పట్లో నచ్చలేదు. ఇప్పుడూ నచ్చటం లేదు అటువంటి ప్రయత్నాలు.

నాకు ఆ ప్రయత్నంలో పాలుపంచుకోవటం వీలుపడదని చెప్పాను.

నా కారణాలు నాకున్నాయి. అందులో ముఖ్యమైనది ఒకటి అప్పట్లో అంటే ఆరేళ్ళ క్రిందటనే శంకరయ్య గారికి ఒక జాబులో చెప్పాను. అది ఇక్కడ ఉంటంకిస్తాను.   సామూహికంగా అన్నమాచార్యకీర్తనలను ఒక గంటసేపు గానం చేస్తే అది ఒక రికార్డు. అదీ లక్షగొంతులు కలిస్తే మరొక రికార్డు. ఎవరికీ భక్తి అవసరం లేదు చూడండి. అది ముఖ్యమైన రికార్డు. సామూహికంగా శతకరచన అన్నది ఒక వినోదం మాత్రమే.  అంతకు మించి మనం దానికి ఏ ప్రతిపత్తినీ ఇవ్వలేము. ఆధునికులు అదే సరైన విధానం అనుకుంటే కాలగతి అనుకోవటమే చేయగలిగింది.

ప్రవృత్తిపరంగా నాకు సాహిత్యం అంటే కేవలం ఒక వినోదం అన్న దృక్కోణం ఎంతమాత్రమూ నచ్చదు. నాకు సంబంధించినంతవరకూ సాహిత్యం అంటే అది ఒక యోగసాధన. అందరికీ అలాగు కాకపోవచ్చును. కాని సాహిత్యవ్యాసంగం అనే దానికి ఒక పవిత్రత అన్నది ఉంటుందని సమాజంలో కవిపాఠకవిమర్శకజనులు భావించాలని నా ఆకాంక్ష. ఎందుకంటే అటువంటి ఆకాంక్ష ఉండినంతకాలమూ సాహిత్యానికి సంబంధించి అందరూ ఎంతోకొంత నిబధ్ధతతో ఉంటారు. అది సమాజానికి మేలు చేస్తుంది.

ప్రస్తుత కాలంలో అవధానాలు పెరిగాయి. సమస్యాపూరణలు పెరిగాయి. పద్యాలను అల్లటం కోసం ఆరాటపడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. మరి పద్యాల వాసి పెరిగిందా అన్నది చదువరులు కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకొంటే బోధపడుతుంది వాస్తవం.

నా ఊహకందినంతవరకూ అనేకులు పద్యాలను అక్షరాలా విస్తళ్ళు కుట్టినట్లు కుడుతున్నారు. సూడోకు గళ్ళలో అంకెలు బేరీజు వేసి ఇరికించి సంబరపడుతున్నట్లు గణాలు సరిపెట్టి పెద్యం ఐపోయిందని ఆనందం చెందుతున్నారు. ఇదంత మంచిదిగా అనిపించటం లేదు నాకు. నేను వట్టి చాదస్తుణ్ణి అంటారా, పోనివ్వండి. అది వాస్తవమే ఐనప్పుడు కాదనటం దేనికి. 

ఒకప్పుడు రావాడ కృష్ణ గారి దగ్గర కొంచెం అభ్యాసం చేసాను బొమ్మలు వేయటం. అప్పట్లో కొంచెంగా వేయగలిగి ఉండే వాడిని లెండి. ఇప్పుడు అదీ‌ లేదనుకోండి. అది వేరే సంగతి. నా బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయంటే, ఆయన నాకు అద్దంం, దువ్వెన, పుస్తకం, కత్తిపీట వంటి వాటిని పెన్సిల్ చిత్రాలుగా వేయమని అన్నారు. అయనకు ఒకమాదిరిగా కూడా నచ్చేలా అద్దం బొమ్మ కూడా వేయలేకపోయా నంటే నమ్మండి. ఐనా ఆయన బొమ్మలు వేస్తుంటే ప్రక్కనే కూర్చొని చూస్తూ ఆయన చెప్పే విషయాలు వింటూ ఉండేవాడిని.

