10, సెప్టెంబర్ 2026, గురువారం

వివేకం

కొన్నాళ్ళ క్రిందట నాస్నేహితులు ఒకాయనకు ఒకానొక కారణంగా నాపైన క్రోథం కలిగింది.

నానామాటలూ ఆయన అనటం నేను పడటం జరిగింది.

అవేవీ నాపైన ప్రభావం చూపటంలేదన్న అనుమానం వలన కావచ్చును ఆయన చివరగా ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించారు.

బ్రహ్మాస్త్రం అంటే దానికి తిరుగులేదు. ఎవడన్నా కింద పడిపోవలసిందే.

తప్పదు.

ఆ బ్రహ్మాస్త్రం ఏమిటంటే "నువ్వేదో నేనే పెద్ద రామభక్తుడిని అని చెప్పుకుంటున్నావు" అని హేళనచేయటం.

రాముడి గురించి ఎత్తటం దేనికి వ్యక్తిగతవాదవివాదాల మధ్యలో?

మరొకరకంగా నైతే నేమి అస్త్రం బ్రహ్మాండంగా పనిచేసింది. వాదం పెంచటం ప్రమాదం అని నేనే తప్పుకున్నాను.

ఒక చిన్న కథ చెప్పాలి.

ఒకడు తన వృత్తిగా అనుకోండి ప్రవృత్తిగా అనుకోండి అడవిలో చెట్టునరికి పుల్లలు కొడుతున్నాడు. అది కాస్త చిట్టడవే. నట్టడవిలో క్రూరమృగాకులప్రాంతంలో దర్జాగా ఎవడూ పోయి చెట్లు నరుకుతూ గంటలుగంటలు గడపటానికి సాహసించడు.

చిట్టడవే కాబట్టి కాస్త జనసంచారం ఉంది. వీడిని ఎందరో చూసారు. వాళ్ళల్లో కొందరికి వీడి వ్యవహారం నచ్చలేదు.

ఒకడంటాడూ చెట్లను అలా కొట్టకూడదు. వాటికీ ప్రాణం ఉండదా అని. పాయింటే కాని చికెన్ లేనిదే ఆయనకు ముద్ద నోటికి పోదు.

మరొకడు చెట్లను కొడితే ఇలా అడవులు తరిగిపోతాయి. అడవులు మన జాతీయసంపద అని.

ఇంకొకడు చెట్లను ఆవాసం చేసుకునే పక్షులేం కావాలీ వాటి జాతులు నశించి పోవా చెట్లను కొట్టేవాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి అంటాడు. ఈయన టీచరే లెండి.

మరొకడు పక్షులేనా అడవులు పలుచనైతే వన్యప్రాణులూ నశించవా. ఇది ఘోరమైన విషయం అని వాపోతాడు.

మరొక బుద్ధిమంతుడు చెట్లను వంటచెరకు చేస్తే పొగతో వాతావరణకాలుష్యం పెరుగుతుంది. అసలే గ్లోబాల్ వార్మింగ్ పెరిగిపోతోంది ఆని విన్నాణం ఒలికిస్తూ మాట్లాడాడు.

ఇంకా మరొకడు చెట్లను కొట్టేవాళ్ళను చెట్లకే ఉరితీయాలి అని ఆవేశపడుతున్నాడు.

షికారుకు వచ్చి ఇలా కబుర్లాడుతున్న కాలక్షేపరాయుళ్ళ మాటలు ఈపుల్లలు కొడుతున్న వాడికి వినబడుతూనే ఉన్నాయి. కొన్ని ముక్కలు ఇంగిలిపీసులో ఏడవటంవలన వాడికి తెలిసిచచ్చేవి కాకపోయినా వీళ్ళుచేసే శబ్దకాలుష్యం వాడి శ్రవణేంద్రియాలను సోకుతూనే ఉంది.

కానీ, వాడు తాపీగా పుల్లలు కొట్టుకొని చక్కాపోయాడు. 

వీళ్ళతో తగువు పడటం తనకి పనిచెరుపు తప్ప మరేమీ కాదన్న ఇంగితం వాడికి బాగానే ఉంది.

ఎవడేమి చేస్తున్నా లోకంలో అది నచ్చని వాళ్ళూ మెచ్చని వాళ్ళూ దానిపై నోరు చేసుకొనే వాళ్ళూ ఎప్పుడూ పుష్కలంగా ఉంటారు.

తనపని తాను చేసుకుంటూ పోవటం ముఖ్యం. లోకంతో తగువులు పడటం కన్నా చాలా ముఖ్యం.

నేను వచ్చాను.

నాపని నేను చేసుకుంటున్నాను.

ఏఒకరికో లేదా ఏకొంతమందికో నాపని నచ్చకపోతే పోనివ్వండి. ఆవిషయంపై తగవులకు పోను. ఎవరినీ ఒప్పించవలసిన అగత్యం లేదు.

నాది భక్తో నటనో డాంబికమో మోసమో వీటిలో ఏదో కాంబినేషన్లో ఏదో ఒకటి ఆని ఎవరన్నా అనుకుంటే నాకేమీ ఇబ్బంది లేదు. కోపం హెచ్చి నన్ను తిట్టినా నన్ను రెచ్చగొట్టాలని రాముణ్ణి తిట్టినా వాళ్ళతో తగువేసుకుని నాపని చెడగొట్టుకోను.

ఆపుల్లలు కొట్టుకునేవాడి పాటి వివేకం నాకూ ఉంది.

2 కామెంట్‌లు:

  1. లోకులు పలుగాకులు.
    కాకులు కూస్తూనే ఉంటాయి
    కాకికూతలు ఒక చెవిని వింటూ మరో చెవిన వదలిపెడుతూ మనపని మనం చేసుకోవాలి.
    కొంతకాలానికి కాకికూతలు వినీ వినని స్థితి ఏర్పడుతుంది.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.