ఒకరోజున నాదగ్గర అప్పట్లో ట్యూషన్ కోసం వస్తూ ఉండే సర్కిల్ గారి అమ్మాయి కృష్ణగారిని మాష్టారూ‌ నా బొమ్మ వేయరా అని అడిగింది. అమె చేత కొంచెం‌ బ్రతిమాలించుకొని, ఆయన రెండంటే రెండే నిముషాల్లో ఆమె నోట్‌బుక్‌లో ఒక ఖాళీపేజీలో పెన్‌తో ఒక స్కెచ్ వేసారు. అచ్చుగుద్దినట్లు ఆ అమ్మాయిలాగా వచ్చింది. ఆమె సంబరం మాటల్లో చెప్పలేం. 

చేయితిరిగిన కళాకారుడు ఒక బొమ్మ వేస్తే అది అలా ఉంటుంది. నాలాంటి వాడు లక్షతుడుపులతో బొమ్మని కిట్టించితే అది నరమానవాకారంలో కొంచెం ఉంటేనే గొప్ప, ఇంక పోలికలదాకా ఎందుకు లెండి.

అలాగే చేయితిరిగిన కవి ఒక పద్యంవ్రాస్తే అది కూడా అలా కృష్ణగారి బొమ్మలాగా ఉంటుంది సహజంగా. ఎక్కడా అతుకులబొంతలా ఉండదు మనబోటి వారి పద్యాల్లా.

గళ్ళుకట్టి బొమ్మనకలు వేసి కొలతలు సరిపోయాయి కదా అనుకున్నా ఆ బొమ్మలో సహజత్వం లేకపోతే అది ఎలా దండగో, సహజసుందరమైన పద్యంగా వచ్చేదాకా అతుకుబొతుకుల పద్యాలూ అలా దండగే.

ఇలా అని ఎవరినీ‌ నిరుత్సాహపరచటానికి అనటం లేదు.

ఒకసారి ఎవరో విశ్వనాథవారిని అడిగారు. అయ్యా మీరింతవరకూ ఎన్ని పద్యాలు వ్రాసి ఉంటారు అని. అయన అన్నారూ, నేను ప్రకటించినవి ఒక ముఫ్ఫైవేలుండ వచ్చును. నేను వ్రాసి చించివేసినవి యాభైవేలైనా ఉంటాయి అని. అంటే ఆయన పద్యం పట్టుకుందుకు అంత తీవ్రకృషి చేసారన్నమాట.

ఇప్పుడేం జరుగుతోంది? గణాల్లో అక్షరాలు పొదిగితే చాలు , అది పద్యం ఐపోయింది. దాన్ని ప్రకటించెయ్యటమే!

దానికి తోడు, ఈ‌ బాపతు ఉబుసుపోక పద్యాలను సాహిత్యంగా జనానికి అందిచాలన్న తపన కూడా పెరుగుతున్నది. 

ఆనాటి జడకవిత్వం అన్నది అటువంటి ప్రయత్నం అనుకున్నాను. కాబట్టే దాన్ని హర్షించలేదు. దాని జోలికి పోలేదు.

కుట్టుడు పద్యాల గురించి ఎందుకంత ఆక్రోశం అని అనవచ్చును ఎవరన్నా. అవెలా ఉంటాయో ఒక పద్యం చిత్తగించండి.

కం. వ్యధపెట్టు వ్యవస్థ యొక వ
నధి! గాజులు గల్లుగల్లనఁగ గాండివమె
త్తె ధనంజయుండనిన్ చే
రి ధర్మము ధరణిని నిలువరింప జిలేబీ !

దీనిలో‌ కందపద్యం తాలూకు నడక ఏమాత్రం ఐనా ఉందా? కేవలం గణాలు సరిపోయాయి కాబట్టి, ఏదో దిక్కుమాలిన సాఫ్ట్‌వేర్ దీన్ని కందపద్యం అనేసింది కాబట్టి ఇది కందపద్యం ఐపోయిందా? నిజానికి ఆ సాఫ్ట్‌వేర్ ప్రయోజనం దానికి ఉంది లెండి, కాని దేన్నైనా మనం దురుపయోగం చేయవచ్చును కదా. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నేను కూడా అంతకన్నా దిక్కుమాలిన సాఫ్ట్‌వేర్ ఒకటి అలాంటిది తయారు చేసుకుంటున్నాను. దానికి నిర్దేశించిన ప్రయోజనం దానికి ఉంది.

ఇటుచంటి పద్యాలను నేను పద్యాలనటానికి కూడా ఇష్టపడక గిద్యాలని అన్నందుకు నాపైన కొందరికి కించిత్తుగా కినుక ఉన్నమాట యదార్ధం.

అన్ని విషయాలూ‌ పుస్తకాల్లో ఉండక పోవచ్చు. కాని పెద్దలనుండి కొంత, అభ్యాసం ద్వారా కొంత తెలుసుకోవాలి. దేశికవిత్వంలో పాదాంతవిరామం పాటించితే‌ పద్యాల నడక సాఫీగా ఉంటుంది. లేకపోతే అస్సలు ఉండదు. పదాలు వీలైనంతవరకూ గణాల వద్ద ఆరంభం కావటం మంచిది. ఈ లక్షణాలు మార్గికవిత్వాన్ని కూడా అందగింపచేస్తాయి కాని దేశికవిత్వం విషయంలో ఇవి మరింత ముఖ్యం. ధారాశుధ్ధిగా లేని పద్యాలను చదవటం‌ ఎవ్వరికీ ఆహ్లాదకరమైన అనుభూతిని ఇవ్వదు. వ్రాయండి. పుంఖానుపుంఖాలుగా వ్రాయండి. నిరంతరాయంగా నిర్భయంగా వ్రాయండి. కాని వ్రాసిన ప్రతిపద్యాన్నీ ప్రకటించాలన్న దురదను మాత్రం దూరం‌ పెట్టండి. క్రమంగా మంచి ధార తప్పక వస్తుంది. 

మళ్ళీ మొదటీకి వస్తున్నాను. ఆమధ్య జడ శతకం వచ్చిందన్నాను కదా. దానిని శంకరాభరణం వారు ప్రచురించినట్లు గుర్తు. నాది పొరపాటు కావచ్చును. ఇదెందుకు ఈరోజున ప్రస్తావనకు వచ్చిందంటే  శతకపద్యాలకు ఆహ్వానం అంటూ ఒక బ్లాగుటపా కనబడింది.  అందులో‌ “సత్యధర్మేశ్వరా”అనే మకుటంతో ఒక శతకాన్ని సకలకవీశ్వర శతకంగావెలువరించాలని శ్రీ పద్మాకర్ గురుదేవులు సంకల్పించారు అని చెప్పారు. సకలకవీశ్వరులూ ఒక్కొక్క పద్యం వ్రాయటం ఏమిటీ? ఈరోజుల్లో అందరూ‌ కవులు కావటం‌ కన్నా ముందుగానే‌ కవీశ్వరులు అవుతున్నారు కదా. కాబట్టి ఔత్సాహికులు అందరూ తలకొక పద్యం చొప్పున పంపితే వారు ఒక శతకాన్ని కుట్టి తయారు చేస్తారన్నమాట. అంతకంటే మరేమీ లేదు.

ఐతే ఇక్కడ ఒక ప్రశ్న వస్తున్నది. అందరూ తలొక రకంగా వ్రాస్తారు కదా అని. ఐతే ఏమి. అదొక ప్రతిబంధకం కాదు. కాని నిజమైన చిక్కు మరొకటుంది. ఔత్సాహికులు వ్రాసే పద్యాల్లోని లక్షణదోషాల సంగతి ఏమిటీ‌ అని. అవును కదా. అచ్చు వేసేందుకు పూనుకున్నాక ఆ పద్యాలను సాధ్యమైనంతగా పరిష్కరించాలి మరి. ఎవరో ఒకరు ఈపని చేస్తారు. కాబట్టి పంపేవారు వారికి చేతనైననట్లు వ్రాసి పంపితే పరిష్కర్తలు తప్పులుంటే సరిచేస్తారు. వీరు చెప్పిన మాటల్లో నాకు నచ్చినది ఒకటుంది అది కవులందరూ “సత్యధర్మేశ్వరా”అనే మకుటంతో పద్యాన్ని తాత్పర్యసహితంగా వ్రాసి పంపమనటం. ఇది చాలా ముఖ్యం అని నాస్వానుభవం. పద్యాన్ని దిద్దవలసి వస్తే అసలు కవిహృదయం తెలియటం వలన తద్విరుధ్ధంగా శుధ్ధప్రతి తయారు కాకుండా ఉంటుంది.

అదేమిటీ దిద్దే వారికి ఆమాత్రం పద్యం తాలూకు అన్వయం తెలీదా, మళ్ళా కవి స్వయంగా చెప్పాలా అనవచ్చును. నాస్వానుభవంతో చెబుతున్నాను. రకరకాల కారణాల వలన కవిగారి ఉద్దేశం వేరు పరిష్కర్త సిధ్ధం చేసే పాఠం చెప్పే అర్ధం వేరు కావచ్చును.

ఒక సంకలనానికి నేను కూడా కొంత తటపటాయించిన పిదపనే నాలుగు పద్యాలు పంపాను. (నాలుగు నిబంధన వారు పెట్టినదే). అవి అచ్చయిన పిదప చూసుకుంటే చాలా బాధ కలిగింది. వాటిలో ఒక మచ్చుతునకను మీకు చూపుతాను.

నేను పంపిన పద్యం:

కం. అందర కెపుడు సమస్యల
నందిచెడు ఘనులు శంకరార్యులు రామా
వందనములు వారికి నీ
వెందును రానీకు చిక్కు లెప్పుడు కరుణన్

పరిష్కర్తలు ప్రకటించిన పద్యప్రతి:

కం. అందర కెపుడు సమస్యల
నందిచెడు ఘనులు శంకరార్యులు రామా!
వందనములు వారికి। నీ
వెందును రానీకు చిక్కు లెప్పుడు కరుణన్!!

ఎందుకు అనుకున్నారో తెలియదు, పరిష్కర్తలు నావనే కాదు, అందరి పద్యాల్లోనూ కొల్లలు కొల్లలుగా ఆశ్చర్యార్ధకాలను  చేర్చి ప్రకటించారు. ఇందువలన తెలిసీ తెలియకా చాలా చోట్ల అర్ధవిపరిణామాలు చోటుచేసుకున్నాయి. పద్యాల అన్వయాలు మారిపోయాయి! అసలు తెలుగు పద్యాలలో విరామచిహ్నాల అవసరం ఏమీ‌ లేదు. అవి వాడవద్దని అందరికీ‌ నా మనవి.

నేను "రామా వందనములు,  వారికి నీ వెందును రానీకు చిక్కు లెప్పుడు కరుణన్" అని ఉద్దేశిస్తే పరిష్కర్తలు నా నమస్కారాలను రాముడి నుండి ఉపసంహరించి "రామా, వందనములు వారికి" అని అవి శంకరయ్య గారికి అందజేసారు.

నాకు పద్యవిద్యలో ఓనమాలు దిద్దించిన గురుదేవులు స్వర్గీయ వేదుల వేంకటరావు గారు. ఒక సందర్భంలో వేరే ఒక తెలుగుమాష్టారు గారి పద్యాలను దిద్దటం వలను పడక ఆయన భావాలతో నేనే మరలా వ్రాసి ఇచ్చాను పద్యాలు. అవి ఆయన స్టేజీమీద చదివారు. అప్పుడు నేనూ కొన్ని చదివాను అనుకోండి అది వేరే సంగతి. మాగురువుగారు మాత్రం ఉగ్రులైపోయారు. నన్ను పిలిపించుకొని చీవాట్లు వేసారు. భగవంతుడిని తప్ప ఎవరినీ పొగుడుతూ పద్యాలు వ్రాయవద్దని హెచ్చరించారు. ఆయన ఆదేశాన్ని మీరిందెన్నడూ‌ లేదు. అందుచేత ఈ సందర్భంలో శంకరయ్యగారిని ఆశీర్వదించమని రాముణ్ణి వేడుతూ‌ పద్యాలు పంపుతే పరిష్కర్త గారు నా నెత్తిన పిడుగు వేసారు! నాకైతే నా అతితెలివికి తగిన శృంగభంగం ఐనదా అని కూడా అనిపించింది. నేను తేరుకుందుకు చాలా సమయం పట్టింది.

అందుచేత చేతనైతే అవసరం అనుకుంటే నేను పద్యాలను వ్రాస్తానే‌ కాని ఎవరో వాటిని మార్చే అవకాశం ఉన్నచోట ఇకనుండైనా చాలా చాలా జాగ్రతగా ఉంటాను.  

అందుచేత ఇలాంటి సంకలనాలకు పద్యాలను పంపేవారు కొంచెం‌ గమనికగా ఉండాలి. శతకం కాస్తా మిక్చరుపొట్లంలాగా ఉంటే జనం ఆసక్తిగా దాన్ని గ్రహించక పోవచ్చును. అసలు తెలుగుపుస్తకాలను చదివే వాళ్ళే తక్కువ. అటువంటప్పుడు జనం చేత చదివించలేవని ముందే తెలిసిన పుస్తకాల కోసం కవులు శ్రమపడాలా అన్నది ఆలోచనీయం.

అదీ కాక శతకం అంటే ఫలాని కవిగారు వ్రాసారనటం‌ కద్దు. రోజులు మారి ఫలాని గ్రూపు వారు వ్రాసారనో ఫలాని గ్రూపువారు సేకరించారనో అంటారేమో నవీనశతకాల్లో చాలా వాటికి. 

అందుకే   శతకపద్యాలకు ఆహ్వానం అంటూ వచ్చిన ఈ అహ్వానమూ‌ నాకు రుచించక ఒక ముక్క అన్నాను. 

కం. ఒకకవి యొకకృతి చేయుట
యొకవిధమగు సంప్రదాయ ముచితము నటుగా
కొకరొక పద్యము చొప్పున
నొక కలగాపులగపుకృతి యొక శతకంబా?

ఈ అభిప్రాయాన్ని ఉదయం పంపాను కాని వారు ఇంకా అచ్చువేయలేదు. పోనీయండి. వారిష్టం వారిది. నా అభిప్రాయాన్ని విపులంగా ఇక్కడ వ్రాసుకుంటున్నాను. 

6, నవంబర్ 2020, శుక్రవారం

మేలు మేలు మేలు మమ్మేలు రాఘవా

మేలు మేలు మేలు మమ్మేలు రాఘవా
వాలాయముగ మంచి వరములిచ్చేవు

మునులు దేవతలు నిను మొనసి పొగడుచుండ
కనుగొను భాగ్యమే కలుగుచుండ మాకు
మనసులు పులకరించి మంచిదొరవైన
నిను గూర్చి పాడు యోచన చేయగానే

యేమెఱుగని మేమును యించుక పాడగనే
రామచంద్ర నగవులు రాజిలు మోముతో
ఆమాత్రమునకె చాల ఆనందపమంది
మామీద దయలను మానక కురిసేవు

ఎల్లలోకములకు నేలిక వగు నీదు
చల్లని చూపులతో సత్వరముగ మా
కల్లన రాలిపడగ కర్మబంధములు
నల్లనయ్య బ్రహ్మానందమే మాకు

5, నవంబర్ 2020, గురువారం

మీ రిపుడు పాడరే మేలైన కీర్తనలు

మీ రిపుడు పాడరే మేలైన కీర్తనలు
శ్రీరామచంద్రుల చిత్తమలరగ

వారాశిని దాటి లంకపైనబడిన విధమెల్ల
ఆ రావణుడు హతమైన విధమును
చేరి బ్రహ్మ వెన్నుడవని చెప్పిన విధమెల్ల
కోరి కోరి యడుగు జనుల కుతుకము తీర

తీయని గొంతులతో దివ్యప్రభావము గల
యీయమ్మ సీతమ్మ హెచ్చు కీర్తిని
ఆయగ్నిహోత్రుడు నఖిలదేవతలు నపుడు
వేయి నోళ్ళ పొగడిన విధము తెల్పుచు

బత్తితో మీరిప్పుడు పాడగా మిగుల సుతి
మెత్తనైన పలుకుల కొంగ్రొత్త రీతుల
చిత్తమలరగ నేడు సీతమ్మ తల్లికి నృప
సత్తముని గొప్పదనము జనులు మెచ్చగ


మమ్మేలు రాముడా మంచిదేవుడా

మమ్మేలు రాముడా మంచిదేవుడా సీ
తమ్మతో వేగ మాకు దరిసెన మీవే

చిరుచిరు నగవులు గల సీతారాముడా మాకు
వరములీయ వేగమే దరిసెన మీవే
కరుణామయి సీతమ్మా కష్టసుఖముల
నరసి మమ్ము పాలింప దరిసెన మీవే

సురలమొరలు వినెడు వాడ పరమపురుషుడా యీ
నరులమొరలు కూడ వినగ దరిసెన మీవే
ధరాసుతా రామ సహధర్మచారిణీ సీతా
పరమాత్మికా మాకు దరిసెన మీవే

చరాచరసృష్టి నెల్ల చక్కగ నేలే శ్రీ
కరుడ రామదేవుడా దరిసెన మీవే
పరమప్రేమస్వరూపిణీ వరదాయినీ మాకు
కరుణతో సీతా మాత దరిసెన మీవే


4, నవంబర్ 2020, బుధవారం

రామ రామ జయ జయ రామ రామ

రామ రామ  జయ జయ రామ రామ హరి
రామ రామ  జయ జయ రామ రామ

శ్రీమన్నారాయణుడవు రామ రామ మాకై
భూమికి దిగి వచ్చినావు రామ రామ
రామ రామ జయ జయ రామ రామ రఘు
రామ రామ జయ జయ రామ రామ

కామారి వింటి నెత్తిన రామ రామ చెలగి
భూమిజా వరుడవైన రామ రామ
రామ రామ జయ జయ రామ రామ సీతా
రామ రామ జయ జయ రామ రామ

తామస రావణనిధన రామ రామ బ్రహ్మ
కామారిప్రముఖవినుత రామ రామ
రామ రామ జయ జయ రామ రామ విజయ
రామ రామ జయ జయ రామ రామ

శ్రీమదయోధ్యాపతి రామ రామ సర్వ
భూమిపాల సంసేవిత రామ రామ
రామ రామ జయ జయ రామ రామ రాజా
రామ రామ జయ జయ రామ రామ

ప్రేమతో మమ్మేలెడు రామ రామ భక్త
కామితార్ధ దాయక హరి రామ రామ
రామ రామ జయ జయ రామ రామ సుగుణ
ధామ రామ జయ జయ రామ రామ


3, నవంబర్ 2020, మంగళవారం

తలచినంతనే భయము

తలచినంతనే భయము కలుగుచున్నది

కలుగ నీకుమా రామ యిలను నన్నింక


మరల పడుదునో యేమొ మరొక తల్లి కడుపులో

మరల బుజ్జి పాపాయిగ మసలుదు నేమో

మరల నివే చదువులను మానక చదువుదు నేమో

మరల యేనాటికి నీ మార్గము కనుగొందునో


మరల నే తరుణులకో మరల నే ధనములకో

మరల నే పదవులకో మనసగు నేమో

మరల నేయే మిషల నిన్ను మరచి నే నుందునో

మరల నెంత కాలమునకు మనసు నిన్ను పొందునో


మరల నెట్టి తనువౌనో మరల నెట్టి బ్రతుకౌనో

మరల నెందు నునికియౌ మరి యేమగునో

మరల రసన నీనామ మంత్ర మెపుడు చేయునో

మరల నెప్పటికి నీ చరణముల చేరుదునో


జయజయ సీతారామా అంటే

జయజయ సీతారామా అంటే జయములు శుభములు కలిగేను
భయహరుడగు మన రామచంద్రుడు వరములు జల్లుగ కురిసేను

విల్లు పట్టిన వీరబాలుడై విరచెను రాముడు తాటకను
కల్లజేసి రాకాసుల మాయల కాచెను తపసి యాగమును
నల్లనయ్యకు పలికిరంతట చల్లగ మునులు జయజయలు
చల్లని తండ్రికి మొదలాయెనదే యెల్లలోకముల జయజయలు

మెల్లగ శివుని వింటినంటితే ఫెళ్ళున నదియే విరుగుటతో
నల్లనయ్యకు జనకుని సభలో కొల్లలాయెను జయజయలు
ఫుల్లాబ్జాక్షుని గని దేవతలును పొంగి పలికిరి జయజయలు
చల్లని తండ్రికి విస్తరించెనదె యెల్ల లోకముల జయజయలు

చల్లని తల్లికి చక్కని తండ్రికి చప్పున పెండిలి జరిగినది
నల్లనయ్యకు పలికె నంతట నాలుగుదిక్కులు జయజయలు
చల్లని తండ్రికి చక్కని తల్లికి జయజయలే‌  జయజయలు
యెల్లకాలముల నెల్లలోకముల కొల్లలు వీరికి జయజయలు

దేవదేవ రామచంద్ర దీనశరణ్య

దేవదేవ రామచంద్ర దీనశరణ్య నీవు
మావంకకు తిరిగి సుంత మాటలాడవా

మధురమధుర మైన నీ మాటలే చాలు నా
అధరముల మీది మందహాసమే చాలు
సుధలగురియు చల్లని నీ చూపులే చాలు మా
వ్యధలన్నీ తీరు కదా పరమపురుషుడా

మా కనుల కనులు కలిపి మాటలాడ రాదా
మా కష్టసుఖములను మమ్మడుగ రాదా
మా కోరికలను గూర్చి మమ్మడుగ రాదా
మాకు నీ పలుకరింపు మరియాద కాదా

నీ వంటి దొరలేడని నీసేవ చేసేము
నీ వారల మని పలుకుచు నిక్కుచు తిరిగేము
నీవు మా మరియాదను నిలబెట్ట గోరేము
నీవు మా కేడుగడవు నీవు మా దైవమవు

2, నవంబర్ 2020, సోమవారం

రారేల రారేల రాముని సేవకు

రారేల రారేల రాముని సేవకు

వేరెవరిని సేవించకను


కూటికి భ్రమపడి కుమతుల సేవించి

మాటిమాటికి చాటుమాటుగను

గోటను కన్నీరు మీటుచు గడుపగ

నేటికి రాముని చాటున బ్రతుకగ


కోరిన విచ్చెడి కొలువనగా అది

శ్రీరఘురాముని సేవనమొకటే

వారిజనయనుడు బహుసుభుండని

మీరు గ్రహించి మిక్కిలి వేడ్కను 


ఒరులను సేవించి యున్నన్నాళ్ళును

నరులకు లే దానంద మన్నది

హరి రఘురాముని యండను నిలిచిన

నరులదె బ్రహ్మానంద మి దెరిగి


1, నవంబర్ 2020, ఆదివారం

ఇక్కడ పడియుంటివి

ఇక్కడ పడియుంటివి నీ వెక్కడికి పోయేవు
వెక్కసమని సంసారము విడిచిపోలేవు

ఎంత చదివినా నీ విందిందే తిరిగేవు
ఎంత నేర్చినా నీ విందిందే తిరిగేవు
ఎంత జూచినా నీ విందిందే తిరిగేవు
ఎంత చేసినా నీ విందిందే తిరిగేవు

ఎంత వేడినా నీ విందిందే తిరిగేవు
ఎంత వేచినా నీ విందిందే తిరిగేవు
ఎంత రోసినా నీ విందిందే తిరిగేవు
ఎంత గింజుకొన్న నీ విందిందే తిరిగేవు

ఎంత భారమైన నీ విందిందే తిరిగేవు
ఎంత కాలమైన నీ విందిందే తిరిగేవు
పంతగించితే రామ మంతరము చేసితే
సంతసముగ రాముని సన్నిధి చేరేవు